Previous Page Next Page 
ది పార్టనర్ పేజి 42

 

    కాకపోతే బిచ్చగాళ్ళు మాత్రం ఎక్కడానికి అవకాశం వుంది.
    అందువల్లనే ఆ పీపాను ఎప్పుడు ఎక్కడ ఎక్కించిందీ తెలియడం లేదు.
    విజయవాడ రైల్వే పోలీస్ స్టేషన్ లో అడుగుపెట్టిన వెంటనే వైజాగ్ నుంచి ఇన్ స్పెక్టర్ కిరణ్ చేసిన కాల్ ను అందుకున్నది ధీరజ.
    విషయం ఏమీ చెప్పకుండానే ఆమెను అర్జెంటుగా బయలు దేరి రమ్మని ఇన్ స్పెక్టర్ చెప్పాడు.
    తను విజయవాడ వచ్చి పన్నెండు గంటలు కూడా కాకపోయినా యెంతో అవసరం అయితే తప్ప తనను రమ్మని అనవసరంగా ట్రబుల్ ఇవ్వడని తెలుసు.
    అందుకే, అది బహుశా తన కేసుకు సంబంధించిన విషయమే అయి వుంటుందని తిరిగి వైజాగ్ ప్రయాణం అయింది లేడీ ఇన్ స్పెక్టర్ ధీరజ.


                                                              *    *    *

    పాసింజరు ట్రైయిన్ నర్శింగ్ పల్లి స్టేషన్ లో ఆగింది.
    ధీరజ ఆ స్టేషన్ లో దిగి ఉత్తర కాబిన్ వరకూ కాలినడకన వెళ్ళీ వచ్చింది. తిరిగి స్టేషన్ లోకి వచ్చి ప్లాట్ ఫారాల పై వున్నా బిచ్చగాళ్ళ ను దగ్గిరకు పిలిచి జేబులో నుంచి నాలుగు నోట్లు తీసింది!
    "చూడండి..... నేను అడిగిన విషయం కరెక్ట్ గా చెప్పారంటే మీకు ఈ డబ్బు పంచుతాను."
    ధీరజ ఆశ చూపింది.
    బిచ్చగాళ్ళు అందరూ ఆత్రంగా ఆమె వైపు చూశారు.
    "కొన్ని రోజుల క్రితం పెద్ద డ్రమ్మును ఒకతను తెచ్చి యిక్కడ రాత్రిపూట విజయవాడ వెళ్ళే పాసింజరు రైలులో ఎక్కించాడు. అప్పుడు అతనిని మీలో ఎవరయినా చూశారా?"
    ఒక క్షణం చెప్పడం ఆపి వాళ్ళ ముఖాల వైపు పరిశీలనగా చూసింది.
    ఎవరి నుంచీ సరియైన సమాధానం రాలేదు.
    "మేమంతా ఈ రెండు మూడు రోజుల నుండే యిక్కడ వుంటున్నాము. మీరు అడిగే పీపా ఏమిటో మాకు తెలియదు" అన్నాడు ఒకడు.
    "ఒరే .....సూరి గాడిని అడిగితే" అన్నాడు ఇంకొకడు.
    "ఎవరు ఆ సూరిగాడు" ధీరజ టక్కున ప్రశ్నించింది.
    "మేము వచ్చేసరికే పదిరోజుల నుండి ఈ ప్లాట్ ఫారం మీద వున్నాడు ఆడు..... ఇంతకూ ముందే టీ తాగి రావడానికి వెళ్ళాడు. బహుశా మీరు చెప్పే విషయం ఆడికి తెలిసి వుండవచ్చు....." అని అంటున్నంతలోనే ఆ సూరిగాడు రానే వచ్చాడు.
    "అదిగో అదేనండీ"
    ధీరజ అతని వేపు విస్మయంగా చూసింది.
    అతను కూడా కానిస్టేబుల్ వీరాచారి.
    బిచ్చగాడి గెటప్ లో వున్నాడు.
    ఆమెను చూసి సెల్యూట్ బెట్టబోయి తన ఉనికి బయట పడిపోతుందన్నట్టు ఎత్తిన చేతిని గమ్మున దించేశాడు.
    ధీరజ తృప్తిగా నిట్టూర్చింది.
    తను నియమించిన వీరాచారి డిటెక్టివ్ పనిలో నిమగ్నమై పోయినట్టు నిర్ధరించుకున్నది ధీరజ.
    ఆమె ఎందుకు వచ్చిందో గడగడ చెప్పారు వాళ్ళు.
    సూరిగాడు ఒక నిముషం అలోచించి తల వూపాడు.
    "అవునమ్మా ------మీరు చెబుతుంటే ఇప్పుడే గుర్తు వచ్చింది ----పెద్ద డ్రమ్ము ను ఒక వ్యక్తీ రిక్షాలో వేసుకోచ్చినట్టు పోలయ్య నాతొ చెప్పాడు....."
    "నిజమా" ధీరజ ఆశ్చర్యపోతూ ప్రశ్నించింది.
    "అవునమ్మా ----అతనిని రిక్షా పోలయ్య చూశాడు. డ్రమ్ము ఎక్కించి అయన వెళ్ళిపోగానే , ఆ రిక్షా వాడు తనతో మాట్లాడినట్టు కూడా చెప్పాడు.... కావాలంటే అతన్నే అడగవచ్చు మీరు" అన్నాడతను నమ్మకంగా.
    సూరిగాడి గెటప్ లో వున్న వీరాచారి మాటలు విన్న ధీరజ తల తిరిగి పోయింది.
    రైల్వే ట్రాక్ ప్రక్కనే రిక్షా ఆగి వుందని.....అది ఇంజన్ అమర్చిన రిక్షా అనీ.....లోపల లావాటి పీపా వుండడంతో ఏమిటా అది.....అక్కడ ఎందుకు ఆగి వుందా అని అనుమానంగా చూసినట్టు పోలయ్యే సూరిగాడితో చెప్పాడు.....
    స్టేషన్ బయట వున్నా రిక్షా తొక్కే వాళ్ళలో ఒక ముసలాయన్ను చూపించాడు సూరిగాడు.
    "నువ్వెలా పోలయ్య అంటే....."
    "అవునమ్మా....."
    "మొన్న ఒకటవ తేదీన ఒకతను రిక్షాలో పీపాను మోసుకు వచ్చి ఇక్కడ ఎక్కించాడు. అతనితో పాటు వచ్చిన రిక్షా వాడితో నువ్వు మట్టాడినట్టు తెలిసింది -----ఎవరతను .....ఎక్కడ ఉంటాడు ?"
    చెప్పడానికి సందేహిస్తూ నిలబడిపోయాడు పోలయ్య.
    ఏం చేద్దామన్నట్టు సూరిగాడి వైపు చూశాడు.
    "ఫరవాలేదు పోలయ్యా......నీకు తెలిసింది చెప్పు......ఏం ఫరవాలేదు . నేను ఉన్నానుగా" అంటూ నచ్చచెప్పాడు సూరిగాడు.
    వీరాచారి అక్కడకు చేరినప్పటి నుండి రిక్షా వాళ్ళ నందరినీ మంచి చేసుకున్నాడు. వాళ్ళ బలహీనతలను కాచ్ చేసి గంజాయి ను వాళ్ళకు రుచి చూపించి --------తనకు కావలసిన ఇన్ ఫర్ మేషను సంపాదించాడు.
    అందుకే అతను అక్కడ అందరికీ ఒక పెద్ద దిక్కుగా వుండి పోయాడు----
    సూరిగాడు ఇచ్చిన అభయంతో రిక్షా పోలయ్య నోరు విప్పి చెప్పాడు.
    "ఆ రిక్షా వేసింది వెంకటేశ్వరులు .....విశాఖ పట్టణం నుంచి మోటార్ రిక్షాలో వాడు ఏదో పీపాను తెచ్చాడు. ఎందుకో తెచ్చాడో నాకు అర్ధం కాలేదు కానీ ఇక్కడకు వచ్చాక ఒకతను వచ్చి వెంకటేశ్వరులతో ఏదో మాట్లాడాడు. ఆళ్లిద్దరూ కలిసి ఆ పీపాను పాసింజరులో ఎక్కించారు. తరువాత అతను వెళ్ళిపోయాక ఆ రిక్షా వెంకటేశ్వరులు నా దగ్గిరకు వచ్చాడు-----"    
    'అతను వైజాగ్ నుండే వచ్చాడని నీకు అంత ఖచ్చితంగా తెలుసా?"
    ధీరజ అనుమానంగా ప్రశ్నించింది.
    "తెలుసమ్మా.... వాడు వుండేది విశాఖ పట్టణమే ....అక్కడ నుండే ఆ పీపాను రిక్షాలో తెచ్చాడు , మోటారు వుంది కాబట్టి బాడుగకు వప్పుకున్నాడు. తనతో పాటు వచ్చిన అయన కూడా వైజాగే నని చెప్పాడు అన్నాడతను.
    అతని సమాధానం విన్న ధీరజకు అంతా అయోమయంగా వున్నట్టు తోచింది.
    చేతిలోని నోట్లను వాళ్ళకు పంచి ఇవ్వమని సూరిగాడికి ఇచ్చింది ధీరజ.
    వైజాగ్ లోనే సీతాపతి హత్య చేసి రిక్షాలో నరసింగపల్లి వరకూ తేవడం అంటే మాటలు కాదు. యెంతో తెలివితేటలూ వున్నవాళ్ళు అయితేనే అలా చేయగలుగుతారు.
    "ఆ వెంకటేశ్వరులు యెక్కడ వుంటాడో నీకు తెలుసా?"
    "తెలుసమ్మా.....నేనూ చాలా కాలం వైజాగ్ లోనే వున్నాను. అందుకే వాడు నాకు తెలుసు.....గాజువాక రిక్షా స్టాండ్ లో వెంకటేశ్వరులు అంటే తెలియని వాళ్ళూ ఎవరూ వుండరు." అని చెప్పాడు పోలయ్య.
    వెంటనే విశాఖ వెళ్ళడానికి నరసింగపల్లి బస్ స్టాండ్ వైపు దారి తీసింది ధీరజ.
    ఇన్ స్పెక్టర్ కిరణ్ తనను వెంటనే బయలుదేరి రమన్న కారణం ఏమిటో నని అప్పుడు అనుమానం కలిగింది ఆమెకు....
    ఆ ఆలోచనలోతోటే ధీరజ బస్ స్టాండ్ కు చేరుకున్నది.
    ఇంకో రెండు నిమిషాల తరువాత తనను ఎవరూ గమనించకుండా వెళ్ళి బస్ స్టాండ్ లో వున్న ధీరజను కలుసుకున్నాడు హెడ్ కానిస్టేబుల్ వీరాచారి.....


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS