నన్ను గుర్తుంచలేదా?" అన్నదా తేజోరూపిణి అయిన శ్వేతకి.
నేను చూస్తున్నది కలామ యదార్ధమా?" అని ప్రశ్నించుకుని రవంత సేపు విస్మయ విహల్వంగా అయిపొయింది శ్రద్దాదేవి.
వెంటనే ఆమె మనసులో అనుమానపు తెరలు క్రమ్ముకున్నాయి" దుఃఖ జీమూతం మనసుని అవరించుకుంది.
"శ్వేతకి ! నీవు ఎలా వచ్చావు? నా జ్యోతి ఏమయింది ? నీవు ఏదయినా ఆగడం కొనసాగించవా? కర్తవ్యమనే కఠినతరమయిన లక్ష్యంతో సాహసోపేతమైన మార్గంలో నన్ను విడిచి వెళ్ళిపోయినా యువతి జ్యోతి. ఆమె కేదయినా అపకారం కరిగిందా?"
నీ ఆత్మ రూపం రాకాసి గుహ నించి విముక్తం అయిందా! జ్యోతి జయకృష్ణ ల అన్వేషణ పరి సమాప్తమయిందా! వారికి నీవేమయినా ఆపద తలపెట్టినావా?" అని అడిగింది ప్రొఫెసర్ శ్రద్దాదేవి. ఆమె కంఠస్వరం శిష్యురాలి గురించిన యోగక్షేమాల విచికిత్స వల్ల బాగా విచలితమయింది.
కాని అందు నించి ధవళకాంతి మూర్తి అయిన శ్వేతకి రవంత అయినా బాధపడినట్లు కన్పించలేదు.
అల్లనల్లన మంద స్వరాన అలవోకగా నవ్విందామే. ఆమె నవ్వగానే ముత్యాల పలువరుస తళుకులీనింది. పగడాల పెదవులు అరుణకాంతుల్ని విరజిమ్మినాయి.
కన్నులు నీలాలవలె తరళించినాయి.
"ఓ విద్యల తల్లీ! ఎందుకమ్మా అంత కంగారు కొద్ది కాలం పాటు నీ శిష్యురాలైనందుకే కదా ---- ఆమెను గురించి అంతగా బాధపడుతున్నావు. యుగాల నించి బందితురాలాయి వున్న నా గురించి నీవు రవంత అయినా బాధపడినావా? నీ ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు నేను వచ్చాననుకున్నావా? శెలవు తల్లీ! తగిన సమయం వచ్చినప్పుడు నా అంతటా నేనే వచ్చి నీ ప్రశ్నలకు సమాధానం చెప్తాను " అన్నది శ్వేతకి ఆత్మరూపం గా ప్రత్యక్షమయిన ధవళ కాంతి రూపం.
ఆ సమాధానం విని ప్రొఫెసర్ శ్రద్దాదేవి విషాన్నా మూర్తి అయింది. జ్యోతి యోగక్షేమాలకు ఏదో ముప్పు వాటిల్లినది అని భయపడసాగింది.
14
జ్యోతిని పొదివి పట్టుకున్న జయకృష్ణ ఆమెను మెల్లిగా ఇవతలకు నడిపించాలని ప్రయత్నం చేశాడు.
సమాధి గుడి బయటపడేందుకు 'యు' ఆకారపు రాతి పలకల చుట్టూ త్రవ్వించినడతాడు. దాని లోతు పన్నెండు అడుగులు కావటం నించి ఆమెను అలాగే పట్టుకుని మెట్లు ఎక్కించి పైకి తీసుకురావటం దుస్సాధ్య మనిపించింది.
ఏమి చేయాలన్న పాలుపోలేదు. ఈదురు గాలి రివ్వుమని వీస్తోంది. చినుకులు సూదుల్లా చర్మాన్ని పొడుస్తున్నాయి. జ్యోతి నిరాధారంగా అతని చేతుల్లో వ్రేలాడిపోయింది. ఆమె వస్త్రాలు పూర్తిగా తడిసినాయి.
లోపల నీరు చేరి అంతా బురదగా అయింది.
ఆమెను క్రింద పడుకోబెట్టేందుకు వీలు లేదు. నీటికి తడిసి బరువెక్కిన మట్టి అందలు గోయి లోపలకు కూలేందుకు సంసిద్దంగా వున్నాయి. ఆమెను బురదలో నేల మీద పరుండ చెయ్యటం మాట అలా వుంచి తామిద్దరూ అక్కడ వుండటమే అసాధ్యమనిపించింది.
మొండికేత్తి అక్కడే వుంటే మట్టి అండలు విరిగి మీద పడతాయి. అండల మధ్య రాళ్ళు కాని ఉన్నాయో తలలు పగులుతాయి.
పైకి వచ్చేందుకు బరువు మోయటం దుస్సాధ్యం.
అక్కడ వుండేందుకు వీలు లేదు. పైకి వచ్చేందుకు చేతకాదు. ఏమి చేయాలి? అని క్షణం ఆలోచించాడు జయకృష్ణ.
క్షేమకరమయినచోటు రాతి పలకల మధ్య పై కప్పు పగుల కొట్టని అర్ధభాగమే అని నిర్ణయించుకున్నాడు. అక్కడికి చేరాలంటే గుహ లోపలి ఆరు రెండు అడుగుల చిన్న సమాధిని దాటి అవతలకు వెళ్లి తీరాలి. అయినా తప్పదు కనుక ఆమె పూర్తీ బరువుని తానె తప్పనిసరిగా మోస్తూ ముందుకి నడిచాడు జయకృష్ణ.
బట్టలు తడిశాయి. చినుకులు ఇంకా రాలుతున్నాయి. ఈదురు గాలి ప్రాణం తీస్తోంది. వొణుకుతున్నాడు జయకృష్ణ. అంత బాధలోనూ మెత్త మెత్తగా, నులివెచ్చగా వక్ష స్థలాన్ని తాకుతున్న ఆమె వక్షస్సు అతనికి బ్రతుకు మీద ఆశ కల్పిస్తోంది.
ఆమె ఊర్పులు నులి వెచ్చగా అతని చెంపల్ని తాకుతున్నాయి. స్త్రీ పుంస యోగోద్భవమయిన ఈ ప్రక్రుతి అంతరార్ధమేమిటో ఆ పరిష్వంగ సుఖంలో అతనికి రవంతగా అర్ధమయింది.
బ్రహ్మచారి బ్రతుకు జీవిత పరమార్ధం కాదు అనిపించసాగింది. మధ్య మధ్య వురుములు వురుముతున్నాయి. మెరుపులు మెరుస్తున్నాయి.
శరీరం మీద స్పృహ లేక మైనం ముద్దలా ఎటంటే అటు ఒరిగి పోతున్న జ్యోతిని రాతిపలకల మధ్య పై కప్పు పగులకొట్టని అర్ధభాగంలో నేల మీద పరుండేలా చేశాడు జయకృష్ణ.
మెరుపు వెలుగులో మెడ క్రిందికి జారిపోయి కన్పించిన సన్నని గోల్డ్ చెయిన్ తీరుగా ఆమె గుండెల మీదికి సర్దాడు. నుదురు ముద్దాడుతూ అంటుకుపోయినున్న ముంగురుల్ని సవరించాడు.
తల క్రింద ఎత్తుగా మెత్తగా వుండేందుకు తల దిండులా తన మోకాలి పైభాగాన్ని అమరించాడు. స్పృహ లేని జ్యోతికి తెలియదు కాని ప్రాణదికంగా ఆమెను చూచుకున్నాడు జయకృష్ణ.
కొయ్య బొమ్మలా కూర్చుండి పోయి గంటలకు గంటలు ఆమెకు స్పృహ వచ్చే క్షణాల కోసం ఎదురు చూచాడు.
అప్పటికి వేకువ అయింది . మబ్బు చెక్కలు వడివడిగా తప్పుకు పోతున్నాయి. చినుకులు వెనుక పట్టాయి.
తూరుపు ఎర్రబారింది. క్రొంగొత్త ఆశలు నింపుకున్న అరుణోదయం ఆరంభమయింది. జయకృష్ణ కళ్ళు నిర్ణిద్రంగా మండుతున్నాయి.
అలసి సొలసి నిద్రించిన ఒక్కరొక్కరే లేవటం ప్ర్రంభించినారు. చెంచులచ్చిమి కూడా లేచింది. అప్పటికి యించుమించు ఆదిమ జనులందరూ కళ్ళు విప్పేశారు.
లచ్చిమి కళ్ళు విప్పుతూనే చెట్టు క్రింద చూసింది. జ్యోతి, జయకృష్ణలు కన్పించక పోవటంతో కంగారుపడి పోయిందామే.
"ఓరోరి పుంజులు దొరబిడ్డలేమయినారు" అని కీచు కంఠంతో అరిచింది. ఆదిమ జనులంతా ఆ వంకకు చూచినారు.
అక్కడ ఎవ్వరూ కన్పించలేదు. అందరిలోనూ కంగారు అధికమాయిపోయింది. కువ్వున కూతలు పెడుతూ వారి కోసం అరచి గోల చేశారు. కాని వారి కూత అందుకున్న వారు లేరు.
ప్రతిధ్వనులు అందించినవారు లేరు.
దాంతో వారికి కంగారు మరింత అయిపొయింది. లచ్చిమి అరక్షణం ఓరగా చూచింది. ఈ విడ్డూరమేమిటో రవంత అయినా అర్ధం కాలేదు కాని ఆమెలో వీరత్వం పొంగింది.
ఆదిమ జనుల నమ్ముకుని అడివి ప్రాంతాలకు వచ్చిన దొరబిడ్డల ఆపదల పాలు కావటం అవమానం కదా!
ఆమె కనులు కెంపులయినాయి. చెంపలు విచ్చుకున్న మందరాల్లా అయినాయి. నల్లని మెను కఠినతరంగా బిగుసుకు పోతోంది. పిడికిళ్ళు ఉక్కు ముద్దలు అయినాయి.
"కళ్ళు అప్పగించి చూస్తారేమిరోరి పుంజులూ, పలుగులు పట్టుకోండి. అడవి అంతా గాలించండి. దొరబిడ్డలేమాయినారో దొరక పుచ్చుకుని తిరిగి రండి.
