Previous Page Next Page 
అమృతం కురిసిన రాత్రి పేజి 42

క్షతగాత్ర అయిన హర్యక్షం లాగ మూల్గుతోంది
మెరక వీధి యిసుక వీధి
ఈగలు వాలుతున్న పెద్ద పెద్ద వ్రణాలు,
వీరేశలింగం, దామెర్ల రామారావు
స్మృతులేవో కదిలిన యీ క్షణాలు
సింహం కళ్ళనుండి జారిన అశ్రుకణాలు
అర్ధరాత్రి వేళ వానలో చలిగాలిలో
రాజమండ్రి పాపాన్ని కప్పుకుని పడుకుంది

        3

రోడ్లు:
ఎగుడూ దిగుడూ
పెళ్ళాం మొగుడూ
వీరికి ప్రణయం
మనకే ప్రళయం

        4

కొండలు
నల్లమందు తిన్న గున్న ఏనుగుల్లాగ కొండలు
ఎక్కడి వక్క మత్తుగా పడుకుంటాయి
సారంగధరుడి మెట్లదగ్గర మాత్రం
సంగీతం విషాదంగా వినిపిస్తూంది
నీతి కట్టె లాంటిది
కోర్కె మంటలాంటిది
అందుకే రాజురాజు కొంపకి నిప్పంటుకుంది

        5

రాత్రివేళ రాజమండ్రి వెళుతుంటే
రమ్య గౌతమీ జలాలలో
కొన్నివేల విద్యుద్దీపాలు ప్రతిఫలిస్తాయి
ఎవరీవడ ధమ్మిల్లంలో యిన్ని కాంతి లతాంతాల్ని తురిమారు?
ఎవరీవిడ గుండెల్లో యిన్ని కాంక్షాకీలల్ని వెలిగించారు?
అని విస్తుపోతాను
అయితే అప్పుడు గౌతమి ఎంత అందంగా వుంటుంది
నాట్యం చేసే అలసిన వేలుపు సానిలాగ!
అర్ధశయాన మూర్తి అయిన రాణిలాగ!


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS