Previous Page Next Page 
త్రీ- ఇన్- వన్ పేజి 41

    "ఒరేయ్ బుచ్చిబాబూ అంకుల్.... మరో రెండు చాక్లెట్లివ్వరా" అంటూ బుజ్జిపండు అరిచాడు.

    వాడికి మరో రెండు చాక్లెట్లిచ్చాను.

    "ఇలా వీడిని సంవత్సరాల తరబడి పోషించడం కాదుగానీ ఓ లవ్ లెటర్ రాసి వీడిచేత వాళ్ళక్కకి పంపించు..." అన్నాడు చంచల్రావు.

    ఆ ఆలోచన నాకు నచ్చింది.

    వెంటనే లవ్ లెటర్ రాసి చంచల్రావుకి వినిపించాను.

    "డియర్ సుందరీ... నీ బుగ్గలు బందరు లడ్డూలు, పెదాలు రసగుల్లాలు, నవ్వు తీపి తీపి జాంగ్రీలు. నువ్వంటే నాకెంతో లవ్వు. నేనంటే నీకేంటో వెంటనే జవాబివ్వు... నీ బుచ్చిబాబు!!..."

    చంచల్రావు ముఖం చిట్లించుకున్నాడు.

    ఈ ఉత్తరం చూసి ఆ అమ్మాయి ఆ సెంటర్ లోని మిఠాయి కొట్టువాడు వ్రాశాడని అనుకుంటదేమో!!..."

    "ఏం కాదులే. బుజ్జిపండుగాడు నేనే ఆ ఉత్తరం ఇచ్చానని చెప్తాడుగా" అన్నాను.

    బుజ్జిపండు గాడిని పిలిచి ఆ ఉత్తరం వాళ్ళక్కకి ఇచ్చిరమ్మని చెప్పాను. వాడు తుర్రుమని బయటకి పరుగుతీశాడు. మేం యిద్దరం బుజ్జిపండు రాకకోసం గదిలో కాలిగాలిన పిల్లలా అటుఇటూ తిరుగుతున్నాం. ఇంతలో బుజ్జిపండుగాడు రయ్యిన ఇంట్లోకి వచ్చాడు.

    "ఏరా ఇచ్చావా?" ఇద్దరం కోరస్ గా అడిగాం వాడిని.

    "ఓ... మా అక్కయ్య బజారుకెళ్ళింది. అది వచ్చాక దానికివ్వమని మా అన్నయ్యకి ఇచ్చాను" అన్నాడు.

    వాడిమాట ఇంకా పూర్తి కాలేదు నా గది గుమ్మంలో అడ్డచారాల బనీనుతో సుందరి వాళ్ళ అన్నయ్య కనిపించాడు.

    "అబ్బే... నాకేం తెలీదుసార్... వట్టిదే హిహిహి... గమ్మత్తు అన్నమాట... హబ్బే... ఏమిటి? ఓహో?... అది మా మిఠాయి కొట్టువాడే రాసుంటాడు. పాపం వాడు మంచాడే... ఈ ఒక్కసారికి వదిలెయ్యండి సార్ హిహిహి" అన్నాను కంగారుగా నవ్వుతూ.

    సుందరి అన్నయ్య ఓసారి తన కండలు పరీక్షగా చూసుకుని నావైపు అడుగులు వేశాడు.

                                              ***

                                       

    నేను కళ్ళు తెరిచేసరికి మంచం మీద ఉన్నాను. కదులుదామని అనుకుంటే కదల లేకపోయాను. ఒంటినిండా కట్లు ఉన్నాయి. ఎదురుగా చంచల్రావు కనిపించాడు.

    "నేను ఎక్కడున్నాను?"

    "గవర్నమెంటు ఆసుపత్రిలో"

    "ఎందుకూ?" ఆశ్చర్యంగా చూశాడు,

    "అదే.. సుందరికి ఉత్తరం రాశావుగా... ఆ తరువాత చారల బనీను వాడొచ్చు..."

    నాకు ఒక్కో సీను గుర్తుకు వచ్చింది.

    "వాడు నిన్నేమీచేయలేదా?" ఈర్ష్యంగా అడిగాను.

    "చేసేవాడేమో నిన్ను తంతుండగా నేను పారిపోయా... మరేం బాధపడకురా. ఈ సుందరి కాకపోతే మరో అమ్మాయి.ఎప్పటికైనా నీ ప్రేమ ఫలించకపోదు" అన్నాడు నన్ను ఓదారుస్తూ.

    ఇంతలో బుజ్జిపండువాళ్ళ పనిమనిషి వచ్చింది.

    మీకెంత కష్టం వచ్చిందండీ" అంది కన్నీళ్ళు పెట్టుకుంటూ.

    "అవును... అదే నేనూ అనుకుంటున్నా" అన్నాను.

    "అంతా నా వల్లే" అంది.

    "నీవల్లేమిటి?" ఆశ్చర్యంగా చూశాను.

    "మీరు నాకు ఉత్తరం రాయడం వల్లేగా ఇలా అయింది."

    "నీకు ఉత్తరం రాయడమేమిటి? నేను సుందరికి ఉత్తరం రాశాను" కంగారు పడ్డాను.

    "నేనే సుందరిని."

    "మరి మీ యింట్లో సన్నగా, తెల్లగా, పొడుగ్గా ఉంటుంది. ఆ అమ్మాయి?" అయోమయంగా అడిగాను.

    "ఆ అమ్మాయిపేరు రూప... మా చుట్టాలమ్మాయి. హైదరాబాదు చూడడానికి మాతో వచ్చింది. మొన్ననే వాళ్ళ ఊరు వెళ్ళిపోయింది" అంది.

    "వా..."

                                      

     నా ఏడుపు విని నర్సు, డాక్టరు పరుగెత్తుకు వచ్చారు. "డాక్టర్! రోగి బాధతో ఏడుస్తున్నారు ఇంజక్షనివ్వనా?"

    "ఇవ్వు" అన్నాడు డాక్టరు.

    నా జబ్బలో మత్తు ఇంజక్షను దిగబడింది.

    నా ఎదురుగా ఉన్న సుందరి రూపం మసక మసకగా మారింది... మెల్లమెల్లగా నేను మత్తులోకి వెళ్ళిపోసాగాను.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS