Previous Page Next Page 
బస్తీమే సవాల్ పేజి 41


    కానీ అతనికి తగిలిన గాయం, రక్తం మడుగులో పడివున్న తీరు చూస్తే అతను బ్రతకడానికి వీల్లేదు.

    అసలు విషయం తెలుసుకుంటే కాస్త ఊపిరి పీల్చుకోవచ్చు.

    కేరాఫ్ ఫుట్ పాత్ అయిపోయిన తను ఏ అడ్రస్ సంపాదించుకోవాలి. ప్రస్తుతం ఓ చిన్న ఉద్యోగం దొరికితే చాలు.

    చదువా పూర్తికాలేదు. తనకి చిన్న గుమాస్తా ఉద్యోగం కూడా రాదు. ఎలాంటి ఉద్యోగం తను చేయవలసి వస్తుందో ఊహించుకుని చిగురుటాకులా కంపించిపోయాడు పరుశురాం.

    ఈ మహానగరంలో తనకి తెలిసిన గాడ్ ఫాదర్ ఎవరూ లేరు. అండ లేకపోతే కనీసం రిక్షా కూడా ఎవరూ అద్దెకు ఇవ్వరు.

    ఈ రొంపిలోంచి బయటపడాలి. రాత్రి పదవుతోంది.

    ఆకలిగా వుంది. కానీ అన్నం తినబుద్ధి కావడం లేదు. నోరంతా చేదుగా వుంది. సిగరెట్లు కాల్చి కాల్చి.

    టీ తాగి రాత్రికి సరిపెట్టుకోవాలి.

    రోడ్డుకి అవతలవైపున్న చిన్న ఇరానీ రెస్టారెంట్లోకి నడిచాడు.

    ఛాయ్ ఆర్డరిచ్చి సిగరెట్ వెలిగించాడు.

    నోరు చేదుగా, మంటగా ఉన్నా సిగరెట్లు మానడంలేదు పరుశురాం.

    ఛాయ్ తాగుతూ ఆలోచిస్తున్నాడు.

    నందిని మాట వినకుండా తను పొరపాటు చేశాడా?

    నీతిలేని సమాజంలో తనే పనిచేస్తే తప్పేమిటి?

    ఆమె షరతులకి అంగీకరిస్తే తనకి పట్టుపరుపులు తప్పవు.

    జేబులోంచి పేకముక్కల్ని తీసి ఓసారి షపుల్ చేస్తూ రోడ్డు మీదికి నడిచాడు.

    ఎదురుగా మెకానిక్ షాపులో అప్పటివరకూ పనిచేసిన ఓ పన్నెండేళ్ళ కుర్రాడు రోడ్డుమీదకొస్తున్నాడు. ఓ వేపునుంచి లారీ, మరోవేపునుంచి కారు వస్తున్నాయి.

    ఆ కుర్రాడు తికమక పడిపోతూ రోడ్డుకి అడ్డంగా నిలబడిపోయాడు. ఎటుపోవాలో దిక్కుతోచని స్థితిలో.

    కొన్ని క్షణాల్లో జరగబోయే ప్రమాదాన్ని పసిగట్టాడు పరుశురాం.

    క్షణం ఆలస్యం చేయలేదు పరుశురాం.

    పేకముక్కల్ని జేబులోకి తోస్తూ రోడ్ మీదకి సుడిగాలిలా దూసుకు వెళ్ళాడు.

    లారీలు బ్రేకులు కీచుమని శబ్ధం చేశాయి. కారు.... కారు పెద్ద శబ్దం చేస్తూ ఆగింది. అప్పటికే పరుశురాం ఆ కుర్రాడిని రోడ్డుపక్కకి విసిరేశాడు. కానీ కారు బానెట్ తగిలి పరుశురాం రోడ్ చివరికి ఎగిరిపడ్డాడు.

    ఒక్కసారిగా జనం మూగారు. పరుశురాం అతి సాహసంతో ఆ పసివాడి ప్రాణాలని కాపాడ్డం చూసినవాళ్ళు అతన్ని అభినందించారు.

    పరుశురాం కాళ్ళు, చేతులు చిన్న గాయాలతో గీరుకుపోయాయి.'

    "పెద్ద ప్రమాదమే తప్పిపోయింది" అన్నారెవరో.

    "సాహసం చేశాడుగానీ ప్రాణం మీదకి తెచ్చుకునేవాడే" ఇంకెవరో అన్నారు.

    "ముందు డాక్టర్ దగ్గరకెళ్ళండి" ఎవరిదో సలహా.

    లారీ డ్రైవర్ని, కారు డ్రైవర్ని పట్టుకున్నారు జనం. వాళ్ళు తప్పులేదని వాదిస్తున్నారు, కొందరు తిడుతున్నారు.

    మరికొందరు రాజీకి ప్రయత్నిస్తున్నారు.

    ఇంతలో పేట పెద్ద వచ్చి సర్ది చెప్పడంతో కారునీ, లారీని విడిచిపెట్టారు జనం.

    కాళ్ళు, చేతులు విదిలించి దెబ్బలు తగిలిన చోట కర్చీఫ్ తో తుడుచుకుంటున్నాడు పరుశురాం.

    "అన్నా దెబ్బ తగిలిందా?"

    ఆ ప్రశ్నకి తలెత్తి చూశాడు పరుశురాం.

    ఎదురుగా ఆ కుర్రాడు.

    జనం ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు.

    "నాకోసం నువ్వు చచ్చిపోయేవాడివి కాస్తుంటే."

    ఆ పసివాడి కళ్ళల్లో నీరు తిరుగుతోంది.

    ఆ పసివాడి కళ్ళలో నీరు.... ముఖంలో అమాయకత్వం, మాటల్లో ఆవేదననీ పరుశురాం అర్ధం చేసుకున్నాడు.

  కల్లాకపటం తెలీని పసివయస్సు వాడిది. కానీ, వాడిలో కనిపిస్తున్న మానవత్వం.... ఖరీదు కట్టలేనిది.

    అందుకేనేమో పసివాళ్ళు దేవుళ్ళతో సమానం అంటారు.

    "నన్ను కొడతావా?" అడిగాడు వాడు.

    పరుశురాం ప్రసన్నంగా చూశాడు.

    "నువ్వేం తప్పు చేశావని కొడతాన్రా?" అన్నాడు.

    "నా మూలంగా నీకు దెబ్బలు తగిల్నాయి"

    పరుశురాం వాడి భుజంపైన తట్టాడు.

    "ఓ ఘోరం జరుగుతున్నదని ఏ మాత్రం తెలిసినా మనిషనే వాడెవడైనా దాన్ని ఆపటానికి ప్రయత్నిస్తాడు కన్నా!" అన్నాడు పరుశురాం.

    ఆ కుర్రాడు ఆశ్చర్యంగా చూశాడు.

    "నా పేరు నీకెలా తెలుసు?" అడిగాడు.

    "నీ పేరా? ఏమిటి?"

    "కన్నయ్య."

    "మంచి పేరు కన్నయ్యా."

    "నీకు దెబ్బలు తగిల్నాయి. పద డాక్టర్ దగ్గరకి వెళ్దాం" అన్నాడు కన్నయ్య.

    ఎన్నో నీతులు అభినందనలు పలికిన జనం ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు.

    "ఈ మాత్రానికే డాక్టరెందుకు వద్దులే"

    కన్నయ్య పరుశురాంని పరీక్షగా చూశాడు.

    మాసిపోయిన బట్టలు.... చెదిరిన జుట్టు....

    "డబ్బులు లేవా?" అడిగాడు.

    "డాక్టర్ కిచ్చేన్ని డబ్బులు లేకపోవచ్చు" అన్నాడు పరుశురాం.

    "అంటే డాక్టర్ అవసరం వుందనేకదా?" తెలివిగా అడిగాడు కన్నయ్య.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS