Previous Page Next Page 
మిస్టర్ 'యూ' పేజి 42

 

    ఎనిమిదవుతోంది .
    కానీ -
    అక్కడ చీకటి అనేదే లేదు !
    వంగి, యధాలాపంగా ఒక రాయి తీసుకుని పైకి విసిరాడు.
    ఆ రాయి , రెక్కలు వచ్చిన పక్షిలా నింగిలోకి దూసుకుపోయింది ! కింద పడలేదు.
    అతను ఆశ్చర్యంగా ఆకాశంలోకి చూస్తూ ఉండగానే -
    ఒక అద్భుతం జరిగింది !
    బ్రహ్మాండమైన జలచరంలా నీళ్ళలో నుంచి నింగికి ఎగసింది ఆ 'లంక'
    పైకి పైకి పై పైకి పోయి ఆకాశంలో అల్లంత దూరాన ఆగింది అది!
    "స్పేస్ షిప్!" అన్నాడు రాజు.
    అప్పటిదాకా నీళ్ళలో వుండి పైకి ఎగసిన ఆ స్పేస్ షిప్ కి అంటుకుని వున్న నీళ్ళు వర్షపు చినుకుల్లా కిందపడుతున్నాయి.
    "స్పెస్ షిప్ ......అంటే గ్రహాంతరా వాసులా?" అంది సృష్టి విస్మయంగా.
    "ఆశ్చర్యం నటిస్తావెందుకు సృష్టీ -- వాళ్ళు గ్రహాంతరవాసులు -- మీవాళ్ళే!" అన్నాడు రాజు నిదానంగా చెంప మీద చెళ్ళున కొట్టినట్లయింది సృష్టీకి.
    "ఏమిటి? ఏమంటున్నావ్ ?" అంది తడబడుతూ.
    సూటిగా ఆమె వైపు చూశాడు రాజు.
    "ఇంక నాటకం అనవసరం సృష్టీ - చెప్పు -- మీది ఏ గ్రహం ?"
    నిశ్చేష్టులై ఇదంతా వింటున్నారు నిఖిల్ నిత్య.
    కొద్ది క్షణాల పాటు తికమకపడ్డట్లు చూసింది సృష్టి తర్వాత తేరుకుంది. నెమ్మదిగా ఆమె మోహంలో చిరునవ్వు చోటు చేసుకుంది.
    "అవును ....ఇంకా నాటకం అనవసరం -- ఇప్పుడే కాకపోయినా ఇంకాసేపటి తర్వాత అయినా ఎలియక తప్పదుగా . నీకు బలం తప్ప తెలివి లేదనుకున్నాను టార్జాన్ - ఎట్టా కనిపెట్టేశావ్?"
    "ఒక్కసారి రెప్పలు అర్పు సృష్టీ ! చెబుతాను ."
    కళ్ళార్పకుండా అతని వైపే చాలా సేపు ప్రశంసాపూర్వకంగా చూస్తూ ఉండిపోయింది సృష్టి. తర్వాత ప్రయత్నపూర్వకంగా , కనురెప్పలు మూసింది.
    ఆమె కనురెప్పలు మూసినా తీరు చూసి నిఖిల్ లాంటి సాహసికుడికి కూడా  గుండె ఒక్క క్షణం ఆగి, తిరిగి కొట్టుకోవడం మొదలెట్టింది. భయంగా నిఖిల్ చెయ్యి పట్టుకుంది నిత్య.
    మళ్ళీ కళ్ళు అర్పింది సృష్టి.
    మాములుగా మనుషులు కళ్ళు అర్పితే పై కనురెప్ప క్రింది కనురేప్పా కలుసుకుంటాయి.
    సృష్టి కళ్ళు అర్పితే --
    ఆమె కనురెప్పలు విచిత్రంగా ఎడం పక్క నుంచి ఒకటి కుడి పక్క నుంచి ఒకటీ దగ్గరికి వచ్చి తలుపులలాగా మూసుకున్నాయి.
    "మేం దేవతలం -- మీ మానవులలాగా కనురెప్పలు మాటిమాటికీ మూసి తెరవవలసిన అవసరం మాకు ఉండదు " అంది సృష్టి . అంటుండగానే ఆమె కంటస్వరం మారిపోవడం మొదలెట్టింది. కోటి వీణలు మోగుతున్నట్లుగా మధురాతి మధురంగా వుంది ఆమె గొంతు.
    చూస్తూ ఉండగానే ఆమె వంటి రంగు కూడా మారడం మొదలెట్టింది. బంగారు రంగుకి మారింది ఒళ్ళు. కొద్దిగా మెరవడం మొదలెట్టింది. దృవ ప్రాంతంలో వెలుగులీనే అరోరా బోరియాలిస్ తాలుకూ అద్భుత దృశ్యంలా ఉంది అది.
    "ఇదంతా నాటకం అని ఎప్పుడు గ్రహించావు టార్జాన్?" అంది నవ్వుతూ.
    "సృష్టీ ...." అని ఆగి , "ఇంకా నిన్ను సృష్టీ అని పిలవవచ్చా?" అన్నాడు రాజు సంకోచంగా.
    అమృతం కురుస్తున్నట్లుగా నవ్వింది సృష్టి.
    "నా పేరు సిహానా. అంటే మీ బాషలో సృష్టి అనే అర్ధం."
    "సిహానా ...సిహానా...సిహానా" అని తనలో తనే మూడుసార్లు ఆ పేరుని వుచ్చారించాడు రాజు.
    తర్వాత అన్నాడు. "నిన్ను సృష్టీ అనే పిలుస్తాను సృష్టీ."
    అలాగే అన్నట్లుగా నవ్వుతూ చూసింది సిహానా.
    "సృష్టీ ! నువ్వు జబ్బు పడినప్పుడు నిన్ను ఆ సినిమా యూనిట్ వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళాను గదా -- అప్పుడు అబ్జర్వ్ చేశాను -- నువ్వు అసలు కనురెప్పలు మూయవని . కళ్ళార్పకుండా చాల సేపు ఉండడం కొంతమందికి అరుదైన అలవాటుగా వుంటుంది. నీదీ అదే పద్దతి అనుకున్నాను. కానీ నీకు ఆరోగ్యం సరిగా లేనప్పుడు మాత్రం కళ్ళర్పకపోవడం అనేది అనారోగ్యంలో భాగామనుకున్నాను.........కానీ ఆ తర్వాత క్రమక్రమంగా అర్ధమయింది సృష్టీ.
    అంతలోనే --
    పైకి వెళ్ళిన స్పేస్ షిప్పులో నుంచి వెన్నెల లాంటి ఒక కాంతి పుంజం వెలువడింది.
    ఆ కాంతి పుంజం నెమ్మదిగా స్ర్పెడ్ అయి, స్వర్గానికి నిచ్చెన లాగా , భూమిని స్పేస్ షిప్పుని కలిపింది.
    ఆ వెన్నెల మెట్ల మీద నుంచి కిందికి దిగివచ్చాడు సైంటిస్టు జ్ఞాని. అతని వెనకే అతని అసిస్టెంట్ అనుచర్. "మా నాన్న - అయన అసిస్టెంటు " అని వాళ్ళని పరిచయం చేసింది సృష్టి.
    "నన్ను నేను పరిచయం చేసుకుంటాను -- నా పేరు సిసిహ . అంటే జ్ఞాని అనే అర్ధం. ఇతను సుహుసా- అంటే అసిస్టెంటు. దేవతలం మేము. మీ మనుషుల మధ్య కొంతకాలం ఉండాలని వచ్చాం.
    ఈ పాలపుంత పొలిమేరల్లో ఉన్న ఒక సూర్యుడి తాలుకూ గ్రహం మాది. పేరు సాహా.
    "మీరు .....ఈ భూలోకానికి ఎందుకొచ్చారు ?" అన్నాడు రాజు.
    నవ్వాడు జ్ఞాని అనబడే సిసిహ.
    "మీ మనుషుల అజ్ఞానాన్ని అంచనా వేద్దామని ."
    వింటున్నాడు రాజు.
    తలుచుకుని తలచుకుని నవ్వుతూ అన్నాడు సిసిహా- జ్ఞాని.
    "మనుషుల్లాగా వచ్చి మీ సైంటిఫిక్ రిసెర్చి డిపార్ట్ మెంటులో చేరాం. అక్కడ జరుగుతున్న రిసెర్చి ఏమిటో తెలుసా?
    ఏమిటన్నట్లుగా చూశాడు రాజు.
    జ్ఞాని అవహేళనగా అన్నాడు.
    "అక్కడంతా అజ్ఞానం!
    ఆశ్రిత పక్షపాతం! అయిన వాళ్ళని అందలం ఎక్కించడానిక అలివికాని పాట్లు -- ఆ సంస్థ ఎంత పెద్దదిగా పెరిగిపోయిందంటే దానికి మొదలెక్కడో, చివరేక్కడో కనుక్కోవడానికి పెద్ద ప్రాజెక్టులాగా వర్క్ చేస్తున్నారన్నమాట!' అని పెద్దగా నవ్వాడు జ్ఞాని.
    ఉన్నట్లుండి అతని కంఠస్వరం కఠినంగా మారిపోయింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS