"వాడసలు పెళ్లి చేసుకోడు! చేసుకొన్నా ఒక స్త్రీని దారుణంగా మానభంగం చేసినవాడి కేరక్టర్ ఊహించుకోవచ్చు! వాడు కట్టేది తాళికాదు. ఉరి! పశువులా నిన్ను చెరిచినవాడు నీ మెడలో తాళికడితే నీ జీవితానికి అర్దం వస్తుందా?...... ఎంత శ్రమపడ్డాను నీకు న్యాయం జరగాలని మగవాడి దౌర్జన్యం మీద విజయం సాధించాలని!అంతా సర్వ నాశనం చేశావు కదా?" సుధ ఆక్రోశిస్తున్నట్టుగా అంది.
"నన్ను ... .నన్ను క్షమించండి,సుధా!" గాద్గదికంగా అంది సుజాత.
* * * *
శర్మ సెకండ్ సాటర్ డే సిటీ వెడుతూ శాలిని వాళ్ల అడ్రస్ తీసుకొన్నాడు.
కాని, శాలిని వెళ్లొద్దంది. ఈ సంగతి తను లేనప్పుడు ఇంట్లో తెలియడం వాళ్లు కంగారుపడడానికి కారణమౌతుందని, డిసెంబరు సెలవుల్లో సిటీ వెళ్లినప్పుడు తనే చెబుతానని అంది.
డిసెంబరు సెలవుల్లో ఇద్దరూ ఒకేసారి బయల్దేరారు. గౌలిగూడ బస్ స్టాండ్ లో ఇద్దరూ విడిపోతూ "సాయంత్రం తప్పకుండా రావాలిమీరు. మా వాళ్లకి పరిచయంచేసి మన సంగతి చెబుతాను" అంది శాలిని.
"సాయంత్రం అయిదింటికల్లా మీ ఇంటి వాకిట్లో వుంటాను!" వాగ్దానంచేసి కదిలాడు శర్మ.
శాలిని ఇంటికివెళ్లి స్నానంచేసి భోజనంచేసి తల్లితో ఆ కబురూ ఈ కబురూ చెబుతూనే ఓ కునుకుతీసి లేచేసరికి సాయంత్రం నాలుగైంది. హడావిడిగా లేచి, ఆ వీధి కార్నర్ దగ్గరికివెళ్లి స్వీటూ, పళ్లూ, తీసుకువచ్చింది. ముందుగది నీటుగా సర్దింది. అతడొస్తే టీ యివ్వడానికి కప్పులు, ప్లేట్లు కడిగి శుభ్రంగా తుడిచిపెట్టింది.
అదంతా చూసి తల్లి అడిగింది"ఎవరైనా వస్తున్నారా మనింటికి?" అని.
"వస్తున్నారమ్మా!"
"ఎవరు?"
"రాధాకృష్ణ శర్మ అని అక్కడ నా కోటీచర్."
ఆవిడ చూపుల్లో ఏదో అనుమానం చోటుచేసుకోగా, ఏదో అడగాలనుకొన్నట్టుగా పెదవులు కదిలించి ఆగిపోయింది.
శర్మ వచ్చి వెళ్లాకే అసలు విషయం చెబుదామని శాలిని మౌనం వహించింది.
అతడొస్తే అతడికి చేసే మర్యాదలకు అన్నీ సిద్దంచేసి స్నానానికి వెళ్లింది శాలిని.
అయిదు అవుతూంటే శాలిని గుమ్మం దగ్గరికి వచ్చి నిలబడింది.
శర్మ అడ్రస్ కాగితం చేతిలో పట్టుకొని. వరుసగా గుమ్మాలకున్న నంబర్లను చూస్తూ వస్తూ కనిపించాడు.
"ఇక్కడ!" శాలిని చప్పట్లుకొడుతూ పిలిచింది.
శర్మ నవ్వుతూ వచ్చాడు. అతడిచేతిలో స్వీట్ పాకెట్, పువ్వుల పొట్లం వున్నాయి. గదిలోకి వస్తూనే అవి స్టూల్ మీద వుంచాడు.
"మర్యాదలు బాగా తెలుసే!"
"..........." చిరునవ్వు నవ్వాడు శర్మ.
తల్లిని ముందుగదిలోకి పిలిచి ఒకరికొకరిని పరిచయం చేసింది శాలిని. ఆవిడ ఒక నిమిషం సంకోచంగా ఆగి లోపలికి వెళ్లిపోయింది.
పళ్లముక్కలూ, దూద్ పేడాలు, కారాలు మూడు మూడు ప్లేట్లలో పెట్టింది. ఓ ప్రక్క మర్యాదలు జరుగుతూనే నవ్వులూ, కబుర్లూ దొర్లిపోతున్నాయి.
"ప్లేట్లలో సగం అలాగే వుండిపోయాయి. తిను కృష్ణా"
"మర్యాదలు కొత్తల్లుడికి చేస్తున్నట్లుగా చేస్తున్నావు. అల్లుడి నయ్యాక ఇంకేం చేస్తావో?"
"అప్పుడేం చెయ్యను. మగడూ, పెళ్లాలమధ్య మర్యాదల ప్రసక్తి ఏముంటుందప్పుడు?"
"అయితే అన్నీ ఇప్పుడే పుచ్చుకోవాలన్నమాట. మహరాజుల పోజుకొడుతూ."
"మగమహారాజుల పోజుమాత్రం కొట్టకండి! నాకొళ్లుమంట."
ఆరుగంటల ప్రాంతంలో నరహరి వచ్చాడు ఆఫీసునుండి.
శర్మను పరిచయం చేసింది శాలిని.
ఓ అయిదారు నిమిషాలు అమాటా ఈమాటా మాట్లాడుతూ కూర్చుని ఆయన బట్టలు మార్చుకోడానికి లోపలికి వెళ్లిపోయాడు.
