Previous Page Next Page 
బస్తీమే సవాల్ పేజి 44


    కన్నయ్య స్నానం చేసి తువాలుతో తల తుడుచుకుంటూ వచ్చాడు.

    "అన్నం తిందామా?" అడిగాడు.

    "నాకు ఆకలిగా లేదు" చెప్పాడు పరుశురాం.

    కన్నయ్య నవ్వాడు.

    "సరిపోదని కదూ! వున్న దానితో ఈ పూటకి సరిపెట్టుకుందాం కన్నా!" యాదమ్మ అంది.

    "మరో మాట పడకు బాబు! ఈ రోజు నుంచీ నువ్వు నా బిడ్డవనే చెప్పాను.

    దేవుడిలా వచ్చి నువ్వు కన్నయ్యని కాపాడకపోతే ఈ పాటికి నేను కూడా గుండె పగిలి చచ్చిపోయేదాన్ని."

    ఆమె గొంతు వణుకుతోంది.

    ప్రపంచం ఎంత చిత్రమైంది!

    ఉన్నవాడు ఎంగిలిచేయి విదిలించడానికి భయపడతాడు తన సర్వ సంపదలు తరిగిపోతాయని.

    కానీ లేనివాడు మరోలేని వాడని చేరదీసి ఆదరిస్తాడు.

    లేమి మనుషుల మధ్య స్నేహాన్ని, ప్రేమనీ పెంచుతోంది.

    కలిమి మనుషుల్ని దూరంగానే వుంచుతోంది.

    యాదమ్మ గుడ్డిది. ఆమె పనిచేయలేదు. ఆమె ఒక్క కొడుకు కన్నయ్య మెకానిక్ షాపులో పనిచేస్తే రోజూ గిట్టేది ఐదు రూపాయలు. మహా వస్తే టిప్పుల రూపంలో ఓ రెండు రూపాయలు. ఆ డబ్బుల్తో రెండు ప్రాణాలు నిలవాలి.

    ఇప్పుడు తన భారం వాళ్ళపైన పడుతోంది. కానీ తనమీద పడబోతున్న భారం గురించి ఆ తల్లిగానీ, ఆ కొడుకుగానీ ఆలోచించడం లేదు. ఉన్నదాన్ని సరిపెట్టుకోవాలీ, తృప్చి చెందాలీ అనే వాళ్ళ భావన అతన్ని మరింత చేరువయ్యేలా చేసింది.

    "నేను ఏదన్నా పని చూసుకొని వెళ్ళిపోతానమ్మా" అన్నాడు పరుశురాం.

    అతని మాటలకి యాదమ్మ మొహం అప్రసన్నంగా మారిపోయింది.

    "మేం నీకు నచ్చలేదా పరుశురాం బాబూ!"

    "అది కాదమ్మా!"

    "అమ్మ అంటున్నావు. ఇంకా ఈ అమ్మని పరాయిదానిగానే భావిస్తున్నావా బిడ్డా!"

    పరుశురాం కళ్ళల్లో నీళ్ళు గిర్రున తిరిగింది.

    తనకి అమ్మలేదు. నాన్న లేడు.

    తల్లితండ్రిలా పెంచిన మామయ్య ఇంట్లోంచి వెళ్ళగొట్టాడు.

    ఇప్పుడో నిస్సహాయురాలు అందునా గుడ్డిదీ అయిన యాదమ్మ నిస్సహాయస్థితిలో వున్న తనని బిడ్డగా స్వీకరిస్తోంది.

    "మీ పరిస్థితి తెలిసినవాడిని కాబట్టి నేను నీకు భారం కాకూడదని అన్నానమ్మా!" అన్నాడు పరుశురాం.

    యాదమ్మ నవ్వింది.

    "ఎంత చెట్టుకు అంత గాలి బిడ్డా! నా రెండో బిడ్డ వుంటే భారమని గెంటేసేదాన్నా చెప్పు"

    కన్నయ్య రెండు సత్తు పళ్ళాలని తీసుకొచ్చాడు. బయటకెళ్ళి రెండు నిమిషాల తర్వాత ఓ ఆకు తీసుకువచ్చాడు.

    గిన్నెలో అన్నాన్ని ముగ్గురికీ సమానంగా పెట్టి-

    "తిను" అన్నాడు.

    మిరపకాయ పచ్చడితో అన్నాన్ని కలుపుతూ అడిగాడు పరుశురాం.

    "వంట ఎవరు చేస్తారు?"

    "నేను చేస్తాను బాబూ! అలవాటైపోయింది. వీడా రెక్కలు ముక్కలు చేసుకొని వస్తాడు. వెళ్ళేవేళ, వచ్చేవేళ చూడాలి కదా!"

    తల్లిపట్ల కొడుక్కి, కొడుకు పట్ల తల్లికి గల ప్రేమానురాగాలని చూస్తుంటే పరుశురాంకి జీవితంలో తను ఎంత పోగొట్టుకుందీ అర్దం అయింది.

    తింటున్నవాడల్లా ఆగిపోయాడు.

    శరీరంలోని రక్తం ఒక్కసారిగా మొహంలోకి పొంగిపోయింది.

    పళ్ళు పటపటమని కొరికాడు.

    "అన్నా, ఏమైంది?" కంగారుగా అడిగాడు కన్నయ్య

    పరుశురాం ఈ లోకంలో పడ్డాడు. క్షణంపాటు కళ్ళు మూసుకొని తెరిచాడు.

    "ఏం లేదు కన్నా! నాకు అన్నం తినాలని లేదురా! కానీ నీ రెక్కల కష్టంతో సంపాదించిన ఈ మెతుకులని నేను వదిలి పెట్టలేక పోతున్నాను, అందుకే తింటున్నాను" కళ్ళు తుడుచుకుంటూ అన్నాడు పరుశురాం.

    "అన్నకి ఏదన్నా ఉద్యోగం చూసి పెట్టరా!" అంది యాదమ్మ.

    కన్నయ్య తల్లి కేసి గొప్పగా చూశాడు.

    "ఉద్యోగాలు చెట్టుకు కాస్తున్నాయా? అయినా అన్న కేం చేతొచ్చునని చేస్తాడు!"

    పరుశురాం కళ్ళెత్తి కన్నయ్యకేసి చూశాడు.

    "నీలానే ఏదన్నా...." అంది యాదమ్మ.

    "నా పని అన్నవల్ల ఏమవుతుందమ్మా బళ్ళు తుడవాలి. పనివాళ్ళకి సామాన్లు అందివ్వాలి. ఛాయ్ తెచ్చిపెట్టాలి. నేను చేసేది ఉద్యోగమామ్మ! అన్న గొప్ప పని చేయాలి" వాడి కళ్ళు మెరుస్తున్నాయి ఆ మాటలు అంటుంటే.

    "గొప్ప ఉద్యోగం నా కెవరిస్తార్రా!" అన్నాడు పరుశురాం.

    "ముందు ఎంప్లాయిమెంటు ఆఫీసులో పేరు నమోదు చేసుకో. తర్వాత చూద్దాం!"

    "చూద్దాం అంటున్నావు. నీకెవరన్నా తెలుసా?"

    "తెలీదు. తెలిసనోడి కోసం తిరుగుదాం!"

    వాడి మాటలకి నవ్వాడు పరుశురాం.

    పేరు నమెదు చేసుకొంటే ఉద్యోగం వచ్చేరోజులా ఇవి. పైగా తగిన క్వాలిఫికేషన్ కూడా లేదు తనకి.

    భోజనం అయినాక బల్లమీద కూర్చుని సిగరెట్ వెలిగించి పేకముక్కల్ని పరచి ఆడ్డం మొదలుపెట్టాడు పరుశురాం.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS