ఎన్నో సంవత్సరాల నుంచీ అక్కడ స్థిరనివాస మేర్పర్చుకున్న పందికొక్కు అది. శరీరం సైజుకి ఏమాత్రం సంబంధంలేని చిన్న సైజు తల, సన్నటి చీలికలాటి నోరు...
ఆ చీకటిలో దాని కళ్ళు చమక్- చమక్ మని మెరుస్తున్నాయి.
బయటకొచ్చిన ఒక క్షణం ఆగింది. రెండడుగుల దూరంలో నిశ్చలంగా వున్న శరీరంకేసి తదేకంగా చూసింది. కాస్త తటపటాయించి దగ్గరి కెళ్ళింది. ఆ శరీరంలో చలనం లేకపోవటంతో మరింత దగ్గర అయింది. తలప్రక్కనుంచి క్రిందికి కారి గడ్డకట్టిన రక్తాన్ని తవ్వి తీసింది.
దాని గోళ్ళ చప్పుడు అతని చెవులు పనిచేయకపోవడంవల్ల వినిపించలేదు. రక్తం రుచి చూసి అది మరింత ముందుకెళ్ళింది.
జీవితంలో ఎన్నడూ అతడు అంత భయభ్రాంతుడవలేదు. మొహం దగ్గర, కళ్ళకి మూడడుగుల దూరంలో దాని కళ్ళు ఉన్నాయి. కన్నార్పకుండా అతడివేపే చూస్తూంది. దాని కళ్ళు ఎర మీదకు దూకే పులి కళ్ళలా నిస్తేజంగా వున్నాయి. వెన్నెల దాని మీసాల మీద ప్రతిబింబిస్తూంది. దాని శరీరం మీద నుంచి వచ్చే దుర్గంధం ముక్కుపుటాలనే బ్రద్దలు కొడుతూంది.
అతడి గుండెల్లోంచి వచ్చినకేక గొంతుదగ్గర ఆగిపోయింది. తన నడుము సంగతి, నాలుక సంగతి మర్చిపోయి, అతడు కెవ్వున అరుస్తూ రెండు చేతులతో దాన్ని దూరంగా విసిరేశాడు. చీకట్లో అది అదృశ్యమైపోయింది. అయితే ఆ అరుపుకి అతడి నోటి నుండి రక్తం తిరిగి స్రవించసాగింది. ఒక్క ఉదుటున కదలటం వలన ఈసారి శరీరమంతా పారలైజ్ అయినట్టయింది.
అతడి వణుకు ఇంకా తగ్గలేదు.
దానిచూపు కళ్ళలో మెదులుతూనే వుంది.
అతడు జీవితంలో భయపడేది మూడిటికే. డేగకి, పందికొక్కుకి, డేపంజాతి స్త్రీకి.
అతడు చేతుల్తో రక్తం తుడుచుకున్నాడు. మరో పది నిముషాలు గడిచినయ్.
అంతలో ఏదో తగిలినట్టయి చప్పున తలతిప్పి చూసేడు.
దూరంగా అదే పందికొక్కు- తల నిటారుగా పెట్టి అతడినే చూస్తూంది. అతడికి పిచ్చెక్కినట్టయింది. చేతితో నేలని టప్ మని కొడ్తూ శబ్దం చేసేడు. అది కొద్దిగా కదిలి వెనక్కెళ్ళి మళ్ళీ వచ్చింది.
అతడు అక్కడనుంచి కదల్లేడన్న విషయం అదీ గుర్తించినట్టు వుంది. కొద్దిగా దగ్గరికి వచ్చి మళ్ళీ దూరంగా వెళుతూంది. ఇలా రావటం, అతడు విదిలించగానే వెళ్ళటం- సముద్రగర్భంలో అగ్ని పర్వతంలా బ్రద్దలయితే, పొంగే అగ్ని జ్వాలలకి, సముద్ర జలాలకి కొన్ని గంటలపాటు, రోజులపాటు ఘర్షణ జరుగుతుంది. అలాటి ఘర్షణే అతడికీ, దానికీ ఆ రాత్రి చాలాసేపు జరిగింది.
నడుముకి తగిలిన దెబ్బవల్ల, రక్తం చాలా పోవటం వల్ల అతడు క్రమేపీ బలహీనుడవసాగాడు. దాన్ని అదిలించే శక్తి కోల్పోయాడు. తెలతెల వారుతూండగా అతడు పూర్తిగా స్పృహ కోల్పోయాడు.
అది దగ్గరకొచ్చి ఆగింది.
అతడిలో కదలిక లేదు.
అది అతడి భుజంమీద నుంచి మొహం దగ్గరగా వచ్చింది... మొహం మీద ముఖం పెట్టి నోరు తెరిచింది. సన్నటి గీతలా వున్న నోరు పై పెదవి విప్పగానే ఎర్రటి కండరం క్రింద కోరల్లాంటి పళ్ళు -
సరిగ్గా అతడి కళ్ళమీద...
నిశాచరుడు అంటే అర్థం ఏమిటి? రాత్రిళ్ళు సంచరించేవాడా? కళ్ళు లేనివాడా?
3
సోమశేఖరం వెళ్ళిపోయాక, మరికొంతసేపు ఆగి భార్గవ కూడా బయలుదేరాడు. కానీ అతడు వెంటనే సామ్సన్ కంపెనీకి వెళ్ళలేదు. తన ఇన్ స్టిట్యూట్ లోనే స్టోర్సు డిపార్ట్ మెంట్ కి వెళ్ళి మొహానికి వేసుకునే మాస్క్ ఒకటి ఇండెంట్ చేసి తీసుకున్నాడు. సామ్సన్ అండ్ సామ్సన్ కంపెనీలో పనిచేసేవారు వాడే ముసుగులాగా వుందది.
దానితోపాటే, ప్లాస్టిక్ లాటి పదార్ధంతో తయారుచేయబడిన సంచి నొకదానిని తీసుకున్నాడు. గాస్ కలెక్షన్ బ్యాగ్ అది.
ఆ రెండింటితోనూ అతడు సామ్సన్ కంపెనీవైపు బయలుదేరేడు.
అంతకు ముందొకసారి వెళ్ళిన కారణంగా ఈసారి కొత్తగా అనిపించలేదు. కానీ ఇంతకుముందు వెళ్ళినప్పుడు దొంగతనం చెయ్యబోతున్నాననే భావం లేదు కాబట్టి మామూలుగా వెళ్ళగలిగాడు. ఈసారి కొద్దిగా భయంగా వుంది. అయినా మామూలుగానే గేటులోంచి ఆఫీసువైపు నడిచాడు. అతడు వెళుతూంటే గేటు దగ్గిర ఎవరూ ఆపుచెయ్యలేదు.
ఆఫీసు మెట్లవరకూ నడిచి, అటూ ఇటూ చూసి, తననెవరూ గమనించటంలేదని ధృవపర్చుకుని, చటుక్కున బిల్డింగు వెనుకవైపు నడిచాడు. అక్కడ చిన్న చిన్న చెట్లు, పొదలు అస్తవ్యస్తంగా పెరిగి వున్నాయి. ఫ్యాక్టరీని, ఆఫీసుని విడదీస్తున్న ఫెన్సింగ్ అక్కణ్ణించే వెళుతూంది.
ఫెన్సింగ్ లోపలికి ప్రవేశించాడు.
ఇనుప గొట్టాల వెనుకనుంచి అతడు అవతలివైపుకి వెళ్ళాడు. బాయిలర్ కీ వాటర్ పంపుకీ మధ్యలో గుట్టగా వుంది.
సల్ఫా-2
అతడు దాన్ని తీసి పొట్లం కట్టుకున్నాడు. జేబులో పట్టక చేత్తో పట్టుకోవలసి వచ్చింది.
బాయిలర్ పక్క నుంచి జాగ్రత్తగా మెట్లు ఎక్కి, అంతకుపూర్వం కొద్ది రోజుల క్రితం తను పరుగెత్తిన రేకుల దారి మీదకు చేరుకున్నాడు. అక్కణ్ణించి కార్మికులు పనిచేస్తూ వుండటం కనిపిస్తూంది. దూరంగా మెయిన్ గేటూ, సెక్యూరిటీ కూడా గోచరమవుతూంది. తమ తమ పనుల్లో వున్న కార్మికులు అతడిని పట్టించుకోలేదు. రేకులమధ్య సన్నటిదారి....భార్గవ ఆ దారివెంటే కాస్తదూరం నడిచి ఫ్యాక్టరీ గొట్టం పక్కగా చోటు చేసుకుని కూర్చున్నాడు.
సమయం భారంగా గడుస్తూంది.
భార్గవ వాచీ చూసుకున్నాడు.
ఎందుకో తలెత్తి దూరంగా వున్న ఆఫీసువైపు చూసి ఉలిక్కిపడ్డాడు.
ఆఫీసు వరండాలో నాయుడు ఎవరితోనో మాట్లాడుతూ కనిపించాడు. భార్గవ చప్పున తల తిప్పుకున్నాడు. అంత దూరంనుంచి అతడు గుర్తుపట్ట లేకపోవచ్చు. కానీ భార్గవకి ఏ విధమయిన రిస్కు తీసుకోవటం ఇష్టంలేదు. వంగి, అక్కడ ఏదో పని చేస్తున్నవాడిలాగా వేళ్ళతో బోల్టు సరిచెయ్యసాగేడు.
ఇంతలో సైరన్ మ్రోగింది.
మిగతా అందరూ కార్మికుల్లాగే అతడూ చప్పున మాస్క్ తీసుకుని మొహానికి తగిలించుకుని, అందులోని గాలి పీల్చసాగాడు.
సైరన్ మోగిన కొద్ది క్షణాలకి పంపు సందుల్లో నుంచి గాస్ బహిర్గత మవసాగింది. అతడు అంతకుముందు వచ్చినప్పుడే ఒక సంగతి గ్రహించాడు. ఆ పంపు నుంచి బయల్పడే విషవాయువు ప్రభావము కేవలం కొద్ది క్షణాలపాటే వుంటుంది. మామూలు వాతావరణంలోకి ఆ గాస్ ప్రవేశించగానే అది తన ప్రభావాన్ని కోల్పోతుంది. బహుశా 'ఆక్సిడేషన్'కి లోనవుతుందేమో- ఏ విషయమూ ప్రయోగశాలలోనే తెలియాలి. అతడప్పుడే ఒక నిర్ణయానికి రాదల్చుకోలేదు.
