చిన్న చిన్న ఇళ్ళు, మట్టి గోడలతో కొన్ని.... ఇటుకలతో కొన్ని, రెల్లుతో కొన్ని కట్టబడిన ఇళ్ళు.
అవన్నీ ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి కట్టుకున్న ఇళ్ళని పరుశురాం గ్రహించాడు.
కొన్ని ఇళ్ళముందు జనం కూర్చుని ముచ్చట్లు చెప్పుకుంటున్నారు.
రచ్చబండలా ఉన్న పెద్ద మర్రిచెట్టు కింద కూర్చుని కొందరు తాగి పాటలు పాడుకుంటున్నారు.
"మా బస్తీ ఎప్పుడూ సందడిగానే ఉంటుందన్నా" అన్నాడు కన్నయ్య.
పరుశురాం మాట్లాడలేదు.
"అదిగో అదే మన ఇల్లు" అన్నాడు కన్నయ్య తిరిగి.
కన్నయ్యతో పాటు పరుశురాం ఆ బస్తీలో అడుగు పెట్టాడు.
ఆ బస్తీ ప్రవేశం అతని జీవితాన్ని మరో గొప్ప మలుపు తిప్పబోతోందని అతనికి ఆ క్షణంలో తెలీదు.
"అమ్మా" అని పిలిచాడు కన్నయ్య.
నలభై సంవత్సరాల స్త్రీ తలుపు తీసింది.
"కన్నయ్యా ఆలస్యం అయిందే రా" ఆమె తడుముకుంటూ నడుస్తుంటే పరుశురాం నిర్ఘాంతపోయాడు ఆమె అంధురాలు.
కన్నయ్య చెప్పిన మాటలు వినగానే ఆమె భయంతో వణికిపోయింది.
"బాబూ! దెబ్బలేం తగల్లేదుగా!" ఆందోళనతో అడిగింది.
"లేదమ్మా!"
కొడుకు ప్రాణాలతో బయటపడ్డాడన్న ఆనందంతో పుత్రభిక్ష పెట్టిన దేవుడిగా పరుశురాంని భావించి రెండు చేతులతో అతని చేతులను గట్టిగా పట్టుకుందామె.
"ఏ తల్లి కన్న బిడ్డవో బాబూ! ఈ గుడ్డిదాన్ని మరింత దిక్కులేని దాన్ని కాకుండా దేవుడిలా వచ్చి నా బిడ్డను కాపాడావు. చిన్నవాడివైనా నీకు చేతులు జోడిస్తున్నాను" అంది కన్నయ్య తల్లి.
"అమ్మా!" అన్నాడు పరుశురాం. ఆ పిలుపుకి మరింత కదిలిపోయింది. అతని తలపైన చేత్తో ఆప్యాయంగా నిమిరింది.
"అమ్మా! అన్నకెవరూ లేరట" చెప్పాడు కన్నయ్య.
"అయ్యో!" అందామె.
"అందుకే అన్న ఇకనుంచీ మనతోనే వుండిపోతాడు."
కొడుకు మాటలతో ఆ అంధురాలి ముఖంలో చిరుదరహాసం వెలిగింది.
"అంతకన్నా మనకేం కావాలి నాయనా! ఈ రోజునుంచీ నాకు ఇద్దరు బిడ్డలు" పరుశురాంని దగ్గరికి తీసుకొని నుదురుపైన ముద్దు పెట్టుకుంది కన్నయ్య తల్లి.
వాళ్ళు చూపిస్తున్న ఆదరణకి, ఆప్యాయతకీ పరుశురాం గుండె కరిగిపోతోంది.
మనుషుల్లో ఇంత మంచి వాళ్ళుంటారా?
ఒక్క చెక్క బల్లపైన మేల్టు పరిచాడు కన్నయ్య.
"నేను స్నానం చేసొస్తా. ఈలోగా కాస్త బడలిక తీర్చుకో. తర్వాత తిందాం!" అని--
"నువ్వు కూడా స్నానం చేస్తావా?.... ఒంటికి డాక్టరు మందులు రాశాడు కదా! ఒద్దులే!" అంటూ పాత తువాలు భుజాన వేసుకుని ఇంట్లోంచి వీధిలో నల్లా దగ్గరకి పోయాడు.
పరుశురాం ఆ ఇంటిని పరీక్షగా చూశాడు.
ఇటుకలతో కట్టి పైన రేకులు వేసిన ఇల్లది. ఇంట్లో సామాను కూడా ఎక్కువ ఏం లేదు.
ఒక చెక్కబల్ల, పాత కుక్కిమంచం, మూలగా పొయ్యి, కొన్ని వంటగిన్నెలు, ఇత్తడి గ్లాసులు రెండు బాల్చీలు.... బిందె వున్నాయి. గోడకి చిన్న అద్దం. దాని ముందర ట్రేలో దువ్వెన, చౌకబారు పౌడరు డబ్బా వున్నాయి.
ఆ ఇంటి పరిస్థితి అర్ధమైంది పరుశురాంకి.
"నా పేరు యాదమ్మ. గుడ్డిదాన్ని. నా బిడ్డ కన్నయ్య. ఈ ఇల్లు.... వాడు ఒక చిన్న షాపులో పనిచేస్తుంటాడు. మా అన్న, వాడి బిడ్డ ఈ బస్తీలోనే వుంటారు. అన్నకి మా ఆలనా పాలనా పట్టదు. తాగి పడుంటాడు. ఇది బాబు మా గురించి నీకు చెప్పదగిన విషయాలు.
ఇప్పుడు నువ్వు చెప్పు.
నీ పేరేమిటి?
ఏం చేస్తుంటావు?"
పరుశురాం నిశితంగా ఆమె ముఖంలోకి తొంగి చూశాడు.
అంధురాలైనా తన గురించి తెలుసుకోవాలన్న ఆత్రం ఆమె ముఖంలో స్పష్టంగా కనిపిస్తోంది.
"నా పేరు పరుశురాం. రామ్ అని కొందరు పిలిచేవాళ్ళు. అలా పిలిచేవాళ్ళు నాకు దూరం అయిపోయారు. నేనీ ఊరికి కొత్త. నాకెవరూ లేరీ నగరంలో. వుద్యోగం ఏదైనా వెదుక్కోవాలి" అన్నాడు.
"చదువుకొన్నావా బాబూ!"
"అంత పెద్ద చదువు కాదమ్మా. కానీ బతుకేందుకు సరిపోతుందేమో!"
ఆమె వెంటనే అంది.
"కన్నయ్యకి చెబుతాను. వాడే ఏదన్నా చూస్తాడు"
ఆమె ఎంతో నమ్మకంగా చెబుతోంటే ఆశ్చర్యంగా చూశాడు పరుశురాం.
కన్నయ్యలాంటి పసివాడు తనకి బతుకు తెరువు కల్పించడం అనే మాట అతనికి విస్మయం కలిగింది.
ఆమె తనని కూడా కన్నయ్యతోటి వాడనుకొంటుందా? అన్న అనుమానం కూడా అతనికి కలగకపోలేదు. కానీ తన కొడుకునో స్థాయిలో ఆలోచించుకొంటూ వాడు ఇతరులకి కూడా వుద్యోగం ఇప్పించగల ఎత్తులో వున్నాడన్న ఆమె నమ్మకానికి మాత్రం ముగ్ధుడైపోయాడు పరుశురాం.
