కృష్ణయార్యుడు, మంగమాంబ ఇద్దరూ చేతులుజోడించి తిరుమలదిక్కు తిరిగి,
"ఏడుకొండలవాడా! వెంకటరమణా! ఆపదమొక్కులవాడా! అనాథరక్షకా! నీవే దిక్కు. మాకు నీవు ప్రసాదించిన భాగ్యం మళ్ళీ నీ దగ్గరికే చేరుతోంది. కొన్నాళ్ళు మమ్మల్ని మురిపించి మైమరపించింది. దాని యోగక్షేమాలు చూచే బాధ్యతనీదే! శరణు వెంకటేశా! శరణు" అంటూ పరిపరివిధాల ప్రార్థించారు.
* * *
రాత్రి బాగా పొద్దుపోయింది. కృష్ణపక్ష ప్రారంభదినాలవటంతో వెన్నెల మెల్లగా పరుచుకుంటోంది. ఊరు సద్దుమణిగింది. పగలంతా కూతురు తమని వదలివెడుతుందని బాధపడిన తల్లి, తండ్రి నిద్రలోకి జారుకోవటం గమనించింది వెంగమాంబ. మానసికంగా ఎంతసందిద్ధమయినా, తాను బయలుదేరుతుంటే, వారు కన్నీరు పెట్టుకోవటం, ఓదార్చటం వంటివి తప్పవు. వాటితో సమయం వృధాచేయకూడదనుకుంటే, ఎలాగూ వారికి తెలుసుగనక, చెప్పకుండా కదలటం మంచిది అనుకుంది. అనుకున్నదే తడవుగా తాళపత్రాలు, గంటం ఒకచీరలో మూట కట్టింది. నిద్రిస్తున్న తల్లితండ్రులకు పాదాభివందనం చేసింది. తన ఇష్టదైవాన్ని తలచుకుంది. ఒంటరిగా తానుచేసే ఈ యాత్ర ఎటుగాసాగాలి? అనుకోటమేతడవు చిన్ననాటి తన మిత్రుడు తనని చూచి నవ్వి రమ్మని చెయ్యిచాచి, ముందుకు సాగుతూ కనిపించాడు. ఇంకేం కావాలి? తాడుకట్టి లాగబడ్డట్టుగా సాగింది. తరిగొండ నృసింహుని దేవాలయం సమీపించగానే భావోద్వేగం తట్టుకోలేకపోయింది.
"నరసింహస్వామీ! ఊహ తెలిసినప్పటినుండి నీ ఒడిలో ఎదిగిన దానిని. మరల నిన్ను చూచేదెన్నటికో! అసలు పునర్దర్శనం ఉందో లేదో? ఇంతకు ముందు లాగానే నాపై దయచూపు తండ్రీ!" అంటూ నమస్కరించి, గ్రామానికి వీడ్కోలు పలికి తిరుమలవైపు సాగింది.
* * *
తరిగొండను వీడిన వెంగమాంబ వేంకటాచల అభయారణ్యంలో ప్రవేశించింది. గమ్యాన్ని వీలైనంత త్వరగా చేరుకోవాలనే దీక్షతో మధ్యలో ఎక్కడా ఆగకుండా సాగింది. ఆకలి దప్పికలు లేవు. అలసట అంతకన్నా లేదు. విశ్రాంతి తీసుకోవటం లేదు. క్రూరజంతువుల భయం లేదు. తన గమ్యంతప్ప మరేమీ పట్టడం లేదు. మనసంతా నిండిన నరసింహుని స్మరించటం, తన మిత్రునితో కొద్దికాలక్షేపం, బాహ్యస్పృహ లేకుండా చేసి ఉంటాయి. రెండు రోజులు ఎడతెగకుండా సాగింది వెంగమాంబ ప్రస్థానం.
రెండోరోజు సాయంత్రం సమయానికి "పందెకాలపు మొగలిపెంట" అనే కోనకి చేరుకుంది. కొంచెం సమయం విశ్రమించాలనిపించటంతో అక్కడ వెలసియున్న ఆంజనేయుని ఆలయమ్లో ఆయన సన్నిధిలో పద్మాసనంలో కూర్చుంది. అంతే! సమాధిస్థితిలోకి వెళ్ళిపోయింది. చాలా సమయానికి బాహ్యస్పృహ కలిగింది. అది తాను తపస్సు చేయవలసిన స్థలంగా స్ఫురించింది. జనావాసానికి చాలా దూరంగా, ప్రశాంతంగా ఉన్న ఆ భక్తాగ్రణ్యుడి సన్నిధిని మించి తపస్సుకి తగిన తావుమరొక్కటి ఏమి ఉంటుంది?
వెంగమాంబ చిన్నతనం నుండి చేసిన సాధన అంతా ఫలించి, తపస్సులో ఏకాగ్రత లభించింది. ఏదో ఒకటి నేర్చుకోవాలి, సాధించాలి అనే పట్టుదలతో చేసినవి ఇంతకు ముందు సాధనలన్నీ, ఇప్పుడు సాధించాల్సినవేమున్నాయి? తపస్సు జీవధర్మంగా చెయ్యటం మిగిలింది. ఆనందం లభిస్తుందనే ఆశతో చేయటంకాక, తపస్సు చేయటమే ఆనందం అనే స్థితిలో ఉంది కనక తపస్సులో లగ్నం అవటం సులభం అయ్యింది. తాను, తన తపస్సు చేయటం, తపస్సుయొక్క లక్ష్యం ఒకటే అయిపోయాయి. ఆ స్థితిలో వెంగమాంబకి వేంకటేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు.
"నీకు తిరుమలలో కాలుమోపే యోగ్యత లభించింది. నా సన్నిధికి రా!" అని ఆదేశమిచ్చాడు
"శరణు రమాధీశ! సారప్రకాశ! - శరణు పాపవినాశ! జలదసంకాశ!
శరణు పావననామ! జగదభిరామ! - శరణు సత్పరధామ! సంపూర్ణకామ!
జయ నిగమవిహార! జయమేరుధీర! - జయ సుజనాధార! జగదేక వీర!
జయ పరమపవిత్ర! సత్య చరిత్ర! - జయ వికుంఠక్షేత్ర! సన్మునిస్తోత్ర!
విశ్వాత్మకుఁడ వీవు విశ్వంబు నీవు - విశ్వేశ్వరుఁడ వీవు వేదార్థ మీవు
నిన్ను సన్నుతిఁజేయ నీలకంఠునకుఁ - బన్నగభర్తకు, బ్రహ్మదేవునకు
నలవి గాదన నే నతి బాలకుఁడను - జలజలోచన! నిన్ను సన్నుతించుటకు
నే నెంతదాననను నిజము భావింప - దీనవత్సల! భవదీయ సత్కరుణ
క్రన్నన నిర్హేతుకం బగుగాన - నన్ను రక్షింపవె నా తండ్రి!
గొనకొని నతులు నుతులు
"ధన్యురాలను స్వామీ! తమ చిత్తం!" అంటుంటే తపస్సు భంగమైంది. వెంగమాంబ మనసు ఆనందంతో నిండిపోయింది. ఎంతోసాధన చేసినా మనసు ఆలోచనలతో నిండి ఉన్నప్పుడు, మమతానుబంధాలు చుట్టుముట్టినప్పుడు, దైవదర్శనం స్వప్నంలో మాత్రమే. ఎందుకంటే - అన్నింటికీ నేనున్నానంటూ మనస్సు ముందుకి దూకుతుంది కదా! అందుకే తనకి స్వప్నసాక్షాత్కారం మాత్రమే లభించింది ముందు. ఆ బంధాలు ఛేదించుకుని, క్షాళనం అయినాక ధ్యానంలో మనోనేత్రానికి గోచరించాడు. అందుకే ఇంటినుండి బయలుదేరాక ఇక్కడ ఆపాడు. ఈ మనసు తాలూకు విక్షేపాలన్నీ ఇంకా ఏ మారుమూలనైనా మిగిలి ఉంటే తుడిచి పెట్టేయాలి. స్వామి అనుగ్రహం, తనమిత్రుని తోడ్పాటు, ఇలవేలుపు చల్లనిచూపు తనని నడిపిస్తున్నాయి. ఈ విధంగా ఆలోచిస్తూ, తనని ఆదరించి, కాపాడి సాధనకి వీలు కలిగించిన ఆంజనేయస్వామిని ఎంతగానో కీర్తించింది.
* * *
సందెకాలపు మొగలిపెంటనుండి ప్రయాణం ప్రారంభించిన వెంగమాంబ మరెక్కడా నిలవలేదు. పాదంతోపాటు పదంకూడా కదం తొక్కినట్టుగా అడుగడుకీ సంకీర్తనమే. పెదవి విప్పితే కీర్తన. పలకరిస్తే పద్యం. మౌనంలో ధ్యానం. నిలబడితే సమాధి..... ప్రతికదలికా, శ్రీనివాసుని కంకితమే. ఉచ్చ్వాసనిశ్శ్వాసలే నామ జపంతో నిండిపోయాయి. సముద్రాన్ని చేరటానికి ఉరవళ్ళతో ఉరకలు పెట్టే మహానదిలాగా, మానస సరోవరం అంతటి నిశ్చలంగా, నిర్మలంగా, సంతృప్తిగా, సంతోషంగా, ఆనందంగా పరిసరాలని, తోటి యాత్రికులని కూడ భక్తి తరంగాలలో ఓలలాడిస్తూ, ఆనందపరవశులను చేస్తూ తన యాత్రని సార్థకం చేస్తూ తిరుపతికి చేరుకుంది.
కొంతకాలం పుట్టింటిలో ఉండి తన స్వంత ఇంటికి వస్తున్నప్పుడు మామూలు ఆడవాళ్ళు ఇలాగే అనుకుంటారు కాబోలు అనుకుంది వెంగమాంబ. తిరుమలకొండ పైకి ఒక్కొక్క మెట్టూ ఎక్కుతుంటే ఎంతోకాలం దూరంగా ఉండి ఇంటికి తిరిగివచ్చి, తన స్వంత గదివైపు నడుస్తున్న అనుభూతి కలిగింది. ఇంకా ఎన్ని అడుగులు వెయ్యాలి నాథుని దర్శనానికి? అయినా దూరం గడుస్తుంటే ఆనందం చిక్కబడుతోంది. అనుభూతి గాఢతరమౌతోంది. మెట్లన్నీ ఎక్కి తిరుమలలో అడుగుపెట్టగానే స్వస్థానానికి వచ్చినట్టు, నిరీక్షణ ఫలించినట్టు, తన జీవిత గమ్యం చేరినట్టు అనిపించింది. తన జీవితంపై ఇక తనకేమాత్రం అధికారంలేదు. శ్రీనివాసునికి అర్పితం.
మెట్లెక్కుతున్నప్పుడు దూరదూరంగా చెట్ల సందులలో నుండి గోపురశిఖరం గోచరించినప్పుడల్లా పులకరింతలతో అప్రయత్నంగా "అదిగో అల్లదిగో శ్రీహరివాసము" అన్న అన్నమయ్య సంకీర్తన జాలువారుతోంది. మనసు తన నాథుని చూడాలని తొందరచేస్తున్నా సంప్రదాయం పాటించవలసి ఉందని బుద్ధి హెచ్చరిస్తుంటే, పుష్కరిణిలో మునిగి వరాహనరసింహస్వామిని దర్శించుకుంది.
