Previous Page Next Page 
కౌగిట్లో కృష్ణమ్మ పేజి 43

 

    "ప్రొఫెసర్ శ్రద్దాదేవి నీ సోదరి కాదు. నీ తల్లి! నేను చెప్పేది యదార్ధమని నీవు నమ్ముతున్నావు. నీవు నా బిడ్డవు. నీవు పసిపిల్ల వాడివి. నీ వయసు అయిదు సంవత్సరాలు మాత్రమే!
    నోట్లో వ్రేలు పెట్టుకుని చీకటం నీకు అలవాటు. ఇప్పుడలా చేయబోతున్నావు. చేస్తున్నావు. నీ కుడి చేతి బొటన వేలు నోట్లోకి పోతోంది. అదిగో వెళ్ళిపోయింది." అంటూ సజెషన్ యిచ్చేసిందామే. ఆమె చూపులు దాడి సూదుల్లా అయినాయి. ప్రొఫెసర్ శ్రద్దాదేవి మాటలు పూర్తీ అయేసరికి అతడి కుడి చేతి బొటన వ్రేలు నిజంగానే నోట్లోకి వెళ్ళిపోయింది. అతడు అంత త్వరగా హిప్నటైజ్ అయినందుకు మనసు లోలోపలే సంతసించిందామే.
    "ఇప్పుడు నీవు నిజంగా చిన్న పిల్లాడివి. నీకు అయిదేళ్ళు. నీ తల్లిని అయిన నేను బయటకు వెళ్ళిపోతున్నాను. నేను తిరిగి వచ్చే వరకూ ఎదురు చూస్తూ కూర్చుంటావు. నేను వెళ్ళిపోతుంటే చూస్తూ కదలకుండా కూర్చోవాలని తిరిగి వచ్చేవరకు ఎదురు చూడాలని నీకు అన్పిస్తోంది. అలాగే చేస్తావు"అంటూ సజెషన్ చెప్పేసి మెడా మీది నించి లేచింది ప్రొఫెసర్ శ్రద్దాదేవి. వాకిలి తలుపులు దగ్గరగా వేసి బయటకు వచ్చేసిందామే. అతడలాగే చిన్నపిల్లాడిలా పడుండిపోయినాడు.
    ఇంచుమించు నిద్రాముద్రితు డయి పోయి కుడి చేతి బొటన వ్రేలు చీక్కుంటూ తల్లి రాకకోసం ఎదురు చూడసాగాడు.
    అటువంటి స్థితిలో అతడిని ఎక్కువ సేపు వుండనీయలేదు. పది నిమిషాల తరువాత పోలీసు బలగంతో తిరిగి వచ్చింది ప్రొఫెసర్ శ్రద్దాదేవి. అతడా అవస్థ నించి ఇంకా బయట పడలేదు.
    అతడిని క్రమంగా మామూలు స్థితికి తీసుకువచ్చి వారికి అప్పగించిందామే. ఉపాధ్యాయుడల్లె వచ్చిన మహాశయుడు ఊచల వెనుకకు వెళ్ళిపొయినాడు. మొత్తుకున్నాడు.
    అనూహ్యమయిన స్థితిలో ఎదురయిన ప్రమాదాన్ని నాటకీయంగా మార్చి క్షేమంగా తిరిగి రావటం ఆమె తలుచుకుని పదేపదే నవ్వుకుంది. స్నేహితులందరికీ ఫోను చేసి ఈ విషయాన్ని చెప్పి నవ్వించింది . అప్పటికి సమయం పది దాటింది.
    జరిగిన ఈ సంఘటన ఆమెలో రవంత ఉల్లాసాన్ని రేకెత్తించినా తరువాత తామ్రపత్రాల మీదికి ఆలోచనలు మరలినాయి. ఒక కర్తవ్యాన్ని నెరవేర్చుకుందుకు సాహసోపేతమైన దారిలోకి ఇల్లు వదలి వెళ్ళిపోయిన జ్యోతి గురించిన ఆలోచనలు వచ్చినాయి.
    ఆమె త్యాగమయి. అడపుట్టుక తన కిచ్చిన ఆశల గురించీ, అర్దాల గురించి రవంత అయినా పట్టించుకొనకుండా, వాటికి లొంగిపోకుండా కర్తవ్యం మీద నిలిచిన ఆదర్శప్రాయురాలు.
    అటువంటి బుద్దిమంతనం కలిగిన యువతి తన శిష్యురాలు కావటం, తాను చూపించిన మార్గంలో ఆమె పయనించటం నిజంగా ఆలోచిస్తే తనకూ గర్వకారణమే.
    విద్య అనే దానికి డిగ్రీలు ఎలా నిజమయిన కొలబద్దలు కావో, శిష్యరికం , గురుత్వం నెరపుకోవటానికి అలాగే బడిపిల్లలు కానక్కరలేదు. అంతా భావించే మనసులో వుంటుంది.
    జ్యోతి గురించి, తనకు నచ్చిన ఆదర్శ ప్రాయమయిన ఆమె వ్యక్తిత్వం గురించీ ఆలోచిస్తూ ఆదమరచి  నిద్రపోయింది ప్రొఫెసర్ శ్రద్దాదేవి.
    అర్ధరాత్రి అయిందేమో!
    వియత్తలం విరబోసుకున్న వినీల కుంతలాలు భూతలం మీద తారాడుతున్నాయి. చీకటి గుంపులు గుంపులుగా సంచరిస్తూ భయాన్ని రేకెత్తిస్తోంది.
    నింగిలో ఒక్క చుక్క అయినా కన్పించటం లేదు. చీకటి గుంపులకు తోడు రాకాసుల్లాంటి వర్షమేఘాలు నల్లగా కాటుక కొండల్లా కదలివస్తున్నాయి.
    ఎవరో పిలిచినట్ల అయింది!
    గొంతు పోడారినట్లు అయింది!
    ఉలికిపడి మంచం మీద లేచి కుర్చుంది ప్రొఫెసర్ శ్రద్దాదేవి. బ్రతుకంతా నిండిపోయిన ఒంటరితనం ఆమెను ఎన్నడూ బాధించలేదు. ఒంటరిగా పరుండటమే ఆమెకు అలవాటు.
    నిద్రాభంగం కలిగించేందుకు ఎవరున్నారు, భర్త లేడు', బిడ్డలు లేరు. మనసులో స్వార్ధ చింతనలు లేవు.
    అందు నించి నడుం వాల్చగానే నిద్రపట్టడం , వేళ అయాక నిద్ర లేవటం ఆమెకు అలవాటు. కాని ఈ చీకటి నిండి చినుకులు రాలుతున్న భయంకరమయిన రాత్రి , దూరం నించి ఏది చిత్ర విచిత్రమయిన భయంకరమయిన అరుపులు విన్పిస్తున్న రాత్రి అలా అర్ధంతరంగా మెళకువ రావటం ఆమెకు భయం కన్నా ఆశ్చర్యాన్నే ఎక్కువ కలిగించింది.
    తలుపు రెక్కలు గాలికి కదులుతున్నాయి, టపటప శభ్దం చేస్తున్నాయి. తెరచి వున్న తలుపులు ఆమెకు మరింత విస్మయాన్ని కలిగించినాయి. ఎలా తెరచుకున్నాయి.
    వర్షపు గాలి రంయిమని వీస్తోంది.
    తెరచిన తలుపులు మూసేందుకు లేచిందామే. ఈదురు గాలి విసురుగా వచ్చి శరీరాన్ని కోస్తోంది. ఆమె కాలు ఒక్క అడుగు ముందుకు వేసిందో లేదో వెలుగుతున్న జీరో వాల్టు బల్బు కూడా గప్పున మలిగింది కరెంటు పోయింది కాబోలు.
    గదిలో రాకాసి కురుల్లా కారు చీకటి క్రమ్ముకుంది.
    వెంటనే రెండు కారు మబ్బులు డీ కొన్నాయి. విద్యుత్తు తటిల్లాతలా వియత్తాలాన మెరిసింది. గదిలో క్షణం పాటు పట్టపగలులా కాంతి పుంజాలు మెరిసినాయి. ఆ వెనువెంట ఉరుములు గుండెల్ని దడదడ లాడించినాయి.
    ప్రొఫెసర్ శ్రద్దాదేవి ప్రకృతి నడుపుతున్న ఆ భీభత్సానికి రవంతగా విచిలిత అయిపొయింది. ఆదరిపడుతున్న గుండెను అదుపులోకి తెచ్చుకోవాలని ప్రయత్నించిందామె. అడుగు ముందుకు పడలేదు.
    "సృష్టి ప్రారంభమయింది మొదలుగా ఇటువంటి ప్రకృతి భీభాత్సాలు సహజమయినవే కదా! వీటి గురించి మీ వంటి విద్యావేత్తలు భయపడవచ్చునా?" అని ఎవరో అడుగుతున్నట్లు విన్పించింది. ఆ కంఠస్వరంలో ఎంత మాధుర్యం.
    పాము పిల్లల్ని సైతం నిద్రపుచ్చ గలిగిన తీయందనాల ఆ కంఠస్వరం విన వచ్చిన దిక్కుగా తలత్రిప్పి చూసిందామె.
    వెన్నెల దారాలు నడుగు పెకలుగా! రవి కాంతులు అద్దిన జిలుగులుగా కన్పించే ధవళ వస్త్రాలను ధరించి వున్న ఒక మధుర సుమధుర దరహసిని ప్రొఫెసర్ శ్రద్దాదేవి కనుల ముందు ప్రత్యక్షమయింది.
    ఆమె దరహాస కాంతులవల్లనే గదిలో కోటి దీపకాంతులు వెలిగించినట్లుగా అయిపొయింది.
    రెప్ప వేయటం మరచి ఆ ఆకృతిని తదేకంగా చూడసాగింది ప్రొఫెసర్ శ్రద్దాదేవి. వీణ మీద వేదనాదాలు ఒలికించి నట్లున్న ఆ కంఠస్వరం విని తన్మయురాలు అయింది.
    "ఎవరు నీవు?" అని ప్రశ్నించిందామె.
    "విజ్ఞురాలయిన ఓ శ్రద్దామూర్తి! యుగయుగాల ఆత్మ యానంలో జీవులు పడుతున్న ఈ జనన మరణ పోరాటంలో నీవెవరు? నేనెవరు? ఎవరి ఎవరు? అన్న ప్రశ్నకు సమాధానమున్నాదా తల్లీ! వివేకశీలివి! విద్యా వారాశివి! విద్యా లోకపు వెలుగు వాకిళ్ళు తెరచి జ్ఞాన తేజాలను వెదజల్లే ఆదర్శమూర్తివి.
    ఈ సంగతులు నీవు ఎరుగనివా తల్లీ! అయినా నీ వడిగినావు కనుక నేనెవరో చెప్పుకోవటం నా బాధ్యత.
    నా పేరు శ్వేతకి! తామ్రపత్రాలు నీవు చదివినావు కదా! క్షుద్ర కాళింగుని ఆగడంతో జాతి జనుల శ్రేయ కామనకు అలనాడు అంకితమై పోయిన శ్వేతకి ఆత్మ రూపాన్ని నేను.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS