వాడు చాలా తెలివైనవాడని గ్రహించాడు పరుశురాం.
లేనితనం, పేదరికంతో వాడు తన పొట్ట తాను పోషించుకోవడానికి ఆ వయసులోనే మెకానిక్ పని నేర్చుకుంటున్నాడు. అదే చదువుకోగలిగితే భవిష్యత్తులో కన్నయ్య ఓ మేధావి అయ్యే అవకాశం ఎంతైనా వుంది.
తను చూస్తుంది కన్నయ్య ఒక్కడినే. కానీ ఈ దేశంలో ఇలాంటి కన్నయ్యలెందరో!
అయినింట పుడితే ఆ వయసు పిల్లలు ఎంత ఆదరణ, ప్రేమకి నోచుకుంటారో పరుశురాంకి తెలుసు.
"పక్క వీధిలో డాక్టర్ గారున్నారన్నా? మన గిరాకీనే ఆయనకి. చూపెడదాం" అన్నాడు కన్నయ్య.
కన్నయ్యతో పాటు నడిచాడు పరుశురాం. కన్నయ్య అడుగులో అడుగు వేస్తుంటే పసిపిల్లవాడిలా అతన్ని అనుసరించాడు పరుశురాం.
డాక్టర్ కి కన్నయ్య జరిగింది వివరించి చెప్పాడు.
డాక్టర్ పరుశురాం చేతులకీ, కాళ్ళకి అయిన గాయాలకి మందురాసి ఇంజక్షను చేసాడు. కొన్ని మందుబిళ్ళలు ఇచ్చాడు.
"మీ ఫీజు" అన్నాడు మెల్లగా పరుశురాం.
డాక్టర్ అతని భుజంపైన చేత్తో తట్టి చిన్నగా నవ్వి--
"కన్నయ్యని కాపాడ్డంకోసం నువ్వు రిస్క్ చేశావు. నీ దగ్గర ఫీజు ఎలా తీసుకుంటాను. అవసరం లేదు" అన్నాడు.
"థాంక్స్ డాక్టర్స్" పరుశురాం కృతజ్ఞతతో అన్నాడు.
బయట కొచ్చాక.
"ఇక నువ్వెళ్ళు కన్నా! జాగ్రత్త!" హెచ్చరించాడు పరుశురాం.
కన్నయ్య పరుశురాం మొహంలోకి చూశాడు.
"నీ మాటలు వింటుంటే యిక్కడివాడిలా లేవు. నువ్వెక్కడి కెళ్ళాలన్నా"
"మరోసారి వాడి తెలివికి అచ్చెరువందాడు పరుశురాం"
"తెలీదురా! కేరాఫ్ రోడ్డు" అన్నాడు.
"నీకెవరూ లేరా?"
"లేరు."
"పాపం."
పరుశురాం నవ్వాడు చిన్నగా.
"పాపం చేసుకున్న వాళ్ళు అందరికీ దూరం అవుతారా కన్నా, నన్ను అందరూ వదిలేశారు."
"ఇప్పుడెలా" పైకి అని కాస్త ఆలోచించి-
"పోనీ మా ఇంటికి వచ్చేయ్" అన్నాడు.
"మీ ఇంటికా!"
"అవును మా బస్తీకి పోదాం."
"మీ వాళ్ళు ఊరుకుంటారా" అనుమానంగా అడిగాడు.
"నాకు అమ్మ ఒక్కతే వుంది. నువ్వు నన్ను కాపాడావని తెలిస్తే అమ్మ ఎంతో సంతోషిస్తుంది అన్నా."
తల దాచుకోడానికి ఓ చోటు.
కన్నయ్యతో వెళ్ళడానికి నిశ్చయించుకున్నాడు పరుశురాం.
"ఎక్కడ మీ ఇల్లు?"
"దగ్గరే"
"పద వెళదాం" అన్నాడు పరుశురాం.
తన మాట విని పరుశురాం తనతో వస్తున్నందుకు కన్నయ్య పొంగిపోయాడు.
ఇద్దరూ నడుస్తున్నారు.
"నువ్వు చదువుకోకుండా ఈ పని ఎందుకు చేస్తున్నావు?"
"అందరూ పల్లకీ ఎక్కితే మోసేదెవరన్నా. చదువు కోవాలంటే పైసలు కావాలి కదా!"
"నీకు జీతమెంత?"
"రోజూ ఐదు రూపాయలిస్తారు."
"ఐదా!"
"అదే ఎక్కువంటాడు ఓనరు. పైన చిన్న చిన్న టిప్పులు దొరుకుతాయిలే."
"రాత్రి ఈ సమయం వరకూ చేస్తావా పని."
"ఆ.... పొద్దునే ఎనిమిదికల్లా వస్తాను."
జాలివేసింది పరుశురాంకి.
"మీ అయ్య లేడా?"
"నాన్న లేడు అమ్మ ఒక్కతే."
"మీ అమ్మ కూడా పనిచేస్తుందా."
"ఊహూ" కన్నయ్య గొంతు బొంగురుపోయింది.
"అంటే నీ జీతంపైన నువ్వు, మీ అమ్మ జీవించాలన్న మాట."
"అమ్మను నేను కాకపోతే ఎవరు చూస్తారన్నా"
ఆ మాటలతో పరుశురాంకి వాడిపైన వాత్సల్యం రెట్టింపయింది.
"ఒకే మాటల్లో పెట్టి నడిపిస్తున్నావు. ఇంకెంత దూరం" అడిగాడు.
"ఇంకెతన్నా? మనం వచ్చినంత దూరం వుంటుంది."
పరుశురాం అదిరిపడ్డాడు. దరిదాపు అప్పటికే మూడు కిలోమీటర్లు దూరం నడిచారు.
"రోజూ నడిచే వెళ్తావా?"
"నడిచి వచ్చి నడిచే వెళ్తాను. బస్సులో వెళితే పైసలు చాలద్దూ."
కన్నయ్య పైన ఎక్కడలేని జాలి కలిగింది.
వయస్సుకి మించిన జ్ఞానం వాడికి వుంది. తన దగ్గరే డబ్బుంటే వాడ్ని బడిలోపెట్టి చదివించేవాడు.
ఈ దేశానికి పట్టిన దౌర్భాగ్యమే అదేమో? ఎంతమంది ఇంటలెక్ట్యువల్స్ ఇలా అడుగంటిపోతున్నారో?
19
"ఇదే మా బస్తీ" అన్నాడు కన్నయ్య.
వెన్నెల వెలుగులో చూశాడు పరీక్షగా.
