కుడికాలు ఎత్తి పంజా విప్పింది.
కత్తుల్లాంటి గోళ్ళు బయటికి పొడుచుకొచ్చాయి. యినుప ఊచలు అడ్డుకోవటం తన అంతటి శక్తి శాలిని లక్ష్య పెట్టకుండా ఎదురుగా ఉన్న మనిషి జాలిగా చూడటం అహంకారాన్ని రెచ్చగొట్టింది.
అవమానాన్ని భరించలేక గుహలా నోరు తెరచి గాండ్రించింది.
జయసింహకి గుండెలు ఝల్లుమన్నాయి.
అవును మరి! అది శక్తికి మరో రూపం!
అమాయిక మృగాలకు ప్రకృతి సృష్టించిన శాపం!
కాని బోనులో చిక్కి దాని శక్తి నంతా నీరు కారిపోయింది! అవమానం భరించలేక తిరిగి పచార్లు ప్రారంభించింది.
కరెంటు దీపాల కాంతిలో మెరుస్తున్న శరీరాన్ని విదిలించేసింది. దాని చూపు, నడక, గాండ్రింపు ప్రతి కదలికలోనూ అద్భుతమయిన వేగమూ శక్తీ నిండి ఉన్నాయి.
అది శక్తికి మారు రూపం!
అవును . అదే శక్తి! శక్తి! ! జయసింహ ఆలోచనలు మెరుపులా మెరిసాయి.
అక్కడున్న అమ్మాయితో మాటలు పెంచాలి!
"ఈ బ్లాక్ పాంధర్ ని ఎక్కడ పట్టుకున్నారు?" అని అడిగాడు.
"ఆఫ్రికా అడవుల్లో"
"ఇది యెంత వేగంగా పరుగెట్టగలదు?"
"నూరు నించి నూట యిరవై! మీకెందుకు ఈ వివరాలన్నీ?"
"దీని ఫోటో తీసుకోవచ్చా!"
"మీరెలా తీయగలరు? మీ దగ్గర కెమెరా లేదుగా!" తన తప్పుని గుర్తించి నాలుక కరుచుకున్నాడు. సో ప్రారంభమవుతున్న సూచనగా గంట మ్రోగింది. డేరాలో దీపాలు తీసేశారు. చీకటి అలుముకుంది.
గ్రౌండ్ లో స్పాట్ లైట్లు పడుతున్నాయి.
"మీరింక వెళ్ళిపోవచ్చు" అందా అమ్మాయి. బోనులో నల్ల పులి కాళ్ళ క్రింద నలుగుతున్న చిన్న బరిణ కన్పించింది. బహుశా దానిలో క్లూ దాచి ఉంచవచ్చు. పందానికి చాలా ఘనమయిన ఏర్పాట్లు చేశారు.
సర్కస్ కంపెనీ వాళ్ళని కూడా పట్టుకున్నారు. చాల పెద్ద మొత్తంలో బహుమతి యిచ్చే కారణం అదన్న మాట!
ఆ బరిణను సంపాదించట మెలాగా అన్న ఆలోచనలో పడిపోయాడు. అతడా ఆలోచనలో ఉండగానే ఒక యువతి హడావుడిగా వచ్చింది.
ప్యాంటు పుల్ హాండ్స్ షర్టు వేసుకుందామె.
రాగానే బోను దగ్గరున్న అమ్మాయికి ఐడెంటిఫికేషన్ చూపించింది. కొంచెం ప్రక్కగా జరిగి నిలబదిందామె. పులికాళ్ళ క్రింద ఉన్న బరిణ కోసం క్రొత్తగా వచ్చిన యువతి తొందరపడుతోంది.
నల్లపులి ఆవేశం తగ్గిపోయింది. ఎర్రని నాలుకతో మీసాలు తుడుచుకుంటూ అటూ యిటూ పచార్లు చేస్తోంది.
పులి మరో వైపుకి తిరిగినప్పుడు చాల ఒడుపుగా ఊచల మధ్య నించి చేయి దూర్చింది. ఆమె ఎంత వేగంగా ఆ బరిణను తీసుకోవాలని ప్రయత్నించినా ఆ ప్రయత్నం విఫలమయింది.
ఒకటి రెండు సార్లు తన బోనులో చేయి పెట్టిన ఆ అమ్మాయి సాహసాన్ని అభినందించుకున్న విధంగా చూసింది నల్లపులి. మాటువేయటం కాచి కొట్టటం దాని జన్మత వచ్చిన విద్య!
మరో వైపు తిరిగి చాలా ప్రశాంతంగా నిలబడింది.
అదే మంచి అదను అనుకుంది క్రొత్తగా వచ్చిన అమ్మాయి. బోనులోకి చేయి పోనిచ్చి బరిణ అందుకోవాలని ప్రయత్నించింది.
ప్రత్యర్ధిని దెబ్బ తీయటంలో వేగం అనుభవం శక్తి ప్రదర్శించటంలో పులికి సాటివచ్చే జంతువు మరొకటి లేదు.
ఎప్పుడయితే చేయి అందుబాటులోకి వచ్చిందో అదను చూసి పులిలా కదిలింది బ్లాక్ ఫాంధర్!
ఆ అమ్మాయి పెద్ద పెట్టున అరిచి వెనక్కి విరుచుకుని పడిపోయింది. అదృష్టవశాత్తు ప్రమాదం తప్పింది. నల్లపులి పంజా తాలుకూ ఒకే ఒక్క గోరు అది ముంజేతికి తగిలింది.
వెంటనే వెనుదిరిగి ఆ చేయిని కోరల మధ్య బిగించాలని ప్రయత్నించింది నల్లపులి. ఆ ప్రయత్నం సాగితే ఆమె జీవితం ఆసాంతమయేది కాని అది లోన కావటం నించి స్వేచ్చగా తిరగలేకపోయింది.
ఆమె చేతికి రుమాలు తీసి కట్టు కట్టాడు జయసింహ! "యాంటి సెప్టిక్ యింజక్షన్ చేయించుకోవాలి వెంటనే" అని సలహా యిచ్చాడు.
ఆమె వెళ్ళిపోయింది. దూరంగా నిలబడి చూస్తున్నాడు.
అవకాశం అయిదు నిమిషాల అనంతరం వచ్చింది.
సిగ్నల్ రాగానే బ్లాక్ ఫాంధర్ నిహాకి తీసుకుపోయింది సర్కస్ అమ్మాయి. జయసింహ బోను వైపు పరుగు తీశాడు.
లోపల ఉన్న బరిణ అందుకున్నాడు. మూత తెరచి లోపల వున్న ఓ కాగితం అందుకున్నాడు. సర్కస్ స్టాండు విడిచి దూరంగా వచ్చాడు!!
17
స్టేడియం రోడ్డులో విశాలమయిన పార్కు దగ్గర నియాన్ దీపం దివ్యంగా వెలుగుతోంది. ఆ కాంతిలో పేపర్ ని పరిశీలించాడు. దాని మీద పెన్సిల్ తో వ్రాసిన అక్షరాలు కన్పించాయి!
స్టార్ సన్! కాగితం పొడువు పది సెంటిమీటర్లుంది . వెడల్పు ఆరు సెంటి మీటర్లు! తెల్లని ఆర్ట్ పేపర్!
దాని మీద పెన్సిల్ తో చుక్కులున్నాయి. ఆకాశంలో నక్షత్రాల్లా కన్పిస్తున్నాయి చుక్కలు! వాటి మధ్య అక్షరాలు వలయాకారంలో వ్రాసి వున్నాయి.
చుక్కల్లో సూర్యుడు! స్టార్ సన్! అదెలా సాధ్యం!
రాత్రి ఆకాశంలో చుక్కల మధ్య చంద్రుడుంటాడు. పగటి ఆకాశంలో సూర్యుడుంటాడు. కాని చుక్కలు కన్పించవు.
స్టార్స్ మధ్య సూర్యుడు వుండటం అసాధ్యం!
జయసింహ నీరుకారి పోయాడు! అక్కడ నించి ఎటూ వెళ్ళాలి అనేది అర్ధం కాని పజిల్ ! నిజంగా పోటీలో పాల్గొనే వాళ్ళందరిని ఫూల్స్ చెయ్యటానికే ఈ ప్రయత్నం.
కాగితాన్ని మడిచి నేలకు విసిరి కొట్టాడు. వాహనాల రద్దీ తగ్గిపోయింది. స్టేడియం రోడ్డు విశాలంగా నిశ్శబ్దంగా వుంది.
చల్లని రాత్రి! గాలి విసురు గిలిగింతలు పెడుతోంది.
విసుగ్గా తలఎత్తి ఆకాశం వంక చూచాడు. చుక్కల మధ్య వెలుగుతున్న చంద్రుడే కన్పించాడు. సూర్యుడు కన్పించాలంటే యింకా ఎనిమిది గంటలు ఎదురు చూడాలి!
ఈలోగా అవకాశం చేజారి పోతుంది.
సూర్యుడోచ్చే వేళకి చుక్కలు మళ్ళీ కన్పించవు. ఎన్నో ఆశలు పెట్టుకుని చేసిన ప్రయత్నం అంతా వృధా అవుతుంది.
అతనికి చాలా కోపంగా ఉంది. ఓటమిని ఒప్పుకోవాలా?
చాల దగ్గరలో కిలకిలమంటూ నవ్వు విన్పించింది. తల యెత్తి చూశాడు. పులి పంజాలో దెబ్బతిన్న అమ్మాయి.
జారిపోతున్న షర్టు చేతుల్ని పైకి మడుచుకుంటూ కన్పించింది. ప్యాంటు కూడ మడుచుకుంది. మేజోళ్ళు కన్పించేలా!
వొంగి అతడు నేలకు విసిరికొట్టిన కాగితాన్ని అందుకుంది, దాని మీద పెన్సిల్ తో వ్రాసి ఉన్న అక్షరాల్ని చుడువుతోంది.
అప్రతిభుడై చూస్తూ వుండిపోయాడు జయసింహ!
చదవటం పూర్తీ ఆయిం తరువాత కాగితాన్ని మడిచి ప్యాంటు జేబులో దాచుకుంది. ఆమె పెదవులు విచ్చుకున్నాయి.
అందంగా నవ్విందామే! కన్నులు నీటిలో ఈదుతున్న చేపపిల్లల్లా వున్నాయి.
కనుబొమలు అతన్ని ఎగతాళి చేస్తున్నట్లుగా ఒరిగాయి.
"నా కాగితం ఎందుకు తీసుకున్నారు?" అన్నాడు జయసింహ.
"పబ్లిక్ రోడ్డులో నేలకు విసిరి కొట్టిం తరువాత వస్తువు మీదెలా అవుతుందనుకున్నారు?" అందామె నిర్లక్ష్యంగా.
"దాన్ని నేను కష్టపడి సాధించాను"
"దీని కోసమే నేను పులి పంజాతో దెబ్బ తిన్నాను"
"కాని సాధించలేక పోయారు కదా!"
