"గురునకు నీ కభేదములు కోరి పఠించితి నంచుఁ జిత్తమం
దరయఁగఁ గోపమున్ వలదు అంబుజబాంధవ సోమనేత్ర! నీ
కరుణను నిన్ను నేఁడు పొడఁ గాంచితి నిం కనుమాన మేల? మ
ద్గురుడవు నీవె కావె తరిగొండ నృసింహ! దయాపయోనిధీ!"
"తరిగొండ నరసింహా! ఇక్కడ కూడా నాకు దర్శనమిచ్చావా? నా ఇలవేలుపువై నన్ను నిరంతరం వెన్నంటి ఉండి కాపాడే తండ్రీ! తరిగొండ నుండి దూరమైనాననే భావన కలుగదు. సమస్త విశ్వసృష్టికర్త అయిన నా స్వామి ఉండటానికి చోటు ఇచ్చిన క్షేత్ర స్వామివి నీవు. నీ దర్శనం సర్వపాపహరం, స్వామి సాన్నిధ్యాన్ని ప్రసాదించ గలదు. నా యావజ్జీవం నీ కనుసన్నలలో ఉండి స్వామి సేవ చేసుకుంటాను" అంటూ అనేక నతులు నుతులు సమర్పించింది.
స్వామి అర్చనకోసం ప్రత్యేకించిన ఉద్యానవనాలు, మందిరాలు, ఎత్తైన ప్రాకారాలు, బంగారు శిఖరం చూచి ఉప్పొంగి పోయింది. ప్రతి చిన్న అంశం ఆనంద దాయకమే. భక్తి భావ స్ఫోరకమే. అనన్య భక్తి భావపులకితయై, శ్రీనివాసుని కీర్తిస్తూ ఆలయంలో ప్రవేశించింది.
"ఘన గోపురములు ప్రాకారమంటపములు
తేరులు సత్పుణ్య తీర్థములును
కమలాప్త కిరణ సంకలితంబులై ప్రకా
శించుచుండెను హేమశిఖరములును
పావన పరివార దేవాలయంబులు
మహిమ నొప్పువిరక్త మఠవరములు
రంగదుత్తుంగ మాతంగ తురంగముల్
కొమరారు బహుసాధు గోగణములు
ముద్దుగాఁ బల్కు శుకపికములును నీల
కంఠములును మరాళసంఘములు మఱియు
ఫలవనంబులు తులసికాదళ సుమములు
క్రిక్కిఱిసి యుండు వేంకటగిరిని నెపుడు."
అది నడకా? పరుగా? ఎగరటమా?....తనే కదిలిందా? ఆకర్షించి లాగబడిందా? ఎప్పుడు గర్భగుడిలో అడిగిడిందో ... ... ... ఎంతసేపు స్వామి దివ్యమంగళ విగ్రహాన్ని దర్శిస్తూ ఉండిపోయిందో.... ఆలయం తలుపులు మూసే అర్చకుడు హెచ్చరిక చేసేవరకు వెంగమాంబకి ఏమీ తెలియదు. అదొక అలౌకిక అవ్యక్త ఆనంద స్థితి.
మర్నాడు కోవెల తలుపులు తీయటానికి అర్చకుడు వచ్చే సమయానికి నిన్న తాను తలుపులు మూస్తూ బయటికి పంపినపుడు ఏ స్థితిలో ఉందో అదే స్థితిలో కదలకుండా ఉన్న వెంగమాంబని చూసి, ఆశ్చర్యపోయాడు. తిరిగి తలుపులు మూసేవేళవరకు కూడా ధ్యాన ముద్రలో ఒకమూలగా పద్మాసనయై ఉన్న వెంగమాంబ అతడి ఆశ్చర్యాన్ని పెంచింది. ఆమె అన్నపానీయాలు లేకుండా ఉండటమే కాదు, నిత్యకృత్యాలకు కూడ కదలకపోవడం అద్భుతమనిపించింది. ఆలయ మహంతుకి ఆ సంగతి చెప్పాడు. మహంతు వచ్చి మండపంలో ధ్యాన నిమగ్నయై ఉన్న వెంగమాంబ ముఖంలో ఉన్న వర్చస్సుని గమనించి,
"అమ్మా! తమరెవరు? ఆలయంలో ఉండటానికి కారణం ఏమిటి? తాముండటానికి వసతిగాని, బంధువులుగాని లేరా?" అని సప్రశ్రయంగా ప్రశ్నించాడు.
వెంగమాంబ మెల్లగా కన్నులు తెరిచి, "అందరికీ బంధువు, సమస్తమూ శ్రీనివాసుడేకదా!" అంది.
సామాన్యమైన వ్యక్తి కాదు. మహానుభావురాలు అని గుర్తించి
"తమరెక్కడినుండి విచ్చేశారు? తమ పుణ్య నామ ధేయం ఏమిటి? తమవంటి వారికి సేవ చేయాలనే ఉద్దేశంతో మాత్రమే అడుగుతున్నాను" అని ఎంతో వినయంగా అడిగాడు.
"నృసింహ క్షేత్రమైన తరిగొండ మా గ్రామం....."
"అమ్మా! తమరు తరిగొండ వెంగమాంబగారు కాదు కదా? తమవంటి యోగిని, పరమ భక్తురాలు ఉండటానికి యోగ్యమైన స్థలం ఈ దివ్యక్షేత్రం. మీ సేవాభాగ్యం మాకు కల్పించండి. స్వామిభక్తుల సేవ స్వామి సేవే. తమరు ఉండటానికి ఏర్పాట్లు చేస్తాను. తూర్పు మాడవీధి చివర రాతి రథం కుడిపక్క ఒక పూరిల్లు ఉంది. ప్రస్తుతానికి దానిని మీ నివాస స్థానంగా చేసుకోవచ్చు. వంటకు కావలసిన సంబారాలను కూడ వకుళమాతా దేవిగారి ఇంటినుండి వచ్చునట్లు ఏర్పాట్లు చేయగలను. కాదనక అంగీకరించవలసినది" మహంతు అర్థించాడు.
స్వామి సన్నిధిలో ముఖ్య అర్చకుడు చెప్పినది స్వామి ఆజ్ఞ అనుకుంది వెంగమాంబ. ఆ చిన్న పూరింటినే కుటీరంగా మలచి, చుట్టూ పూల మొక్కలు, తీగలు, తులసీ బృందావనం పెంచి, పూలమాలలు కట్టి ఆలయంలో స్వామికి అర్పించటం, నిత్యకృత్యమైంది. శ్రీనివాసుని పాకశాలనుండి మాతృమూర్తి వకుళ మాతాదేవి పేరిట పంపించబడుతున్న సామాగ్రితో వండిన దానిని వేంకటాచలపతికి నివేదనచేసి, మిగిలిన ప్రసాదాన్ని తింటూ కాలం గడపసాగింది. నిత్యపూజకు, నివేదనకి వంట చేసే సమయం తప్ప మిగిలిన సమయమంతా గ్రంథ రచనలో నిమగ్నమై పోయింది.
హయగ్రీవ మంత్రోపదేశంతో మరింతగా వికసించిన మేథ ఆమెలో సహజంగా ఉన్న భక్తికి కవితా పటిమకు, జ్ఞానానికి తోడయ్యింది. రచనల్లో పరిణతి కనపడటం మొదలయ్యింది. మౌనం కారణంగా వాక్శుద్ధి సిద్ధించింది. వేంకటేశ్వరుని కీర్తనకు తప్ప పెదవి విప్పే పనిలేదు కదా!
"విష్ణుపారిజాతం" అనే నామాంతరం ఉన్న పారిజాతాపహరణ కావ్య రచన నిరాఘాటంగా సాగుతోంది. వెంగమ్మ భక్తి మహిమ, కవితా వైశిష్ట్యం తిరుమలలో అందరికీ తెలిసాయి. శ్రీవేంకటేశ్వరస్వామి వారి సంకీర్తనాచార్యుల పదవిలో స్థిరపడిన తాళ్ళపాక పెదతిరుమలాచార్యుల వంశీయుల కుటుంబానికి కూడ తెలిసింది. వారి వంశంలో స్త్రీలు కవితా రచన చేయటం అప్పటికే జరిగి ఉంది. అన్నమాచార్యుల ధర్మపత్ని తాళ్ళపాక తిమ్మక్క సుభద్రా పరిణయం అందరికీ తెలిసినదే. తమనందవరీక శాఖకు చెందిన మరియొక మహిళ యోగినియై, భక్తురాలై రచనలు చేస్తోందని ఎంతో సంతోషించారు. ఉత్తరమాడ వీధిలో తాము ఉంటున్న ఇంటి పక్కనున్న చిన్న ఇంటిలో ఉండవలసిందిగా వెంగమాంబను ఆహ్వానించారు. తూర్పు మాడవీధిలోని పూరి ఇంటినుండి ఉత్తరపు మాడవీధిలోని మిద్దె ఇంటికి వెంగమాంబ నివాసం మారింది.
ఇంటికి ఉత్తర దిక్కున ఉన్న ఎత్తైన చదునైన ప్రదేశాన్ని సేకరించి మళ్ళీ తోట పెంచటం ప్రారంభించింది. కాని, తగినన్ని నీళ్ళు లేవు. దిగుడు బావి తవ్వాలని నిశ్చయించుకుంది. బావి తవ్వటం పూర్తయిపోవచ్చింది. సరిగ్గా నీరు పడే సమయానికి పెద్ద బండ అడ్డం వచ్చింది. పడిన శ్రమ అంతా వృథా. పనివాళ్ళు వెళ్ళిపోయారు. వెంగమాంబ బావి ఒడ్డున నిలబడి గంగాదేవిని తలుచుకుని చేతులు జోడించి ప్రార్థించింది.
"ఓ తల్లీ! గంగా భవానీ! రావే!
ఖ్యాతిగ ఇచ్చటికి కపటము మాని ||ఓ తల్లీ||
హరిపాదమున బుట్టినావు పుర
హరుని జటాజూటమున నిలిచినావు
పరమపవిత్రవై నావు మా
పాలిట వెలసి పూజలు గైకొన్నావు ||ఓ తల్లీ||
హరి కర్పితముగ శ్రీతులసీవన
ములనా డర్చతో నిన్ను గావింప వెలసి
తరు ణిది పెంచను మెరసి యున్న
నర లేక రావె శేషాద్రిలో వెలసి ||ఓ తల్లీ||
వాసిగ నిను చాల నమ్మి, చిన్న
వాండ్ల కాదరువుగ నున్న సొ మ్మమ్మి
చేసితి, నిను పని నమ్మి చేయ
నిరవుగ ఇచటికి బిరబిర రమ్మి ||ఓ తల్లీ||
తరిగొండ నరసింహుడైనా శేష
గిరివాసు నే వేళ కీర్తింపు జ్ఞాన!
కరుణ నాపై మంచు శానా, మమ్ము
కడతేర్చు భారము కల్గినదాన! ||ఓ తల్లీ||
