Previous Page Next Page 
మిస్టర్ 'యూ' పేజి 44

 

    చిన్నగా నవ్వాడు రాజు.
    "నిజం చెప్పాలంటే నేను -- రాక్షసుడిని వెదుకుతూ రాలేదు. నా చెల్లెలు యువని వెదుకుతూ వచ్చాను. నా అన్వేషణ పూర్తీ అయిందనుకుంటాను " అన్నాడు.
    "అంటే?" అన్నాడు సిసిహ.
    అనుమానంగా ఊపిరి బిగపట్టి చూస్తోంది సృష్టి.
    "అంటే -- ఆ కుడివైపు ఉన్న గదిలో నా చెల్లెలు యువ ఉండి ఉండాలని నా ఊహ -- కరక్టేనా సృష్టీ?"
    చప్పట్లు చరిచాడు సిసిహ. "ఉండదగ్గవాడివే! నీలాంటి వాడి కోసం నా అన్వేషణ ఫలించింది " అన్నాడు.
    నెమ్మదిగా అంతలోనే అక్కడికి వచ్చింది యువ.
    చెర బట్టబడిన దానిలాగా లేదు ఆమె. చిరకాలం నుంచి అక్కడే వుంటూ , ఆ వాతావరణానికి అలవాటు పడిన దానిలాగా ఉంది. కొద్దిగా వళ్ళు చేసింది. మొహంలో మెరుపు వచ్చింది.
    చామన చాయ వంటి రంగు విరిగి, బంగారపు రంగుకి తిరుగుతోంది.
    "అన్నయ్యా!" అంది అతన్ని చూడగానే ఒక్క పరుగున వచ్చి చుట్టేసుకుపోతూ. చెల్లెలి వెన్ను నిమిరి , నుదుటిని మృదువుగా చుంబించాడు రాజు.
    "ఎట్లా వున్నావు యువా?"
    "ఐ యామ్ అల్ రైట్"
    "నీకోసం అమ్మా నాన్నా ......." అనబోయాడు.
    "అంతా ఇక్కణ్ణించి చూస్తూనే వున్నాను " అంది యువ.
    "గురువుగారు తులసీరావుగారు కూడా ......" అని రాజు అనబోయేలోగానే -
    యువ మొహం జేవురించింది.
    "గురువుగారనకు - తులసీరావు తుచ్చుడు. నువ్వు మిస్టర్ యూనివర్స్ కాకూడదని ఎంత ట్రై చేశాడు చెప్పలేం?
    "ఏమిటి నువ్వంటున్నది ?" అన్నాడు రాజు.
    సైంటిస్టు సిసిహ జోక్యం చేసుకున్నాడు.
    "భూతవర్తమాన భవిషత్తు విశేషాలన్నీ చూసే దర్శిని ఇక్కడుంది. మీ గురువుగారి విశేషాలు చూస్తావా?
    వెంటనే తెరలేకుండా గాల్లోనే దృశ్యాలు కనబడటం మొదలెట్టాయి.

                             * * *

    సమయం : మిస్టర్ యూనివర్స్ పోటీలకు కాస్త ముందుగా ఒక హోటల్లో రూం.
    అందులో తులసీరావు తాగుతూ కనబడ్డాడు. అతని పక్కన కండకి కండలు వచ్చినట్లుగా కనబడుతున్న ఒక యువకుడు. అతని పక్కన అతని తాలుకూ ఏజెంటు.
    "అదీ మన ఒప్పందం " అన్నాడు ఏజెంటు.
    "మళ్ళీ ఒకసారి వివరంగా చెప్పండి" అన్నాడు తులసీరావు.
    నాటకీయంగా గొంతు సవరించుకుని, చెప్పడం మొదలెట్టాడు ఏజెంటు.
    "ఇదిగో ....... ఈయంగ్ మాన్ పేరు మైకేల్. అతను మిస్టర్ యూనివర్స్ పోటీకి వెడుతున్నాడు. పోటీలో పైనల్సులోనే చిక్కు .....అక్కడ టఫ్ ఫైట్ వుంటుంది. కానీ, నూటికి తొంభై తొమ్మిది శాతం మీ రాజు గెలిచే సూచనలే ఉన్నాయి. మీ వాళ్ళకు జాతకాల పిచ్చి ఎక్కువ. మూడ నమ్మకాలు మరీ ఎక్కువ.
    మీ కుటుంబం ఆ నమ్మకాల మీద అమ్మకాలు సాధించడంలో తరతరాలుగా అనుభవం సాధించింది. ఆ ఎక్స్ పర్ టైజ్ అంతా ఇప్పుడు ఉపయోగించి రాజుకి శల్య సారధ్యం చెయ్యాలి -- అసలు అతను పోటీలకే రాకుండా చేయగలిగితే అది వుత్తమొత్తమం! మీ ఋణం మేం ఉంచుకొం! మిమ్మల్ని అమెరికాలో సెటిల్ చేస్తాం - మిలియన్ డాలర్ల బహుమానం!" అన్నాడు.
    "ప్రస్తుతం డాలరు ఎక్స్ చేంజ్ రేటెంత?" అన్నాడు తులసీరావు ఆశగా.
    రూపాయితక్కువగా వెయ్యి! అంటే ఒక్క డాలరు దాదాపు వెయ్యి రూపాయలకు సమానం -- మిలియన్ డాలర్లంటే , లెక్కేసుకోండి . పది లక్షలూ ఇంటూ వెయ్యి.......
    "ఈ జన్మకి చాలు" అన్నాడు తులసీరావు సంతోషంగా. శల్య సారద్యంలో ఎన్నెన్నో ట్రాఫీలు సాధించాను నేను. ఇదొక లెక్క -- మిస్టర్ యూనివర్స్ పోటీ అంటేనే ప్రాణ భయం పుట్టేటట్లు చెయ్యనూ ........అడ్వాన్సు ఏదీ?"
    డబ్బు చేతులు మారింది.

                               * * *

    నెక్స్ ట్ సీను.......
    తులసీరావు, పరమేశ్వర్ , సంయుక్తలకు చెబుతున్నాడు. "మన రాజు మిస్టర్  యూనివర్స్ టైటిలు గెల్చుకోవడం ఎంత ఖాయమో, తిరుగు ప్రయాణంలో యాక్సిడెంటు అయి చనిపోవడమూ అంతే ఖాయం! మనం ఎట్లాగయినా రాజు పోటీలకు వెళ్ళకుండా ఆపలేమా?"

                                * * *
    అదంతా చూస్తున్న రాజూ తలపంకించాడు. "జ్ఞాని అనబడే సిసిహ అన్నాడు. "దట్ సేటిల్సు ఇట్! మనుషుల్లో మంచితనం అన్నది మృగ్యం. రాజూ -- నువ్వొక్కడివే ఎక్స్ ప్షన్ -- మనిషి అనే పదానికి సజీవ ఉదాహరణ నువ్వే -- తక్కిన వాళ్ళంతా మృగాలు.
    "అని మీరనుకుంటున్నారు. మీరనుకుంటున్నది తప్పని నేననుకుంటున్నాను" అన్నాడు రాజు.
    "కానీ మేం ఏది చెబితే అదే వేదం" అన్నాడు సిసిహ , వ్యంగ్యంగా.
    'అయితే ?"
    "మాది ఒక ప్రపోజల్ ఉంది"
    "ఏమిటది?"
    గొంతు సవరించుకున్నాడు సిసిహ. చెప్పడం మొదలెట్టాడు.
    "మానవజాతికి జన్మ నిచ్చింది మేమేనని నీకు బహుశా తెలియకపోవచ్చు "
    "మీరా?"
    "అవును -- దాదాపు లక్షల సంవత్సరాల క్రితం ......మేము షికారుగా మీ గ్రహం వైపు వచ్చాం "
    వింటున్నాడు రాజు.
    "అప్పుడు మనుషులు లేరు -- మానవజాతి లేదు. కాని నరవానరాలు ఉండేవి .
    ".........."
    కోతి పరిణామాలు అందరికీ తెలిసినవే. హోమోఏరేక్టస్ అనే లేచి నిటార్గా నడిచిన కోతి , హోమోహాబిలస్ అనే పనిముట్టు తయారుచేసుకున్న కోతి, రామాపిధికస్, హోమో అస్ట్రేలికస్ ..... ఆ తర్వాత హోమో సపైన్స్ అనే నవీన మానవుడు.   
   


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS