Previous Page Next Page 
ది ఎడిటర్ పేజి 42


    
    ఊర్రుత లూగిపోతున్నారు పాఠకులు. ఉత్తరాలు ముంచేస్తున్నాయి.ఆపత్రికా కార్యాలయాన్ని ఫోన్ కాల్స్ ఊపిరాడనివ్వడం లేదు.
    ఇంత హడావుడిలోనూ ఎడిటర్ కి కనబడకుండా పోయింది ఒకే ఒక వ్యక్తీ.
    ఆమె హరిణి.
    హరిణి ఎడిటర్ కి కనబడి వారం దాటుతోంది. మంత్రం వేసినట్లు మాయమై పోయింది హరిణి. ఈ ఉత్సాహాన్ని పంచుకోకుండా!
    ఏం జరిగి ఉంటుంది? ఎందుకని రావడం లేదు తను?
    ఇక్కడ ఇంత సెన్సేషన్ క్రియేట్ అవుతుంటే ఏమయిపోయింది హరిణి.
    సందేహనివృత్తి చేసుకోవడం కోసం ఒకసారి హరిణి ఇంటికి ఫోన్ చెయ్యాలనుకున్నాడు ఎడిటర్.
    జడ్జిగారి కూతురు కదూ తను? ఫోన్ నెంబరు ఎంత?
    ఒకచోట నోట్ చేసుకున్న నెంబరు చూసి రింగ్ చేశాడు ఎడిటరు. జడ్జిగారే ఎత్తారు. గంభీరమైన స్వరం.
    "హాలో!"
    ముందుగా తనని తాను పరిచయం చేసుకున్నాడు ఎడిటర్. పరస్పర అభివాదాలు అయ్యాక "మీ అమ్మాయి హరిణిని పిలుస్తారా! సీరియల్ గురించి మాట్లాడాలి. మంచి రెస్పాన్స్ వస్తోంది సీరియల్ !" అన్నాడు ఎడిటర్.
    "మా అమ్మాయా! హరిణా" అన్నాడు జడ్జిగారు ఆశ్చర్యంగా. తర్వాత నవ్వారు. "యు ఆర్ మిస్టేకన్ మైడియర్ సర్! నాకు ఒక్కడే కొడుకు. కూతుర్లు లేరు."
    అది విని అప్రతిభుడై పోయాడు ఎడిటర్.

                                       16

    ఎడిటర్స్ కేబిన్ లో......
    ఊపిరాడని పనిలో మునిగిపోయి ఉన్నాడు ఎడిటర్. అయినా అతని మనసు హరిణి గురించిన ఆందోళనలోనే నిండిపోయి వుంది.
    కనబడకుండా ఏమయిపోయింది ఆ అమ్మాయి! ఎందుకన్ని అబద్దాలు చెప్పింది తనతో.
    ఎలాగైనా సరే ఒకసారి హరిణిని కాంటాక్టు చేసి జరిగిందేమిటో తెలుసుకోకపోతే తనకు మనశ్సాంతి ఉండేటట్లు లేదు.
    కానీ ఎలా కాంటాక్టు చెయ్యడం.
    అతను అలా డైలామాలో వుండగానే వచ్చాడు పబ్లిషర్ నందనరావు ఎవరో పిలవనంపితే వచ్చినట్లుగా.
    "రండి ! రండి!" అన్నాడు ఎడిటరు మర్యాదపూర్వకంగా. "ఎప్పుడొచ్చారు?"
    "పొద్దున వచ్చాను సార్! మిమ్మల్ని ఒకసారి కలిసిపోదామని" అన్నాడు నందనరావు.
    "చెప్పండి"
    "కొత్త నవల రిలీజ్ చేస్తున్నాం. ఈ యాడ్ (అడ్వర్ టేయిజ్ మెంట్) ఇచ్చిపోదామని వచ్చాను."
    దాన్ని అందుకుని పక్కన వుంచాడు ఎడిటరు.
    "ఇది అద్భతం సార్! ఫస్ట్ టైం యిన్ హిస్టరీ" అన్నాడు పబ్లిషరు.
    "ఏమిటి?"
    "ఇదే! ఒక సీరియల్ కి యింత రెస్పాన్స్ రావడం జనం పిచ్చెత్తిపోయినట్లు చదవడం! మా ఊళ్ళో అయితేనండీ కుర్రాళ్ళు వీక్లీ వచ్చేరోజు తెల్లారు జామునుంచే స్టేషన్లో పడిగాపులు గాస్తున్నారు. వీక్లీ కాపీలకోసం! వీక్లీ రావడం ఒకరోజు ఆలస్యం అయితే యిక స్టాల్స్ వాళ్ళ బుర్రలు పగలకొట్టేసేటట్లు ఉన్నారు. వండ్రఫుల్ సార్."
    తృప్తిగా చిరునవ్వు నవ్వాడు ఎడిటరు.
    "ఈ సీరియల్ అయిపోగానే ఆ అమ్మాయిదే ఇంకో కొత్త సీరియల్ వెంటనే మొదలెడదామనుకున్నాను. కానీ మంత్రం వేసినట్లు మాయమైపోయింది తను. ఏదీ! కనబడితేనా! వారం దాటింది హరిణి ఇక్కడికొచ్చి ఏదన్నా ఊరెళ్ళిందేమో."
    "అదేమిటి సార్! ఆమె ఏ ఊరికి వెళ్ళలేదు. ఇక్కడే వుంది. నేను ఇప్పుడు అక్కడ నించే వస్తున్నాను." అన్నాడు నందనరావు.
    ఆశ్చర్యంగా చూశాడు ఎడిటరు.
    "ఇక్కడే వుందా? మరి ఎందుకు రావడం లేదు?"
    "ఏమోనండీ! నేను ఆమెనీ క్రితం వారం కూడా కలిశాను."
    "దేనికి! సీరియల్ మీరు బుక్ గా పబ్లిష్ చేస్తున్నారా?"
    "ఈ సీరియల్ కోసం కూడా అడుగుతున్నాం సర్! కానీ ఆ లోపల ఒక డైరెక్ట్ నవల ఇస్తే వేసేస్తాం అని అడిగాను. ఇచ్చింది . అంత తేలిగ్గా ఏం యివ్వలేదులెండి. గీచి గీచి బేరమాడి ముక్కుపిండి డబ్బు వసూలు చేసుకుని మరీ ఇచ్చింది. యాభై వేలు తెసుకుంది సార్." అన్నాడు ఆరోపణగా.
    "యాభైవేలా! డైరెక్టు నవలకి?"
    అవునన్నట్లు తల ఊపాడు నందనరావు.
    యాభైవేలు అంటే! సీనియర్ రైటర్స్ సీరియల్ గా వచ్చిన నవలకి తీసుకునే దానికంటే కూడా చాలా ఎక్కువ.
    ఒక్క కొత్త రైటరు రాసిన డైరెక్టు నవలకి అంత పే చేశారంటే -
    అంతకు రెట్టింపు లాభాన్ని ఆశించే చేసి వుంటారు. పబ్లిషర్స్ చేసేది కూడా వ్యాపారమే! ఊరికే ఎందుకు పే చేస్తారు ఎవరయినా.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS