Previous Page Next Page 
ప్రార్థన పేజి 45


    ఇన్ స్పెక్టర్ అతడివేపు వస్తూ వుండగా భార్గవ చటుక్కున లేచి నిలుచున్నాడు. అతడికి జరిగింది అర్థమయింది. వెళ్ళిపోతున్న వాడిని ఏదో పనున్నట్టూ తిరిగి పిలిచింది ఇందుకన్నమాట. తన కళ్ళముందే జరిగిన మోసం చూస్తూంటే అతడికి వళ్ళు మండిపోయింది.

 

    "ఇది అన్యాయం?" అన్నాడు.

 

    "ఏది?"

 

    "నన్ను రోడ్డుమీద నుంచి వీళ్ళు వెనక్కి పిల్చుకొచ్చారు ఇన్ స్పెక్టర్".

 

    "అంతకుముందు దొంగతనంగా ఫ్యాక్టరీలో ప్రవేశించలేదా నువ్వు?"

 

    "దానికి సరిపడా నా జేబులో డబ్బు తీసుకొని నన్ను వదిలేసేరు, కావాలంటే వాళ్ళ జేబులు వెతకండి నా డబ్బు దొరుకుతుంది".

 

    ఈ మాటలకి సెంట్రీ భార్గవ వెనుకనుంచి భుజం పట్టుకుని వెనక్కి తిప్పి మళ్ళీ ఫెడేలునకొట్టి- "వీడెవడో సామాన్యుడిలా లేడు ఇన్ స్పెక్టర్. మా ఫ్యాక్టరీకొచ్చి మామీదే దొంగతనం మోపుతున్నాడు" అంటూ మరోసారి కొట్టాడు.

 

    భార్గవ వెనక్కి తూలి ఇన్ స్పెక్టర్ మీద పడ్డాడు. ఈ దౌర్జన్యం అతడిని దాదాపు పిచ్చివాణ్ని చేసింది. మామూలుగా పోలీసుల్ని పిలిపిస్తే అతడింత ఇరిటేట్ అయ్యేవాడు కాడు. తన డబ్బు తీసుకొని తనని వదిలేసి, తిరిగి మళ్ళీ వెనక్కి పిలిచి, అరెస్టు చేయించటం అతడి విచక్షణా జ్ఞానాన్ని నశించేలా చేసింది. ఒక్క ఉదుటున సెంట్రీ మీదకు వెళ్ళబోయాడు. కానీ వెనుకనుంచి ఇన్ స్పెక్టర్ బలంగా పట్టుకున్నాడు. ఎదురుగా సెంట్రీ ఇది చూసి నవ్వేసరికి అగ్ని మీద ఆజ్యం జల్లినట్లయింది. మోచేయి వెనక్కి విదిలించేసరికి అది వెళ్ళి ఇన్ స్పెక్టర్ డొక్కలో తగిలింది. అతడు పట్టు వదిలేశాడు. భార్గవ గాలిలా దూసుకు వెళ్ళి సెంట్రీ చొక్కా పట్టుకున్నాడు. అతడి ఉద్దేశ్యం సెంట్రీ జేబులోంచి డబ్బుతీసి చూపించి తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుందామని...

 

    కానీ మీద కొస్తున్న భార్గవని చూసి సెంట్రీ ఇంకోలా అనుకున్నాడు. భార్గవ మొహం భయంకరంగా వుంది. కోపంతో ప్రజ్వరిల్లుతూంది. తలుపులన్నీ మూసికొడితే పిల్లైనా తిరగబడుతుంది అనేలా వున్నాడు. అతడి ఆకారం చూసి సెంట్రీ అప్రయత్నంగా వెనక్కి అడుగువేసేడు. హర్నామ్ సింగ్ చప్పున లాఠీ కోసం గదిలో మరో మూలకి వెళ్ళాడు. వెనుక ఇన్ స్పెక్టర్ కడుపులో తగిలిన దెబ్బతో ఇంకా లేవలేదు.

 

    అకస్మాత్తుగా తనకి దారి దొరికినట్టనిపించింది భార్గవకి. ఎదురుగా గుమ్మం కనిపించింది. ఒక్కసారి ఈ పులిబోనులోంచి బయటకి వెళ్ళిపోతే తనకి జరుగుతున్న ఈ అన్యాయం నుంచి రక్షణ లభిస్తుందని ఎందుకో అనిపించింది. అందులో యుక్తాయుక్తాలు ఆలోచించటానికి టైమ్ లేదు. అతడు చప్పున అటు పరుగెత్తాడు. వెనుకనుంచి "ఆగు" అని వినిపించింది. ఇన్ స్పెక్టర్ కంఠం. అతడు ఆగలేదు. గుమ్మందాటి మరో నాలుగు అడుగులు వేసేడు.

 

    "ఢాం"

 

    చెవులు చిల్లులుపడేలా శబ్దం వినిపించింది.

 

    మండుతున్న ఇనుప ఊచని బలంగా కాలిలోకి దూర్చినట్టూ ఒక్కసారి భగ్గున మండింది. ఒక కేక బిగ్గరగా గొంతులోంచి రాబోయి ఆగిపోయింది. కాలు పట్టుకుని నిస్సహాయంగా క్రిందికి వాలిపోయాడు- వెచ్చటి రక్తం కాలిమీదుగా స్రవించసాగింది. ఇంతలో ఎదురుగా అలికిడి అయి కళ్ళు విప్పి చూసేడు.

 

    ఎదురుగా రవూఫ్ నిలబడి వున్నాడు.

 

    కౄరమైన స్వరంతో అతనన్నాడు. "ఈ రవూఫ్ చేతుల్లోంచి తప్పించుకు పారిపోవటం అంత సులభంకాదు మిస్టర్! నువ్వెవరో కొత్తగా ఈ లైన్ లోకి దిగినట్టున్నావ్. నన్ను కొట్టినవాడు ఇంతవరకూ లేడు. మొట్టమొదటి వాడివి నువ్వే. నిన్ను తగినవిధంగా అభినందించటం నా విధి. అప్పుడే ఏమైంది పద, లాకప్ లో చూపిస్తాను" అంటూ అతడి గాయం మీద బూటుతో కొట్టాడు. భార్గవ పంచప్రాణాలూ తోడేసినట్టయింది. పళ్ళు గట్టిగా కరచి బాధని దిగమింగేడు.

 

    రవూఫ్ అతడి రెక్కపట్టుకుని, మరో సెంట్రీసాయంతో దాదాపు యీడ్చుకెళ్ళాడు. అనుమతి లేకుండా పరాయిచోట ప్రవేశించినందుకు క్రిమినల్ ట్రిస్ పాస్ సెక్షన్ 448 క్రిందా- విధి నిర్వహణలో ఒక ప్రభుత్వాధికారికి అడ్డు తగిలినందుకు సెక్షన్ 353, 322ల క్రింద అతడు అరెస్టు చెయ్యబడ్డాడు.

 

                                         *    *    *

 

    ఆ రాత్రి అనుభవించిన నరకయాతన అతడు జీవితంలో ఎప్పుడూ అనుభవించలేదు. అతడిపట్ల అది కాళరాత్రే అయింది. సాయంత్రం ఎప్పుడో పోలీసు డాక్టరు వచ్చి కాస్త పౌడరు జల్లి కట్టుకట్టేడు. అదృష్టవశాత్తు గుండు కాలికి పక్కగా చీల్చుకుపోయిందంతే! బుల్లెట్ తగిలినప్పుడు అంతగా బాధ వెయ్యలేదు గానీ- ఆ రాత్రి సెల్ లో గరుకు గచ్చుమీద పడుకున్నాక, ఒకవేపు దోమలకాటు, మరోవేపు పోలీసుల బూతు జోకుల నవ్వులతో మెలకువ వచ్చింది. సన్నగా సలపరం మొదలై నిముషాల మీద ఉధృతమైంది. అతడి బాధ పట్టించుకున్నవాడే లేడు.    

 

    అరెస్టు చేసిన ఇరవై నాలుగు గంటల్లోగా మేజిస్ట్రేటు ముందు హాజరుపర్చాలి. మరుసటి రోజు ప్రొద్దున్నవరకూ ఆ నరకం తప్పదు.

 

    అతడు మోకాళ్ళ మీద కూర్చుని బాధని వోర్చుకుంటూ జైలు ఊచలగుండా బయట వెలుతురుని చూస్తూ ఆ రాత్రంతా గడిపాడు. సాంద్రతలేని ఆ ఆలోచనల నడుమ నిస్తేజమైన మనసు మూగగా నిద్రపోయింది. అతడు మాత్రం మెలకువగానే వున్నాడు. ప్రొద్దున్న ఎనిమిది అవుతూ వుండగా బయట అలికిడి వినిపించి బయటకు చూసాడు. దూరముగా ఇన్ స్పెక్టర్ తో మాట్లాడుతున్న వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయాడు.

 

    అతడు శంకర్ లాల్!

 

    భార్గవ మనస్సులో ఎక్కడో మారుమూల ఆశారేఖ తళుక్కుమంది.

 

    అంతకుముందు ఒకటి రెండు రోజుల క్రితమే తామిద్దరికీ ఘర్షణ జరిగింది! తనని ఉద్యోగంలోంచి తీసేసే హక్కు వాళ్ళకు లేదని వాదించి తను గెల్చాడు!! అయినా తను ఇక్కడ వున్నాడని తెలిసి ప్రొద్దున్నే అతడు వచ్చాడు. తన గురించి చెప్పి- ఇక్కడ్నుంచి విడుదల చేయిస్తాడు!!!

 

    ఎంతయినా అతడు తన అధికారి!

 

    భార్గవ మనసంతా కృతజ్ఞతతో నిండిపోయింది.

 

    ఈ లోపులో సెంట్రీ వచ్చి తలుపు తీసి అతడిని వెలుపలికి తీసుకెళ్ళాడు. ఇన్ స్పెక్టర్ తో మాట్లాడి శంకర్ లాల్, భార్గవ కూర్చున్న చోటికి వచ్చాడు. ఇద్దరి మధ్యా టేబుల్ వుంది. శంకర్ లాల్ తన చేతిలోని కాగితాలు టేబుల్ మీద పెట్టి భార్గవ వైపు చూసాడు. భార్గవ అతడివైపు అర్థంకానట్టూ దృష్టి సారించాడు. శంకర్ లాల్ గొంతు సవరించుకుని అన్నాడు.

 

    "సూటిగా అసలు విషయానికొస్తాను డాక్టర్ భార్గవా! ఉపోద్ఘాతాలొద్దు" అని ఆగి తిరిగి అన్నాడు.

 

    "మోహన్ లాల్- శంకర్ లాల్ వంశం దానధర్మాలకు ఎంత పేరెన్నికగన్నదో, పంతానికీ, పట్టుదలకీ కూడా అంతే పేరు పొందింది.... ఆ వంశంలో పుట్టినవాడిని నేను! అటువంటి నేను సల్ఫా-3 గురించి ఒక చిన్న కోర్కె కోరితే, ఏదో నియమాలున్న వాడిలా దాన్ని తిరస్కరించడమే కాకుండా పత్రికల వాళ్ళ దగ్గర నీ ఇష్టం వచ్చినట్టూ మాట్లాడి అందరి పరువూ పోగొట్టావు".


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS