Previous Page Next Page 
యువత నవత పేజి 41

         ఉదయం పదిగంటలకల్లా వంటచేసి సుగుణకి తినిపించి, తను తిని ఆఫీసుకు వస్తాడు. సాయంత్రం  యింటికి వెళ్లాడంటే, టైమంతా భార్య దగ్గరే గడుపుతాడు.

     అంతగా ప్రేమించే భర్త దొరకడానికి సుగుణ ఎంత అధృష్టం చేసుకొందో!

     అయితే, సుగుణ దీన్ని అదృష్టమని అనుకోవడం లేదని, దీన్ని ఒక నరకమనుకొంటూందని ఒకనాడు సుధకు తెలిసింది. సుధకి కలిగిన ఆశ్చర్యం అంతా ఇంతా కాదు.

     ఆరోజు పనిపిల్ల కు జ్వరంవచ్చి ఇంటికివెళ్లిపోయింది. చంద్రకాంత్ టూర్ వెడుతున్నాడు. ఎట్టిపరిస్థితుల్లోనూ రాత్రికి తిరిగి వచ్చేట్టు లేదు.

     చంద్రకాంత్ సుధని పిలిపించి, అర్దింపుగా చెప్పాడు "రేపు సాయంత్రం  వరకు నేను వచ్చేస్తాను. ఈ రాత్రి సుగుణకి తోడుగా మీరు" పడుకోవాలి. నేను లేకపోతే ఆవిడ బెంగతో అన్నంకూడా తినదు. కాస్త ఆవిడ అన్నం తినేట్టు, వేళకి మందులు వేసుకొనేట్టు చూడాలి మీరు!"

    "మంచిదిసర్! మీరు నిశ్చింతగా వెళ్లిరండి!" మనస్పూర్తిగా చెప్పింది సుధ.

    "చూసారా? ఎవరినుండీ చిన్నమెత్తు సాయంకూడా తీసుకోని మనిషినన్నారు? ప్రక్కవాడినుండి సాయం తీసుకోకుండా ఎంతవాడికీ కుదరదు."

    "కాస్త చూడడం ఇదో పెద్ద సాయమా?"

    "ఈ సమయంలో మీరే లేకపోతే నేను ఇంకో మనిషికోసం వెదకాల్సిందేకదా?" సుధకు చెప్పాల్సినవి చెప్పి చంద్రకాంత్ వెళ్లిపోయాడు.

    ఆ రాత్రి సుగుణ చాలా సంగతులు చెప్పింది. చంద్రకాంత్ తో తన పెళ్లి, తమ అనురాగ దాంపత్యం, తనకి ఏక్సిడెంట్ కావడం అన్నీ చెప్పింది.

     "......ఒకవిధంగా మృత్యుకోరల్లోకి వెళ్లి తిరిగివచ్చిన మనిషిని. ఏక్సిడెంట్ అయ్యి నేను హాస్పిటల్ లో పడ్డాక వారంరోజుల వరకు నేను బ్రతుకుతానని ఎవరూ అనుకోలేదు. బ్రతికాను. కాని, ఎన్నో జాగ్రత్తలు తీసుకొంటే తప్ప బ్రతకనని చెప్పారు డాక్టర్లు. ఆ మాటతో మావాళ్లు మా జీవితంలో పిడుగుపడిందనే  అనుకొన్నారు. ఎందుకూ పనికిరాని నన్ను ఆయన వదిలిపెడతారని, మళ్లీ పెళ్లిచేసుకొంటారని నేనుకూడా అనుకొన్నాను. కాని, ఆయన వూహల్ని తలక్రిందులు చేశారు."

    "భార్యాభర్తల్ని అవసరం ఒక్కటే కలిపి వుంచుతుందా? భార్యా భర్తల మధ్య  ఇంకేమీ వుండదా?" అన్నారాయన.

    "ఉంటుంది ప్రేమ! కొన్ని శరీరాల కలయిక లేకుండా ఆ ప్రేమ ఎన్నాళ్లు నిలబడుతుంది?"

    "శరీరాలు కలవకముందే ఉధ్బవించే ప్రేమ శరీరాలు కలువకపోయినా నిలబడదా?"

    "నిండు వయసులో వున్నారు.  సుఖం లేకుండా యెన్నాళ్ళుంటారు?"

    "మనసు సహకరించకుండా శరీరం ఏమీ చెయ్యదు, సుగుణా! నా మనసును నేను అదుపులో పెట్టుకొంటే నిండు యవ్వనం అయినా, ఏమైనా ఏమీచెయ్యలేదుతెలుసా? నీ మీది నా ప్రేమ నా మనసుకు నేర్పుతుంది. నువ్వు త్వరగా ఆరోగ్యవంతురాలివి కావాలి కావాలంటే  ఒక్క మందువల్ల అది సాధ్యంకాదు. అందుకు నీ మనస్సు ముఖ్యం. తొందరగా కోలుకోవాలన్న ఆశ ముఖ్యం. లేనిపోని బెంగలు, అనుమానాలు, పెట్టుకొని శారీరకంగానే కాదు, మానసికంగాకూడా అనారోగ్యం తెచ్చుకోకు" అన్నారు.

     "కాని, మనసును అదుపులో పెట్టుకోడానికి నామీద ప్రేమొక్కటే చాలదని త్వరలోనే గ్రహించారు ఆయన. అంతవరకు లేని వేదాంత గ్రంథపఠనం మొదలుపెట్టారు. ముఖ్యంగా రామకృష్ణుడు, వివేకానందుడు ఇష్టపురుషులైపోయారు. వేదాంత గ్రంథాల్లో ఆయనకు కావలసిన నిగ్రహం కొనితెచ్చుకొంటూంటే ఇదంతా కళ్ళతో చూస్తూ ఎలా భరించను నేను? అందుకే చెప్పేసాను ఆయనకు.  మళ్లీ పెళ్లిచేసుకొమ్మని చెప్పడమేకాదు, రోజుకొక్క సారయినా ఆమాట గుర్తుచేస్తుంటాను ఆయనకు. మొదట్లో వాదించేవారు, కోప్పడేవారు, గంటసేపు మాట్లాడకుండా తనకోపాన్ని ప్రకటించేవాల్లు కాని, ఇప్పుడు ఏమీ అనరు. నా మాట ఆయన చెవిలో దూరనట్టుగా  మౌనం వహిస్తారు."

    "మళ్ళీ పెళ్ళిచేసుకొమ్మని ఎందుకు చెప్పారు ఆయనకు?" సుధ అడిగింది.

    "ముఖ్యంగా నా అనారోగ్య కారణంగా ఆయన సంసార సుఖానికి దూరమయ్యారు.  అందుకు కావలసిన ఆత్మనిగ్రహం ఆయన ఆధ్యాత్మిక గ్రంథాలలో వెదుక్కుంటూంటే చూస్తూ ఎలా వుండను?"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS