"ప్రేమ బలంగా వున్నప్పుడు శరీరసౌఖ్యం తుచ్చంగా కనిపించదూ?"
"సౌఖ్యం సంగతి వదిలిపెట్టినా ఆయన నావల్ల యెన్నిపోగొట్టుకొన్నారు? ఆయనకి వంటేకాదు, ఒక్కపనీ చేయలేను. పైగా ఆయనే వంటచేసి నాకు పెట్టాలి? జడవేయాలి, మందులు మింగించాలి. నన్ను సదా సరదాగా వుంచేందుకు ప్రయత్నించాలి! ఇదంతా ఆయన ఒక తృప్తికోసం చేస్తున్నారు. అవిటిదయిన నాభార్యకు నేనేమీ అన్యాయం చేయడంలేదు, అన్న ఆత్మతృప్తి అది. కాని, నాకు మాత్రం ఒక గుదిబండలా తయరయ్యానా అని క్రుంగిపోని క్షణం వుండదు. ఆయనకే అన్నీ చేయాల్సిన నేను ఆయనచేతే చేయించుకోవడం నిజంగా ఒక నరకం కదూ?"
"అలా ఎందుకనుకొంటున్నారు? ఒకరికి కష్టంవస్తే యింకొకరు పంచుకోకపోతే భార్యాభర్తల మధ్య అనుబందానికి అర్దమేమిటి?"
"ఇటువంటి కష్టం వచ్చినప్పుడు పంచుకోకపోయినా ఎవరూ ఏమీ అనరు. ముఖ్యంగా మగవాడిని. "
"మగవాడిని ఎవరూ ఏమీ అనకపోవచ్చు. పైగా సమర్దించవచ్చు కూడా. కాని, సహధర్మచారిణికి జరుగుతున్న ద్రోహానికి మనస్సాక్షి ఏమీ అనకుండా వుండలేదు కదా? మీరున్నచోట ఆయనే వుంటే మీరు ఆయన్ని వదిలేసి వేరే పెళ్లిచేసుకొనే వాళ్లా?"
"తన సతీత్వాన్ని ప్రకటించుకొనే అపూర్వమైన అవకాశం యిది స్త్రీకి. అలాంటి అవకాశాన్ని వదులుకొని వెళ్ళిపోతే ఆ స్త్రీని ఎంతతుఛ్చంగానయినా పరిగణిస్తుంది లోకం."
"ఎవరో ఏదో అంటారనికాదు, ఇది కేవలం మీకు సంబందించిన విషయమే కాబట్టి మీరేం నిర్ణయిస్తారు? సతీత్వానికి ప్రాముఖ్యతనిస్తారా, స్వసుఖానికి ప్రాముఖ్యతనిస్తారా?"
"నా సుకం , నా ఆనందం అన్నీ ఆయనే అయినప్పుడు ఆయన్ని వదిలిపెట్టే ప్రసక్తి ఎలా వస్తుంది?"
"ఇదేమాట ఆయనా అనుకోవచ్చుకదా? మగవాడి ప్రేమమీద, స్వచ్చతమీద మీకు నమ్మకంలేదా? మగవాళ్లకి నీతి నియమం ఉండక్కరలేదనుకొంటున్నారా?మీరు స్త్రీ అయివుండి స్త్రీకో నీతినీ, పురుషుడికో నీతినీ ప్రోత్సహిస్తున్నారెందుకు? అతడు తన ధర్మం నిర్వహిస్తున్నాడు. అంతేకాని, మీకోసం యేదో త్యాగం చేస్తున్నాడని యెందుకు ఫీలవుతున్నారు."
"అంతేనా? నేను బాధపడాల్సింది లేదంటారా, సుధా?"
"ఏం లేదు!?'
"ఏంలేదని నాకూ తెలుసు! కాని, బాధపడకుండా వుండలేకపోతున్నాను. అంతటి ఉత్తముడు భర్త అయినందుకు ఎంతగర్వపడుతున్నానో, ఆ ఉత్తమత్వమేకదా నన్ను మెడకు కట్టుకుందని అంత సంకటపడుతుంటాను. చాలా చిత్రమైన పరిస్థితికదూ నాది?" పేలవంగా నవ్వింది సుగుణ.
"నిజంగా ఆయన మళ్ళీ పెళ్లి చేసుకొంటే మీరేమవుతారు?"
"పడుంటాను ఓ ప్రక్కకు. ఉండలేని పరిస్థితివస్తే మా పుట్టింటికి వెళ్లిపోతాను"
"కాళ్లు చేతులు అన్నీ సరిగ్గా వున్న ఆడపిల్లే అత్తింటికి దూరమై పుట్టింటికివస్తే భరించలేరు కన్నవాళ్లు. ఇహ నడుముల్లేని పసిపాపలా మీరు పుట్టింటికి చేరితే కన్నవాళ్లలోనే రాక్షసత్వం చూస్తారు మీరు. ఇహ భర్త దగ్గరే ఓ ప్రక్కన పడి వుండడమంటారా, ఒక్కరోజుకే ఆత్మహత్య చేసుకొంటారు! అంతప్రేమను చవి చూసిన మీరు మీ కళ్లముందే అది పరాయిదవడం చూసి. కాబట్టి నేను చెబుతున్నాను. ఎట్టి పరిస్థితిలోనూ ఆయన్ని మళ్లీ పెళ్లికి ప్రోత్సహించవద్దు! మీకు మందు వేసేటైం అయినట్టుంది...." సుధలేచి మంచినీళ్లకోసం వెళ్లింది.
మాత్రలు మింగి, నీళ్ళుతాగి గ్లాసు ఇచ్చివేస్తూ "మనిషికి మృత్యువు కంటే దారుణమైంది లేదనుకొంటాం. కాని, అంతటి దారుణమైన మృత్యువునూ ఆప్యాయంగా ఆహ్వానించేట్టు చేసే దారుణమైన సంగటనలు మనిషి జీవితంలో సంభవిస్తాయని చెప్పడానికి నా జీవితమే ఉదాహరణ. చూడండి సుధా! ఆయన తన ధర్మం తప్పకుండా నానుండి విముక్తి పొందేందుకు నేను ఆయన జీవితంనుండేకాదు ప్రపంచంనుండే తప్పుకోవలసివస్తే, ఆ రోజు ఆశ్చర్యపోవద్దండీ. నన్ను అర్దం చేసుకోడానికి ప్రయత్నించండి."
"మీలో ఇంత దారుణమైన ఆలోచనలు చెలరేగుతున్నాయని చంద్రకాంత్ గారికి తెలుసా?"
"ఆఁ ఒక సందర్బంలో బయటపడ్డాయి!"
"ఏమన్నారు?"
"నిజంగా అదేరోజువస్తే ముందు తన మరణాన్నే చూస్తానన్నారు."
"ఇంకెందుకండీ బాధపడతారు? అంత గాఢంగా ప్రేమించే భర్త చేతిలో మీ జీవితాన్ని పెట్టి నిశ్చింతగా కళ్లుమూసుకోక."
