అందుకే ఎవరూ వాళ్ళను అనుమానించే అవకాశం లేకపోయింది.
అలానే మంగళ విషయంలోనూ చేయాలనుకున్నారు.
ఆమె జానీవాకర్ ను గుర్తించడం వలన ఆమెను హత్య చేసి వెళ్ళిపోయాడు.
హోటల్ గదిలో వున్న వ్యక్తీ పైకే ఆ హత్య నేరం వెళుతుందని భావించాడు.
కానీ సునీల్ కూడా ఆ నేరం మీద పడుతుందని తెలివిగా తప్పు కోవడం వలన ఆ కేసు పోలీసులకు మిస్టరీగానే మిగిలిపోయింది.
జానీవాకర్ స్టేట్ మెంట్ ప్రకారం అతని పార్టనర్ అయిన రాజేష్ ను కస్టడిలోకి తీసుకున్నాడు ఇన్ స్పెక్టర్ కిరణ్.
పోలీస్ ఇంటారాగేషన్ లో అతను తన నేరాన్ని అంగీకరించాడు.
"థాంక్స్ మేడమ్! అసలయిన నేరస్థుడిని పట్టిచ్చారు."
కిరణ్ కరచాలనం చేస్తూ అన్నాడు.
"ఇట్స్ మై డ్యూటీ .....అయినా వైజాగ్ లో మీరు.....మీ సిబ్బంది నాకు దర్యాప్తులో అన్ని విధాల సహకరించారు. అసలు నేనే మీకు మీ సిబ్బందికి ధాంక్స్ చెప్పాలి...." అన్నది ధీరజ.
"కానీ మీ కేసు మిస్టరీ ఇంతవరకు తేలలేదే. మా సహకారం వలన మీ కేసులో ముద్దాయి ఎవరో మీరు తెలుసుకోగలిగితే అప్పుడు మీరు చెప్పకపోయినా థాంక్స్ అడిగి మరీ చెప్పించుకుంటాను" చిరునవ్వు నవ్వుతూ అన్నాడు కిరణ్.
'అయితే ఇప్పుడే థాంక్స్ చెప్పి వెళ్ళి పొమ్మంటారా?"
"భలే వారే! సరాసరి ముద్దాయిని అరెస్టు చేయకుండానే వెళుతున్నారా ఏమిటి? కిరణ్ జోక్ గా అన్నాడు.
"మీరు జోక్ చేసినా, ఆ జోక్ ను నిజం చేయడానికయినా నేను వెంటనే ముద్దాయిని అరెస్టు చేయాలి.....గుడ్ బై ఇన్ స్పెక్టర్ ...." తనూ చిరునవ్వుతో అతని వద్ద శెలవు దీసుకున్నది ధీరజ.
ఆమె మాటలలోని గూదార్ధం అర్ధం కాని ఇన్ స్పెక్టర్ కిరణ్ ఆమె వెళ్ళిన వైపే ఆశ్చర్యంగా చూస్తుండిపోయాడు!
* * *
సింహాచలం గ్లాస్ డోర్ లాగి తను తెచ్చిన స్కాచ్ విస్కీ లోపల పెట్టాడు.
అది గమనించిన స్వప్న నిట్టూర్చింది.
తన ప్రవర్తన ఎలాంటిదో అతనికి తెలిసినప్పటి నుండీ అతని ప్రవర్తనలలో కూడా మార్పు కొట్టవచ్చినట్టు కనిపిస్తుంది.
సింహాచలం ప్రతిరోజూ తాగుతున్నాడు.
ఎక్కువగా బయట తిరుగుళ్ళు తిరగడం లేదు.
అసలు ఆ రోజు నుండి ఆ టాపిక్ నే ఎత్తడం లేదు అతను.
ఏమీ ఎరుగనట్టే మౌనంగా వుంటున్నాడు.
తను మాత్రం తక్కువ తిన్నానా అన్నట్లు స్వప్న కూడా ఎప్పటిలానే వుంటుంది.
రాత్రిళ్ళు అతను పడక మీదకు వచ్చినా తనకు ఎలాగూ సుఖం కావాలి కాబట్టి అభ్యంతరం చెప్పడం లేదు.
అతనిని చూస్తున్న స్వప్నకు జాలి వేస్తుంది.
అందుకే తను కూడా కొంతకాలం పాటు బుద్దిగానే వుండదలుచుకున్నది.
కానీ, ఆన్నీ అనుకున్నవి అనుకున్నట్లు జరగవు కదా. సునీల్ రాకతో మరలా ఆమె మనస్సు పూరి విప్పిన నెమలిలా నాట్యం చేసింది.
తన భర్త ఎదురుగా వున్నాడు.
ఏమయినా అనుకుంటాడెమో అనే సందేహాన్ని గాలికి వదిలివేసింది.
తన నిర్ణయాన్ని సడలించుకున్నది.
పడక గదిని శోభనపు గదిలా చేసుకోవాలని తహతహ లాడింది.
సునీల్ నిర్దోషిగా భావించి ధీరజ వదిలి వేసింది.
అయితే ఆ కేసులో దర్యాప్తు అయ్యేవరకూ అతను విజయవాడ లోనే వుండాలని రోజూ స్టేషన్ కు హాజరు కావాలన్న షరతు పెట్టాడు డి.ఎస్.పి.
అందుకే ధీరజ అతనిని తన ఇంటికి ఆహ్వానించింది.
సునిల్ ఇక్కడ తను తప్ప ఇంకెవరు ఉన్నారని?
కనీసం ఇక్కడ ఉన్నప్పుడయినా అతనిని తన ఇంటికి తీసుకువెళ్ళాలను కుంది.
కాని ఎలా......?
అటు పై అధికారుల దృష్టిలో ---- ఇటు సిబ్బంది దృష్టిలో తను చులకన అయిపోదూ?
ఏది ఏమయినా తన మనసును ఇంక కష్ట పెట్టదలుచుకో లేదు. అతనిని సరాసరి తన ఇంటికి రమ్మని పిలిచింది.
కాని సునిల్ ఆమె అభ్యర్ధనను సున్నితంగా తిరస్కరించి వెళ్ళి పోయాడు.
అదీ ఒకందుకు మంచిదేనేమో....!
అతనిని నిర్దోషిగా నిరూపించి దోషి ఎవరో తెలిసే వరకూ రాకూడదు అనే వుద్దేశ్యంతో అతను అలా ప్రవర్తించి వుంటాడా?
ధీరజ అ కేసు దర్యాప్తు పైనే పూర్టిగా తన దృష్టిని కేంద్రీకరించింది.
ఎక్కడో ఒకచోట వుండాలి కాబట్టి తనకు పరిచయం ఉన్న స్వప్న ఇంటికి వెళ్ళాడు సునీల్.
స్వప్న అతడిని సాదరంగా ఆహ్వానించింది.
కాని వాళ్ళ సంభాషణ వినలేక సింహాచలం నిప్పులు కురిసే కళ్ళతో బయటకు వెళ్ళిపోయి ఎప్పుడో అర్ధరాత్రికి వచ్చాడనే సంగతి మాత్రం వాళ్ళకు తెలియదు.
సునిల్ ను చూసినప్పుడల్లా సింహాచలం ఆవేశానికి లోను కావడానికి కారణం వుంది.
ఆ రోజు తన మామగారింట్లో తన భార్య సునీల్ తోనే సరసాలాడుతున్నది....
అప్పుడే తన భార్య ఎలాంటిదో తెలిసింది. అదేమంటే కుండ బద్దలు కొట్టినట్టు అతనితో సంబంధాన్ని వదులుకోలేనని కావాలంటే విడాకులు ఇవ్వడానికి అయినా సిద్దమే అని తేల్చి చెప్పింది.
తన సంసారంలో సుఖ శాంతులు లేకుండా పోయింది ఈ సునీల్ వల్లనే.
మళ్ళీ తిరిగి ఇప్పుడు ఇక్కడ ప్రత్యక్ష మయ్యాడు.
కానీ తను ఏమి చేయలేని అశక్తుడు.
అందుకే సింహాచలం మౌనంగా మూగవేదనను అనుభవిస్తున్నాడు.
వాస్తవానికి సునీల్ మనస్సు కూడా కల్లోలానికి లోనై వుంది.
తన ప్రియురాలి దృష్టిలో ఒక హంతకుడిగా తన మీద అభియోగం వచ్చినందుకు కాదు.
ఎవరో అమ్మాయిల శీలలతో ఆడుకున్న కామాందునిగా నిలిచి పోవలసి వచ్చినందుకు.
ఎనిమిదేళ్ళ తరువాత కలిసిన వాళ్ళు ఎవరయినా మళ్ళీ మళ్ళీ కలుసుకోవాలని తహతహ లాడిపోతారు. కాని తను మాత్రం మళ్ళీ తిరిగి ధీరజను కలుసుకోవాలను కోవడం లేదు.
తనపై తనకే అసహ్యం వేయడమే అందుకు కారణం.
సునిల్ మనస్సులోని వేదనను గుర్తించలేని స్వప్న ఎప్పటిలానే అతనిని బెడ్ పైకి లాగింది....
"సారీ స్వప్న..... నేను అందుకోసం రాలేదు."
"మరి....
"నాకు మనశ్శాంతి కరువయింది.....అది వెదుక్కుంటూన్నాను"
"ఎస్.....అది ఇక్కడ తప్పకుండా దొరుకుతుంది' అంటూ అతని తలను తన హృదయానికి హత్తుకుని నిమరసాగింది.
"కేసు ఫైనల్ అయ్యేవరకూ నేను ఇక్కడే ఉండాలట.....వెంటనే ఎక్కడకు వెళ్ళాలో తెలియక, ధీరజను తప్పించుకుని వచ్చేయాలని గమ్యం తెలియక నీ వద్దకు వచ్చాను."
'అబ్బ....నీ వేదాంతం అపు బాసూ....నాకు కావలసింది ఏమిటో నీకు తెలుసు....అది నువ్వు ఇచ్చాక ఏం చెప్పిన వింటాను. కమాన్...." స్వప్న చిలిపిగా అన్నది.
