Previous Page Next Page 
ది పార్టనర్ పేజి 43

 

    
                                                        *    *    *


    వైజాగ్ సిటీ.
    గాజువాక లోని సినిమాహాలు పరిసరాలలోనే రిక్షా స్టాండ్ వుంది.
    దూరంగానే అటో దిగి రిక్షా స్టాండ్ వరకు నడిచి వెళ్ళింది ధీరజ.
    "రిక్షా కావాలమ్మా..."
    రిక్షా వాలాలు అందరూ ఆమెను చుట్టూ ముట్టారు.
    "చూడండి .... మా దూరపు బంధువు ఒకాయన ఇక్కడే రిక్షా తొక్కుతూ వుండాలి."
    "పేరేమిటమ్మా...."
    "పేరు.....గుర్తు రావడం లేదు... ఏదో చెప్పారు కాని" ఆలోచిస్తున్నట్టు ముఖం పెట్టింది ధీరజ.
    పేరు తెలియకుండా వచ్చిన ఆమె వైపు వింతగా చూశారు అందరూ.
    "పోలికలు ఏమయినా వుంటే చెప్పమ్మా.."
    తనను సమీపించిన వ్యక్తీ వైపు పరిశీలనగా చూసింది.
    అతనికి యాభై ఏళ్ళ వయస్సు వుంటుంది. ముఖాన స్పోటకం మచ్చలు .....బట్టతల..... కోర మీసాలు వుండడం గమనించింది. రిక్షా పోలయ్య చెప్పిన పోలికలు అతనిలో వున్నాయని గ్రహించింది.
    అయినా వెంటనే బయటపడలేదు.
    "అయన నాకు వరుసకు బాబాయ్ అవుతాడు ....స్పోటకం మచ్చలు వుంటాయన్నారు ....పేరు.....ఆ వెంకటేశ్వరరావో..... వెంకటేశ్వర్లో అయి వుండాలి" ఆలోచింది చెప్పినట్టు అన్నదామె.
    "నా పేరు వెంకటేశ్వర్లు....ఇక్కడ నేను తప్ప ఆ పేరు కలిగిన వాళ్ళు ఇంకెవరూ లేరు....నా ముఖాన స్పోటకం మచ్చలున్నాయి.... కానీ నువ్వెవరో నాకు గుర్తుకు రావడం లేదమ్మా!"
    "బాబాయ్ గుర్తు పట్టలేకపోయాను . పిన్ని యెలా వుంది?"
    అసలు ఆమె యెవరో ఏమాత్రం అర్ధం కాలేదు ఆయనకు.
    'అది సరే అమ్మాయ్! ఏం పని మీద వచ్చావు?"
    "రైల్వే స్టేషన్ కు వెళ్ళాలి బాబాయ్! వెళుతూ మాట్లాడుకుందాం వస్తావా?" అన్నదామె.
    రిక్షా తెచ్చి ఆమె ముందు వుంచాడు.
    ధీరజ ఎక్కి కూర్చుంది.
    స్టేషన్ దగ్గరకు వెళ్ళాక.....
    "నువ్వు నర్శింగపల్లి రైల్వే స్టేషన్ లో విజయవాడ పాసింజరులోకి ఒక పీపాను యెక్కించిన విషయం గుర్తుందా?"
    "నేనా నేను ఎక్కించడమేమిటి?"
    "బుకాయించకు నువ్వు ఆరోజు నర్శింగపల్లి వెళ్ళావా లేదా?"
    "ఏమోనమ్మా నాకు తెలియదు" కంగారుపడిపోతూ అన్నాడు.
    "నేను పోలీస్ ఇన్ స్పెక్టర్ ను, ఆరోజు నువ్వే స్వయంగా ఎక్కిచింనట్లు నావద్ద సాక్ష్యం వుంది. నువ్వు బుకాయించినందువలన ప్రయోజనం లేదు....ఆ పీపా నీచేత రైలులో పెట్టించిన పెద్దమనిషి యెవరు?"
    వెంకటేశ్వరులు మాట్లాడలేదు.
    అతను ఒక పట్టాన నిజం చెప్పడని అర్ధం అయింది.
    అమాంతం అతని చొక్కా పట్టుకుని ఈడ్చుకుంటూ రైల్వే పోలీస్ స్టేషనుకు తీసుకు వెళ్ళింది ధీరజ.
    వెంకటేశ్వరులు నెత్తీ నోరు లబలబ బాదుకుంటున్నా వినిపించుకోలేదామే.....
    నాలుగు అంటించిన తరవాత అతని నోటికి వున్న తాళం వూడింది.
    ఒక్కొక్కటిగా విషయాలన్నీ అతని నోటి వెంట వినడంతో ఇన్ స్పెక్టర్ ధీరజ భ్రుకుటి ముడిపడింది. సీతాపతి హత్య చేసిన వ్యక్తీ ఎవరో అతను చెప్పడంతో అవాక్కు అయింది.
    వెంటనే బయలుదేరి ఏ.సి.పి ఆఫీసుకు వెళ్ళింది ధీరజ.
    కిరణ్ ఆమె కోసమే ఎదురు చూస్తున్నాడు.
    "మేడమ్ ఈ కేసు ఫైలు  ఒకసారి చూడండి.
    వచ్చీ రావడంతోటే ఇన్ స్పెక్టర్ కిరణ్ తన చేతిలోని ఫైలు ను అందించాడు.
    ఫైలు తీసుకుని చకచక పీజీలు తిప్పింది.
    అది మంగళ హత్య కేసు.....
    ఇన్ స్పెక్టర్ కిరణ్ పరిశోధనలో ఆ హత్య సునీల్ చేసినట్టుగా అతడే ముద్దాయి అని వ్రాసి వుంది.
    పని మనిషి రంగమ్మ బలమయిన సాక్ష్యం వలన. సునీల్ ఫోటోను రసవల్లా హోటల్లో ని రిసెప్షన్ లో చూపగా ఆరోజు అతడు . ఆగదిలో ఉన్న ఈశ్వరరావు అతనేనని గుర్తుపట్టి పట్టు .....మంగళను హత్య చేసింది సునిల్ అని అతని పరిశోధన సారాంశం.....
    సీతాపతి హత్య కేసులో అప్పటికే సునీల్ ను విజయవాడ రైల్వే పోలీసులు అరెస్టు చేసి వున్నారు కాబట్టే ధీరజను కాంటాక్ట్ చేశాడు.
    కిరణ్ అనుమానం అర్ధమయింది ధీరజకు.
    "సారీ ఇన్ స్పెక్టర్.....! ఈ కేసులో అసలు ముద్దాయి సునీల్ కాదు...."
    "అంటే అసలు ముద్దాయి ఎవరో మీకు తెలుసా? సునీల్ ముద్దాయి కాదని అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు?" అనుమానంగా చూశాడు కిరణ్.
    "ఎస్.....? అందుకు సాక్ష్యాలు వున్నాయి. అంతేకాదు .....సీతాపతి ని చంపింది కూడా అతను కాదు."
    ఇన్ స్పెక్టర్ కిరణ్ ఆశ్చర్యంతో నోరు వెళ్ళ బెట్టాడు.
    "ఎస్ ! సీతాపతి హత్య కేసులో అసలు హంతకుడుని మనం గుర్తించడంలో పొరపాటు పడ్డాము."
    "మరి మంగళను హత్య చేసింది ఎవరు?"
    "జానీ వాకర్...."
    "ఈజ్ ఇట్...."
    మరొక్కసారి ఆశ్చర్యపోయాడు ఇన్ స్పెక్టర్ కిరణ్.
    "ఎస్ ఇన్ స్పెక్టర్ ....ముందు నేనూ నమ్మలేకపోయాను, కానీ సునీల్ డైరీలో తన స్నేహితుడు రాజేష్ ఇటీవల కాలంలో రౌడీ జానీవాకర్ తో చాలా క్లోజ్ గా తిరుగుతున్నట్టు , అసలు తన దగ్గరకు రానట్టు అతని ప్రవర్తన అనుమానంగా వున్నట్టు వ్రాసుకున్నాడు. అది నిజమో కాదో తెలుసుకోవడానికి జానీవాకర్ ను కస్టడీలోకి తీసుకుని ఇంటరాగేషన్ చేశాను. అతని వలన ఎన్నో విషయాలు తెలిశాయి.." ధీరజ సీరియస్ గా అన్నది.
    అంతవరకూ చట్టానికి దొరకకుండా తిరుగుతున్న అసలు నేరస్థుల బండారం బయట పడింది.
    ప్లే బోయ్ గా మారిన సునీల్ చూడగానే అతని ఫ్రెండ్ అయిన రాజెష్ కు స్వార్ధం బయలుదేరింది.
    తనకు పార్టీ ఇచ్చి వెళ్ళిపోతున్న సునీల్ ను ఫాలో చేసి ఎవరి ఇంటికి వెళుతున్నాడో గమనించి, తరువాత ఆమెను బ్లాక్ మెయిల్ చేయడం. డబ్బుతో పాటు ఆమెను కూడా అనుభవించడం ఎంతో సులభ మార్గంగానికి తోచింది.
    గీతాదేవిని బ్లాక్ మెయిల్ చేయడంతో అతని కధ ప్రారంభమయింది.
    అయితే, ఆ విషయంలో అతనికి జానీవాకర్ సహకరించాడు.
    అప్పటి నుండీ ఇద్దరూ కలిసి ఆ తరహా నేరాలు చేయడం ప్రారంభించారు.
    బ్లాక్ మెయిల్ చేయడం .....వచ్చిన డబ్బు చేరి సగం పంచుకోవడం, ఒక్కొక్కసారి ఒక్కొక్కరు మాస్క్ వేసుకుని వాళ్ళను అనుభవించే వాళ్ళు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS