అతడు తనతోపాటూ తెచ్చిన ప్యాకెట్ లో ఆ గాలిని నింపేడు. గాస్ లీకేజి ఆగిపోగానే, మాస్క్ తీసేసి మామూలుగా అక్కణ్నుంచి బయటకు రాబోయేడు.
ఫ్యాక్టరీ ముందు సెక్యూరిటీ ద్వారం నుంచి బయటకు వెళ్ళటానికి వీలులేదు. మామూలు పరిస్థితులలో అయితే కుదురునేమోగానీ, ఇప్పుడు చొక్కా చిరిగిపోయి వుంది. బురదకూడా అంటింది. అందువల్ల అతడు గతంలో వచ్చిన మార్గాన్నే తిరిగి వెళ్ళటానికి నిర్ణయించుకున్నాడు.
మళ్ళీ బాయిలర్ వెనక్కి చేరుకుని, అక్కణ్నుంచి ఫెన్సింగ్ వైపు నడిచాడు. ఇక వెళ్ళిపోతున్నాను కదా అన్న నిర్లక్ష్యంతో అతడు వచ్చినప్పుడున్నంత జాగ్రత్తగా లేడు. దురదృష్టం అతడిని వెన్నాడుతూంది. ఫెన్సింగ్ ఇంకో అయిదడుగుల దూరంలో వుందనగా అతడి వెనుకనుంచి విజిల్ వినిపించింది. ఆ తరువాత 'ఆగు' అన్న కేక.
భార్గవ వెనక్కి తిరిగి చూసేడు.
సెంట్రీ తనవైపే రావటం కనిపించింది.
చప్పున తిరిగి ఫెన్సింగ్ వైపు పరుగెత్తాడు. వెనుక వస్తూన్న సెంట్రీ కూడా పరుగెడుతున్నట్టూ అడుగుల చప్పుడు దగ్గిరయింది. ఒకసారి ఆఫీసు కాంపౌండ్ లోకి వెళ్ళిపోగలిగితే చాలు, అక్కణ్నుంచి ఎలాగయినా తప్పించు కోవచ్చు.
ఆ ఆలోచన రాగానే వేగం మరింత హెచ్చించాడు.
రెండు క్షణాల్లో అతడు ఫెన్సింగ్ చేరుకున్నాడు. ఇంకా జారుకోవటమే తరువాయి, వంచి తీగల మధ్య తలదూర్చి అటు జారేడు.
అతడి షర్టు ఆ తీగల మధ్యే చిక్కుబడిపోయింది.
ఎంత గట్టిగా ప్రయత్నం చేసినా రాలేదు. అతడా ప్రయత్నంలో వుండగానే సెంట్రీ దగ్గిర కొచ్చేశాడు.
* * *
"చెప్పరా, ఎవరు నువ్వు?"
భార్గవ మాట్లాడలేదు. తన ఆకారం ఒక దొంగలాగే వుందని అతడికి తెలుసు. అందుకు సంతోషించాడు కూడా. వీలైనంతవరకూ తనెవరో తెలియక పోవటమే మంచిది.
సెక్యూరిటీ పేరు హర్నామ్ సింగ్, అతడు ఏ విషయాన్నీ పెద్దగా పట్టిచుకోడు. ఫ్యాక్టరీ ఆవరణలో విలువైనవేమీ లేవని అతడికి తెలుసు. అతడు భార్గవ దగ్గిరకొచ్చి చేతిలోంచి ప్యాకెట్ లాక్కొని విప్పిచూసేడు. అందులోని తెల్లటి పొడిని చూడగానే "ఇది చోరీ చెయ్యటానికి ఇంతదూరం వచ్చావా దొంగనాయాలా" అంటూ లాగి చెంపమీద కొట్టాడు. భార్గవ పెదవి చిట్లింది.
అతడితోపాటూ మరిద్దరు సెంట్రీలు మిలటరీ దుస్తుల్లాటి దుస్తుల్లో వున్నారు. వారిలో ఒకడు భార్గవని ఫెన్సింగ్ దగ్గిర పట్టుకున్నవాడు. వాడు వచ్చి మిగతా జేబులు వెతికాడు, పర్సు దొరికింది.
విప్పి చూస్తే అందులో నాలుగు వేలదాకా వున్నాయి.
"ఒహో వీడెవడో డబ్బులున్న దొంగే. ఎక్కడ కొట్టేసేవురా దీన్ని?" అన్నాడు మిగతా ఇద్దరూ నవ్వేరు. భార్గవ మాట్లాడలేదు. డబ్బులు వాళ్ళుంచేసుకుని, ఖాళీ పర్సు తిరిగి జేబులో పెట్టేశారు.
వచ్చిన వాడి దగ్గర ఇంకేమీ కనిపించకపోయేసరికి, ఇంత చిన్న విషయాన్ని మెయిన్ ఆఫీసు వరకు తీసుకువెళ్ళటం ఇష్టం లేకపోయింది. అదీగాక నాలుగువేలు చిన్న మొత్తం కాదు.
మూడో సెంట్రీ భార్గవ కాలరు పట్టుకుని దగ్గరకు లాగి, "ఇంకెప్పుడయినా ఇటువైపు కనిపించావంటే ఎముకలు విరగ్గొడతాను. పో..." అంటూ తోసేడు.
భార్గవ రూమ్ నుంచి బయటకు విసురుగా వచ్చి పడ్డాడు. చిట్లిన పెదవి నుంచి రక్తం కారసాగింది. అయినా ఇంతలో బయటపడ్డందుకు అతడికి సంతోషంగానే వుంది. ముఖ్య విషయం- తను సేకరించిన 'గాస్' వారి కంట బడకపోవటం.
అయితే అతడిని దురదృష్టం వదిలి పెట్టలేదు.
అతడు లేచి బట్టలు దులుపుకుని రెండడుగులు వేసేడో లేదో, లోపల్నుంచి నాయుడు కారు వస్తూ గేటు దగ్గిర ఆగింది. పెద్దగేటు తలుపులు తీసి సెంట్రీ సెల్యూట్ చేసి నిలబడ్డాడు. కారు గేటు దాటుతూ వుంటే నాయుడు అద్దాల్లోంచి భార్గవని చూసేడు. అతడు అక్కడెందుకున్నాడా అని అనుమానం వచ్చి, కారు ఆపమని డ్రైవరికి చెప్పి, సెంట్రీని అడిగాడు.
మేనేజింగ్ డైరెక్టర్ అడుగుతూవుంటే, సెంట్రీ తిబ్బిబై జరిగిందంతా చెప్పేశాడు. నాయుడు అతడితో మరో రెండు నిమిషాలు మాట్లాడి, కారు పోనిమ్మన్నాడు. భార్గవ పక్కనుంచే కారు దూసుకుపోయింది.
భార్గవ నాలుగు అడుగులు వేసేసరికి వెనుకనుంచి భుజం మీద చెయ్యిపడింది. తిరిగి సెంట్రీ "నువ్వొకసారి లోపలికిరా" అంటున్నాడు.
భార్గవకి అర్థంకాలేదు. అంతా అయిపోయిందనుకున్నాడు. మళ్ళీ ఇదేమిటో అర్థంకాలేదు. తిరస్కరిద్దామనుకున్నాడు. కానీ రోడ్డు మీద గొడవ బావోదని తిరిగి వెనక్కి వెళ్ళాడు.
అతడు ఆ గదిలో ప్రవేశించేసరికి అక్కడ వాతావరణం పూర్తిగా మారిపోయింది. హర్నామ్ సింగ్ చీవాట్లు తిన్నవాడిలా మొహం మాడ్చుకొని వున్నాడు. భార్గవని చూసి "ఇలా కూర్చో" అంటూ స్టూలు చూపించాడు. భార్గవకి అర్థంకాలేదు. "దేనికి" అని అడిగాడు. ఎవరూ సమాధానం చెప్పలేదు.
భార్గవ రెట్టించి అడిగాడు. హర్నామ్ సింగ్ విసుక్కుంటూ కోపంగా "కూర్చో, కూర్చో, ఎదురు ప్రశ్నలు వెయ్యకు" అన్నాడు. భార్గవకి ఇదంతా అయోమయంగా వుంది. సెంట్రీలందరూ ఎవరికోసమో ఎదురు చూస్తున్నట్టూ వేచి వున్నారు. గోడ గడియారం శబ్దం తప్ప అంతా నిశ్శబ్దంగా వుంది.
అంతలో మోటార్ సైకిల్ చప్పుడయింది. కొద్ది క్షణాల్లో అది వచ్చి గుమ్మం ముందు ఆగటమూ, యూనిఫారంలో వున్న ఇన్ స్పెక్టర్ ఒకరు లోపలికి రావటమూ జరిగింది.
* * *
ఇన్ స్పెక్టర్ రవూఫ్.
పోలీస్ డిపార్ట్ మెంట్ లో కర్కోటకులు, నిర్దాక్షిణ్యం మూర్తీభవించిన వాళ్ళూ వుంటారని ఎవరయినా ఉదాహరణ ఇవ్వదల్చుకుంటే ఇన్ స్పెక్టర్ రవూఫ్ ని అందుకు తార్కాణంగా పేర్కొనవచ్చు. ఆరడుగుల ఎత్తు, ఎర్రటి కళ్ళు, లావాటి మీసాలూ- కేవలం డ్రస్ లోనే అతడు ఇన్ స్పెక్టర్ లా వుంటాడు, డ్రెస్ లేకపోతే రౌడీలా వుంటాడు.
టకటకా బూట్లు చప్పుడు చేసుకుంటూ అతడు లోపలికి వచ్చి భార్గవని చూసి, "ఇతనేనా" అని అడిగాడు. సెక్యూరిటీ చీఫ్ తలూపాడు.
