Previous Page Next Page 
బ్లాక్ టైగర్ పేజి 44

 

    "ఆ మొక్కని మనం బ్రతికించి యిచ్చే షరతు మీద అమ్మారా? బ్రతికిందా-----?"
    "అవునండీ బ్రతికింది. క్రింది ఆకులు ఊడాయి. క్రొత్త చిగురు కన్పించింది నిన్ననే!" అన్నాడు వాడు.
    "వెరీ గుడ్ ! ఆ మొక్కని ఎక్కడ నాటారు?"
    "చాలా అరుదయిన మొక్క కదండీ! ఆ అమ్మాయిగారికి గార్డెన్ మీద వల్లమాలిన మోజు! గేటు ప్రక్కనే ఘుర్కా కూర్చునే కాబిన్ ఉంది కదండీ! దాని ఎదురుగ్గా నాటారు."
    "థాంక్యూ! వెళ్లొస్తాను"
    "అదేంటి సార్! మీరు పూల మొక్కల కోసం రాలేదా?" జయసింహ ఈ ప్రశ్న విని ఉలికిపడి ఆగిపోయాడు.
    "అందుకోసమే వచ్చాను. కాని నేను అడిగింది లేదన్నారు కదా .........!"
    "అవును సార్! ఒక్కటే మొక్క వచ్చింది. వెళ్ళిపోయింది. ఈ సారి బెంగుళూరు వెళ్ళినప్పుడు ఆ మొక్క తీసుకు రావాలి. మీ అడ్రస్ యివ్వండి" అన్నాడు నర్సరీ యజమాని.
    చెప్పేందుకు అడ్రస్ ఎక్కడుంది?
    "ఎందుకండీ! నేను వస్తూనే వుంటాను కదా! మీరు బెంగుళూరు ఎప్పుడు వెడతారో చెప్పండి వచ్చి కలుస్తాను "
    "బొంబాయి నించి క్రొత్త మొక్కలు వచ్చాయి. చూస్తారా?"
    "ప్రొద్దు పోయింది కదా! మరోసారి వస్తాను."
    "అలాగే వెళ్ళండి" అన్నాడు యజమాని. బ్రతుకు జీవుడా అనుకుంటూ పాక నించి బయట పడ్డాడు. పూల మొక్కల మధ్య ఒకచోట జనం గుంపులుగా నిలబడ్డారు.
    నర్శరీ ఎదుట దాదాపు పాతిక కార్లున్నాయి.
    "ఏమిటా హడావుడి?" అని అడిగాడు జయసింహ!
    "కలకత్తా నించి క్రొత్త రకం క్రోటన్స్ మొక్క వచ్చిందండీ! ఆక్షన్ జరుగుతోంది" అని బయట చెప్పాడు కుర్రాడు.
    "ఆక్షన్ జరుగుతోందా? అంటే వేలం పాట పాడుతారా?"
    "అవునండీ! చూచేందుకు చాల సరదాగా వుంటుంది రండి. ఈసారి పరిస్థితి ఉద్రేకంగా కూడా వుంది. వెళ్ళి చూడండి." అంటూ వెళ్ళిపోయాడు.
    ఒక పూల మొక్క కోసం ఇన్ని కార్లేమిటి? ఇంత హాడావుడి ఏమిటి? ఆ వైపుగా వెళ్ళాడు.
    ఆక్షన్ ప్రారంభమయింది!
    "సార్! ఇది ఫారిన్ నించి వచ్చిన క్రోటన్! ఇండియాలో ఎక్కడా లేదు. దాన్ని ప్రతిష్టాత్మకంగా తోటలో పెంచుకోగల అదృష్టవంతులు యెవరో పాడండి. సర్కారు వారి పాట వంద రూపాయలు" అంటూ ప్రారంభించాడు . వెంటనే కరెంట్ లా అందుకున్నాడు.
    ఉద్రేకంగా అయిదు వందలు దాటిపోయింది పాట! రంగంలో యిద్దరే మిగిలారు. మరో అయిదు నిమిషాలు ఉద్వేగం! ఉద్రేకం!
    పాడేవాళ్ళు ఉత్సాహంతో పాడుతున్నారు. చూసే వాళ్ళు అసూయగా చూస్తున్నారు. ఉడికి పోతున్నారు.
    ఆరువందల యాభైకి పాట కొట్టి వేయబడింది . డబ్బు చెల్లించి పూల కుండీ డ్రయివర్ చేత పట్టించుకుని వచ్చిందా అమ్మాయి.
    దాన్ని చూచేందుకు జనం గుమిగూడారు. వారిని తోసుకుంటూ ముందుకు నడుస్తున్నారు డ్రయివరు.
    చీకటిలో యెవరో వెనుక నించి అతని మోచేయి మీద పొడిచారు. అసూయ భగ్గుమంది. పూల కుండీ నేలమీద పడి భళ్ళున బ్రద్దలయింది .
    నేలపాలయిన పూల మొక్క మీది నించి కార్లు దూసుకు పోతున్నాయి. జయసింహ కళ్ళముందే అసూయ ఆ మొక్కని చిదిమి మట్టిగా మార్చేసింది.

                               18


    "అమ్మాయ్! నీ పేరేమిటమ్మా!"  ఎంతో జాలి నిండిన కంఠ స్వరంతో అడిగింది నర్స్? ఆకారణంగా ఆమె చూపుతున్న జాలి చాల అసహజంగా అనిపించింది. కోపంగా చూచిందామె.
    "పేరేమిటంటే అంత కోపంగా చూస్తావెందుకు?"
    "నేనింక మాట్లాడను. కాలక్షేపం కావాలనుకుంటే వెళ్ళి నీ రోగులతో కాలక్షేపం చెయ్యి! నన్ను పలకరించకు" అందామె విసుగుగా!
    అతను చెప్పింది నిజం! పిచ్చి కాకపోతే అడిగిందానికే యింత కోపం రావాలా?" అనుకుంది నర్స్!
    "ఎక్స్ యిటీ అవకు. స్థిమితంగా కూర్చో" అని సలహా ఇచ్చింది.
    "నువ్వేం చెప్పక్కరలేదులే! వెళ్ళు! వెళ్ళు! నన్ను ఒంటరిగా ఉండనీ!"
    "తప్పమ్మా! నువ్వు ఒంటరిగా కూర్చోకూడదు" అంది మరింత జాలిగా! ఆ జాలి చిర్రెత్తిస్తోంది. ఆ అమ్మాయికి. కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి.
    "ఏం ఏమయింది నాకిప్పుడు? అంది అసూయగా! ముక్కు పుటాలు యెర్రపడ్డాయి. పెదవులు అదురుతున్నాయి. డబ్బు లేకపోవటంతో జరిగిన అవమానంకి తోడు ఈ గొడవేమిటి అని ఆలోచిస్తోంది కోపంగా!
    పిచ్చి పాపం బాగా ముదిరిపోయింది. లేకపోతే పాపం అంత కోపం ఎందుకొస్తుంది అని ఇంకా జాలిపదిపోయింది నర్స్!
    "ఏమయిందేమిటమ్మా! మతి స్థిమితం లేనివాళ్ళు ఒంటరిగా కూర్చుంటే యేవో పిచ్చి ఆలోచనలు వస్తాయి. అదుపు తప్పి ఆలోచనలు వస్తాయి. అందుకే నేను తోడుగా కూర్చున్నాను" అందామె మెడలో సిలువని చూసుకుంటూ!
    "పిచ్చా! ఎవరికి ? నీకు పిచ్చి! నీ అమ్మాకి పిచ్చి! బుద్ది తక్కువగా మాట్లాడకు. నాకు పిచ్చేమిటి? నీలాంటి పిచ్చిదాన్ని నర్సుగా పెట్టుకున్న మీ డాక్టరు పిచ్చివాడు! ఇంకా ఎక్కువగా మాట్లాడవంటే బాగుండదు. సీరియస్ గా తీసుకుంటాను" అంది పొంగి వస్తున్న ఉక్రోషంతో.
    లాకెట్ లో ఉన్న స్లివ్ ని కళ్ళకి అడ్డుకుంది నర్సు!
    "అవ్సునమ్మా! మా అందరికీ పిచ్చే! నువ్వు స్థిమితంగా కూర్చో ! పాపం అసలే గాయపడి వున్నావు!" అంది అమితమయిన జాలి కంఠస్వరంతో.
    ఆ జాలి మాటలు ఆ అమ్మాయికి అదుపు తప్పినా కోపం తెప్పించాయి.
    ప్రతిసారీ కళ్ళకి అద్దుకుంటున్న స్లేవ్ ని పిడికిట పట్టుకుంది.
    తన గుండెను పిడికిట పట్టుకున్నట్లుగా నర్సు విలవిల లాడిపోయింది.  
    "బాబోయ్! ఈ పిచ్చిది నా లాకెట్ తెంచేస్తుంది. రక్షించండి . హెల్ప్! హెల్ప్!" అని కేకలు పెట్టటం ప్రారంభించింది.
    కాంపౌండర్లు, పేషెంట్స్ కి తోడుగా ఉండేందుకు వచ్చిన వాళ్ళు వారి చుట్టూ చేరిపోయారు.
    ఆ అమ్మాయి తన పట్టుని సడలించింది. నర్సు దూరంగా జరిగింది.
    "ఈ పిచ్చిది నన్ను చంపేసేలా ఉంది బాబోయ్!' అంది గండం గడిచి క్షేమంగా బయటపడిన లాకెట్ కళ్ళకి అడ్డుకుంటూ.
    "ఎవరు నువ్వు? ఎందుకొచ్చావు?" ఓ కాంపౌండర్ సీరియస్ గా అడిగాడు.
    "చేతికి గాయమయితే కట్టు కట్టించుకునెందుకొచ్చాను. నేను పిచ్చి దాన్నంటుంది ఈ పిచ్చిది" ఆవేశంగా చెప్పిందామె.
    "అవును! ఆమె భర్త నాతొ చెప్పాడు! ఆమెకు పిచ్చి! ఈ మధ్య మరీ ఎక్కువయిందట! జాగ్రత్తగా చూడమని చెప్పాడు" అంటూ సంజాయిషీ ఇచ్చింది నర్సు.
    భర్త అనే మాట వింటూ మరింత మండిపడిందా అమ్మాయి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS