"ఎలా మూసుకోను? నాకూ మనస్సుందికదా? నాప్రేమ ఆయన సుఖాన్ని గురించి ఆలోచించడం న్యాయమేకదా?"
"నిజంగా మీరు ఆయన సుఖాన్ని గురించి ఆలోచించే వాళ్లయితే మీరు త్వరలో ఆరోగ్యవంతులు కావడానికి ఆయనతో సహకరిస్తారు."
7
"నేను ఆరోగ్యవంతురాలినై మళ్లీ మామూలు మనిషినౌతానా? పిచ్చి డాక్టర్లు ఏదో ఆశ చెబుతారుగానీ!"
"బ్రతుకుమీద ఆశా, డాక్టర్లమీద నమ్మకమూ లేకపోతే ఎంత మంచి మందులైనా పని చెయ్వవండీ! పోయేరోగం కూడా గట్టిగా తిష్టవేసి కూర్చుంది. అంతటి ప్రేమమూర్తికి మీరు చేయాల్సిన అన్యాయం కాదది!"
"నాకు న్యాయమనిపించింది మీకు అన్యాయమనిపిస్తూంది. ఏం చేయను? ఇంతసేపు నా గొడవేసరిపోయిందిగానీ మీ సంగతులేవీ నేనడుగలేదు. చెప్పండి అమ్మా నాన్నా ఉన్నారా?"
"నాకు అమ్మా, నాన్న ఒక తమ్ముడు వున్నారు. సిటీలోనే వుంటారు. నాన్న కమీషన్ వ్యాపారం చేస్తుంటారు. మా నాన్న అని గొప్పగా చెప్పడం కాదుగాని చాలా చాలా అభ్యుదయ భావాలుకల వ్యక్తి. మా తమ్ముడుని ఎంత స్వేచ్చగా పెరగనిచ్చారో నన్నూ అంతే స్వేచ్చగా పెరగనిచ్చారు."
మరోరోజు సాయంత్రం వచ్చాడు చంద్రకాంత్.
"ఇవాళ మాకోసం సెలవు పెట్టారా?"
"నా సెలవులు సగం ఊరికే పోయాయి. నేను ఎక్కువగా సెలవులు వాడుకోకపోవటంవల్ల."
"చాలా థ్యాంక్స్. సుధగారూ! ఏదైనా అవసరంవస్తే పొరుగున ఒక మంచివ్యక్తి వుందని ధైర్యం. "
"అయితే ఇహ పొగుడుతారుకాబోలు నేనుచేసిన సాయాన్ని గోరంతలు కొండంతలుచేసి."
"ఏం పొగడనులెండి! కృతజ్ఞత వెల్లడించుకోవడం కనీస మానవధర్మం కదా?"
* * * * *
ఆరోజు కోర్టులో సుజాత కేసు విచారణ.
సుజాత సాక్ష్యం ఎవరూ ఊహించని విథంగా ఇవ్వడంతో కేసు కొట్టివేయబడింది.
రెడ్డి గౌడ్ తనమీద దౌర్జన్యం చేయలేదని, అంతా తన యిష్టప్రకారమే జరిగిందని, సుధ బలవంతంగా తనచేత కేసు పెట్టించిందని, సమాజం తలిదండ్రుల భయంకూడా తననందుకు పురికొల్పిందని చెప్పింది. త్వరలో వెంకటరెడ్డితో తన వివాహం జరగబోతున్నదని కూడా చెప్పింది.
సుద నోరు వెళ్ళబెట్టింది.
కేసు కొట్టివేయబడింది.
కోర్టు బయటికి రాగానే సుధ పిచ్చిదానిలా సుజాత భుజాలు పట్టుకు వూపేస్తూ "ఎందుకు అబద్దం చెప్పావు? నీ మీదికి ఏదెయ్యం పూనింది? నాకుకాదు తలవంపులు స్త్రీ జాతికే తలవంపులు తెచ్చేపని చేశావుకదా? అనడిగింది ఆవేశంతో.
"మీకు తెలియదు. వాళ్లు నా కుటుంబాన్ని సర్వనాశనం చేస్తామని చెప్పారు వట్టి చెప్పడం కాదు, చేయగల సమర్దులు కూడా! ఎలాగూ నేను నాశనమయ్యాను. నావల్ల నా కుటుంబంకూడా నాశనం కావడం ఎందుకు?" గుడ్లనీరు కుక్కుకుంటూ చెప్పింది సుజాత
"ఇలా బెదిరిస్తున్నారనిచెప్పి కోర్టునుండి రక్షణ తీసుకొనేవాళ్లం. ఎందుకిలా చేశావు సుజాతా? ఎంతపని చేశావు? నిజంగా వాడునిన్ను పెళ్లి చేసుకొంటానన్నాడా?"
"అన్నాడు"
"నువ్వు లొంగిపోయింది దీనికేకదూ? వాళ్ళు కుటుంబాన్ని సర్వ నాశనం చేస్తామంటే కాదు!"
"అవును!"
"శిక్ష పడాల్సినవాడు పెళ్లిచేసుకొంటానంటే నువ్వు సంబరంతో లొంగిపోయావు! ఎంత ఆత్మాభిమానంలేనిదానివి. "
"చెడినవాడితోనే తాళికట్టించుకొంటే జీవితానికి ఒక అర్దం ఏర్పడుతుంది కదా అని ఆలోచించాను."
"చెడింది ఇద్దరివల్ల కదా! ఇద్దరిచేత తాళి కట్టించుకొంటేకదా అర్దం ఏర్పడేది?" సుధ ఎగతాలి చేస్తుంటే సిగ్గుతో తల వంచుకుంది సుజాత.
