"లచ్చిమి నీకు పాడటం వచ్చునా?" అని అడిగాడు . వెలుగుతున్న నెగడు నించి వెచ్చని ఆవిరులు ముఖాన్ని తాకుతున్నాయి. వెనుక నుంచి ఈదురు గాలి వీపుకు తాకుతోంది.
అదొక చిత్రమయిన అనుభూతి. అడవిలో జీవితానికి అలవాటు పడినవారికి అది క్రొత్త కాదు. జ్యోతి స్థితిని గమనించి కిట్ లోంచి దుప్పటి తీసి ఆమె వీపున కప్పాడు జయకృష్ణ.
ఆమె బాగా రిలాక్స్ అయిపొయింది.
"పుంజు పాడమంది. పాడవే లచ్చిమి!" అన్నాడు ఆమెకు బాగా చనువుగా వుండే యువకుడోకడు.
లచ్చిమి వెంటనే పాట అందుకుంది. ఆ భాష చాల ప్రాచీన మయినది. కొన్ని పదాలు అర్ధం కూడా కావు. ఆ పాట పద్దతి చాల సాంప్రదాయకమయినది.
గిలిగింతలు పెట్టినట్లుగా వుంది.
కాకులు దూరని కారడవిలో బిక్కు బిక్కు మంటూ ఒదిగి వున్న ఒక అడవి గూడెం. అక్కడ యువతీ యువకులంతా వేడుక చేసుకున్నారు. ఎవరో వేటకై వెళ్ళినవారు పరుగు పరుగున తిరిగి వచ్చి పులిని చూచామని భయపడుతూ చెప్పారు.
ఒక వీరుడు పులిని తాను ఒక్కడినే వదిస్తానని వేటకై ధనర్చాణాలు అందిస్తూనూ , వీర తిలకం దిద్దుతూనూ , యువతులు పాడిన వీర గీతమది.
క్రూరమృగాన్ని వధించి దీనులయిన తన ప్రజలను కాపాడుకోవలసిందని ప్రోత్సహిస్తూ , అతని వీరత్వాన్ని పొగుడుతూ వీడ్కోలు చెప్పటమే ఆ పాటకు అర్ధం.
వింటున్న శ్రోతలంతా పరవశులయినారు. జయకృష్ణ మనసు కొన్ని శతాబ్దాల వెనుకకు పోయింది. అడవి దారుల వెంట బ్రతుకుదారులు అన్వేషించిన ఆనాటి అతవీకుల జీవితమంతా అతని కన్నుల ముందు కట్టినట్లు అయింది.
లచ్చిమి పాడిన తరువాత మరొక యువతి అందుకుంది . ఇంక జయకృష్ణ ఎటువంటి ప్రోత్సాహము ఇవ్వాకుండానే వారు ఒకరి తరువాత ఒకరు చిత్ర విచిత్రమయిన పాటలు పాడారు. అందరూ కలసి చేతులు పట్టుకుని నెగడు చుట్టూ తిరుగుతూ నాట్యం చేశారు. రాకాసి గుహను త్రవ్వి పై మూతగా వున్న రాతి పలకను పగులకొట్టి జ్యోతిని వెలుపలకు రప్పించడంలో వారు పొందిన విజయానికి ఆ రూపంగా వారు తమ ఆనందాన్ని వెల్లడించుకున్నారు. రాత్రి పొద్దుపోయాక చెట్టు మదుగులో పొడిపొడిగా వున్న ప్రదేశాలు ఎంపిక చేసుకుని అలాగే పడుకుని నిద్రపోయినారు. నెగడు వెలుగుతూనే వుంది.
నల్లని తెల్లని మేఘశకలాలు తిరుగుతున్న ఆకాశంలో అప్పుడప్పుడూ చుక్కలు ప్రత్యక్షమవుతున్నాయి. కన్పించనట్లే కన్పించి మళ్ళీ మాయమవుతున్నాయి.
సరిగా అర్దారాత్రి అయింది.
అద మరచి నిద్రపోతున్న జ్యోతికి ఉలికి పడినట్లుగా అయి లేచి కూర్చుంది. చుట్టూ పరికించి చూచింది.
జయకృష్ణ నిద్రాముద్రలో ఒదిగి వున్నాడు. అదిమజనులంతా అస్తవ్యస్తంగా పడి వున్నారు. దూరం నించి ఎవరో పిలుస్తున్నట్లు అన్పించింది.
అడుగుల చప్పుడు విని చివ్వున పడగవిప్పి తలఎత్తి చూచేకోడె త్రాచులా తలఎత్తి చూచింది జ్యోతి.
ఆమె కనులు మిరుమిట్లు గొలిపినాయి. అదే ధవళకాంతి పుంజం! అదే చిరునవ్వు! విచ్చిన మల్లెల మీదుగా మంచు ముద్దలు దోర్లుతున్నట్లు నిలువెల్ల నిండారిన ధావళ్యమే!
రా రమ్మని చేతులు చాచి పిలుస్తోంది శ్వేతకి!!
జ్యోతి మనసూ వివశమయింది. విచిత్రమయిన ఆకర్షణతో పరాధీన మయింది. ఇంక తక్షణమే తన ఉనికినీ , తన స్థితినీ మరచి లేచి నిలిచిందామె. నడవసాగింది.
"సోదరీ! యుగయుగాల ఆత్మ యానంలో మానవాకృతి ఒక మజిలీ మాత్రమే! నీవు దాన్ని విడిచి నాతొ మమేకం కావాలి. రా! త్వరగా వచ్చేయ్. నీ కోసమే ఈ ఆత్మ పరితపిస్తోంది. నా కౌగిలి లో ఇమిడిపోయి చేజారిన బ్రతుకు అర్ధాలు నీకిచ్చిన ఆవేదన నించీ, అవిశ్రాంత బాధా పరితప్తమయిన స్థితి నించీ నీవు విముక్తురాలివి కావాలి . రా! సోదరీ! త్వరగా రా!!" అని పిలుస్తున్న శ్వేతకి ధవళరూపాన్ని అనుసరించి పోసాగింది.
అసలే చీకటి! ఆ పైన ఆకాశంలో దట్టంగా క్రమ్మిన మబ్బులు, కాటుక రాశి పోసినట్లుగా వుంది ఆ ప్రాంతం. ఎవరి వునికి వారికే అగుపించని దట్టమయిన ఉన్మాదం లాంటి చీకటి! అర్ధం తెలియని అయోమయం లాంటి దుస్థితి.
అయినా ఎవరో దారి చూపుతున్నట్లు నడుస్తోంది జ్యోతి!
పగలే కన్ను పొడుచుకున్నా కనుపించని రాక్షసి గుహ వైపుగా ముందుకు పోతోంది. శ్వేతకి ఆత్మరూపం. దాన్ని అనుసరించి నడుస్తోంది జ్యోతి.
కాటుక రాశి పోసినట్లున్న చీకటిలో నడుస్తూ అయోమయంలాంటి ఉన్మాదం లాంటి చీకటి గుయ్యారంగా వున్న రాక్షసి గుహ ముఖ ద్వారాన్ని చేరుకున్నదామే.
లోపల ఆరడుగుల సమాధిలోకి వెళ్ళి మెత్తని శయ్యమీద శయనించినట్లుగా పడుకుంది శ్వేతకి. జ్యోతి ఆత్మ బంధువును చేరుకొంటున్న అర్తునిలా, తల్లి పొదివి చేరుతున్న ఆకొన్న లేగదూడలా, యుగయుగాల విశాల విశ్వంతరాళ భ్రమణంలో విసిగి చేరవలసిన చోటుకి చేరుతున్న ఆత్మలా ఆ వంకకు అడుగు కదిల్చింది జ్యోతి. అడుగు ముందుకు పడింది.
ఆరడుగుల సమాధి లోపలి సమాధిలో క్రేనియం కకావికలాడుతూ కరకరమని కదిలినట్లు అయింది.
ఆమె మెడ మీద ఏదో బరువు పడినట్లుగా అన్పించింది. ఆమెకు వెనుదిరిగి చూడాలనిపించలేదు. ఒకవేళ అనిపించినా ఆ పని చేయగల శక్తి ఆమెకు లేదు.
నిస్సహాయంగా మెడను వాల్చేసింది జ్యోతి!!
13
ఆరు నెలల వైవాహిక జీవితం తరువాత భర్తతో పాటే తన సుఖ సంతోషాలను, సౌభాగ్యాన్ని కోల్పోయిన ఆ శ్వేత వస్త్రధారిణి అయిన విధవరాలి కోసం చుట్టూ చూసింది ప్రొఫెసర్ శ్రద్దాదేవి.
భర్త విహీనలయిన యువతులెవ్వరూ అక్కడ లేరు. ఉన్నది తామిద్దరే!
అప్పుడు ఉపాధ్యాయ మహాశయుడని చెప్పుకుని వినయంగా నటించి ఇప్పుడు వికటంగా నవ్వుతున్న ఆ వ్యక్తీ తో పాటు మూసిన తలుపుల మధ్య తాను.
భర్త లేని యువతి కోసం పరిశీలించి చూస్తున్న ఆమెను పరిహాసం చేస్తూ మరింతగా నవ్వాడు అతడు.
"ఆమె ఎక్కడ?" ప్రశాంతమయిన స్వరాన శ్రద్దాదేవి మాటలు అతడికి పరిహాసపాత్రంగా కన్పించినాయి.
"ఆమె ఎవరు?" అన్నాడు ఏమీ ఎరుగని వాడిలా. ప్రొఫెసర్ శ్రద్దాదేవి కొంత పరిష్టితిని అర్ధం చేసుకుంది.
ఏదో మోసం జరుగుతోందని గ్రహించిందామె. కాని తనను మోసగించవలసిన అవసరం ఎవరికి, ఎందుకు కలిగిందో మాత్రం అర్ధం కాలేదు.
"నీవెవరు?' నేత్రాలు విశాలం చేసి అడిగింది ప్రొఫెసర్ శ్రద్దాదేవి.
