అతిథులందరికీ సూప్ సర్వింగ్ అయింది. వారు దానిని చప్పరిస్తుండగా బల్లల మీద మెనూ ఐటమ్స్ ని రెడీ చేశారు.
భద్రంగారు ప్లేట్ లో పదార్దాలను వడ్డించి స్వయంగా తీసుకువెళ్లి ఛైర్మన్ గారి కరకమలాలలో వుంచారు.
రజాక్ అదే ఫక్కీలో డైరెక్టర్ గారికి వడ్డించాడు. మిగిలినవారు ఎవరికి వారు ప్లేట్లలో తీసుకుని తినసాగారు.
మరో ముప్పావుగంట లో భోజన కార్యక్రమం పూర్తి అయింది.
అందరూ తిరిగి కుర్చీలలో కూర్చున్నారు. హాట్ డ్రింక్స్ ను స్వయంగా సర్వ్ చేయడం మొదలుపెట్టాడు రజాక్.
గానాబజానా తీరు మారింది. అర్దనగ్నంగా వున్న సుందరీమణులు రంగప్రవేశం చేశారు. బాలీసుల మీదవున్న గాయకబృందం రెండర్దాల పాటల్ని పాడుతుంటే నర్తకీమణులు ఆ భావాలకు అనుగుణంగా వివిధ భంగిమలలో నాట్యం మొదలుపెట్టారు.
కపూర్ గారి ముఖం దివిటీలా వెలిగిపోయింది. అందరూ తన్మయత్వంలో మునిగిపోయారు. అందరికీ కైపు ఎక్కింది. మాంఛి నిషాలో ఊగిపోతున్నారు.
పానకంలో పుడకలాగా, మధురగానం మధ్యలో అపశృతిలాగా బయట కారుహారన్ మ్రోగింది. అది వినగానే వాచ్ మన్ పై ప్రాణాలు పైనే పోయాయి.
"సార్.. మా దొర వచ్చేశాడు. ఇప్పుడేమిటి చెయ్యడం?" అంటూ తల బాదుకుంటూ గేటు తీయడానికి పరుగెత్తాడు.
"ఎవర్రా లోపలుంది? ఏమిటి గోల?" అంటూ అరుపులు వినిపించాయి.
చేతితో సంజ్ఞ చేసి గానాబజానా ఆపించాడు రజాక్.
తెగువ తెచ్చుకుని బయటకు వచ్చి "నమస్కారం సార్.. నేను రజాక్ ని. ఈ ఊరి..." అంటూ మొదలుపెట్టాడు తడి ఆరిన గొంతుతో.
"నువ్వెవరైతే నాకేటి బే! ఎవరు లోపలుంది?' అని గట్టిగా అరిచాడు రాజా ప్రసాదరాయ బహద్దూర్. ఆయన వెంట ఆయన" జర్మన్ ప్రియురాలు" కూడా వుంది. వెన్నెలరాత్రి బీచ్ లో ఎంజాయ్ చేయాలని వచ్చారు ఆ ప్రేమికులు.
"దొరా ....ఈయనే చెప్పిండు తమర్ని అడిగానని!" అన్నాడు వాచ్ మన్ రజాక్ ని చూపుతూ.
"వాడెవడురా చెప్పడానికి..., నువ్వెవరు ఇయ్యడానికి? అంటూ నడుంకి వున్న బెల్టు తీసి గొడ్డుని బాదినట్లు బాదసాగాడు వాచ్ మన్ ని.
"రచ్చించండి దొరా...." అంటూ ఆయన కాళ్లమీద పడ్డాడు వాచ్ మన్.
"స్టాపిట్ ఐసే!" అంది జర్మన్ నారి.
కొట్టడం ఆపి లోపలికి వచ్చాడు రాజావారు.
అప్పటికి అయ్యవార్ల నిషా చాలావరకు దిగిపోయింది. ప్రళయరుద్రుడిలా చిందులు తొక్కుతూ రంకెలు వేస్తున్న ఆయన్ని చూడగానే అందరి ప్రాణాలూ పైనే పోయాయి. గానాబజానా వాళ్ళు తమ సరంజామా సర్దుకోసాగారు.
"ఎవర్రా వీళ్ళంతా.... దొంగనాయాళ్ళు?" అని అరిచారు రాజావారు.
"వీరు ఛైర్మన్ గారు. పంజాబ్ నుంచి వచ్చారు. వీరు ఆఫీసర్లు..." అంటూ హీనస్వరంతో చెప్పడం మొదలుపెట్టాడు రజాక్.
"ఆఫీసర్లా - గాడిదగుడ్డా...? ఆఫీసర్లయితే దొంగచాటుగా నా బంగళాలోనికి వస్తారా బే....?! లంజకొడుకులు..., లండీకొడుకులు...." అంటూ తిట్లందుకుని, "ఒరేయి..... దొంగనాయాళ్లలారా - పది నిమిషాలలో మీరందరూ బంగళా ఖాళీ చేసి బయటకు పోకపోయారంటే మిమ్మల్ని పిట్టల్ని కాల్చినట్లు కాల్చేస్తా. ఒరేయ్... కారులో నా గన్ వుంది - తీసుకురా!" అని వాచ్ మన్ తో గట్టిగా అరిచాడు.
"చిత్తం దొరా!" అంటూ ఛంగున బయటకు వెళ్ళి గన్ తెచ్చి ఇచ్చాడు వాచ్ మన్.
అసలే ఫారిన్ విస్కీ బాగా పట్టించి కైపు మీదున్నాడు రాజావారు. దానికితోడు - పట్టరాని ఆవేశం! చింతనిప్పుల్లాంటి కళ్లతో చూస్తూ మనిషి ఆసాంతం ఊగిపోతున్నాడు. తుపాకీ ఎక్కుపెట్టి, "ఇంకా నుంచున్నారే.. .పొండి బే.... పోతారా - కాల్చేయమంటారా?" అని అరిచాడు.
రజాక్ ధైర్యం తెచ్చుకుని, "సార్.. ఇప్పుడు వెళ్లడానికి బస్ కూడా వుండదు. చీకటి పోకముందే తెల్లవారే వెళ్లిపోతాం!" అని చెప్పబోయాడు.
"ఎవడ్రా నువ్వు?బుద్దిలేదట్రా నీకు? చెప్తుంటే మనిషివి కావూ?పోతారా... ముందు నిన్నే కాల్చమంటావా?" అంటూ గన్ ని రజాక్ వైపు తిప్పాడు.
"వద్దు సార్... వద్దు... ఇప్పుడే పోతాం!" అని, "పదండి సార్!" అంటూ అందర్నీ తొందరపెట్టాడు రజాక్.
అంతే...! ఇంక కపూర్ గారు, ఆఫీసర్ లు, మిగిలినవారు ఎక్కడి సామాను అక్కడే వదిలేసి పరుగు లంకించుకున్నారు. కొందరు లుంగీలు, బనీన్లతో, కొందరు కేవలం అండర్ వేర్ లతో అలాగే పరుగులు తీశారు. అందరూ సరుగుతోటల్లో పడి, మెయిన్ రోడ్ వచ్చేదాకా ఒకటే పరుగు. ఆ హడావుడిలో వాళ్లు చెప్పులు కూడా వేసుకోలేదు. బ్రతుకుజీవుడా.... అంటూ ఒకటే పరుగు.
వాళ్ళంతా బయటకు పోగానే - "ఒరేయ్ .. .ఈ లంజకొడుకులు వదిలేసిన సామాన్లన్నీ బయట పారేసి బంగళా అంతా బాగా శుభ్రంగా కడుగు" అని ఆయన వాచ్ మన్ మీద అరిచిన అరుపులు ఆ ప్రశాంత వాతావరణంలో పరుగులిడుతున్న వారికి వినిపిస్తూనే వున్నాయి.
