Previous Page Next Page 
అమృతం కురిసిన రాత్రి పేజి 44

                                          రాత్రివేళ
   
రాత్రివేళ ఎవరూ లేరింట్లో మసకగా వున్న విద్యుద్దీపాల కాంతిలో
ఒక్కణ్ణీ బాల్కనీలో కూర్చున్నాను. బోగన్ విల్లా పందిరిలో
ఒక్క నిముషం ఆగి తెరలు తెరల్లాగా వీచే గాలిలోంచి ఎవరిదో
ఏదో మధురాతి మధుర విషాదగానం నేరుగా వచ్చి గుండెల్లోకి
గుచ్చుకుంటోంది.

నిర్జన స్థలం, ఎవ్వరూ లేరు, చుట్టూ పరచకున్న మైదానపు
నగ్నదేహాన్ని స్పృశించబోయే నిచుల శాఖాగ్రపు వ్యగ్రపు
తొందర నిశ్శబ్దం మెల్లగా అడుగులు వేస్తూ నడుస్తోంది, ఆకాశం
మీద ఒక్క చుక్క మరో నక్షత్రంతో మాట్లాడే మాటమాత్రం
మనసుకి వినిపిస్తోంది.

ఇంత రాత్రివేళ ఈ గానం ఎవరిదో చీకటి కాగితం మీద ప్లాటినం
తీగలాగ మెరుస్తోంది, ఏదో విషాదాన్ని హాయిని భయాన్ని పంచి
పెడుతూంది. ప్రాణాలకి అడుగునవున్న సుతారపు తీగల్ని
కదలిస్తోంది, ఏదో విధి దష్టమైన జీవితం కాబోలు పాపం
మొరపెడుతోంది జాలిజాలిగా, సంకీర్ణమైన విశ్వరహస్యం మరీ
మరీ నిగూఢమై కదలే నల్లని నీడలలో కలసిపోతుంది.

చెరచబడ్డ జవ్వని విడివడిన పృధుశిరోజ భారంలాగ ఈ
నిశీధం మలిన మలినమైన చెదరిన తన అందాన్ని చీకట్లతో
కప్పుకుంటోంది, ఒంటరిగా నాలో ఊహలలో అవ్యక్తంలాగ
ఒదుగుతోంది, అనంతమైన శూన్యాన్ని అలుముకుంటోంది
ఏదో పాట మాత్రం ఏడుపేడుపుగా సన్నగా తియ్యగా గాలిలో
ఊగుతోంది, నీరవమైన ఏకాదశి నిశీధాన్ని రెండుగా చీలుస్తోంది.

        *     *     *       
                ---1961

        వసుధైక గీతం


భూమధ్యరేఖ నా గుండెలోంచి పోతోంది
భ్రుకుటి లోపల నక్షత్రగోళం తిరుగుతోంది
ఈవేళ నన్నానవాలు పట్టలేవు నువ్వు
సూర్యుడిని చూడు నా తలమీద పువ్వు


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS