Previous Page Next Page 
ఇదీ కధ! పేజి 42

 

                                                           23

    "మెంటల్ హాస్పిటల్ కు వస్తావా?"
    "పిచ్చాసుపత్రికా బాబు"
    "అవును పిచ్చాసుపత్రికే?"
    "మళ్ళీ వస్తారా?"
    "లేక అక్కడే ఉండి పోతాననుకున్నావా?" అప్సర హోటల్ ముందు నిలబడి రిక్షా బేరమాడుతూ చిరాకుపడి పోయాడు సాగర్.
    "కోప్పడేస్తున్నారెంటి బాబయ్యా! ఒక్కో మారాజు, రానూ బోనూ రిచ్చా మాట్లాడు కొంటారు. అందుకని అడిగాను బాబయ్యా!" అన్నాడు రిక్షా అప్పన్న.
    'అక్కడ ఆలస్యం అయితే? అంతవరకూ ఉంటావా మరి?" సాగర్ అడిగాడు.
    'ఆడంత ఆలశ్యం లేదు బాబయ్య"
    "నీ కేలా తెలుసు? నేనెంత సేపు అక్కడ వుంటానో?" కళ్ళు చిట్లించి రిక్షా వాడి కేసి చూశాడు.
    "ఎన్నేళ్ళ గానో చూస్తున్నా బాబు! పాపం ఎంతో మంది అన్నలు,అక్కలు తల్లులు తండ్రులు భార్యలు భర్తలూ, వాళ్ళ వాళ్ళను చూడాలని ఆశగా వస్తారు. ఆ పిచ్చాసుపత్రిలోకి వెళ్ళి అయిన వాళ్ళను చూస్తుంటే అళ్ళా గుండెలు చేరువై పోతాయోమో బాబు పావుగంట అయ్యే సరికి వచ్చి రిక్షాలో కూర్చుంటారు! అప్పుడాళ్ళ మొఖాలు చూస్తుంటే మాకే ఏంతో బాధ కలుగుద్ది బాబు! తమాషా చుట్టానికి కేల్తారు చూడండి అల్లు మాత్రం సాయంకాలం వరకు ఆ పిచ్చాళ్ళ తమషాలన్నీ చూస్తూ ఆసుపత్రిలోనే తిరుగుతూ ఉంటారు. ఇంతకీ బాబు తమరు ఆసుపత్రి చూట్టానికి వెళుతున్నారా? లేక తమరోరు ఎవరయినా అక్కడ.....' రిక్షా అప్పన్న ప్రశ్నార్ధకంగా నోరు వెళ్ళబెట్టి సాగర్ కేసి చూశాడు.
    సాగర్ బుర్ర అన్నంలా ఉడికిపోయింది.
    మాధవిని ఏ స్థితిలో చూడాల్సి ఉంటుందో! అసలు తనను గుర్తు పడ్తుందా? ఆ పిచ్చి వాళ్ళతో కలసి పిచ్చి పిచ్చి పనులు చేస్తూ వెర్రిగా జుట్టు పీక్కుంటూ తన కళ్ళముందు ఎదురయ్యే మాధవిని ఊహించుకుంటూ సాగర్ మిన్ను పట్టిపోయాడు.
    "బాబూ ఎక్కండి రిచ్చా. ఎత్తియ్యాలి. తోసుకు తోసుక పోవాలి. కష్టం చూసి ఇవ్వండి బాబు!' రిక్షా అప్పన్న రిక్షా సీటు తుడుస్తూ అన్నాడు.
    సాగర్ రిక్షా ఎక్కి మౌనంగా కూర్చున్నాడు.
    అప్పన్న పది గజాలు రిక్షా తోసి ఎగిరి , రిక్షా తోక్కసాగాడు. రిక్షా సాగిపోతుంటే సాగర్ కళ్ళముందు పిచ్చాసుపత్రి దృశ్యాలు తిరగసాగాయి. అంతవరకూ తను పిచ్చాసుపత్రి చూడలేదు. అయినా తన కళ్ళముందుయీ దృశ్యాలేమిటి అవన్నీ తను సినిమాలో చూసిన దృశ్యాలు! పుస్తకాల్లో చదివిన పిచ్చాసుపత్రి వర్ణనలు. ఆ మాటకొస్తే పిచ్చివాళ్ళనే సరిగా చూడలేదు. పిచ్చివాళ్ళను చూడక పోవడమేమిటి? మాధవి......మాధవి పిచ్చిదా? పిచ్చిది కాకపొతే పిచ్చాసుపత్రిలో ఎందుకు చేరుస్తారు? ఓ మైగాడ్? మాధవికి పిచ్చి ముదరడానికి తనే కారకుడా సైక్రియాటిస్ట్ తో పరీక్ష చేయించాడు. ఎన్నో టెస్ట్స్ జరిపించాడు. తనకున్న మానసిక స్థితి అర్ధం చేసుకోవడానికి ఏంతో కృషి చేశాడు. డాక్టర్ మూర్తి, ప్రషర్ కుక్కర్ .....వంటవాడూ.....సునీతా, తల్లి తండ్రుల హత్యా......వీటన్నింటికీ అర్ధం లేదా పిచ్చిదాన్ని ప్రలాపనా లేనా? తల్లికి కేన్సర్ అని మూర్తి నిర్ణయం ,కాదని మరో డాక్టర్ నిర్ణయం. సుజాతతో తన పెళ్ళి, మాధవితో ప్రేమ.
    'బాబూ! ఆరు తమకేమవుతారూ?" అప్పన్న ప్రశ్న.
    సాగర్ త్రుళ్ళి పడ్డాడు.
    "ఎవరూ?"
    "అరే బాబు! ఇప్పుడు పిచ్చాసుపత్రిలో ఉన్నారే వారు!"
    "నాకేమీ కారు?" అనాలోచితంగా అనేశాడు అప్పన్న ఆశ్చర్యంగా తిరిగి చూశాడు.
    "కాదు! నాకు చాలా ముఖ్యమైన వాళ్ళు. నాక్కావాల్సిన వాళ్ళు."
    "బంధువులా?"
    అప్పన్న రిక్షా మీద లేచి తొక్కుతున్నాడు.
    'అంతకంటే ఎక్కువ! నువ్వు త్వరగా పోనీయ్" అప్పన్న వెనక్కు తిరిగి సాగర్ ను ఎగాదిగా చూసి తల ఎగరేసి రిక్షా జోరుగా తొక్కసాగాడు.
    మరో అర్ధగంటలో రిక్షా పిచ్చాసుపత్రి గేటు ముందు కొచ్చి ఆగింది. సాగర్ రాతి బొమ్మలా అలాగే కూర్చున్నాడు.
    'బాబూ."
    'ఊ"
    "వచ్చేశాం దిగండి మరి"
    "సాగర్ కాళ్ళు కదలలేదు." అతి ప్రయత్నం మీద దిగాడు.
    "బాబు! త్వరగా వచ్చేస్తారుగా!"
    సాగర్ అడుగు వెనక్కు వేసి అప్పన్న కేసి చూశాడు! వాడి ఉద్దేశ్యం ఏమిటి? మాధవిని చూస్తూ తను ఆసుపత్రిలో ఎక్కువ సేపు ఉండలేడనా? ఐదు రూపాయల నోటు తీసి రిక్షా వాడి చేతిలో పెట్టబోయాడు.
    'ఉంచండి బాబు! తమరు తిరిగొచ్చే దాకా ఉంటాను. నేను ఎంతసేపయినా ఆగుతా బాబు? కానీ మీరు అక్కడ ఎక్కువ సేపు ఉండటము మంచిది కాదని చెప్పాను అంతే బాబు."
    వీడొక సైకాలజిస్టులా వున్నాడు! సాగర్ రిక్షావాడి కేసి చురచురా చూశాడు.
    "అనుభవం మీద చెప్తున్నా బాబు! మీరేమీ అనుకోవద్దు. నా కూతురు అప్పలమ్మ ఇక్కడే పోయింది"
    "ఏమిటి? నీ కూతురు యీ పిచ్చాసుపత్రిలో చచ్చిపోయిందా!" సాగర్ కళ్ళప్పగించి అప్పన్న కేసి చూడసాగాడు.
    'అవును బాబు దానికి పదహారేళ్ళప్పుడు బస్తీ గుంటడొకడు మా ఊళ్ళో నుంచి లేవదీసు కెళ్ళాడు...."
    "ఇప్పుడా సంగతి వదిలేయ్, తిరిగి వెళ్ళేటప్పుడు చెబుదువు గానీ , నువ్విక్కడుండు , నేను వెళ్ళి వస్తాను " సాగర్ కు అప్పటికే గుండెలు జారి ఉన్నాయి. ఇంకా రిక్షా వాడు చెప్పేది వినడానికి సిద్దంగా లేడు        "బాబూ వట్టి చేతులతో వెళ్తారా"
    "అంటే?"
    అడిగాడు సాగర్.
    "ఇక్కడ వాళ్ళను చూడటానికి వచ్చేవాళ్ళు తినడానికి ఏదన్నా తీసుకేళతారు. మనం ఇచ్చేది మనవాళ్ళు తింటారని కాదు. మనం మన మనిషి చేతిలో పెట్టి రాగానే హాస్పిటల్ ఆయాలు , పనివాళ్ళు లాగేసుకుంటారు. వాళ్ళే తినేస్తారు."
    "మరయితే మనం తీసుకెళ్ళినా ఉపయోగమేముంది? మనవాళ్ళకు అందనప్పుడు."
    "మనమేమీ తీసుకెళ్ళ కుండా వట్టి చేతులతో వెళ్తే హాస్పిటల్ పనివారు మనవాళ్ళని కొడతారు."
    సాగర్ కళ్ళముందు మాధవిని ఆయాలు చుట్టుముట్టి కొడుతున్న దృశ్యం కదిలింది.
    'అందుకే బాబు! నా కూతురు నేను వెళ్ళినప్పుడల్లా "అయ్యా నాకేం తెచ్చావ్' అని అడిగేది. ఆయమ్మలు పక్కన నిలబడి అడిగించేవారు బాబు!"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS