Previous Page Next Page 
కె. ఆర్. కె మోహన్ కథలు పేజి 42


    అప్పటికి రాత్రి సుమారు ఒంటిగంట అయింది. తెల్లవారి ఐదు గంటలకి గానీ తమ వ్యాన్ కారు రావు. అప్పటివరకు ఆ చలిలో వణుకుతూ అందరూ రోడ్ ప్రక్కన కూర్చున్నారు. తెల్లవారుతుండగా వాహనాలు వచ్చాక అందరూ బ్రతుకు జీవుడా.. .అంటూ కొంపలకు చేరుకున్నారు.

 
    రజాక్ అంటే గిట్టనివాళ్లు ఆ డిపార్ట్ మెంట్ లో చాలామందే వున్నారు. అలాంటివారు ఆ బంగళాకి వచ్చినవారిలోనూ వున్నారు. వాళ్లు వెంటనే  ఆలస్యం చేయకుండా ఇటువంటి సంచలన విషయాలను ప్రచురించే 'గబ్బు పత్రిక' అనే ఎల్లో జర్నలిజం పత్రికకు ఈ ఉప్పును సవివరంగా అందించారు. వెంటనే ఆ పత్రిక తాటికాయంత హెడ్ లైన్లతో ప్రత్యేక సంచికను విడుదల చేసింది.


    అసలే అవమానభారంతో కృంగిపోతున్న ఆఫీసర్ లకు ఆ పత్రిక చిలవలు - పలవలుగా ప్రచురించిన ఈ వార్త పుండుమీద కారం రాసినట్లయింది. కపూర్ గారయితే ఇన్ స్పెక్షన్ చేయకుండానే నెక్ స్ట్ ట్రెయిన్ కి హెడ్ క్వార్టర్స్ కి వెళ్ళిపోయారు. 'మొగుడు  కొట్టినందుకు కాదు - తోటికోడలు  నవ్వినందుకు ఎక్కువ బాధ..."అన్నట్లు - జరిగిన  అవమానం కంటే పత్రికలో పడి నలుగురూ నవ్వుకోవడం మరింత బాధ అయింది వాళ్ళకి.

    
     కపూర్ గారి అవమానం ఆగ్రహంగా  మారింది.  అర్దాంతరంగా వెళ్లేముందు అంతటి అవమానానికి కారకుడైన రజాక్ పై'డిసిప్లినరీ యాక్షన్' తీసుకోమనీ, ఆ ఊరినుంచి బదిలీ చేయమనీ ఆర్డర్ వేసి మరీ వెళ్లారు. కొందరు ఆఫీసర్ లు ముఖం చెల్లక సెలవులు పెట్టేశారు. మరికొందరు బదిలీ చేయించుకున్నారు.

 
    అంతవరకూ  రజాక్ చేత అడ్డమైన సేవలూ చేయించుకున్న ఆఫీసర్లే ఇప్పుడు శత్రువులయ్యారు. తలాతోకా లేని ఛార్జీలు ఫ్రేం చేసి ఛార్జిషీట్ ఇచ్చారు 'అతను ఎప్పుడూ  సీట్లో వుండడం... , పని పెండింగ్ లో వుంచుతాడట!'... ఇవీ చార్జిలలో కొన్ని. మొత్తం మీద  ఆ వంకా, ఈ వంకా పెట్టి ఆ వూరినుంచి  బదిలీ చేశారు.

 
    ఇదంతా చూసేసరికి రజాక్ మనసు  విరిగిపోయింది.

 
    తమ అవసరాలకు అందరూ తనని వాడుకున్నవారే. వాళ్లే తనని గోతిలోకి పడదోశారు. ఇంక ఆ వూరిలో వుండాలనిపించలేదు. ట్రాన్స్ ఫర్ కి కిక్కురుమనకుండా ఒప్పుకున్నాడు.


     కొత్త ఊరిలో పాత జీవితం మరిచిపోయి బుద్దిగా పనిచేస్తున్నా'అబద్దాల రజాక్' అన్న ముద్ర మాత్రం మాసిపోలేదు. దానిని తట్టుకోలేకపోయాడు. ఇంక ఆ డిపార్ట్ మెంట్ లోనే  వుండలేకపోయాడు. వాలంటరీ రిటైర్ మెంట్ తీసుకుని వచ్చిన గ్రాట్యుయిటీ సొమ్ముతో బీడీల ఏజన్సీ తీసుకున్నాడు. అడిగినవారికీ, అడగనివారికీ కూడా ఉచిత సలహా ఇస్తుండేవాడు -"మీరు ఆఫీసర్ లకి సహాయకంగా వుండండి. వాళ్లు చెప్పిన  పని చేయండి.... తప్పులేదు. కాని, ఆత్మగౌరవాన్ని చంపుకుని మాత్రం చేయకండి.  ఏదైనా  ఎదురుతిరిగితే అంతకాలం సేవలు చేయించుకున్నవాళ్లే ముందుగా రాళ్ళు వేస్తారు. ఇది నేను అనుభవంతో చెప్తున్నాను"అని!


    "అబద్దాల రజాకీయం'  ఆ విధంగా తెరమరుగైంది.


                           - ఆంధ్రభూమి మాస పత్రిక... అక్టోబర్' 98


                                         ఇప్పుడెలా...?


    నలభైయ్యో పడి చివరిలో మేరీకి మళ్లీ పెళ్లి ఖాయం అయింది. పెళ్లికి ఎటువంటి బట్టలు కొనాలా... అన్న విషయంలో ఓ నిర్ణయానికి రాలేకపోయింది. ఇది కాదని షాపువాడినే అడిగితే సరి - అనుకుంది.


    "చూడండీ.... రేపే నా పెళ్ళి ఏ రంగు దుస్తులు వేసుకుంటే బాగుంటుంది?" అని అడిగింది.


    "మొదటి పెళ్ళయితే ఎరుపు రంగు. రెండోదైతే ఆరంజి. మూడోది పసుపు....."అంటూ ఇంద్రధనుస్సులోని ఏడు రంగుల్నీ  ఏకరువు పెట్టసాగాడు ఫిజిక్స్ చదువుకున్న ఆ గుమాస్తా.


    "బాగానే వుంది కాని - మరి... తొమ్మిదో పెళ్ళయితేనో?!" అంది మేరీ బుర్ర గోక్కుంటూ.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS