Previous Page Next Page 
ది ఎడిటర్ పేజి 41


    తీరా లోపలికి వెళ్ళి కూర్చున్న తర్వాత డబ్బు దుబారా చేస్తున్నానేమో అని బెంగ కలిగింది అతనికి. లేచి వెళ్ళిపోదామా అనుకున్నాడు కానీ కడుపు కాలిపోతోంది. పోనీ తిందామా అనుకున్నాడు.
    అతను అలా డైలమాలో ఉండగానే సర్వరు వచ్చేశాడు. అప్పటికి ఒక నిర్ణయానికి వచ్చేశాడు అభిషేకన్. ఏదో గుర్తువచ్చినట్లు చటుక్కున లేవబోయాడు .
    కానీ అతన్ని లేవనియ్యకుండా టక్కున అతని చెయ్యి పట్టేసుకున్నారు ఎవరో.
    ఉలిక్కిపడి తిరిగి చూశాడు అభిషేకన్.
    పక్కనున్న వ్యక్తీ మొసలి పట్టుకున్నట్లు అతని చేతిని పట్టుకునే ఉన్నాడు. వదలలేదు.
    "నన్ను గుర్తు పట్టలేదుట్రా?" అన్నాడు చనువుగా.
    తెల్లబోయి చూశాడు అభిషేకన్. "రా?' ఇంత చనువుగా మాట్లాడుతున్నాడు ఎవరితను.
    "కూచో" అభిషేకన్ చెయ్యి ఊడివచ్చేలా లాగాడు ఆ వ్యక్తీ.
    పట్టుతప్పి కూలబడ్డాడు అభిషేకన్.
    "ఏమన్నా తింటావుట్రా? ఉప్మా పెసరట్......." అన్నాడా వ్యక్తీ.
    ఫ్రీ టిఫెన్ అనేటప్పటికి అభిషేకన్ కి పోయిన ప్రాణం లేచి వచ్చింది.
    "ఓ తింటా! కానీ ఉప్మా పెసరట్ కాదు.......ఉప్మా పెసరట్ ఆంధ్రావాళ్ళు తింటారు. నేను తిన్ను-------"
    "పోనీ బిన్ బేళా బాత్?"
    "ఛీఛీ అది కన్నడం వాళ్ళ తిండి! నేను తిన్ను! నాకు కన్నడం అంటే పడదు."
    "అదీ కాకపోతే పూరీ కూరా?"
    "అబ్బేబ్బేబ్బే! అది నార్త్ ఇండియన్స్ తినే గడ్డి! నాకు నార్త్ ఇండియన్స్ అంటే ఎలర్జీ! తమిళ్ నాడులో చదువుతున్నప్పుడు అయాల హిందీ అజిటేషన్లో అరెస్టు కూడా అయ్యా!" అన్నాడు అభిషేకన్.
    "నేను కూడా నీతో బాటు అరెస్టు అయ్యా కదరా బడుద్దాయ్ బక్కపీనుగా! మతిమరుపు రోగం కూడా వచ్చిందిరా నీకు?" అన్నాడు వ్యక్తీ.
    చకచక ఆలోచించింది అభిషేకన్ బుర్ర. వీడెవడు? ఇంతకు ముందు ఎక్కడ తగిలాడు తనకు?
    "ఇంతకీ ఏం తింటావురా?" అన్నాడా వ్యక్తీ.
    "ఇడ్లీ సాంబార్ ! అదే నాకిష్టం." అన్నాడు అభిషేకన్ ఉత్సాహంగా.
    "మీ టామిల్ నాడులో అందరూ అదే తింటారు. ఈ ఆంధ్రాలో ఏముందండీ ఆవకాయ తప్ప! తిండి తినాలంటే తమిళనాడు లో నేనండీ! ఇక్కడంతా దండగండీ! అసలు ఇక్కడి మనుషులంతా దద్దమ్మలండీ, కోస్తా జిల్లలో ఉండే వాళ్ళందరూ కోతిమూకండీ! రాయలసీమలో అంతా రాతియుగపు మనుషులండీ! తెలంగాణా లో వుండే వాళ్ళందరూ తెలివి లేని వాళ్లండీ! ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ లో ఉండే వాళ్ళందరూ అజ్ఞానం గాళ్ళండీ! అన్నాడు పుంజుకుని పెద్ద గొంతుతో.
    తెలుగు రాజధాని లోని ఆ హోటల్లో ఉన్న తెలుగు వాళ్ళందరూ వానపాముల్లా తలెత్తకుండా తింటున్నారు అతని తిట్లు.
    ఆ వ్యక్తీ మాత్రం అభిషేకన్ మాటలకు విరగబడి నవ్వుతున్నాడు. "రైట్! రైట్! రైట్!" అంటున్నాడు ప్రతి మాటకి.
    తనకు తగ్గ జోడి దొరికినందుకు సంతోషించాడు అభిషేకన్.
    "మీ పేరేమిటండీ?" అన్నాడు అభిమానంగా.
    "చిదానంద్!" అన్నాడతను ఆనందంగా.
    చటుక్కున ఏదో స్పురించింది అభిషేకన్ కి.
    "చిదానంద్! అంటే మీరు సదానంద్ బ్రదరా! అన్నాడు .
    "అవున్రా! వాడు నా తమ్ముడు. నేను వాడికి అన్నని. మేమిద్దరం మా నాన్నకి కొడుకులం" అన్నాడు చిదానంద్. అని మళ్ళీ నవ్వడం మొదలెట్టాడు.
    ఉలిక్కిపడ్డాడు అభిషేకన్.
    ఇదేమిటి ఇట్లా మాట్లాడుతున్నాడు వీడు?"
    తెగ నవ్వుతున్నాడు చిదానంద్. నవ్వినవ్వి కళ్ళెంబడి నీళ్ళు తిరిగాయి అతనికి. అతికష్టం మీద నవ్వాపుకుని "భలే నవ్వించావురా? ఇవాళ నీకు సన్మానం చెయ్యాలి?" అన్నాడు.
    ఏం జరగబోతుందో అభిషేకన్ గ్రహించే లోపలే ఇడ్లీని ముద్దలా చేసి అభిషేకన్ నోట్లో కుక్కాడు. చిదానంద్. సంబారు గిన్నె ఎత్తి అభిషేకన్ నెత్తి మీద కుమ్మరించాడు.
    కీచు గొంతుతో అభిషేకన్ వేసిన కేక అప్పుడేవచ్చి ఆగిన అంబులెన్స్ సైరెన్ లో కలిసిపోయింది.
    అంబులెన్స్ లో నుంచి కిందకు దూకారు నలుగురు మనుషులు. హోటల్ లోకి ఊరికి వచ్చి చిదానంద్ పెడరెక్కలు విరిచి లాక్కెళ్ళి అంబులెన్స్ ఎక్కించారు.
    ఆ అంబులెన్స్ పిచ్చాసుపత్రి తాలుకాది.
    ఆ చిదానంద్ పిచ్చాసుపత్రి నుంచి పారిపోయి వచ్చిన వాడు.
    వెర్రిమొహం వేసుకుని చూస్తుండిపోయాడు అభిషేకన్.


                           *     *    *    *

    హరిణి సీరియల్ నాలుగో వారం ఇష్యూ మార్కెట్ లోకి వచ్చింది. సీరియల్ రోరింగ్ సక్సెస్! పది లక్షల మంది పాఠకుల పెదాల మీదా హరిణి పేరే మెదులుతోంది.
    సరికొత్త రైటర్! యంగ్ రైటర్ లేడి రైటర్!
    సరికొత్త యంగ్ లేడీ రైటర్!
    సరికొత్త తరహ సీరియల్.
    సెన్సేషన్! సెన్సేషన్!


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS