Previous Page Next Page 
ది ఎడిటర్ పేజి 44


    "లేకేం ఉంది. ఎవరూ ఊహించనంత తేలిక అది" అని మళ్ళీ నవ్వాడు బ్రహ్మచారి.
    "ఏమిటది?" అన్నాడు ఉదయార్కర్.
    నవ్వి చిన్న గొంతుతో ఉదయార్కర్ చెవిలో ఏదో చెప్పాడు బ్రహ్మచారి.
    ఆశ్చర్యంగా చూశాడు ఉదయార్కర్. "అంత సింపులా"
    "అవును, అయితే ,ఈ వశీకరణ విద్యలో ఇంకా చాలా రకాలు వున్నాయనుకో. స్త్రీని తాకకుండా ఆమెకి ఏ మందూ అంటించకుండానే కూడా వశం చేసుకోవచ్చు."
    "ఎలా?"
    సరిగ్గా అదే సమయంలో ఒక చెంచు యువతి దూరంగా చెట్ల చాటు నుంచి వచ్చి, ముందుకి సాగిపోతూ కనబడింది.
    "ఒక తమాషా చేస్తాను చూడండి" అని, దగ్గరలోనే కనబడుతున్న ఒక గజనిమ్మ చెట్టు పళ్ళు రెండు తెంపి, వాటిని గాల్లోకి ఎగరేసి పట్టుకోవడం మొదలెట్టాడు బ్రహ్మచారి.
    సుదూరంగా వెళుతున్న ఆ చెంచుయువతి ఏదో పిలుపు వినబడినట్లు చటుక్కున ఆగిపోయింది. వెనుదిరిగింది.
    కలలో నడుస్తూన్నట్లు నడుస్తూ బ్రహ్మచారి వాళ్ళు ఉన్నవైపే రావడం మొదలెట్టింది.
    చెట్ల గుబురుచాటున నిలబడి వున్నారు బ్రహ్మచారి బృందం ఆమెకు కనబడటం లేదు వాళ్ళు.
    ఆమె వాళ్ళకి బాగా దగ్గరికి వచ్చాక, గజనిమ్మ పండ్లని ఎగరేయడం ఆపేసి, వాటిని చేతిలో పట్టుకున్నాడు బ్రహ్మచారి.
    అడవి కీటకాల రోద తప్ప అంతా నిశ్శబ్ధం!
    అతను నిమ్మపండ్లు ఎగరేయడం ఆపగానే, ఆ అమ్మాయి కూడా ఆగిపోయింది. సందిగ్ధంగా అటూ ఇటూ చూసింది. తను అసలు ఎందుకు వెనక్కి వచ్చిందో, దేనికోసమో ఆమెకే అంతుబట్టలేదు. కొద్దిక్షణాలు బేలగా అక్కడే నిలబడి , తర్వాత మళ్ళీ తిరిగి తన దారిన తాను వెళ్ళిపోయింది.
    అప్పటిదాకా ఊపిరి బిగపట్టి చూస్తున్న ఉదయార్కర్ "గ్రేట్!" అన్నాడు. స్మేల్లర్, దుర్గయ్య భయభక్తులతో బ్రహ్మచారి వైపు చూశారు.
    మళ్ళీ అందరూ ముందుకి సాగారు.
    బ్రహ్మచారి తనలో తను అనుకొంటున్నట్లు అన్నాడు.
    "ఈ చెంచుపిల్ల అడవిలో ఇంత దూరం ఎందుకు వచ్చింది అసలు వాళ్ళు మాములుగా ఇంతదూరం రారే! అలా అంటుండగానే అతనికి జవాబు స్పురించింది. "ఓహో! అదా సంగతి! ఇవాళ ఇక్కడ చంచుల జాతర కదా!" అన్నాడు.
    "ఏం జాతర?"
    "తుమ్మల బైలు జాతర" అన్నాడు బ్రహ్మచారి. "ఇప్పుడు శ్రీశైలానికి పడమట నున్నాం మనం. ఇక్కడొక జల వుంది. సంవత్సరానికి మూడొందల అరవై అయిదురోజులు ఈ జల వస్తూనే వుంటుంది. కానీ ఒక్కపూట మాత్రం ఆగిపోతుంది. సాయంకాలం అయ్యేసరికి ఆగిపోయి, తెల్లారేలోపల మళ్ళీ మొదలవుతుంది. మనం ఫలానా అని విడమరిచి చెప్పలేని విచిత్రాలలో ఇది ఒకటి.
    ఆ జల రావడం ఆగిపోయిన ఆ కొద్ది సమయంలో , అంటే ఆ రాత్రి అంతా చెంచులు ఇక్కడ జాతర చేసుకొంటారు."
    బ్రహ్మచారి మాటలు పూర్తి కాకముందే, చెవులు చిల్లులుపడేలా దప్పులు మోగడం మొదలెట్టాయి. జనం గుంపులు గుంపులుగా ఊరికి వస్తున్నట్లు కలకలం వినబడింది.
    అదిగో వచ్చేస్తునారు!" అన్నాడు బ్రహ్మచారి.
    వెంటనే వెర్రికేక పెట్టాడు ఉదయార్కర్.
    ఒక అడుగు ముందుకి వెళ్తున్న బ్రహ్మచారి చివుక్కున వెనుదిరిగి చూశాడు.
    అక్కడ ఉదయర్కర్ ఉన్న స్థితి చూసి బ్రహ్మచారి గుండె నీరయిపోయింది.

                                  17

    కొద్దిరోజులు గడిచాక మరో పబ్లిషర్ వచ్చాడు ఎడిటర్ దగ్గరకి. ఎక్సయిటేడ్ గా కనబడుతున్నాడు అతను.
    లోపలికి వస్తూనే అన్నాడు.
    "ఈ న్యూస్ విన్నారా మీరు?"
    "ఏ న్యూస్?" అన్నాడు ఎడిటరు.
    "అదే! హరిణి డైరెక్ట్ నవల ది ట్రిక్? మన ఆనందరావు వేశాడే! అది"
    "ఏమయింది అప్పుడే సెకెండ్ ప్రింట్ కి వచ్చేసిందా! యాబై వేల కాపీలు అమ్ముడయిపోయాయా! ఏం జరిగింది?"
    "యాభై వేల కాపీలా! ఇంకా నయ్యం. సరిగ్గా వెయ్యి అమ్ముడుపోయాయట. పరమ చెత్త అని టాక్ వచ్చింది. జనం నవ్వుతున్నారు." అన్నాడు పబ్లిషర్.
    ఎడిటర్ మాట్లాడకుండా వింటున్నాడు.
    "ఈ దెబ్బలో నుంచి తేరుకోవడానికి నందనరావుకి రెండేళ్ళు పడుతుంది." అన్నాడు పబ్లిషర్ మళ్ళీ.
    "పాపం" అన్నాడు ఎడిటరు సానుభూతిగా.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS