Previous Page Next Page 
కె. ఆర్. కె మోహన్ కథలు పేజి 43


                              పేరయ్య రాజంటా...!


    ఢిల్లీ సుల్తాన్ మోసంతో ప్రతాపరుద్రుని  బందీగా పట్టుకుపోయాడు.


    ఏకశిలా నగర సింహాసనం ఖాళీగా వుంటూ అరాచకం ప్రబలడమేగాక, రాజ్యం కూడా శత్రువుల పరం అయ్యే అవకాశం వుందని భయపడి తీవ్రంగా ఆంతరంగిక సమాలోచనలు జరుపసాగాడు మంత్రి యుగంధ నారాయణుడు.

 
    ఇనకులానికి వశిశ్టుడిలా కాకతీయుల గురువైన విద్యారణ్యస్వామిని కూడా సంప్రదించాడు.  చివరికి స్వయంగా ఎలాగైనా ఆరు మాసాలలోగా  ప్రతాపరుద్రుని  తీసుకువస్తానని  ప్రతిన చేశాడు యుగంధ నారాయణుడు. ఈలోగా ప్రతాపరుద్రుని పోలికలు ఉన్న వ్యక్తిని తీసుకువచ్చి రాజు వేషం వేయించి, అతనిని  సింహాసనం  మీద కూర్చుండబెట్టి ఈ రహస్యం ఎవరికీ తెలియకుండా చాకచక్యంగా పరిపాలన నడపడం ఎంతైనా అవసరమన్న  నిర్ణయానికి వచ్చారు వారిద్దరూ.


    అలాంటి వ్యక్తి కోసం వళ్ళంతా  కళ్ళతో వెతుకుతుండగా వారికి గోదావరీ తీరాన బట్టలు ఉతుకుతున్న పేరిగాడు  కనిపించాడు.

 
    ముమ్మూర్తులా అతనిలో ప్రతాపరుద్రుని పోలికలు వుండడంతో అన్వేషణ  ఫలించిందన్న  రాజువేషం వేసి, సింహాసనం మీద కూర్చోబెట్టారు.


    ప్రతాపరుద్రుని  తీసుకురావడానికి  యుగంధ నారాయణుడు ఢిల్లీకి బయల్దేరాడు. ఈయన్నే యుగంధరుడు అనికూడా అంటారు.

 
    పేరిగాడిని అడ్డు పెట్టుకుని, మేధకునిగా  వున్నప్పుడు కాళిదాసు కూసిన కారు కూతలు, వేసిన వెర్రివేషాలను గురువుగారు సమర్దించినట్లు - పేరిగాడి పిచ్చిచేష్టలను కూడా  అధ్బుతంగా సమర్దిస్తూ  ఎవరికీ అనుమానం  రాకుండా రాజ్యపాలన చేయసాగాడు విద్యారణ్యస్వామి.

 
    అన్న ప్రకారం ఆరు నెలల లోపలే ప్రతాపరుద్రుని బంధవిముక్తుని కావించి ఏకశిలా నగరానికి  తీసుకువచ్చాడు యుగంధరుడు.

 
    పేరిగాని ప్రతాపరుద్రావతారం సమాప్తం అయింది.


    అతని సేవకు సంతోషించి ఘనంగా  సత్కరించి, ఏదైనా వరం కోరుకోమని అడిగాడు విద్యారణ్యస్వామి.

 
    "స్వామీ.. తమ అనుగ్రహంతో ఆరు నెలలు అధికారం చలాయించాను. కాని తృప్తి తీరలేదు. ఈ ఆంధ్రదేశాన్ని కనీసం ఐదేళ్ళ పాటైనా పాలించే అవకాశం ఇయ్యండి"  అని ప్రార్దించాడు పేరిగాడు.


    "ఓరి.... ఆర్నెల్లు కూడా పూర్తిగా సింహాసనం మీద కూర్చున్నావో లేదో కాని, నీ  వాలకమే కాదు - తీరు, ఆలోచనలు కూడా మారిపోయాయి. అధికారంలోని ఆకర్షణ అటువంటిది మరి! అందుకే ఒకసారి కుర్చీ ఎక్కిన వాడు చచ్చేదాకా దాన్ని వదలనంటాడు. అటువంటప్పుడు  నీకు కూడా ఇలాంటి కోరిక కలగడంలో ఆశ్చర్యం లేదు. నీ పూర్వ పుణ్యవశాన ఆర్నెల్లు రాచరికం వెలగబెడుతూ  రాజభోగాలు అనుభవించే యోగం కలిగింది. ఆ పుణ్యం పూర్తయిపోయింది. మళ్లీ నువ్వు  పేరిగాడిగా మారిపోక తప్పదు. అయితే..... ఈ  ఆర్నెల్లు నువ్వు కాకతీయ సామ్రాజ్యం అల్లకల్లోలం  కాకుండా మహోపకారం  చేశావు. ఈ పుణ్యకార్యానికిగాను నీకు మళ్లీ మరుజన్మలో రాజయోగం పడ్తుంది. ఐదు వందల సంవత్సరాల  తరువాత  భాగ్యనగర సింహాసనం అధిరోహిస్తావు. నీ పరిపాలన గొప్పగా  లేకపోయినా నీ రూపంతో, మాటలతో, నీ చేతలతో -  అపరహాస్య బ్రహ్మవై ప్రజలు నిత్యమూ హాయిగా నవ్వుకునేట్టు చేస్తూ వారి మనసులలో శాశ్వత స్థానం సంపాదించుకుంటావు" అని వరమిచ్చాడు విద్యారణ్యస్వామి.


    "మహా ప్రసాదం స్వామీ!" అంటూ పూర్వాశ్రమానికి వెళ్ళిపోయాడు పేరిగాడు.

 
                                             *    *    *    *    *
    
    ఐదు వందల సంవత్సరాలు అయిపోయాయి.

 
    భాగ్యనగర సమీపంలో ఒక కుగ్రామంలో పేద ఇంట పుట్టాడు పేరిగాడు.


    అయితే.... పూర్వజన్మ పుణ్యబలం ఎక్కువగా వుండడంతో పేరులోకూడా ప్రమోషన్ వచ్చింది. పేరిగాడు కాస్తా 'పేరయ్య' అయ్యాడు. మూసీ నదిలో సర్కారువారి  ధోబీఖానాలలో బట్టలు ఉతకసాగాడు. పాత జన్మలో చేనేత బట్టలు  ఉతుకుతూ వుంటే,  ఈ జన్మలో ప్రమోషన్ మూలంగా మిల్లు బట్టలు, టెర్లిన్, పాలిస్టర్ బట్టలు కూడా ఉతకడం మొదలుపెట్టాడు.


    అయితే..... రానురాను 'వాష్ అండ వేర్' రకం బట్టలు ఎక్కువ కావడంతో ఎవరి  బట్టలు వారు ఇళ్లల్లో ఉతుక్కోవడం ఎక్కువైపోయాయి. బట్టలు ఉతికేవారికి గిరాకీ బాగా తగ్గిపోయింది.


    ఫలితంగా పేరయ్య బట్టలు ఉతకడం మానేసి, వాళ్ళబంధువు ఒకాయన ఫ్యాక్టరీలో పనిచేస్తుంటే, ఆయన రికమెండేషన్ లో అందులో మజ్దూర్ గా చేరాడు. ఆరోజుల్లో ఆ కూలిపని  చేసినందుకు రోజుకు ఆరణాలు ఇచ్చేవారు. అయితేనేం... ఆరణాలకు ఎంతో విలువుండేది. దాంతో హాయిగా  కాలం గడపసాగాడు పేరయ్య.

 
    పేరయ్య నేర్చింది 'ఆ ఆ' లే అయినా, తెలివితేటలు వున్నవాడు కావడంతో -  త్వరలోనే సాటి కూలీలలో మంచిపేరు సంపాదించగలిగాడు.


    నెమ్మదిగా సాటి కూలీలను సంఘటితపరచి వారికి నాయకుడు కాగలిగాడు.
    నాయకులను గుప్పిట్లో పెట్టుకోవడం అవసరమని భావించే ఫ్యాక్టరీ యాజమాన్యం పేరయ్యకి త్వరలోనే 'రెగ్యులర్ ప్యూన్' గా ప్రమోషన్ ఇచ్చి ఉద్యోగం ఖాయం చేసింది.


    ఆ ఫ్యాక్టరీకి దేశంలోని  బడా బడా షేర్ లు వాటాదార్లుగా వుండడంతో తరచూ ఎంతోమంది పెద్దవారు, మందిబలం వున్నవారూ, రాజకీయ  నాయకులూ వస్తుండేవారు. ఎదుటివారి ముఖాలు  చూసి వారి అవసరాలను అర్దంచేసుకుని, క్షణాలలో వాటిని సమకూరుస్తుండేవాడు పేరయ్య. దానితో ఫై అధికారలకు, పెద్దలకీ తలలో నాలుక అయిపోయాడు.

 
    పేరయ్యకి ఉన్న పలుకుబడిని చూసి, అతని శక్తిసామర్ద్యాలను  గుర్తించి,  అతనిని తమ నాయకుడుగా ఎన్నుకున్నారు  సాటి కార్మికులు.  చూస్తుండగానే ఆ పెద్ద  ఫ్యాక్టరీలోని వేలాదిమందికి ప్రియతమ నాయకుడైపోయాడు పేరయ్య. వటుడిలా వుండిన పేరిగాడు అచిరకాలంలోనే  పేరయ్యగా  వామనరూపం పొందాడు.

 
    అవి ఢిల్లీ సింహాసనాన్ని బంగారుబాబు జనరంజకంగా పాలిస్తున్న రోజులు.

 
    ఆయన  ఎక్కడికి పోయినా వెంట తన కూతురు మాయాదేవిని తీసుకువెళ్తుండేవాడు. చిన్నతనంలోనే ఆమె తల్లి గతించడంతో, ఆమెను అల్లారుముద్దుగా  పెంచుకుంటూ, సొంత సెక్రటరీగా పనిచేయించుకుంటుండేవాడు. తన తర్వాత ఆమె ఢిల్లీ సింహాసనాన్ని అధిరోహించాలని అంతరంగంలో కలలు కంటుండేవాడు.

 
    ఒకసారి ఆ ఫ్యాక్టరీలో విభాగం ఒకదాన్ని ప్రారంభించడానికి ఢిల్లీ నుంచి బంగారుబాబు వచ్చాడు.  వెంట మాయాదేవి ఉందనే విషయం ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు. ఆ సంధర్బంలో వారిద్దరూ ఆ ఫ్యాక్టరీ గెస్టు హౌజ్ లో కొంచెంసేపు గడిపారు.  ఆ సమయంలో ప్రత్యేక సిబ్బందితోపాటు, అక్కడ  పేరయ్యను కూడా కాపలా వుంచారు.

 
     ప్రారంభోత్సవం అయిపోయిన తర్వాత బంగారుబాబు,  కుమార్తె గెస్టుహౌస్ కు తిరిగివచ్చారు. ఈయన గుమ్మంలో అడుగుపెడుతుండగానే టిప్ టాప్ గా  వున్న పేరయ్య  అమాంతం ఆయన కాళ్లమీద పడ్డాడు.


    అటువంటివి బంగారుబాబుకు అలవాటే కనుక ఆయన ఏమీ కంగారుపడలేదు. నలుగురి వంకా చిరునవ్వు దృక్కులు సారించి ఆప్యాయంగా పేరయ్యను పైకి లేవనెత్తాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS