Previous Page Next Page 
బ్లాక్ టైగర్ పేజి 43

 

    అంతేకాదు . ప్రయిజులో సగం వాటా కావాలట! కసిగా తిట్టుకున్నాడు.
    తెలివిగా ఆమెను హాస్పిటల్ లో యిరికించేయగలిగినందుకు తనని తాను అభినందించుకున్నాడు. హాయిగా నవ్వుకున్నాడు.
    తాను ఎన్ని గంటల్లో తిరిగి వచ్చేది నర్స్ కి చెప్పలేదు. కనీసం రెండు మూడు గంటలయినా ఆమె కదలకుండా చూస్తుంది. ఈలోగా తాను లక్ష్యానికి మరింత దగ్గర అయిపోతాడు.
    సంపాదించిన క్లూలు అన్నింటిని వెంటనే ధ్వంసం చేసుకుంటూ ముందుకు పోవాలి. లేకపోతే యిలాంటి ప్రమాదాలు ఎదురు అవుతాయి.
    మనసులో దృడంగా తీర్మానించుకున్నాడు.
    ప్రత్యర్ధిని దెబ్బ తీయగలిగిన హుషారులో జోరుగా నడుస్తున్నాడు. విజయవంతమయిన ఈ ఎపిసోడ్ వల్ల మనసు రిలాక్స్ అయింది. తిరిగి పూర్తి శక్తితో తాజా అయిన ఆలోచనలు ప్రారంభించింది.
    స్టార్ సన్ అంటే అర్ధం ఏమయివుండాలి!? ఇలాంటి విరుద్దమైన పేర్లు మనుషులకి ఉండవు. అలాంటివి జంతువులు కూడా లేవు. అది షాపు పేరు కూడ అయి వుండదు. హోటల్ పేరు కాదు. సినిమా హాలు కూడా కాదు.
    మరేమయి వుండాలి? డే స్టార్స్, నైటీ క్వీన్! ఇలాంటి పేర్లన్నీ పూల మొక్కలకే ఉంటాయి. అవును పూల మొక్క అయి వుండాలి.
    ఆ ప్రాంతాల్లో దగ్గరగా ఉన్న నర్సరీ వైపు పరుగు తీశాడు. జయసింహ!
    నర్సరీలు ఉదయం తొమ్మిది గంటల లోపూ సాయంత్రం అయిదు గంటల తరువాత చురుకుగా పని చేస్తుంటాయి.
    ఇంకా కొందరు పూల మొక్కలు కొంటున్నారు. ఓ కుర్రాడు పూల కుండీలు తీసుకుపోయి ఓ కారు డిక్కీలో అమర్చుతూ కన్పించాడు.
    "మీ అయ్యగారున్నారా?" అని అడిగాడు జయసింహ.
    "అక్కడున్నారండీ!" అంటూ ఓ వంకకు చూపించాడు.
    నర్సరీ మధ్యలో పూల మొక్కల పూల కుండీల మధ్య ఓ కుర్చీలో కుర్చుని డబ్బు లెక్క పెట్టుకుంటున్న యజమాని కన్పించాడు.
    అది పూరిపాక! పైన రెల్లు తో వేసిన కప్పు మాత్రమే ఉండి చుట్టూ గోడలు కాని తడికలు కాని లేవు. స్తంభాల మీద అమర్చిన పూరి కప్పు!
    "నమస్కారం గురూగారూ!" దగ్గరగా వెళ్ళాడు. ఆ పిలుపుని అనుసరించి ఇదివరకే పరిచయం ఉన్న వ్యక్తీ అనుకున్నాడు నర్సరీ యజమాని. కాని ముఖం ఇదివరలో చూచిన జ్ఞాపకం రాలేదు.
    ఎందరో వస్తుంటారు. పోతుంటారు. కొన్ని ముఖాలు రాత్రి సమయాల్లో మాత్రమే కన్పిస్తాయి , గుర్తుండవు.
    "రండి! కూర్చోండి! ఏం కావాలి మీకు?" అని అడిగాడు. నర్సరీ వ్యాపారం చాలా  చిత్రమయినది. ఎవరి ఊహలకి అందని వ్యాపారం.
    "స్టార్ సన్ పూల మొక్కలున్నాయా?" అని అడిగాడు జయసింహ ఆ మాట వింటూనే చివ్వున తలయెత్తి చూశాడు నర్శరీ యజమాని.
    ఆ తరువాత నవ్వటం ప్రారంభించాడు!
    "ఈ పేర్లన్నీ విని మతిపోతోంది సార్! మీకొక విషయం తెలుసా ? కొందరు మంచి మొక్కలు దిగుమతి చేసుకోలేరు. విశాఖపట్టణం, బొంబాయి, కలకత్తా, బెంగుళూరు నించి తెప్పించటం మాటలా?
    పూల మొక్కలు క్రొత్తవి తెప్పించకుండా మరి నగరంలో ఇతర వాళ్ళతో వ్యాపారంలో పోటీకి నిలబడటం ఎలాగంటారు?"
    అలాంటి నర్సరీలు వాళ్ళు పోటీలో నిలబడేందుకు ఓ క్రొత్త పద్దతి కనిపెట్టారు. అడవిలోంచి, కొండల్లోంచి , బంజరు భూముల్లోంచి ఏవో పేరు తెలియని పిచ్చి మొక్కలు పెరుక్కు రావటం.
    వాటికి ఇంగ్లీషు పేర్లు, నోరు తిరగని పేర్లు పెట్టటం, అది తెలియని వాళ్ళకి పెద్ద మొత్తానికి వాటిని అమ్మటం!" అంటూ నావ్వసాగాడు.
    "మరి కొనేవాళ్ళు ఎలా కొంటున్నారండీ?"
    "ఎలాగేమిటండి బాబు/ క్రొత్త పేరు వినగానే డబ్బున్న వాళ్లకి వాళ్ళు పులుస్తాయి. గొప్ప గొప్ప బంగ్లాలు కట్టుకుంటారు. మరి యింటి ముందు గార్డెన్ లో కూడా అరుదయిన మొక్కలు కావాలి!"
    ఎవరి దగ్గరా లేని పూల మొక్కలు తమ గార్డెన్ లో ఉన్నాయని చెప్పుకోవటం గొప్ప కదా! అందువల్ల క్రొత్తపేరు విన్పించగానే ఎంత ఖరీదయినా చెల్లించి కొనేస్తారు.
    కొనేవాళ్ళకి అదొక ప్రిస్టేజ్! అమ్ముకునే వాళ్ళకి ఇదొక స్ట్రాటజీ! మీరు చెప్పిన పేరు వింటే ఆ మొక్క అలాంటిదే అనిపిస్తోంది.
    "ఇంతకాలంగా తిరుగుతున్నా ఆ పేరు నేనెప్పుడూ వినలేదు" అన్నాడు.
    ఇంకా తెరలు తెరలుగా నవ్వుతూనే ఉన్నాడు.
    "నర్సరీ వ్యాపారం మంచి లాభసాటి వ్యాపారం అన్నమాట!"
    "ఏం మీరూ మొదలెడతారా? మొదలెట్టండి. దీనికి అనుభవంతో పని లేదండీ! మేం వ్యాపారం మొదలు పెట్టిన రోజుల్లో ఎన్నో కష్టాలు పడ్డాం!"
    "ఒక భవనం ముందు గార్డెన్ రూపొందించాలంటే ఆ భవనం ఉన్న చోటు , నేల స్వభావం ! భవనం రంగు! ఇలా ఎన్నో విషయాలు పరిశీలించి గార్డెన్ స్వరూపాన్ని తయారు చేసేవాళ్ళం"
    "మొక్కలు నాటి వాటిని పెంచటం అంతా మా పనే! కాంట్రాక్టు! అదంతా ఇంజనీరింగు స్థాయిలో ఉండే పని!"
    "ఇప్పుడు ఆ పని అందరూ చేయగలుగుతున్నారు. మొక్కల కోసం నేను ప్రపంచమంతా తిరిగాను. ఇప్పటివాళ్ళు అడవులు, కొండల్లో తిరిగి సంపాదిస్తున్నారు. అవునూ మీరు చెప్పిన మొక్క పేరేమిటి?"
    "స్టార్ సన్ ! పేరెప్పుడు వినలేదంటారా?"
    "విన్నట్లే అనిపిస్తోందండీ! అడవిలో దొరికిన ఏ పిచ్చి మొక్కకో ఏ మహానుభావుడో ఒక అందమైన పేరు పెట్టాడు అంతే!"
    ఆ పేరు ఈ మధ్యనే ఎప్పుడో విన్నాను.
    "మొక్క పేరేమిటి? స్టార్ వార్సా?" మళ్ళీ అడిగాడు. అతనికి జ్ఞాపకశక్తి చాలా బలహీనమయి పోయిందని గుర్తించాడు జయసింహ!
    "స్టార్ వార్స్ కాదండీ! స్టార్ సన్! బాగా గుర్తు తెచ్చుకోండి" నర్సరీ యజమాని బుర్ర గోక్కున్నాడు.
    "ఈ మధ్య చాలా గార్డెన్స్ ఒప్పుకున్నాను . మతి పోతోంది. ఉండండి మా వాళ్ళని అడుగుతాను. రంగా! రంగా! ఓసారి యిలా రారా!" అని కేక పెట్టాడు.
    సిసింద్రీ లాంటి పదకొండేళ్ళ కుర్రాడు పరుగెత్తు కొచ్చాడు!
    "ఏంటి సార్! ఏం కావాలి?" అన్నాడు. మాటల్లో చురుకు!
    "స్టార్ సన్ కావాలి" జయసింహ చెప్పాడు.
    "ఓ అదా! వెళ్ళిపోయింది సార్! ఇప్పుడు లేదు" అన్నాడు జయసింహ ముఖం మతాబులా వెలిగిపోయింది.
    "ఎక్కడికి పోయింది ? యింకా ఉన్నాయా?"
    "లేవు సార్! అది చాల అరుదయిన మొక్క! బెంగుళూరులో పూల మొక్కలు కొనేందుకు వెళ్ళారు అయ్యగారూ! అప్పుడు కొనుగోలు అంతా అయ్యాక కాంప్లిమెంటరీగా ఆ మొక్క యిచ్చారు.
    అది పూలు పూయదండీ! ఆకులు తెల్లగా క్రోటన్ ఆకుల్లా ఉంటాయి. చుక్కల్లా ఉంటాయి. మధ్యలో ఆకులూ కాచెడి పువ్వు ఆకుల్లా అంటుకుని వుంటాయి.
    దాని ఈ మధ్యనే ఎవరో తీసుకుపోయారు!"
    "ఎవరు తీసుకున్నారో చెప్పు. బాగా జ్ఞాపకం చేసుకో!' జయసింహ వాడి భుజం మీద చెయ్యి వేసి ప్రోత్సహించాడు.
    పైకి క్రిందికి చూచాడు కుర్రాడు. కాస్సేపటికి ట్యూబు వెలిగింది.
    "ఆ అవున్సార్! గుర్తొచ్చింది. ధర్మాజీరావుగారమ్మాయి ఆ పూల మొక్క కొన్నారు. నూట అరవై రూపాయలకు అమ్మాం. బ్రతికించి యిచ్చే షరతు మీద అమ్మాం కదండీ! ఆ అమ్మాయి పేరు -----పేరు ---- పేరూ!' అంటూ మళ్ళీ ఆలోచనలో పడిపోయాడు వాడు.
    "ఆ అమ్మాయి పేరు ప్రియాంక!"
    "అవునండీ! అదే పేరు. క్రొత్త పేరు కదా గుర్తు లేదు."
    "తీసుకు వెళ్ళి ఎన్ని రోజులయింది"
    "వారం రోజులు దాటి పోయిందండీ!"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS