"నాకేం తెచ్చావ్? నాకేం తెచ్చావ్....." మాధవి కంఠస్వరం దీనంగా వినిపించసాగింది. హారిబుల్ మాధవి ఏ స్థితికి దిగజారిపోయింది? ఆత్మాభిమానం గల మాధవి తన ముందు నిలబడి అలా అడగడం తను చూడలేదు, చూసి బ్రతకలేడు.
"ఆమాట ముందు ఎందుకు చెప్పలేదయ్యా తీరా ఇక్కడి కొచ్చాక చెప్తావేం. టౌన్ లో అయితే ఏదయినా కొని తెచ్చే పని కదా!"
"అదుగో అక్కడ మిఠాయి కొట్టుంది బాబు. అన్నీ అక్కడే దొరుకుతాయి.
'సరే! వెళ్ళి తీసుకురా." సాగర్ పది రూపాయల నోటు ఇచ్చాడు.
"రెండు రూపాయలకు తెమ్మంటారా?"
"పది రూపాయలకు ఎంత వస్తే అంత తీసుకురా!" రిక్షా అప్పన్న సాగర్ ను ఎగాదిగా చూసి, మిథాయి కొట్టుకు నడిచాడు.
ఈగలు ముసిరే యీ స్వీట్స్ తను మాధవికి ఇచ్చేది? ఒకవేళ మాధవి తన కళ్ళ ముందే పొట్లం విప్పి తింటుంటే తను చూస్తూ ఊరుకో'గలడా?
"పదండి బాబూ!' అప్పన్న న్యూస్ పేపరులో కట్టిన పొట్లం పట్టుకొని తిరిగి వచ్చాడు. ఇద్దరూ హాస్పిటల్ గేటు ముందుకు వచ్చారు.
"ఏమిటే మాధవీ! ఇంకా ఎంతకాలం అడతావే యీ నాటకం?"
డాక్టర్ పరిమళ గదిముందు ఆగిపోయాడు సాగర్! సగం తెరచిన స్ప్రింగ్ డోర్ అలాగే పట్టుకుని లోపలకు చూశాడు.
మాధవి డాక్టర్ పరిమళకు ఎదురుగా కూర్చుని మాట్లాడుతోంది.
"ఏం చేయమంటావ్ పరిమళా? అతని పెళ్ళి ఆయె దాకా నేను ఈ నాటకం ఆడక తప్పదు."
"అతగాడికి పెళ్ళయితే గాని యీ పిచ్చి నాటకం మీద తెర దించనంటావ్ !"
"అవును, అంతేనే పరిమళా!"
"ఏమిటనే మధు! నాకు పిచ్చి పట్టేస్తున్నది. ఇదసలె పిచ్చాసుపత్రి. దానికి తోడు మా బాస్ ఒకడు సగం పిచ్చోడు. నీతో కలిసి ఈ పిచ్చి నాటకం ఆడటం ఇహ నా వల్ల కాదే."
"ప్లీజ్! పరిమళా! ఇంకో పది రోజులు ఓపికపట్టు."
"ఏం? నీ ప్రియుడు ఆ డాక్టర్ కూతురు సుజాతను పెళ్ళి చేసుకున్నట్టు కలేమయినా వచ్చిందా?"
"సాగర్ అలా ఎన్నటికి చేయడు. సాగర్ నన్ను మనసారా ప్రేమించాడు.' మాధవి గొంతు పూడిపోయింది.
'డామిట్! మళ్ళీ కధ మొదలు కొచ్చింది." డాక్టర్ పరిమళ మెడ చుట్టూ ఉన్న స్టేత్ తీసి బల్లమీద పడేసింది తల పైకెత్తి చూసింది.
"ఎవరూ?"
సాగర్ డోర్ వదిలేసి గోడ పక్కన నిలబడ్డాడు. మాధవి ఎంత నాటకం ఆడుతున్నది? ఎందుకీ నాటకం?
"మాధవీ ! ఏంటే అది? ఊరుకో!"
మాధవి ఏడుస్తున్నదా! వెంటనే లోపలి కెళ్ళి మాధవిని రెండు చేతులతో పొదివి పట్టుకొని, ఓదార్చాలనిపించింది సాగర్ కు. అంతలోనే నిలదొక్కుకున్నాడు. గోడకు చేవునానింఛి వినసాగాడు.
"సాగర్ ను అంతగా ప్రేమించే దానివయితే ఈ నాటకమెందుకు? అతడ్ని పెళ్ళి చేసుకుని హాయిగా ఉండరాదా!"
"పరిమళా! నా బాధ నీకర్ధం కాదె! తల్లీ తండ్రి కూడా నన్ను పిచ్చిదాన్ని గానే చూస్తున్నారు. అందరూ నన్ను పిచ్చిదాని కిందే జమ కట్టేశారు. సాగర్ తండ్రీ తల్లి కూడా నన్ను అదే అనుకుంటున్నారు. వీటన్నిటికీ డాక్టర్ మూర్తే కారణం!"
'అది సరే అసలు నీ ప్రియుడు సాగర్ ఏమనుకుంటున్నాడో చెప్పు?"
మాధవి మాట్లాడలేదు.
"అతను కూడానా?" పరిమళ అడిగింది.
"అవును.....కాదు......కాదు....."
"ఏమిటే అవును, కాదు! సరిగా చెప్పు."
"మాధవీ! నేనెప్పుడూ అలా అనుకోను. నువ్వే మయినా నాదానివే!' బయట నీలబడి వున్న సాగర్ పెదవులు వణికాయి. మాటలు దిగమింగుకున్నాడు.
'అయితే నాకొకటి చెప్పు మాదూ! సాగర్ నిన్ను అంతగా ప్రేమిస్తుంటే ఇన్ని రోజులూ అతడికి తెలిసే ఉండాలి కదా? అమ్మ కోసమో, బాబు కోసమో నిన్ను వదులుకోడానికి సిద్దమయిన వాడి గురించి నాకు చాలా పూర్ ఒపీనియన్ ఉన్నది. అతడి ప్రేమ వట్టి బూటకం! నాటకం. నీమీద ఏవో వెధవ ప్రయోగాలు చేస్తున్నాడు. అతడి దృష్టిలో నువ్వు ఓ గిని పిగ్" పరిమళ కంఠం తీవ్రంగా వున్నది. సాగర్ కు అమాంతం లోపలకెళ్ళి పరిమళ గొంతు నులిమి వేయాలని పించింది.
వెక్కి వెక్కి ఏడుస్తున్న ,మాధవి గొంతు విని సాగర్ నీరు కారిపోయాడు.
"మళ్ళీ ఏడుపు మొదలుపెట్టావ్! నీకు చేతనయినవి రెండే! పిచ్చిపట్టినట్టు నాటకం ఆడటం, లేకపోతే ఏడవటమూను. పిచ్చిపట్టినట్లు నటించి అందరినీ నమ్మించి ఇక్కడ చేరావు. నీ అడ్డం తొలగిపోతే సాగర్ సుజాతను చేసుకుంటాడనేగా! నిన్ను చేసుకుంటే అతడు సుఖపడలేడనేగా నీ అనుమానం! అంటే నీమీద నీకే నమ్మకం లేదన్నమాట. నువ్వు ప్రేమించిన వాడిమీద అంతకంటే నమ్మకం లేదు.
"పరిమళా! సాగర్ మీద నాకు పూర్తి విశ్వాముంది . అతన్ని నేను ఎంతగా ప్రేమిస్తున్నానో నీకు అర్ధం కాదు. అతని కోసమే....."
"ఇంతటి త్యాగం చేస్తున్నానంటావ్?"
"సిస్టర్! వీళ్ళందరినీ బయటికి పొమ్మను. ఆఫీస్ ముందు , వరండాలో జనాన్ని చేరనివ్వద్దని ఎన్నిసార్లు చెప్పాను."
"నర్సయ్యా!అప్పలమ్మా!" సిస్టర్ పెద్దగా కేక పెట్టింది.
"వెళ్ళండి , వెళ్ళండి! అడుగో ఆ బెంచి మీద కూర్చోండి. ఒక్కొక్కళ్ళనే పిలుస్తారు." అయాలు తోటలో జనాన్ని తోలడం మొదలు పెట్టారు.
"మిస్టర్! వాటార్యూ డూయింగ్ హియర్?"
సాగర్ ఉలిక్కిపడి తల తిప్పి చూశాడు.
ఏబై ఏళ్ళ దాటినా వ్యక్తీ తెల్ల కోటు వేసుకుని తన కేసి తీవ్రంగా చూస్తూ ఉన్నాడు. అతడే బాస్ అని అర్ధం చేసుకోవడానికి సాగర్ కు ఎక్కువసేపు పట్టలేదు. అతని వెనుక ఇద్దరు అసిస్టెంట్స్ వినయంగా నిలబడి ఉన్నారు.
"సార్! నేను ఓ పేషెంటు ను చూడ్డానికి" సాగర్ నీళ్ళు నమిలాడు.
"చూడడానికి వస్తే ఇక్కడెందుకు నిలబడ్డావ్! ఫో! అటు వెళ్ళి ఆ బెంచి మీద వరుసలో కూర్చో" డాక్టర్ గారి గొంతు కఠినంగా పలికింది. బయట బాస్ గొంతు వింటూనే లోపల నుంచి డాక్టర్ పరిమళ పెద్దగా అరవసాగింది.
