అ ప్రశ్నకు సమాధానం నేను చెప్పవలసిన అగత్యం లేకుండానే కొద్దికాలం తరువాత నీకు తెలియగలదు. అందుకు ముందుగా ఒక మాట అడుగుతాను.
నీవు విద్యాధికురాలవు. వైజ్ఞానిక లోకంలో వెలుగు కిరాణానివి. నీ అవసరం విద్యార్ధులకే కాక విద్యాలోకానికి చాలా ఉంది. అందు నించి నేనొక చిన్న ప్రశ్న అడుగుతాను. దానికి సమాధానం చెప్పు" అన్నాడతడు. ఇతపూర్వం అతని కంఠంలో ధ్వనించిన వినమ్రతా భావం ఇప్పుడు రవంత అయినా కన్పించలేదు.
ఆమె ఏనాడో మరచిన అహంకారం చివ్వున నిద్రలేచింది. పడగ విప్పి ఖస్సున బుస కొట్టింది. ఏనాడో తనది అనుకున్నది అంతా వొదులుకుని విద్యాలోకానికి అంకితమైపోయి మంచి, మర్యాదల్ని తప్ప మరి దేనినీ కోరని ప్రొఫెసర్ ఆవిడ.
ప్రేమ వాత్సల్యాలు , సభ్యత, అభిమానం ఇలాంటివి ప్రదర్శించటమే ఆమెకు తెలుసు. కోపగించుకోవటం లాంటి పదాలను ఆమె ఏనాడో మరచిపోయింది. విద్యార్ధులయినా, సహా అధ్యాపకులయినా ఎవరూ ఎన్నడూ అటువంటి ప్రయత్నం చేయలేదు.
చేసిన వారిని మన్నించే సహనమూ, క్షమా ఆమెకు ఉండేవి. కాని ఉపాధ్యాయునిలా నటించిన వ్యక్తీ ఏకవచనంలో సంభోదించి ఆమెలో సుప్త సర్పాకృతి అయిన అహంకారాన్ని దెబ్బ కొట్టటంతో ఆమె నేత్రాలు అరుణాచితమయినాయి.
ముఖం విచ్చిన మందారంలా యెర్ర ఎర్రగా మారిపోయింది. అంతరంగంలో కోపం కడలి కెరటంలా ఉవ్వెత్తున లేచి వుంది. అలవాటయిన ధోరణిలో ముందు కోపం తగ్గించుకుందుకు రవంత సేపు కళ్ళు మూసుకుంది ప్రొఫెసర్ శ్రద్దాదేవి.
తనను ఎదిరించనూ లేదు. తనకు భయపడనూ లేదు. తన భావమేమిటో వ్యక్తీకరించని ధోరణిలో ప్రశాంతంగా కనులు మూసుకుని అంతర్ముఖురాలాయి నిలిచి వున్న ఆమెను చూచి భయపడినాతడు.
ప్రేలిపోయెందుకు సిద్దంగా వున్న మందు పాతరలా , దొర్లిపడే ముందు రవంత నిశ్చేతన్య స్థితిలో వున్న కొండకొన కొమ్మ మీది రాయిలా, ఒరిపిడి తగలగానే నెత్తి మీద పిడుగులు వర్షించే కారు మబ్బులా కన్పించిండామే.
ప్రొఫెసర్ శ్రద్దాదేవి రవంత సేపు అయాక నెమ్మదిగా రెప్పలు విప్పి అతని వంక నిర్లక్ష్యంగా చూసింది. అంతకు మునుపు అతడు చెప్పిన కధ విన్నప్పుడు ఆమె కనులలో కన్పించిన కరుణా తరంగిణులు అంతర్హితమయినాయి.
"నీవు అడగదల్చుకున్న దేమిటో చెప్పు. త్వరగా నేను వెళ్ళిపోవాలి." అన్నదామె. అతడు ధైర్యాన్ని సమీకరించుకున్నాడు. ఆమె ముఖ ముద్రలో తాను చూసిన గంభీర్యం మనోధైర్యాన్ని సడలిస్తూ వుండగా , కంపితమయేలా వున్న కంఠస్వరాన్ని అదుపు చేసుకుందుకు ప్రయత్నించాడు.
"తామ్రపత్రాలు నీవు చదువగలిగినావా? అర్ధమయినాయా?" అని ప్రశ్నించాడు. సమాధానం కోసం ఆశగా ఎదురు చూచినాడు.
కాని మనసు అనుమానిస్తూనే ఉంది. వంచించి ఒంటరిగా గదిలో బంధించినా అంత మనో నిబ్బరాన్ని , సడలని గాంభీర్యాన్ని చూపుతున్న ఆమె నించి తానా శించినది అంది రాకపోవచ్చునని మనసు సంశయగ్రస్త మవుతూనే ఉంది.
ఆ అవలక్షణలేమీ తనకు లేనట్లు నటించేందుకు ప్రయత్నించాడు. కాని విద్యావారాశి అయిన, అపూర్వ అనుభవశాలిని, ప్రత్యేకించి మనస్తత్వ శాస్త్రంలో నిష్ణాతురాలు అయిన ప్రొఫెసర్ శ్రద్దాదేవి ఎక్స్ రే దృష్టి నించి తప్పుకోలేపొయినాడతడు.
ఎదుటి వ్యక్తీ స్వార్ధం పట్ల మితిమీరిన దురాశ వల్ల బలహీనుడు అనే విషయాన్ని సునాయాసంగా గ్రహించింది ప్రొఫెసర్ శ్రద్దాదేవి.
"వాచాలుడా! నీవు ఉపాధ్యాయుడవు కాకపోయినా నాకు సోదరుడవే! ఆ సంగతి అలా ఉంచు.ఇప్పుడు నీవు మాట్లాడుతున్నది తామ్రపత్రాల గురించి కదా! అత్యాశ వల్ల వాటి గురించి తెలుసుకోవాలనుకుంటున్నావు మంచిదే!
కాని తామ్రపత్రాల గురించి చెప్పమని నీవు ఎవరిని అడుగుతున్నావో నీకు అర్ధం కాలేదు. ప్రొఫెసర్ శ్రద్దాదేవి ఒక సాధారణ ఉద్యోగిని, ఉపాధ్యాయుని అబల, ఆడది, కేవలం బెదిరింపులకు లొంగి పోయే అమాయకురాలు అనుకుంటున్నావు.
పొరబడినావోయి సోదరుడా!
తామ్రపత్రాలలో దాచవలసిన సంగతులేవి లేవు. అవి నేను చదివాను. నాకు అర్ధమయినాయి. అందు గురించి సవివరాలు నీకు పూర్తిగా చెప్పగలను.
కాని ముందుగా నీవు బిగించిన తలుపులు తెరవాలి. అంతకన్నా ముందు స్వార్ధంతో సంకుచితమైన నీ మనసు వాకిళ్ళు తెరలు విశాలం చేసుకోవాలి.
గొప్పవారి దగ్గర అతి పవిత్రమూ, రహస్యమూ అయిన అంశాల గురించి మాట్లాడేప్పుడు ఎలా వుండాలో నీకింకా తెలియలేదు. ముందు వెళ్ళి తలుపులు తెరచి కూర్చుందుకు నాకేదయినా సౌకర్యం చూడు.
సావధానంగా నేను అన్ని విషయాలు చెప్తాను." అన్నదామె. ఆ మాటలలో రవంత అయినా జడుపు లేదు. గంభీర్యమే రూపెత్తినట్లుగా వున్నదా కంఠస్వరం.
నా మాటలను నీవు ఎదిరించలేవు అన్న పరిపూర్ణమయిన ఆత్మ విశ్వాసం నిండారిన ధోరణి అది. దానికి లొంగిపొయినాడతడు.
రవంత సేపు అలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు. వెంటనే వెళ్ళి తలుపులు తెరచి తిరిగి వచ్చాడు.
"కూర్చుందుకు నాకేదయినా అమర్చగలవా?" అని అడిగిందామె. అతడు ప్రక్క గదిలోకి వెళ్ళి ఒక మోదా తీసుకువచ్చాడు. దాని మీద కూర్చుంది ప్రొఫెసర్ శ్రద్దాదేవి.
"సోదరుడా! నీవు చాలా మంచి వాడవోయి! వాస్తవం చెప్పాలంటే ప్రొఫెసర్ శ్రద్దాదేవిని వంచించగల శక్తి సంపన్నుడవు కూడా కాదు. నేను చెప్పనున్నది చాలా ముఖ్య మయిన సంగతి.
నీవు మనసంతా పెట్టి వింటేనే గ్రహించగలుగుతావు. అందు నించి మిగిలిన విషయాలన్నీ మరచిపో! నీకు విశ్వాసపాత్రురాలను. నీ సోదరిని అన్న విషయాన్ని మరవకు" అన్నదామె.
అతడు శ్రద్దాసక్తులతో తానశించినది లభించనున్నదన్న ఆనందంతో ఆమె వంక ఏకాగ్రంగా చూడసాగాడు.
శ్రద్దాదేవి కన్నులు అతని మనసులోకి గ్రుచ్చి చూస్తున్నాయి. ఆమె నేత్రాలు తేజోపూర్ణమయినాయి. అవి క్రమంగా శక్తి వంతమయిన సమ్మోహనంగా మారినాయి.
అతడు తన చూపులను మరల్చుకోలేని స్థితికి వచ్చాడని గ్రహించింది ప్రొఫెసర్ శ్రద్దాదేవి.
"బ్రదర్! నీకిప్పుడు బయటి సంగతులేవీ జ్ఞాపకం లేవు. నీ మనసు ప్రశాంతంగా ఏకాగ్రంగా అయిపొయింది. నేను తప్ప నీకు మరేమీ కన్పించట్లేదు. నా మాటలు తప్ప నీకు మరేదీ విన్పించటల్లేదు. అవునా!" అన్నదామె అలాగే చూస్తూ.
"అవును" అన్నాడు యాంత్రికంగా.
"ఇప్పుడు నీవు నీ మనసు పొరల్లోకి దిగిపోతున్నావు. నేను తప్ప నీకు మరేదీ కన్పించట్లెదు. నా మాటలు తప్ప నీకు మరేదీ విన్పించటల్లేదు. నీ మనసు ఏకాగ్రంగా అయిపొయింది. నామాటలు ఒక్కటే నీకు విన్పిస్తున్నాయి, నీ మనసు నాకు స్వాధీనమయింది. నేను ఏది చెప్పినా అది చేయాలని నీవు అనుకుంటున్నావు. మనస్పూర్తిగా అనుకుంటున్నావు.
అంతకు మించి నీకు మరే ఆలోచనలూ లేవు. నీ మనసు నాకు స్వాధీనమయిపోయింది. అవునా" అన్నదామె నెమ్మది అయిన స్వరాన. అతడు అవునని తల ఊగించాడు.
