Previous Page Next Page 
ఇదీ కధ! పేజి 44


    "అప్పల కొండా_ సింహాద్రి నర్సమ్మ! తొందరగా రండి! ఈ పిచ్చిదాన్నెందుకు లోపలకు రానిచ్చారు. ఏయ్ ఆగు! ఏంటదీ?" పెద్ద డాక్టరూ అసిస్టెంట్సూ మందీ మార్బలంతో స్ప్రింగ్ డోర్స్ తెరచుకొని ఆఫీసు గదిలోకి పరుగెత్తారు. వాళ్ళ వెనకే సాగర్ ఆఫీసు గదిలోకి మెల్లగా ప్రవేశించాడు!
    మాధవి టేబుల్ మీద నిలబడి, జుట్టు విరబోసుకుని గంతులు వేస్తూ వున్నది. మాధవి చేతిలో ఉన్న తన స్టెత్ ను లాక్కోడానికి ప్రయత్నిస్తూ గట్టిగా కేకలు వేస్తూ పరిమళ టేబుల్ చుట్టూ తిరుగుతూ కన్పించింది.
    ఇద్దరు ఆయాలు టేబుల్ ఎక్కి మాధవిని పట్టుకొని బలవంతంగా కిందకు దించారు.
    "పరిమళా! ఎందుకసలు యీ పిచ్చిదాన్ని ఆఫీసు గదిలోకి ఎలవ్ చేస్తావ్?"
    "నన్నెలవ్ చేయకుండా నిన్ను లవ్ చెయ్యమంటావా! మై డియర్ బాస్!" మాధవి కళ్ళు తిప్పుతూ రాగాలు తీసింది.
    "ఏం చేయాలి సార్! ముందు చాలా మంచిగా_చాలా నార్మల్ గా ఉంటుంది. ఉండీ ఉండీ కేకలు వేస్తూ గంతులు వేస్తుంది. ఎవరూ చూడకుండా చాలా క్వయిట్ గా లోపలకొస్తుంది సార్?" అన్నది పరిమళ.
    "మరి! ఎవరూ చూడకుండా మీ బాస్ వస్తే నీకిష్టమేనా పరిమళం!" పరిమళ మీదకు వంగి కళ్ళు తిప్పుతూ అన్నది మాధవి.
    "వాటే న్యూసెన్సు! టేక్ హర్ ఎవే!" బాస్ గట్టిగా అరిచాడు.
    "న్యూసెన్సుగాదు బాసూ! లవ్ సెన్స్ బాసూ. పరిమళం అంటే ఏమిటో తెలుసా సారూ! సెంట్! సెంట్ అంటే ఏమిటో తెలుసా వాసన. ఏం వాసనా? ముసలి వాసన! ముసలి కంపు. ఛీ! ఛీ" రాగాలు తీస్తూ ముక్కు మూసుకొన్న మాధవిని ఆయాలు బరబరా గదిలో నుంచి బయటికి లాక్కొచ్చారు. ఆ గందరగోళంలో సాగర్ మెల్లగా తప్పుకొన్నాడు. మాధవి తనను చూడటానికి అవకాశం ఇవ్వకుండా గోడ వారగా నిలబడ్డాడు.
    ఆయాల చేతులు విదిలించుకొని వాళ్ళ మధ్య లెఫ్ట్ రైట్ కొడ్తూ వార్డులోకి నడిచి వెళుతున్న మాధవిని చూస్తుంటే సాగర్ కు అంతా ఓ కలలా అనిపించింది.
    "బాబుగారూ! ఇడుగో యీ బాబే! ఈయనకో రూపాయి యిస్తే మన పని తొందరగా అయిపోతుంది." రిక్షా అప్పన్న ఒక వార్డు బాయ్ ను వెంటపెట్టుకొని వచ్చాడు.
    "ఎవర్ని చూడాలి సార్?" అడిగాడు వార్డుబాయ్.
    "అదుగో ఇప్పుడు వెళ్ళిందే ఆ అమ్మాయిని" సాగర్ చెప్పాడు.
    "ఓ! ఆ పిచ్చిదా. చాలా తమాషాలు చేస్తుంటది. ఐదో నెంబరు వార్డు పదమూడో నంబరు గది. గంట ఆగాలి! ఇంకా టైమ్ కాలేదు."
    "బాబుగారూ! ఈయన కిచ్చేదేదో ఇచ్చేయండి" రిక్షా అప్పన్న హెచ్చరించాడు.
    సాగర్ రెండు రూపాయలు తీసి వార్డుబాయ్ చేతిలో పెట్టాడు. వాడు లాగుజేబులో నోటు వేసుకొని "ఐదు నిమిషాలాగండి" అంటూ వార్డుబాయ్ పక్క గదిలోకి వెళ్ళాడు!
    సాగర్ బల్లమీద కూర్చున్నాడు. వార్డుబాయ్ రాకకోసం ఎదురుచూస్తూ ఆలోచించసాగాడు. మాధవికి నిజంగా పిచ్చి కాదన్నమాట! ఇంటి దగ్గర కూడా యిలాగే నాటకం ఆడి, తల్లి దండ్రుల్ని నమ్మించి ఈ పిచ్చాసుపత్రిలో చేరిందన్నమాట! అసలు మొదటనుంచి మాధవి నాటకం ఆడుతున్నదా? నో! నో! అలా ప్రవర్తించడానికి అవసరమేమున్నది? డాక్టర్ మూర్తి రంగప్రవేశం చేసిన తర్వాతే పరిస్థితులు విషమించాయి. తన మానసిక స్థితి మీద రాను రాను భయాన్ని పెంచుకొని తనకు దూరంగా ఉండటానికి నిర్ణయించుకొన్నది. తను నిజంగా పిచ్చిదన్న నమ్మకం అందరికీ కలిగాక సుజాతతో నా పెళ్ళయిపోతుందన్న ఆలోచనతో ఇంత నాటకం ఆడుతున్నది మాధవి. అసలు కథ ఇదీ అన్నమాట! ఏమైతే ఏం! తనకు ఎంతో ఆనందంగా ఉన్నది ఈ రోజు. మాధవికి నిజంగా పిచ్చిలేదు. మాధవి ఆడే ఈ నాటకానికి త్వరలో తెరదించివేయాలి. అందుకు తను నాటకంలో అంతర్నాటకం ఒకటి ఆడాలి. తను విన్నదీ చూసినదీ మాధవికి తెలియనివ్వకూడదు. తనూ మాధవి పిచ్చిదనే నమ్మినట్టు ప్రవర్తించాలి. మరో ఐదు నిముషాల్లో మాధవిని చూస్తాడు. తన కళ్ళముందు పిచ్చిదానిలా ప్రవర్తిస్తుంది. మాధవిని ఒక ఆట ఆడించాలి. పిచ్చిదానిలా టేబుల్ మీద ఎక్కి గంతులు వేసేప్పటి మాధవి కళ్ళముందు కదిలింది. ఎంత సహజంగా నటించింది. ఆలోచిస్తూ కూర్చున్న సాగర్ పెదవులపై చిరునవ్వు తొణికింది.
    అది చూసిన అప్పన్న ఆశ్చర్యంగా "బాబుగారూ" అన్నాడు.
    "ఆ మిఠాయి కొంత నువ్వు తీసుకొని మిగతాది ఆసుపత్రి వాళ్ళకిచ్చేయ్" అప్పన్నను చూసి అన్నాడు సాగర్.
    "ఆఁ రండి సార్" అంటూ వార్డుబాయ్ వచ్చాడు. వార్డుబాయ్ వెనకే సాగర్ ఐదో నంబరు వార్డులోకి నడిచాడు.


                                                               24


    వైజాగ్ బీచ్ లో కూర్చుని, ఆలోచనలో నిమగ్నమై ఉన్న సాగర్ చేతివాచీ చూసుకొన్నాడు. ఆరుగంటలు దాటి ఐదు నిమిషాలయింది. హఠాత్తుగా లేచి నిలబడ్డాడు. బట్టలు కంటుకొన్న ఇసుక దులుపుకొని గబగబా నడవసాగాడు!
    ఆమె ఇంటికి వచ్చే ఉండాలి. ఆమెతో నిజం చెప్పించాలి. తనతో సహకరిస్తుందనే నమ్మకం ఉన్నది. అయినా... ఆలోచిస్తూ బీచ్ రోడ్డెక్కాడు.
    "ఏ రిక్షా?" దారే వెళ్తున్న రిక్షాను ఆపాడు. రిక్షా వాడు ఆగి రిక్షా దిగి "ఎక్కడికి బాబూ?" అన్నాడు.
    "మహారాణిపేట వస్తావా?"
    "ఎక్కండి బాబూ!"
    "ఏమియ్యమంటావ్!"
    "రూపాయిన్నర!"
    సాగర్ రిక్షావాడితో బేరమాడే మూడ్ లో లేడు. అంతా కలిపి అక్కడికి అరమైలు దూరం కూడా ఉండదని తెలుసు. మాట్లాడకుండా రిక్షా ఎక్కి కూర్చున్నాడు సాగర్.
    మరో పావుగంటలో రిక్షా మహారాణీపేట చేరుకుంది. ఓ డాబా ఇంటి ముందు రిక్షా ఆపి సాగర్ దిగాడు. రిక్షా వాడికి డబ్బులిచ్చి పంపేసి చిన్న గేటు తెరచుకొని వరండా మెట్ల దగ్గరకొచ్చాడు. రెండుసార్లు కాలింగ్ బెల్ నొక్కి తలుపు పక్కగా నిలబడ్డాడు.
    "ఎవరు బాబు?" నడివయసు దాటిన ఒకామె తలుపు తీసి సాగర్ ను ప్రశ్నించింది.
    "డాక్టరమ్మగారున్నారా?"
    "ఇప్పుడే ఆసుపత్రి నుంచి వచ్చారు. కొంచెం ఆగి రండి."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS