Previous Page Next Page 
బ్లాక్ టైగర్ పేజి 45


    "ఎవడె నా భర్త! నాకసలు పెళ్ళి కాలేదు " అంది బుసలు కొడుతూ.
    "చూడండి! మీరే వినండి! కొద్ది నిముషాల క్రితం భర్తతో కలసి వచ్చింది. చేతికి కట్టు కట్టించుకుంది. ఇప్పుడు నా కసలు భర్త  అనేవాడే లేడంటుంది.
    "ఇవన్నీ పిచ్చి లక్షణాలు కాకపొతే మరేమిటి? నా వంక ఎలా పిచ్చి చూపులు చూస్తోందో గమనించారా?"
    "అయ్యా! బాబూ! పట్టుకోండి! లేకపోతే నన్ను కొరుకుతుంది. నా బట్టలు చింపేస్తుంది. అదుగో! నన్ను మింగేసేలా చూస్తోంది. పట్టుకోండి! పట్టుకోండి!" అని కేకలు పెట్టింది నర్సు.
    ఏ ప్రమాదం ముంచు కొస్తుందో అని చుట్టూ చేరిన వారు ఆ అమ్మాయిని గట్టిగా పట్టుకున్నారు.
    ఆమె గింజుకోవటం ప్రారంభించింది. అరిచి గోల చేస్తోంది.
    "వదలండి! నన్నొదలండి! నాకు పిచ్చి పట్టిందంటారా? మీ అందరికి పిచ్చి వదిలిస్తాను. లక్ష రూపాయలు కొట్టేసేందుకు పెద్ద ఎత్తు  వేశాడు. ఆ కుట్రలో మీరంతా పాలు పంచుకుంటున్నారు." అని అరిచింది ఆమె.
    "చూశారా! చూశారా! అవన్నీ పిచ్చి మాటలు కాకపోతే మరేమీటనుకున్నారు. భర్తని పట్టుకుని ఎన్ని మాటలంటుంది?"
    "అసలు లక్ష రూపాయలేమిటి? చేతికి కట్టు కట్టించుకుని డాక్టరు ఫీజు ఇచ్చేందుకు ఇద్దరి దగ్గరా ఒక్క పైసా లేదు."
    "లక్ష రూపాయలంట! కుట్ర చేస్తున్నారట! మనమంతా భాగం పంచుకుంటున్నామాట! ఇదంతా పిచ్చి కాకపొతే ఏమిటంటారు?"
    "వదిలి పెట్టకండి! గట్టిగా పట్టుకోండి!
    తాళ్ళు తెస్తాను. కట్టి పారెయ్యండి. అంటూ లోనికి పరుగు తీసింది. నర్సు! ఆమె లక్ష రూపాయలు కుట్ర అనే మాటలు ఉపయోగించాక నిజముగా పిచ్చి పట్టిందనే అందరూ అనుకున్నారు.
    నర్సు తాళ్ళు తెచ్చి యిస్తే కట్టి పడేయ్యాలని సిద్దంగా ఉన్నారు. భర్త వచ్చాక అతనికి అప్పగిస్తే బరువు తీరిపోతుందనుకున్నారు.
    ఆవేశం తగ్గిపోయాక ఆమె గ్రహించింది. వారికి సంబంధం లేని విషయాలు మాట్లాడి ఊబిలోకి దిగిపోయానని! సమయం మించి పోతూ ఉంది. చాల జాగ్రత్తగా ఇరికించేశాడు.
    లక్ష రూపాయల్లో భాగం పంచి యివ్వాల్సి వస్తుందనే యిలా చేశాడు.
    ఎలాగయినా వెళ్ళి అతన్ని పట్టుకోవాలి.
    సమయం దాటిపోతే మిగిలేవి శూన్య హస్తాలే!
    తనని పట్టుకున్న వాళ్ళని కొంచెం పరాకున పడనిచ్చి ఒక్కసారి మెరుపులా విజ్రుంభించిందిదామే! వారి పట్టు సడలగానే రోడ్డు మీదికి పరుగు తీసింది. చీకట్లో కలిసిపోయింది.
    అప్పుడే బయటకు వచ్చిన నర్సు చేతిలో ఉన్న తాళ్ళు వదిలేసింది.
    "అయ్యో పారిపోతోంది? పట్టుకోండి! పట్టుకోండి" అని అరిచింది.
    "ఈ చీకటిలో ఆ పిచ్చిదాన్ని వెంట ఎవరు పరుగెడతారు? ఊరుకో!"
    "ఆమె భర్త వస్తే నేనేమని సమాధానం చెప్పాలి?"
    "మతి చలించిన దాన్ని సంకెళ్ళు వేయకుండా వీధుల వెంట తీసుకు రాకూడదని బుద్ది చెప్పు" ఓ కాంపౌండర్ సలహా యిచ్చాడు.
    "అతను రాకపోతే-----?"
    "మరీ మంచిది . పీడా పోయిందనుకో!"
    "మరి డాక్టర్ ఫీజు నలబై రూపాయలో?"
    "నీ జీతంలో కట్ చేసుకోమను" అందరూ గొల్లుమని నవ్వారు.
    వంద రూపాయల కోసం ఆశపడి నలబై రూపాయలు చేతి చమురు వదిలించుకున్నందుకు సిగ్గు పడింది నర్సు.
    ఆ చీకటి తెరల్లోకి ఇంకా ఆశగా గ్రుచ్చి గ్రుచ్చి చూస్తోంది.
    కాని అప్పటికే ఆ అమ్మాయి కనుమరుగు అయింది. మళ్ళీ స్టేడియము రోడ్డులో పరుగు తీస్తోంది. దాహంగా కూడా ఉంది.
    ఎక్కడయినా విశ్రాంతి తీసుకోవాలి! దగ్గరలో కన్పించిన నర్సరీలోకి దూసుకు పోయిందామె!
    జయసింహకి ఎదురయిన కుర్రాడే ఎదురయ్యాడు.
    "ఏం కావాలి ! బెంగుళూరు నించి పచ్చ గులాబి మొక్కలు వచ్చాయి" అంటూ ఎంతో మర్యాదగా చెప్పాడు.
    అనుకోని ఈ పలకరింపుకి ఉక్కిరి బిక్కిరి అయిందామే. అది నర్సరీ అని అర్ధమయి పోయింది.
    ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాలి కదా! కొద్ది సేపటి క్రితం కాగితము మీద చదివిన ఆ పేరు గుర్తుకొచ్చింది.
    "స్టార్ సన్ కావాలి! ఉన్నాయా?"
    "అందరూ అదే అడుగుతారేంటి? నగరంలో అప్పుడే అందరికీ దాని పేరు ప్రచారమయిందన్నమాట!?"\
    "ఇప్పుడే కదూ ఒకాయన వచ్చి అడిగి పోయారు. అది ఒక్క ,మొక్క వచ్చింది. దాన్ని ప్రియాంక గారు తీసుకుపోయి తోటలో నాటుకున్నారు. అందరూ అదే కావాలంటే ఎలా?"
    "ఇంకా క్రొత్త మొక్కలు వచ్చాయి తీసుకుంటారా?" అన్నాడు  విసుగ్గా.
    "నాకు అదే కావాలి? ప్రియాంక అంటే ఎవరు?"
    "ధర్మాజీరావు గారమ్మాయి!"
    "ఓహో ! అలాగా! దాని గురించి అడిగింది ఎవరు?"
    "ఇప్పుడే ఎవరో ఒకాయన అడిగి వెళ్ళారు!"
    "అయన ఎలా ఉన్నారో చెప్పగలవా?"
    జయసింహ రూపురేఖలూ, వేసుకున్న డ్రస్సు వర్ణించి చెప్పాడు కుర్రాడు. ఆమెకు అర్ధమయిపోయింది.
    "ధర్మాజీరావు గారి యిల్లు ఎక్కడ?"
    "మా అయ్యగారే ఆ తోట కాంట్రాక్టు తీసుకున్నారు. ఆ యింటి గురించి తెలియని వాళ్ళు ఎవరున్నారండీ బాబూ?" అంటూ ఇంటి గుర్తులు చెప్పటం ప్రారంభించాడు కుర్రాడు.
    ఆ చోటు తెలిశాక ఒక్క క్షణం నిలువలేదు. ఆమె ఆ వైపుగా పరుగు తీయటం ప్రారంభించింది.

                          *    *    *

    ధర్మాజీరావుగారి కారు కాంపౌండ్ లోపలకు ప్రవేశించింది . అయన వెళ్ళగానే మెయిన్ గేటు మూసేశాడు ఘూర్కా!
    అమ్మాయి గారి కారు యింకా రాలేదు. అది కూడా వచ్చేస్తే మెయిన్ గేటు తాళాలు బిగించి కాస్సీపు విశ్రాంతి తీసుకోవచ్చు.
    ఆ కారు కోసం ఎదురు చూస్తూ రోడ్డు మీదికి కన్పించేలా మోల్డా వేసుకుని కూర్చున్నాడు. మెయిన్ గేటు ప్రక్కనున్న సిమెంటు దిమ్మెల మీద కాంతివంతమయిన దీపాలు వెలుగుతున్నాయి.
    ఆ కాంతి విరగబడి నవ్వుతుంది. గేటు ఎదురుగ్గా పులిలా మీసాలు దువ్వుతూ కూర్చుని వున్నాడు ఘూర్కా!
    గేటు ప్రక్కనే కొయ్య ముక్కలతో చేసిన చిన్న గది వుంది. దాని ఎదురుగ్గా తెల్లని ఆకులతో మధ్య సూర్యబింబం లా మెరుస్తున్న మోవ్వతో కన్పిస్తోంది స్టార్ సన్ పూల మొక్క.
    పగలబడి నవ్వుతున్నట్లున్న దీపాల కాంతిలో అది ధగధగ లాడుతోంది. దాన్ని చేరుకోవటం యెలా?
    ఘూర్కా అలా యెంత సేపూ కూర్చుంటాడో! సమయం దగ్గర అవుతోంది. ఏం చెయ్యాలి! ముందు ఘూర్కాని ఆ చోటు నించి కదిలించటం యెలా? గేటు ఎదురుగా రోడ్డుకి అవతల ప్రక్క క్రీ నీడలో నిలిచి వున్న జయసింహ ఆలోచిస్తున్నాడు.
    తెల్లని కాంతి! దీపాల వెలుగు! మూసినగేటు! ఎదురుగా ఘూర్కా ప్రక్కనే స్టార్ సన్!
    దాని దగ్గర దాచి ఉంచిన క్లూని తెలుసుకోవటం మాటలా? ఇది సాధ్యమయే పనాని దిగులుతో కృంగిపోతున్నాడు.
    కాస్సేపు ఎదురు చూచిన ఘూర్కా యింక అమ్మాయిగారు వచ్చేందుకు ఆలస్యం ఉందని గ్రహించాడు.
    జేబులోంచి బీడీ తీసి వెలిగించాడు. గట్టిగా దమ్ము లాగి రెప్ప వేయకుండా రోడ్డు మీదికి చూస్తూ కూర్చున్నాడు.
    క్షణక్షణానికి జయసింహ భూమిలోకి కృంగిపోతున్నాడు. దగ్గరలో అలికిడి అయింది. తలత్రిప్పి చూశాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS