Previous Page Next Page 
విష్ణు విలాసిని పేజి 42

    "కావచ్చు. ముందు మీరు చెప్పండి" అంది వెంగమాంబ.
    "అమ్మాయీ! రాత్రినాకు కలవచ్చింది. అందులో నువ్వు తపస్సు చేసుకోవటానికి వెడుతున్నట్టు, మునులు, దేవతలు నిన్ని ఆహ్వానిస్తున్నట్టు కనిపించింది. ఈ కలకి అర్థం ఏమయివుంటుంది?" అడిగాడు కుతూహలంగా.
    "అది నా భవిష్యత్తుకి సంబంధించిన సూచన. మూడురోజుల క్రితం శ్రీనివాసుడు కలలో నన్ను తిరుమలకు రమ్మని ఆదేశిస్తే నేను పట్టించుకోలేదు. తిరిగి రాత్రి కలలోకనపడి తిరుమలకు రమ్మని హెచ్చరించాడు. స్వామి ఆదేశాన్ని నేను నిర్లక్ష్యం చేయటం భావ్యంకాదు. నేను తిరుమలకు చేరవలసిన సమయం ఆసన్నమైంది. నేనక్కడ చెయ్యవలసినది మీకు కలలో కనిపించింది. తపస్సు చెయ్యాలి. కావ్యాలు రచించాలి" అంది వెంగమాంబ.
    "అయ్యో! స్వామి అలా ఆదేశించాడా? నువ్వు మమ్మల్ని వదిలి వెడితే మేముండగలమా?" మంగమాంబ బాధగా అంది.
    "అమ్మా! అట్లా దిగులు పడవద్దు." అని తల్లితో అని తండ్రివంక తిరిగి "నాన్నా! మీరే అమ్మకి ధైర్యం చెప్పాలి. ఎందుకంటే నేను మిమ్మల్ని వదలి వెళ్ళాల్సిన సమయం వచ్చేసింది. మీకు జీవితంలో ఏలోటూ లేదు. దేనికీ వెతుక్కోవలసిన అవసరం లేదు. మన ఇలవేలుపు నరసింహస్వామి దయవలన మనకుటుంబ పోషణభారం అంతా రాజుగారే చూసుకుంటున్నారు. నా జీవితం మీద నాకే అధికారం లేదు. నేను ఎక్కడ ఉంటాను, ఎలా ఉంటాను అన్నది నాకే తెలియదు" అంది.
    "అమ్మలూ! నువ్వు లేకుండా... ... ..." మంగమాంబ మాట పూర్తిచేయ్యలేకపోయింది.
    "అమ్మా! నేను లేకుండా ఎక్కడికి వెడుతున్నాను? కోవెలకి, శ్రీనివాసుని సన్నిధానానికి. ఇక్కడ నరసింహస్వామి కోవెలకి వెళ్ళినప్పుడు బాధపడ్డారా? లేదే! ఇదీ అంతే!
    "అయినా ఆడపిల్ల అత్తవారింటికి వెళ్ళటం సహజం అనేదానివి కదమ్మా! అత్తవారింటికి వెళ్ళాననుకోండి. తిరుమల నా అత్తవారిల్లని, శ్రీనివాసుడే నా ప్రాణాధిపతి అని మీతో ఎన్నోమార్లు చెప్పాను. గుర్తుచేసుకోండి" అంది వెంగమాంబ.  
    "తల్లీ! ఇంతకాలం మాకు కొడుకులులేరని మేము ఏనాడూ బాధపడలేదు. కూతురైనా కొడుకైనా నువ్వేనని, మమ్మల్ని నువ్వు కడతేరుస్తావని, మా ఆశ, మా దిక్కు, అన్నీ మాకు నువ్వేనని నిన్ను చూసుకుంటూ జీవితం గడిపాము. నువ్వులేకపోతే మాకు, జీవితం, జీవితాశలేవు. నువ్వన్నట్టు సుఖంగా బతకటానికి కావలసినవన్నీ ఉన్నా నువ్వు లేనప్పుడు అవేవీ మాకు సుఖసంతోషాలనియ్యలేవు...
    "నువ్వులేని జీవితాన్ని మేం ఊహించుకోలేము.
    "మాకోసం నీ భవిష్యత్తును అస్తవ్యస్తం చేసుకుని ఆగిపొమ్మనటం భావ్యంకాదు. తల్లితండ్రులు పిల్లల అభివృద్ధికి అడ్డుకాకూడదు..."
    ఆపై కృష్ణయార్యుని గొంతు పూడుకుపోయి మాటరాలేదు.
    "దేవుడు మాకెప్పుడూ ఏదో ఒకరకమైన పరీక్ష పెడుతూనే ఉన్నాడు..." అంది మంగమాంబ.
    తల్లితండ్రులు ఇద్దరి కళ్ళనుండి కారుతున్న నీరు వెంగమాంబకి బాధ కలిగించింది. ఇంతకాలం తన సాహచర్యం, తనతోపాటు వారు పడిన ఇబ్బందుల వలన జరిగిన సాధన వారిని ఇంకా మమకారం నుండి మాయనుండి తప్పించలేక పోయాయే అని నిరాశ కలిగించింది. వారు ఇంకా బంధాల మాయాజాలంలో ఇరుక్కుని ఉన్నందుకు జాలికలిగింది. కొంత ఓదార్పుని, ధైర్యాన్ని ఇవ్వటం వారి కడుపున పుట్టినందుకు తన బాధ్యత అనిపించింది. తండ్రిపాదాలమీద తలాన్చి నమస్కరించింది. ఇద్దరి ముఖాలలోకి భావరహితంగా చూస్తూ ఇలా అంది.
    "అధైర్యం పడటం ఎందుకు? జరిగేది జరగక మానదు మనం ఏంచేసినా. విధి బలీయం అన్న సంగతి మీకూ తెలుసు. తెలిసినవానిని ఆచరణలో పెట్టండి. మానవజన్మ దుర్లభం. అందులోనూ బ్రాహ్మణుడుగా జన్మించటం మరింత దుర్లభం. జన్మచేత బ్రాహ్మణుడనికాదు. బ్రహ్మజ్ఞానం కలిగి ఉండటంవల్ల అని నా అభిప్రాయం. అటువంటి మంచి జన్మలభించినప్పుడు దానిని సద్వినియోగం చేసుకోవాలి. మీరిద్దరూ మీజన్మని దైవారాధనకి అంకితం చేసి, పునీతం చేసుకోండి. అంతా మనమంచికే అని గుర్తుంచుకోండి చాలు.
    "జగతిలో మానవజన్మంబు దొరకదు
        దొరికిన పురుషుఁడై పుట్టు టరుదు
    పురుషుఁడై పుట్టిన పొలఁతి మంచిది రాదు
        వచ్చిన భాగ్యంబు లెచ్చు టరుదు
    భాగ్యశాలికి పుత్రఫలము చేకూడదు
        కూడిన వితరణ జాడ లరుదు
    వితరణ గలిగిన వితతశాంతము సున్న
        శాంతంబు గల్గిన సత్యమరుదు
    సత్య మొదవిన శ్రీహరి స్మరణ లరుదు
        హరిని దలచిన వాఁడె పో పరమయోగి
    పుండరీకాక్ష! తరిగొండ పురనివాస!
        సరస ననుఁ బ్రోవు వేంకటాచల నివాస!"
    తల్లితండ్రులకైతే ధైర్యం చెప్పిందికాని, తనకన్నీటిని ఆపలేకపోతోంది. కూతురు కళ్ళలో కన్నీరు చూచి చలించిపోయారు తల్లితండ్రులు. కృష్ణయార్యుడు తేరుకుని ధైర్యం తెచ్చుకుని వెంగమాంబతో ఇలా అన్నాడు.
    "కన్నీరు పెడుతున్నావా అమ్మా! నీ పురోగతికి మేము అడ్డుపడం. మేము నీ ఇష్టప్రకారం నడుచుకుంటాం. నువ్వుచెప్పినట్టే దైవధ్యానంలో కాలం వెళ్ళబుచ్చి జీవితాన్ని సార్థకం చేసుకుంటాం.
    "నీలో దోషంలేదని తెలిసికూడా సమాజానికి భయపడి నిన్ను మేము కూడా ఇబ్బంది పెట్టాం. నీ మీద నమ్మకం ఉన్నా, మేము బలహీనమనస్కులం కనక నిన్ను కష్టపెట్టటం జరిగింది. నిన్ను చూసి, మాకు కలిగిన ఆనందాన్ని ప్రకటించే ధైర్యం కూడా చేయలేకపోయాం. నిన్ను మెచ్చుకునే మాట ఒక్కటీ మానోట రాలేదు - ఆయుక్షీణమని. ఇప్పుడు చెపుతున్నాం. నీ సంస్కారం, సద్బుద్ధి, సత్ప్రవర్తన, దైవచింతన, యోగసిద్ధి - ఇవన్నీ చూసి ఎంతో గర్వపడుతున్నాం. ఈ సంగతి అందరికీ కూడా చెపుతాము."
    "ఇటువంటి మాటలు ఎందుకు నాన్నగారూ! మీరు దిగులుపడకుండా, ధైర్యంగా ఉంటే అంతేచాలు. మీ కుమార్తెగా మీ సుఖసంతోషాలు చూడటం నా కర్తవ్యం" తండ్రి ఉద్వేగాన్ని తగ్గించే ప్రయత్నం చేసింది వెంగమాంబ.
    "తల్లి తండ్రుల సుఖసంతోషాలు చూడటం పిల్లల బాధ్యత. ఆ బాధ్యత ఈలోకానికి సంబంధించింది. ఈ జన్మకి సంబంధించింది. కాని, ఒక ఇంట్లో ఒక భక్తుడో, భక్తురాలో జన్మిస్తే తల్లితండ్రుల వంశంలో అటు ఏడుతరాలు ఇటు ఏడుతరాలు ధన్యమౌతాయి. పితృదేవతలందరికీ పుణ్యలోకాలు సంప్రాప్తిస్తాయి అని పెద్దలు చెపుతారు. అదే ఒక యోగి, సిద్ధపురుషుడు వంటివారు జన్మిస్తే ఇక చెప్పేదేముంది? నీ వల్ల మా ఇద్దరివంశాల, పూర్వీకులు పునీత మయ్యారు. ఇటువంటి అదృష్టం ఎంతమందికి లభిస్తుంది?..."
    "మా ఇలవేల్పుని, మా అదృష్టదేవతని కాపాడమని ఆ ఏడుకొండలవాడిని ప్రార్థించటం తప్పమేము నీకోసం చేయగలిగిందేముంది?"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS