Previous Page Next Page 
ప్రార్థన పేజి 42


    ఆ ప్రదేశమంతా నిర్మానుష్యంగా, నిశ్శబ్దంగా వుంది. బాల్కనీలో నాయుడు లేడు.

 

    అతడు వాచీ చూసుకున్నాడు. పదిన్నర... ఇళ్ళు దూరం దూరంగా వున్న కాలనీ అవటంవల్ల జనం అప్పుడే నిద్రలోకి జారుకున్నట్లున్నారు.

 

    అతడు అలాగే వెల్లకిలా పడుకుని ఆకాశంలో నక్షత్రాల కేసీ, చంద్రుడికేసీ చూడసాగేడు. అతడి మెదడు ఏ విధంగా ఆలోచించటానికయినా నిరాకరిస్తూంది. స్తబ్దంగ వుంది. దూరంగా ఓ కీచురాయి ఆగి ఆగి అరుస్తూంది.

 

    ఇంతలో కాళ్ళకి స్పర్శజ్ఞానం తెలిసినట్టయి, కదపటానికి ప్రయత్నించాడు. నడుము దగ్గర తిరిగి నొప్పి ప్రారంభమయింది. వెన్నెముక విరిగిపోయిందేమో అని భయపడ్డాడు. కానీ కాళ్ళు స్పర్శ పోగొట్టుకోలేదు. కేవలం ఇంజరీ అయి వుంటుంది.

 

    అతడికెందుకో ఆ క్షణాన తన మొహాన్ని అద్దంలో చూసుకోవాలనిపించింది. నాలుక తెగి జాంబవంతుడి మూతిలా మారి వుంటుంది బహుశా! చెవుల నుంచి కారిన రక్తం చెక్కిలి మీద ఎరుపురంగు అద్ది వుంటుంది. ఇక తను మాట్లాడలేడు. ఇతరులు మాట్లాడింది అర్థం చేసుకోలేడు. సర్కస్ లో బఫూన్ లా సంజ్ఞలతో కాలం గడపాలి. దానికి తగ్గట్టు ఎత్తయిన మూతి, ఎర్రటి రంగు. భలే భలే...

 

    సడెన్ గా- తను పిచ్చివాడుగా మారబోతున్నానని అతడికి అర్ధమయింది. డిలిరియం స్థితి రాబోతూంది. తనని తాను కంట్రోల్ చేసుకోకపోతే ఈ పరిస్థితులు తనను డిప్రెషన్ లోకి తీసుకెళ్ళి అక్కడ్నించి ఉన్మాదిని చేస్తాయి? నో.... ఇలా జరగటానికి వీలు లేదు. తను మరణించినా ఫర్లేదు. కానీ పిచ్చివాడుగా జీవచ్చవంలా మారటానికి వీలులేదు. చనిపోయేముందు ఒక్క ఆశయం మాత్రం తీర్చుకోవాలి.

 

    పగ!

 

    బ్రతుక్కీ, చావుకీ మధ్య తను అటూ ఇటూ వూగుతూ వుంటే- దాన్ని సరదాగా చూస్తూ కూర్చున్న ఆ నాయుడికి బుద్ధి చెప్పిగానీ తాను చావటానికి వీలులేదు.

 

    అంతవరకూ తన మనసు తన ఆధీనంలో వుండాలీ అంటే ఇక ఈ రక్తం గురించీ, తన నిస్సహాయ స్థితి గురించీ ఆలోచించకూడదు. మరణిస్తే ఫర్వాలేదు. కాని బ్రతికి వుంటే ఈ రాత్రి తెల్లవార్లూ, ఎవరయినా వచ్చి తనకు సాయపడేవరకూ ఇంకేదయినా ఆలోచించాలి. ఏం అలోచించాలి?

 

    భవిష్యత్తులో తనెవర్నయినా అమ్మాయిని ప్రేమిస్తే చెవిలో గుసగుసగా 'ఐ వాంట్ టు స్మాష్ యూ విత్ మై లవ్' అని ఎలా చెప్పగలుగుతాడు. ఆ అమ్మాయి అయినా కూడా ఆ సమయంలో గారాలుపోతూ తనకి ఎలా సందేశం అందివ్వగల్గుతుంది? పక్కమీద నించి లేచి వెళ్ళి కాగితం పెన్నూ తీసుకుని వ్రాసి చూపిస్తే తప్ప తనకి తెలీదు. కష్టాలు తెచ్చి పెట్టేవయ్యా మన్మధుడా! అయినా కొంతలో కొంత నయం. చాలా నవలల్లో చదివాడు. ఈ కాలంలో అమ్మాయిలు నోట్లో నాలుకలేని అబ్బాయిల్నే ఎక్కువ ఇష్టపడతారట. కనీసం ఈ క్వాలిఫికేషన్ మిగిలింది తనకి! ఇది క్రెడిట్టు. పోతే ముందులాగా నాలుకతో క్రికెట్ ఆడడం, దాగుడుమూతలు నేర్పటంలాంటి పనులు చేయలేడు. ఇది డెబిట్టు.

 

    ఇలా క్రెడిట్టూ, డెబిట్టూ వేసుకుంటూ అరగంట గడిపాడు.

 

    తన స్థితి గురించిన భయంకరమైన వాస్తవాన్ని మర్చిపోవటం కోసం అతడు ఈ విధంగా ఆలోచిస్తున్నాడు. పైకి చాలా తేలిగ్గా మామూలుగా కనిపిస్తుంది. కానీ అది చాలా కష్టసాధ్యమయిన విషయం. కష్టాలలో వుండి సుఖం గురించి ఆలోచించటం... మనసును తేలిగ్గా వుంచుకోవటం- అది సాధ్యం కాని పక్షంలో ఆ రక్తపు మడుగు మధ్యలో అతడెప్పుడో ట్రాన్స్ లోకి వెళ్ళిపోయి వుండేవాడు. తనని తాను మానసికంగా (షాక్ తగలకుండా) రక్షించుకునే ప్రయత్నం చేయలేక పిచ్చెక్కి పోయేవాడు.

 

    అతడికి ముందు శారద జ్ఞాపకం వచ్చింది. ఆ డేపంజాతి స్త్రీ ఏమైనా చేతబడి చేయించి, తనకిలా చెవులూ నోరూ పోవటానికి కారణభూతురాలు అయి వుంటుందా అని ఆలోచించాడు, కాదనిపించింది. పోనీ తనెవరినయినా మోసం చేసేడా అంటే అదీలేదే. తనేం మాట్లాడినా, తనెవరిని ఏడిపించినా అదంతా సరదా కోసం అని తన ఫ్రెండ్స్ కీ, స్నేహితురాళ్ళందరికీ తెలుసు. తన కంపెనీ ఎవరికీ హానికరం కాదని కూడా వాళ్ళకి తెలుసు. తెలిసీ తను ఎవర్నీ మోసం చేయలేదు. చాలామంది మగవాళ్ళలా "పైకి" మంచిగా కనపడి, బాగా మాట్లాడుతూ నెమ్మదిగా నవ్వి - చుట్టూ గొయ్యి తవ్వటం తనకు తెలీదు. స్నేహాన్ని ఫ్రాంక్ గా అడిగేవాడు, ఇచ్చేవాడు, పుచ్చుకునేవాడు. మరెందుకిలా జరిగింది?

 

    సోడాబుడ్డి కళ్ళద్దాల కమల, ఎత్తు పుస్తకాల రాంబాయమ్మ గారూ- వీళ్ళ ఉసురు తగిలిందా పోనీ అనుకుంటే - పైకి ఎంత కోప్పడ్డా లోలోపల తనంటే, తన మాటంటే వాళ్ళకి ఇష్టమేనని నిశ్చయంగా తెలుసుకదా. పైకి వెళ్ళడం వాళ్ళకు ఇష్టం లేదని తెలిశాక తను మాటల దగ్గిరే ఆగిపోయాడు కదా.

 

    చేసిన పాపాలకు ఫలితం అనుభవించక తప్పదంటారు. మరి నేను చేసిన పాపం ఏమిటి? ఏముంది తనలో కల్మషం? నిష్కల్మషమయిన భావాల్ని నిష్కపటంగా బయట పెట్టడమేనా? అదేనా తప్పు?

 

    మనిషి మంచిగా వుండడం వేరు- మంచిగా కనబడడం వేరు.

 

    ఈ ప్రపంచానికి కావల్సింది రెండోది.

 

    అందుకేనా తగిన శిక్ష?

 

    అదే కారణమయితే తను నమ్మిన సిద్ధాంతం కోసం తను విధితో కూడా పోరాడతాడు. ప్రాణంపోయినా సరే! మనసుకు ముసుగు వెయ్యటంకన్నా దౌర్భాగ్యం ఇంకొకటి లేదు. దానికన్నా చావే మంచిది.

 

    అంతలో రాత్రి పన్నెండయినట్టూ సైరన్ మ్రోగింది అది అతనికి వినపడలేదు.

 

    ఆ స్థితిలో కూడా అతనికి నవ్వొచ్చింది.

 

    ఇదేమిటి? తను కర్మసిద్ధాంతంవేపు వెళుతున్నాడు. తన పాపపుణ్యాల గురించి బేరీజు వేసుకుంటున్నాడు....? సన్ షేడ్ ని పట్టుకుని వ్రేలాడుతూ వుండగా చీమలబారు చేతి మీదకు పాకింది. అదేదో విషప్పురుగు అనుకుని చేతులు వదిలేసి నడుము విరగ్గొట్టుకున్నాడు. అంతే దీనికీ కర్మకీ సంబంధం ఏమిటి? దీన్ని గురించి ఆలోచించడం ఎందుకు? మానెయ్యాలి. దీనికన్నా జిడ్డు కృష్ణమూర్తి తత్వశాస్త్రం గురించో, కార్ల్ మార్క్స్ థియరీ గురించో ఆలోచిస్తే పుణ్యం-పురుషార్థం. అతడు చుట్టూ చూసేడు.

 

    ఆ ఆవరణలో మందంగా పరుచుకున్న చీకటిని సన్నటి వెన్నెల పారద్రోలలేకపోపోతూంది. ఇంకా ఏడెనిమిది గంటలు... అప్పటికీ ఎవరయినా ఇటువైపు వస్తారో- రారో...

 

    అతడు కళ్ళు మూసుకున్నాడు.

 

    చుట్టూ అంతా స్థబ్ధంగా వుంది.

 

    ఆ స్థబ్దతలో చిన్న కదలిక.

 

    దాన్ని అతడు గమనించలేదు.

 

    చెత్తాచెదారం, అడుగునుంచి కొద్దిగా కదిలి ముందు చిన్న తల బయటకొచ్చింది. అటూ ఇటూ చూసి మరింత బయటపడింది.

 

    తర్వాత పూర్తిగా వెలువడింది. 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS