"కృతజ్ఞత సంగతి అలా వుంచి నీ రెండో సీరియల్ ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకో! మంచి సబ్జెక్టు ఆలోచించు. ఈ సీరియల్ అయిపోగానే రెండో సీరియల్ మొదలేట్టేస్తాను. సరేనా?"
"థాంక్యూ వెరీమచ్ సర్! రెండో సీరియల్ కి నవల నా దగ్గర రెడీగా వుంది." అంది హరిణి.
ఆశ్చర్యంగా చూశాడు ఎడిటరు.
"అప్పుడేనా! ఈజిట్ సో"
"యస్ సర్! ఇంతకుముందే ఇంకో నవల కూడా రాశాను."
"సబ్జెక్ట్ ఏమిటి?"
చెప్పింది హరిణి.
వింటూ నుదురు చిట్లించి కాసేపు ఆలోచించాడు ఎడిటరు. క్రమంగా అయన మోహంలో చిరునవ్వు చోటు చేసుకుంది.
"వెరీ వెరీ గుడ్! చాలా బావుంది. కానీ ఆ హీరియిన్ తల్లి చనిపోవడం కధకు అంత అవసరమా?"
"అన్పిస్తోంది సర్"
"ఐ డోంట్ థింక్ సో! తల్లి కారెక్టర్ కూడా కంటిన్యూ అయితే మంచి సెంటుమెంటు వస్తుంది."
కొద్దిగా ఆలోచించింది హరిణి.
"సరే సర్! మీరు చెప్పినట్లే మార్చేస్తాను."
కధకి జాగ్రత్తగా మరికొన్ని మార్పులూ , చేర్పులూ చెప్పాడు ఎడిటర్. జాగ్రత్తగా నోట్ చేసుకుంది హరిణి.
"గో ఆహేడ్! ఇది ఇంకో సెన్సేషనల్ సీరియల్ అవుతుంది." అన్నాడు ఎడిటర్.
"అంతా మీ నోటి చలవ" అంది హరిణి అభిమానంగా.
"మూడో వారం ఇష్యూ రేపు మార్కెట్ లోకి వస్తుంది కదూ?" అనుకున్నాడు ఎడిటర్ స్వగతంలా.
"అవును సర్"
"రేపు సాయంత్రానికి తెలుస్తుంది రెస్పాన్సు" అవునన్నట్లు తలపంకించింది హరిణి.
* * * *
ఎడిటర్ అన్నట్లే మర్నాడు సాయంత్రానికి లెక్కలేనన్ని ఫోన్ కాల్స్ వచ్చాయి అతని ఆఫీసుకి. అతనికి గుర్తున్నంతవరకూ అన్ని సంవత్సరాల అనుభవంలో అంత రెస్పాన్స్ ఏ సీరియల్ కి రాలేదు.
ఊహించింది ఊహించినట్లు జరుగుతున్నప్పుడు కలిగే సంతృప్తి కలిగింది అతనికి.
ఆ రోజు అతనికి వచ్చిన చివరి ఫోన్ కాల్ హరిణి దగ్గరినుంచి.
అది హరిణి దగ్గరనుంచి
కృతజ్ఞతా భావంతో గొంతు పూడుకుపోతూ ఉండగా అంది హరిణి.
"సర్! దేవుడనేవాడు ఇంకెక్కడో ఉన్నాడో లేడో తెలియదు నాకు. కానీ నాకు తెలిసిన దేవుడు మాత్రం మీరే! ఇది నిజం సర్!"
* * * *
నిర్లక్ష్యంగా జేబులోంచి కొన్ని నోట్లు తీసి అభిషేకన్ కి అందించాడు ప్రేమ్ కుమార్.
ఒక్కొక్క నోటూ విడిగా తీసి, బోతనవేలూ, మధ్యవేలూ మధ్య పెట్టుకుని చిటికేసి చూసి లేక్కపెట్టుకొని జేబులో పెట్టుకున్నాడు అభిషేకన్. అయినా మొహం ముడుచుకునే ఉన్నాడతను.
"అభిషేకన్ ! ఇంక వెళ్ళు! వెళ్ళి ఆ ఎడిటర్ కి హరిణికీ మధ్య ఏదో సంబంధం వుందని ప్రచారం చెయ్యి. రాత్రి ఎనిమిదింటిదాకా ఎడిటర్ కేబిన్ లో ఏం పని ఆ పిల్లకు. అవునా? ఇది అందరికీ చెప్పు."
తల ఊగించాడు అభిషేకన్. కానీ అక్కడ నుంచీ కదలలేదు ఉత్సాహంగా లేడతను.
"ఏమిటివాళ వీడి మొహం ఉడకేసిన ఊర్లగడ్డలా ఉంది" అని మనసులో అనుకోని పైకి మాత్రం ఆప్యాయంగా అడిగాడు ప్రేమ్ కుమార్ . "ఏం అభిషేకన్! వంట్లో బాగాలేదా! జొరమొచ్చిందా?"
అతనలా ఆప్యాయంగా అడగంగానే దాదాపు ఏడుపొచ్చినంతపనయింది అభిషేకన్కి. డగ్గుత్తికతో అన్నాడు "ఇవాళ పేపర్ చూశారా సార్?"
"చూశానే ఏమయింది?"
"బాబా పాల్కే అవార్డు బి. నాగిరెడ్డి కి ఇచ్చారు సార్!"
"అవును. అయితే?"
ఆక్రోశంగా అన్నాడు అభిషేకన్.
"ఏం సార్! ఎందుకు సార్! అంత పెద్ద అవార్డు ఒక తెలుగు వాడికే ఇవ్వాలి. అవార్డు ఇవ్వడానికి టమిలియన్ లేరా సార్"
"ఓరీ నీ బండబడా! అదా నీ ఏడుపు? అనుకున్నాడు ప్రేమ్ కుమార్ ఆశ్చర్యంగా.
"నాకు ఈ విచారంతో పొద్దున్నుంచి అన్నం సహించలేదు సార్" అన్నాడు అభిషేకన్.
"అరెరె పాపం! పోనియ్యవయ్యా! నాగిరెడ్డిగారు తెలుగు మనిషే అయినా వుండేది మద్రాసులో కదా! తమిళ్ నాడు. తమిళ్ నాడుగొప్పే ఇదంతా!" అన్నాడు ప్రేమ్ కుమార్ ఊరడిస్తూ.
అది విన్న తర్వాత కాస్త కళ తిరిగి వచ్చింది అభిషేకన్ మొహంలోకి.
ఇంక వెళ్ళు! వెళ్ళి ప్రచారం సంగతి చూడు! గుర్తుందా హరిణి , ఎడిటర్ కలిసి...."
"ఇలాంటి విషయాలు ఒక్కసారి చెబితే చాలు సర్. ఇంక జన్మలో మరిచిపోను." అన్నాడు అభిషేకన్.
పొద్దున్నుంచీ తిండి తినక డొక్క మాడుతోంది. అభిషేకన్ కి మాములుగా అయితే ఆకలికి తలనొప్పి వచ్చేస్తున్నా హోటల్ కి వెళ్ళి టిఫిన్ చెయ్యడు అతను .అదా.
ఇవాళ ప్రేమ్ కుమార్ డబ్బు ఇచ్చాడు కాబట్టి ఇవాళ ఒక్క రోజూ హోటల్లో తిందాం అనుకున్నాడు అతను.
