Previous Page Next Page 
అమృతం కురిసిన రాత్రి పేజి 43

         6

గ్రీష్మంలో
రెల్లుపూల బార్డర్ వేసిన
నీలాటి నీటి నైలాన్ చీర
వొంటి మీదనుంచి జారుతుండగా
రాజమండ్రి అనే యువతి
సందులూ గొందులూ ఎండలూ తిరిగి
విసుగెత్తి
వెనుక తానుండే గొప్పతనం మేడ ఎక్కడా కనిపించక
చిన్నబుచ్చుకుని
అలసిన కాళ్ళ నీడ్చుకుంటూ వెళ్ళి
దూరంగా
కొండల పక్కన నీడలలో కూర్చొని
కొబ్బరినీళ్ళు తాగుతోంది

        7

రాజమండ్రిలో సాహిత్య సుందరి
అందెలూ బావిలీలూ ఇంకా మానలేదు
కొంచెం మడిగా చేసి పెడుతోంది
భోజనంలో పాతచింతకాయ పచ్చడీ, వంగ పురుగూ, పులుసూ
రుచిమాట దేవుడెరుగు గానీ
మాంచి ఆరోగ్యం తినగలిగిన మనిషికి!
యువకులూ నడివయస్కులూ కూడా
దేవతార్చనకి అక్కడికే వెళుతున్నారట
సెంట్లూ అత్తర్లూ
స్నోలూ, పౌడర్లు
వాడదు, సినిమాలు క్లబ్బులూ
చూడదావిడ;
వృద్ధపతి సార్వభౌముల
కృద్ధలోచనగోళ నిర్గత
శాసనాబద్ధయై, రుద్ధయై, ముగ్ధయై

    *      *      *       
                ---1960


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS