Previous Page Next Page 
బ్లాక్ టైగర్ పేజి 42

 

    ఇప్పుడు సాధించాను" అందామె గర్వంగా!
    "నేను చదివి నేలకు కొట్టిందాన్ని తీసుకోవటం గొప్ప కాదు ------"
    "చింపకుండా పారేయటం మీదే పొరపాటు. ఎలాగైతేనేం సాధించాను. మీకు అర్ధమయిందేమిటో నాకు అర్ధం కాకుండా ఉంటుందా ?"
    "అర్ధమాయెందుకు ఏముంది దాన్లో?"
    "లక్ష రూపాయలు సంపాదించేందుకు దారి వుంది."
    "అదేమిటో అర్ధమయిందా?"
    "మీరు ఒక షరతు కి ఒప్పుకుంటే చెప్తాను "
    "మీ షరతులకి నేనెందుకు ఒప్పుకోవాలి ---?" ముందుకి నడిచాడు.
    "తెలివి లేని సాహసం మూర్ఖత్వమవుతుంది. మీకు తెలివి తేటలు, సాహసం రెండూ వున్నాయి. మీరు సాధించగలరు " ఆమె విడిచి పెట్టలేదు అతను ఎంత వేగంగా నడుస్తున్నాడో అంత వేగంగా అనుసరిస్తోంది.
    "నాకు కావలసింది పొగడ్తలు కాదు. లక్ష్యాన్ని చేరుకోవటం."
    "ఇద్దరమూ కలసి ప్రయత్నం చేస్తే చేరుకోనగలమనుకుంటాను"
    "అంటే మీ అభిప్రాయం?" ఆగిపోయాడు జయసింహ!
    "ఎక్కడయినా నింపాదిగా కూర్చుని మాట్లాడుకుందాం. మీకు నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను."
    "మీరు యిప్పటికే డాక్టర్ దగ్గరకు వెళ్ళి కట్టు కట్టించుకావలసింది అది మానేసి ఇలా నా వెంట పడటం ఏమీ బాగోలేదు."
    "మీ రుమాలు కట్టాక రక్తం కారటం ఆగిపోయింది "
    "ఇలా ఊరుకోవటం చాలా ప్రమాదం!- సెప్టిక్ అవుతుందేమో !"
    "ప్రమాదాల్ని ఎదుర్కొనేందుకు సిద్దపడే కదా పోటీలోకి వచ్చాం":
    "ముందు మీరు డాక్టర్ని చూడాలి! ఆ తరువాతే మీతో మాట్లాడుతాను."
    "మన మధ్య ఎలాంటి పరిచయం లేకపోయినా నా మీద అభిమానం చూపుతున్నారు. థాంక్స్! వెడదాం పదండి" అందామె.
    ఆమెను వెంట పెట్టుకుని డిస్పెసరీ కి వచ్చాడు జయసింహ. డిస్పేన్సరీ నించి వెళ్ళిపోయెందుకు సిద్దమవుతూ నర్సు కి జాగ్రత్తలు చెపుతున్నాడు డాక్టర్! ఆమె అదోకలా చూస్తోంది డాక్టర్ వంక. ఆకలి చాపులు!
    ఇంటికి వెళ్ళాలని తొందరెందుకు అని అతనికి అనిపించేలా చేయాలని ప్రయత్నిస్తోంది. డాక్టర్ వెళ్ళిపోతే రోగుల మధ్య ఒంటరి!
    వాకిలి దగ్గర అడుగుల చప్పుడు అపటంతో ఇద్దరూ తలలు త్రిప్పి చూశారు.
    కొందరు డాక్టర్లుకి అద్భుతమయిన ప్రతిభ ఉంటుంది. రోగులు దృష్టి పరిధిలోకి వచ్చింది మొదలు దగ్గరకు వచ్చి కూర్చునేలోగా ఆ రోగి వివరాలు కొన్ని తెలుసుకోగలుగుతారు.
    నడిచే పద్దతి ముఖ ముద్రల తీరు కంటి చూపు వీటిని బట్టి ఊహిస్తారు.  
    వారు దగ్గరగా వస్తున్నప్పుడు యిద్దరినీ పరిశీలించాడు డాక్టర్.
    "చేతికి గాయం ఎందుకయింది?" అని అడిగాడు వారు చెప్పకుండానే!
    "బ్లాక్ ఫాంధర్ పంజాతో కొట్టింది.
    "ఓ! బోనులో చేయి పెట్టారన్న మాట. అలాంటివి చేయకూడదు. వాటి గోళ్ళలో విషం ఉండే అవకాశాలు ఎక్కువ! సెప్టిక్ అయ్యేందుకు నూటికి నూరు శాతం వీలుంది. ఎంత సేపయింది "
    "ఆరగంట లోపే! ఇరవై అయిదు నిమిషాలు కావచ్చు"
    "ఇంత ఆలస్యం కూడా చేయకూడదు. నర్స్! యాంటిసెప్టిక్ ఇంజెక్షన్ యివ్వు. డ్రెస్సింగ్ రెడీ చేయి! ఇంకా రక్తం కారుతోండా" తనే స్వయంగా కట్టు విప్పి చూశాడు.
    ఒకే ఒక్క గోరు . ముంజేతి మీద చీరుకుపోయి వుంది. సున్నితమయిన చర్మం. గాయం చుట్టూ ఎర్రగా కందిపోయింది.
    నర్స్ ఇంజెక్షన్ యిచ్చింది. డ్రెస్సింగ్ చేసేందుకు ఆమెను వెంట పెట్టుకుని తీసుకుపోయింది.
    "ఇలాంటివి జరగటం ఒక్కొక్కసారి చాల ప్రమాదానికి దారి తీస్తుంది. జాగ్రత్తగా ఉండాలని వారితో చెప్పండి!" డాక్టర్ లేచి వెళ్ళిపోయాడు. అయిదు నిమిషాల అనంతరం ఆ యిద్దరూ తిరిగి వచ్చారు.
    "ఇంక మీకెలాంటి భయం లేదు" అంది నర్స్ నవ్వుతూ!
    "థాంక్స్! మీ మేలు మర్చిపోలేం" వెళ్ళేందుకు సిద్దమయ్యారు.
    "మేలు అంటారేమిటి? అది మా ధర్మం. మా వృత్తి!"
    "వృత్తిని గౌరవించి ప్రజలకు సేవ చేసేవాళ్ళు ఈ కాలంలో ఎందరున్నారు. థాంక్స్ అండీ! వస్తాం" ఆమె కూడా అతని వెంట వెళ్ళేందుకు ఉద్యుక్తురాలయింది.
    "సారీ! ఓ నిముషం ఆగండి. బిల్లు చెల్లించారా?" అడిగింది నర్స్.
    ఇద్దరూ పాతిన మేకుల్లా నిలిచిపోయారు. ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఎవరి దగ్గరా డబ్బు లేదు.
    "బిల్లు గురించి అడుగుతున్నారు" అన్నాడు జయసింహ. ఆ అమ్మాయి ఉలికిపడి చూసింది కళ్ళు వెడల్పు అయ్యాయి.
    "బిల్లా / బిల్లు ------ అడుగుతారనుకోలేదు" అందా అమ్మాయి.
    "ఇది ప్రవేట్ నర్సింగ్ హోం . బయట బోర్డు కూడా ఉంది చూడలేదా? వైద్యం చేయించుకుని థాంక్స్ చెప్పి వెళ్ళిపోతే ఎలా?"
    "సారీ అండీ! ఇలా అనుకోలేదు " నర్సుతో చెప్పిందా అమ్మాయి. "మీ దగ్గరుంటే యిచ్చేయండి. బయటకు పోయాక మీ ఋణం తీర్చుకుంటాను" అందామె నర్సు కి విన్పించకుండా!
    "నా దగ్గర డబ్బు లేదు " రహస్యంగా చెప్పి పైకి నవ్వేశాడు జయసింహ.
    "అదేమిటండి! బిల్లు గురించి అడిగితే నవ్వుతారేమిటి?" కొంచెం సీరియస్ గానే అడిగింది సిస్టర్.
    కట్టుకట్టించుకున్న అమ్మాయి అప్రతిభురాలాయి పోయింది.
    "మీరు యిక్కడే ఉండండి. నేను వెళ్ళి డబ్బు తెచ్చి యిస్తాను." అన్నాడు నర్సుకి విన్పించేలా! తప్పని సరి అయి ఆమె తల ఊగించింది.
    బ్రతుకు జీవుడా అనుకుంటూ బయటకు వచ్చాడు. గేటు వరకూ వచ్చాక వెనుక నించి కేక విన్పించింది.
    వెనుదిరిగి చూచాడు. తన వెంట వచ్చిన ఆమె డాక్టరు గది బయట వరండాలో నిలబడి ఉంది. నర్సు దగ్గరగా వచ్చింది.
    "మీరు నిజంగా డబ్బుతో తిరిగి వస్తారా?" అని అడిగింది.
    'అటువంటి అనుమానం మీకెందుకొచ్చింది?"
    "బిల్లు ఎంత అని మీరు అడగలేదు కదా!"
    "పోనీ ఇప్పుడు చెప్పండి "
    "కన్సల్టింగ్ ఇరవై రూపాయలు, ఇంజెక్షన్ అయిదు రూపాయలు, చేసినందుకు అయిదు డ్రెస్సింగ్ పది. మొత్తం నలభై రూపాయలు" అంటూ బదులు చెప్పింది నర్సు.
    "ఓస్! ఇంతేనా? కేవలం నలభై రూపాయలేనా? ఏ వందో రెండోందలో ఉంటుందనుకున్నాను" అన్నాడు జయసింహ తేలిగ్గా!
    "పోనీ వంద రూపాయలు ఇవ్వండి. తీసుకుంటాను" అంది నర్స్ నవ్వుతూ!
    'అలాగే! వంద కాదు. రెండొంద లిస్తాను. మీరు మరొక సాయం చెయ్యాలి" అన్నాడు జయసింహ. ఆమె ముఖం వికసించింది మందరంలా!
    "ఏం చెయ్యాలో చెప్పండి. ఆవిడ మీకేమవుతారు?"
    "బంధుత్వం గురించి ఎందుకులెండి! అదంతా ఓ విషాద గాధ ! కాని మీతో చెప్తాను. ఆమెకు ఈ మధ్యనే మతి చలించింది."
    'అయ్యో పాపం! ఈ వయసులో అలా జరగటం దురదృష్టమే!"
    "నేను వెళ్ళి పోయాక తను కూడా వెళ్ళిపోతానంటూ మారాం చేస్తుంది"
    "ఆ పప్పులు నా దగ్గరేమీ ఉడకవు. అంగుళం కూడా కదలనివ్వను."
    'అంతా మీదే భారం! ఎలా చూసుకుంటారో?" అంటూ మరో క్షణం నిలువకుండా ముందుకు సాగాడు.
    రోడ్డు మీదికి వచ్చాక హాయిగా అన్పించింది. కష్టపడి తను సాధించుకున్న క్లూ దొంగచాటుగా పొంచి ఉండి తెలుసుకోగలిగింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS