"అవిగో అదే వద్దన్నది .....తొందర ఏమీ లేదు....అలా అని నిన్ను బలవంతంగా ఈ మార్గంలోకి మళ్ళించడం నా అభిమతం కాదు..... నిదానంగా ఆలోచించాకే నిర్ణయం తీసుకో .... సమాజంలో గౌరవంగా బ్రతకాలంటే డబ్బు ముఖ్యం. ఆ విషయం నీకు తెలియనిదేమీ కాదు, నిరుద్యోగిగా బతికే కంటే ఈ మార్గాన్ని ఎన్నుకోవడం ఉత్తమం. నీ టాలెంట్ ను ఎవరో గుర్తించలేదని నిరుత్సాహపడేకన్నా ఈ విధంగా ఉపయోగించి డబ్బు సంపాదించడం నేర్చుకో ....ఒకవేళ అలాంటి జీవితంపై విరక్తి కలిగింది అనుకో అప్పుడే మానివేయవచ్చు...." నచ్చజెప్పే ప్రయత్నం చేసింది సుజాత.
"నేను తప్పు చేస్తున్నాననే ఫీలింగ్ వెంటాడుతుంది..... నాకు ఆలోచించుకోవడానికి సమయం కావాలి ...." అన్నాడు సునిల్.
"ఇట్స్ ఒకే.....కావలసినంత టైం తీసుకో.....నీ కిష్టమైతేనే తెలుసుగా నా ఫోన్ నెంబర్ .....ఫోన్ చేయి చాలు....మన మధ్య వున్నది కేవలం బిజినెస్ డీలింగ్ .....నువ్వు సంపాదించిన సంపాదనలో సగం నాకు ఇవ్వాలి. నువ్వు నన్ను మోసం చేయనంత కాలం మన డీలింగ్ సజావుగానే వుంటుంది."
"సమాజంలో నీకు ఒక హోదాను కల్పించి హైక్లాస్ సొసైటీ లేడీస్ కు నిన్ను పరిచయం చేసే బాధ్యత నాది. డబ్బు సంపాదించే బాధ్యత నీది.... మన డీలింగ్ సక్రమంగా ఉన్నంత కాలమూ ఇద్దరమూ హాయిగా గడిపేయవచ్చు. ఒకే యంగ్ మాన్.....సీయూ ఎగైన్..... " అంటూ సుజాత అతనికి షేక్ హేండ్ ఇచ్చింది.
విసురుగా తల తిప్పుకుని ఆ భవంతిలో నుంచి బయటకు వచ్చేశాడు సునిల్.
అతని మనస్సు నిండా ఎన్నెన్నో ఆలోచనలు .....!
* * *
అప్పటివరకు చదువుతున్న సునిల్ డైరీ మూసి లేచి నిలుచున్నది ధీరజ....
ఆమె కళ్ళలో నీరు వూరింది....
సునిల్ హృదయ వేదన ప్రతి పేజీలోనూ వ్యక్తం అయింది. అతను ఏ విధంగా ప్లే బాయ్ అయ్యాడో ఆ డైరీలోని ప్రతి పేజీ చెప్పకనే చెబుతుంది.
తను హైదరాబాద్ వెళ్ళినప్పటి నుండీ ఈరోజు వరకూ సునిల్ తన ఎదుటకు రావడానికి ఎందుకు వెనుకాడాడో ఇప్పుడు ఆమెకు పూర్తిగా అర్ధం అయింది.
అతని గమ్యం వేరు కావడం వలన మానసికంగా చిత్రవదను అనుభవిస్తూ తనంతట తనే తనను దూరం చేసుకుంటున్నాడు.
సునిల్ ఎవరేవరినీ ఎప్పుడు కలుసుకున్నది.... ఆరోజు తను ఎంత చిత్రవధ అనుభవించింది డైరీలోని ప్రతి పుట కళ్ళకు కట్టినట్టు తెలియ చేస్తున్నది.
సీతాపతి హత్య విషయంలో సునిల్ కు ఎలాంటి సంబంధమూ లేదు అనడానికి డైరీ సాక్షిగా నిలిచిపోతుంది.
లలిత విషయంలో అందరూ సునిల్ ను అపార్ధం చేసుకున్నారు.
జీవితంలో ఏదో వెలితి, అసంతృప్తితో వున్న ఆడవాళ్ళు కావాలని అతనిని రప్పించుకుని తన కోరికలను చల్లార్చుకుని డబ్బును సునిల్ ముఖాన కొట్టారు. కొందరు స్టీలు పొట్ట కూటి కోసం వేశ్యలుగా మారడం తెలిసిందే.....
సకల భోగాలను అనుభవిస్తూ --భర్తను మోసం చేస్తూ కావలసిన విటులతో డబ్బు కోసం కులకడం, ఆ డబ్బు కోసం ఎంతకయినా తెగించే వ్యక్తీ లలిత..... అందుకే ఆమె అంటే నాకు అసహ్యం..... సంపాదించే భర్త ఉండడానికి ఇల్లు....ఇద్దరు పిల్లలకు తల్లి అయిన లలిత ప్రవర్తన తనకు ఎబ్బెట్టుగా తోచింది.
మొదట తనంటే మోజు పడుతుంది అనుకున్నాడు భర్త వలన సంసార జీవితంలో ఆమెకు అసంతృప్తి వుందనుకున్నాడు. కానీ కేవలం డబ్బు కోసం ఇటు కట్టుకున్న భర్తను, కన్నపిల్లలకు తెలిసే విధంగా వ్యభిచరించడం క్షమించరాని విషయం.
తను కాదు అన్నానని మరో విటుడిని వేదుక్కుంది ఆమె.
ఆమె ఎన్నుకున్న మార్గం తప్పు అని ఎప్పటికి తెలుసుకుంటుందో
పూర్తిగా చదివిన ధీరజకు లలిత ఎలాంటిదో అర్ధమైంది.
అంటే, ఆమెకు మరొక విటుడు వున్నాడు.
అతనితో కలిసి ఆమె తన భర్తను హత్య చేసినట్టా? యేమో అవ్వొచ్చు!
ధీరజ రెట్టించిన ఉత్సాహంతో ఎలాగైనా ఈరోజు హంతకుడు ఎవరో పరిశోధించి తీరాలనే పట్టుదలతో వైజాగ్ రైల్వే స్టేషన్ కు చేరుకున్నది.
అప్పుడే కదులుతున్న 427 పాసింజర్ లో బయలుదేరింది ధీరజ.
అప్పుడు సమయం ఏడు గంటలు అవుతుంది.
వరుసగా వచ్చే స్టేషన్లు అన్నింటిని పరిశీలనగా చూస్తుందామె.
ఏడున్నరకు దువ్వాడ స్టేషన్ లో ఆగింది.
ఒకవేళ వైజాగ్ లో కాకుండా పక్కనే వున్న స్టేషన్ లో యెక్కడ నుంచయినా సీతాపతి శవం ఉన్న పీపాను ముద్దాయి ఎక్కించి వుండవచ్చునని ఆమె ఊహా....
అందుకే వరుసగా వచ్చే స్టేషన్ లో ఎక్కడ అలాంటి అవకాశం వుందో గమనించసాగింది.
అనకాపల్లి వచ్చేసరికి ఎనిమిది గంటలయింది.
అనకాపల్లి రాబోయే ముందు చిన్న బ్రిడ్జి దాటింది, రాల్వే ట్రాక్ ప్రక్కనే స్టేషన్ వచ్చేటంతవరకూ వెడల్పుగా కాలిబాట కనిపించింది. ఆ బాట వెంట ఎవరయినా పీపాను తెచ్చి అనకాపల్లి స్టేషన్ లో ఎక్కించే అవకాశం ఉన్నట్టు ఆమెకు తోచింది.
ఏది జరిగినా చీకటిలోనే జరిగి వుండాలి కాబట్టి పీపాను తెచ్చి ట్రెయిన్ లో ఎక్కించినా ఎవరూ గమనించే అవకాశం వుండదు.
ఒకవేళ అనాకాపల్లిలోనే జరిగి వుండాలంటే అంత అర్ధరాత్రి వరకూ ఆ రూట్ లో వెయిట్ చేయనవసరం లేదు. పాసింజర్ రాకముందే రోడ్ వెంట వచ్చి ఈ రైలు వచ్చే రూట్ లో ఎక్కడో ఒకచోట దాగి వుండి అవకాశం చూసి పీపాను ఎక్కించవచ్చు.
అదీ పది గంటల లోపలే జరిగి వుంటుంది.
అంటే తుని స్టేషన్ వచ్చే లోపలే ఎక్కడో ఒకచోట ఈ పని జరిగి వుండాలి.
నర్శింగపల్లి వచ్చేసరికి ఎనిమిదింబావు అయింది.
స్టేషన్ రాబోయే ముందు ట్రాక్ ప్రక్కనే నిలువెత్తున వున్న రెండు కొండలు .....ప్రక్క తాటి చెట్టు .....చొప్పదంటు పొలాలు ఎవరయినా దాగి వున్నా కనిపించే వీలులేకుండా వున్నాయి.
ధీరజ అనుమానం ఉన్నచోటల్లా ఆయా స్టేషనుల పేరు నోట్ చేసుకుంటున్నది.
పాసింజర్ రైలు మరుసటి రోజు పదిగంటలకు విజయవాడ చేరుకున్నది.
వెంటనే స్టేషన్ సూపరింటెండెంట్ ను కలిసి ధీరజ తనకు కావలసిన వివరాలను సంపాదించింది.
జూన్ ఒకటవ తేదీన పాసింజర్ బయలుదేరాక రేగు పాలేం, పిఠాపురం, గోదావరి, తాడేపల్లి గూడెం, దెందులూరు, ఏలూరు , తేలప్రోలు గన్నవరం లలో మాత్రమే సిగ్నల్ వెంటనే ఇవ్వని కారణంగా ఎక్కువ సేపు ఆగింది.
వాస్తవానికి ఏడూ నలభయి ఐదు రావలసిన పాసింజర్ పది నలబై ఐదుకు వచ్చింది.
అంటే ఆరోజు మూడు గంటలు ఆలస్యంగా వచ్చింది.
ఇంజను వెనుకనే 3872 నంబరు కలిగిన ఎస్. ఎల్. ఆర్ భోగి వున్నది.
ఈ భోగి డామేజ్ కావడం వలన విశాఖ స్టేషన్ నుంచి బ్విజయవాడకు తీసుకువెళ్ళి వదిలిపెట్టే వుద్దేశ్యంతో పాసింజర్ బయలుదేరబోయే ముందు ఇంజనుతో కలిపి ఎటాచ్ చేయడం జరిగింది.
బయలుదేరేటప్పుడు ఎటాచ్ చేయడం వలన కానీ, చూడడానికి సీట్లు బాగోని కారణంగా కానీ ఏ స్టేషన్ లోనూ పాసింజర్లు ఎవ్వరూ ఎక్కిన చిహ్నాలు లేవు.
