Previous Page Next Page 
కె. ఆర్. కె మోహన్ కథలు పేజి 44

 

    "ఏంకావాలి? ఎవరు నువ్వు?" అని అడిగాడు.


    "స్వామీ ...నేను మీ భక్తుణ్ణి! నిత్యమూ మీ ఫోటోను ఇంట్లో పూజిస్తూ వుంటాను. అంతేకాదు..., నా హృదయం మీదే దాచుకున్నాను కూడా!" అంటూ లోపలిజేబులో మంచి బంగారుబాబు ఫోటో  ఒకటి తీసి చూపించాడు.

 
    "సరే.... ఏమి కావాలి?" అన్నాడు ఆయన.

 
    "ఏమీ వద్దు స్వామీ? తన దర్శనం అయింది... అదే పదివేలు!' అంటూ రెండు చేతులూ జోడించాడు పేరయ్య.


    చిరునవ్వుతో ముందుకుసాగాడు బంగారుబాబు.


    మాయాదేవి అటువంటి దృశ్యాలను ఎన్నింటినో చూసింది. కాని, పేరయ్య ముఖంలో కృత్రిమత్వం కనిపించలేదు. అతని ముఖంలో సాక్షాత్తూ రామునికి నమ్మినబంటు అయిన ఆంజనేయుని కళ గోచరించింది.

 
    చిరునవ్వుతో అతనివంక ఆదరంగా చూసింది.

 
                            *    *    *    *    *

    
     ఒక దశాబ్దం గడిచింది.

 
    దేశంలో ఎన్నెన్నో మార్పులు వచ్చాయి.


    ఒకరోజు అకస్మాత్తుగా బంగారుబాబు గుండెపోటుతో కన్నుమూశాడు. దేశం దుఃఖసాగరంలో మునిగివపోయింది. పేరయ్య హుటాహుటిన రెక్కలు కట్టుకుని ఢిల్లీలో వాలాడు.


    బంగారుబాబు శవాన్ని ప్రజలకు ధర్మధర్శనం కోసం వుంచారు. శవం ప్రక్కనే మాయాదేవి మౌనంగా విచారంగా కూర్చుని వుంది. పేరయ్య జనంతోపాటు శవ దర్శనానికి వెళ్లాడు. ఆ మృతదేహం పాదాలు పట్టుకుని గుండెలు అవిసేటట్లు రోదించడం మొదలుపెట్టాడు. ఆ హోరుకి, ఆ జోరుకి తలయెత్తి అటు చూసింది మాయాదేవి.


    ఈ విగ్రహాన్ని ఎక్కడో చూసినట్లు మెదులుతుండగానే, 'శివపాదాలు' వదలని మార్కండేయునిలాగా  "శవ పాదాలు" వదలకుండా  రోదిస్తున్న పేరయ్యను బలవంతంగా బయటకి పంపించారు భద్రతా పోలీసులు.


    బంగారుబాబు శవానికి సకల రాజలాంఛనాలతో ప్రపంచాధినేతల సమక్షంలో అంత్యక్రియలు జరిగాయి. మంత్రివర్గంలో సీనియర్ ని శౌచ్యప్రధానిగా క్యాబినెట్  ఎన్నుకుంది. సంతాపదినాలు  అయ్యాక కొత్త ప్రధాని ఎన్నిక జరుగుతుంది.

 
    మూడు రోజులు గడిచాక - ఎలాగోలాగ మాయాదేవి దర్శనం  చేసుకోగలిగాడు పేరయ్య.

 
     ఆమె ఆ విశాలమైన హాలులో కూర్చుని పరామర్శించడానికి వచ్చిన వారితో  మాట్లాడుతోంది.  ఆమె వద్దకి వెళ్ళి అమాంతం పాదాల మీద పడి రోదిస్తూ -


    "అమ్మా .. తమ సెలవు తీసుకుపోడానికి  వచ్చాను" అంటూ పాదాభిషేకం  చేయసాగాడు.


    ఆమె అభిమాన పూర్వకంగా అతని తల  తట్టింది.


    "తల్లీ ...నాదొక చిన్న కోరిక!' అని విన్నవించుకున్నాడు పేరయ్య.

 
    ప్రశ్నార్దకంగా అతని తల తట్టింది.


    "నా ప్రభువు బంగారుబాబు పాదుకలు ఈ దీనుడికి  అనుగ్రహించండి.  వాటిని పూజామందిరంలో  వుంచి నిత్యమూ పూజించుకుంటాను. దేవరవారి పాదుకలు అనుగ్రహిస్తేనే కాని తమ పాదాలు వదలడీ  దీనుడు!" అంటూ అమ్మగారి రెండు కాళ్లూ గట్టిగా పట్టుకున్నాడు పేరయ్య.


    పేరయ్య మాటల్లో , ముఖంలో పదేళ్ల క్రితం కనిపించిన ఆ అమాయకత్వం, నిజాయితీ తిరిగి కనిపించాయి మాయాదేవికి.

 
    వెంటనే బంగారుబాబుగారి బాత్ రూమ్ చెప్పులు తెప్పించి పేరయ్యకు బహూకరించింది అమ్మగారు.


    వాటిని కళ్లకు అద్దుకుని భరతుడు రామపాదుకలు నెత్తిన  పెట్టుకొని వెళ్ళినట్లు నెత్తిన పెట్టుకొని అమ్మగారి దగ్గర సెలవు తీసుకున్నాడు పేరయ్య.


     'ఈ అపర భరతుడు, ఈ అపర హనుమంతుడు ఎవరా?'...అని ఆశ్చర్యంతో నోళ్ళు వెళ్ళబెట్టి చూడసాగారు అక్కడివారు.


    బంగారుబాబు మరణంతో దేశం అల్లకల్లోలం అవుతుందనీ, కుక్కలు చింపిన విస్తరి అవుతుందనీ ఎందరో భయపడ్డారు. కాని, అటువంటిదేమీ  జరుగలేదు. ప్రజల అభిమానం చూరగొన్న రత్నాకర పండిట్ కొత్త ప్రధాని అయ్యారు. బంగారుబాబు పార్టీకి మాయాదేవి అధ్యక్షురాలు అయింది.


    త్వరలోనే అనేక రాష్ట్రాలతోపాటు  ఆంధ్రప్రదేశ్ లో కూడా అసెంబ్లీ ఎన్నికలకు ప్రకటన వెలువడింది. తాను ప్రముఖ కార్మిక నాయకుడనీ, అనేక ప్రజాహిత సంస్థలతో తనకు సన్నిహిత సంబంధం వుందనీ..., అందువలన తమ పార్టీ టికెట్ ఇప్పించవలసిందిగా కోరుతూ - బంగారుబాబు పార్టీ రాష్ట్ర కమిటీకి  అభ్యర్దన పత్రం సమర్పించాడు పేరయ్య.  అంతేకాదు. ..., హుటాహుటిన హస్తినాపురానికి వెళ్లి మళ్ళీ అమ్మగారి పాదాల మీద పడ్డాడు. తాను యం. యల్. ఏ.  అయితే తన నియోజకవర్గంలో ప్రతీ ఇంటా బంగారుబాబు, మాయాదేవిగార్ల ఫోటోలు ప్రతిష్టింపచేస్తాననీ, వారి సూత్రాలు ప్రచారం చేయించి పార్టీని బలిష్టం చేస్తాననీ విన్నవించుకున్నాడు.


    ఆ సమయంలో కూడా పేరయ్య ముఖంలో ఎప్పటి నిజాయితీయే కనిపించింది మాయాదేవికి.


    "సరే .. చూస్తాను!" అని పేరయ్యను పంపించేసింది ఆమె.

 
    బంగారుబాబు పార్టీశాఖ హస్తినాపురంలోని అధిష్టాన వర్గానికి  అభ్యుర్దుల జాబితా పంపించింది. కొమ్ములు తిరిగిన మొనగాళ్లు, హేమాహేమీలు , కురువృద్దులు, గురు  వృద్దులు, మందభాగ్యులు, అనుభవజ్ఞులు, విప్లవ  వీరులు.... ఇలా ఎందరెందరో వున్నారు ఆ లిష్టులో. ప్రతివారు కూడా కేంద్రంలో ఎవరో ఒక అగ్రవాదులని ఆశ్రయించి, ఆశీస్సులు పొంది అండను మెండుగా ఆశించినవారే!


    అయితే.... పేరయ్య మాత్రం ఎవరి ప్రాపునూ కోరలేదు. 'కొట్తే గోల్గొండనే కొట్టాలి....' అన్నట్లు, ఏకంగా అమ్మగారి కాళ్లనే పట్టేశాడు.


    మాయాదేవి ఈసారి తగు సంఖ్యలో కొత్తవారికి, యువకులకి స్థానం కల్పించాలని  అనుకుంది. జాబితా  ముందువేసుకుని, సహాయకుల సహాయంతో ప్రతివారి జాతకాలు చూస్తూ శల్య పరీక్ష చేయసాగింది. ఎవరి ప్రాపకం కోరని అపర హనుమంతుడు పేరయ్యకి అవకాశం కల్పించాలని ఆమె మనసుకి అనిపించింది. అంతే.. .అతని అభ్యర్దిత్వమే ఖాయమైంది.


    మాయాదేవి రాజకీయ మంత్రాంగం నడపడంలో మహఘటికురాలు.  అంతకుముందే దేశంలో బంగారుబాబు పాక్టీకి ప్రజల్లో పలుకుబడి వుంది. ఆ పలుకుబడి, ఆమె చాణక్యం రెండూ కలిసి ఆసారి ఎన్నికలలో బంగారుబాబు పార్టీకి బ్రహ్మాండమైన విజయాన్ని సంపాదించిపెట్టాయి.

 
     పేరయ్య కూడా మంచి మెజారిటీతో గెలిచాడు. ఆ దెబ్బతో అమాంతం యమ్మెల్యే అయికూర్చున్నాడు పేరయ్య. తనకి అంతటి వున్నతిని కల్పించిన మాయాదేవికి పరమభక్తుడయపోయాడు. ఇంట్లో బంగారుబాబు ఫోటో పక్కనే ఆమె ఫోటో కూడా పెట్టి పూజించినప్పుడల్లా, అమ్మగారి దర్శనాల సంఖ్య పెరుగుతున్నకొద్దీ మాయాదేవికి అతని పట్ల వాత్సల్యమూ పెరగసాగింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS