Previous Page Next Page 
విష్ణు విలాసిని పేజి 41

    "నేనేం చదువుతానమ్మా! కాయం కష్టం చేసుకునే వాడిని. మసీదులో నమాజ్ చేయటం నేర్పించారంతే. నాకు గురువు మాత్రం నువ్వేనమ్మా!"
    "తథాస్తు!" అంది వెంగమాంబ.
    వెంగమాంబ ఇల్లు సమీపించటంతో,
    "ఉంటానమ్మా!" అని వంగి సలాంచేసి అనుమతికోసం ఆగాడు మురాషావలీ.
    "రేపు ఉదయం స్నానంచేసి ఏమీ తినకుండా గుడికి రా! గురువునన్నావుగా ఉపదేశం చేస్తాను. గొప్ప ఆధ్యాత్మిక ఔన్నత్యం పొందుతావు. నీ పేరు కలకాలం నిలిచి ఉంటుంది" అంది వెంగమాంబ.
    మురాషావలి ఆనందంతో తబ్బిబ్బై మరోసారి సలాంచేసి వెంగమాంబ లోపలికి వెళ్ళేదాకా ఉండి వెనక్కి వెనక్కి నడుస్తూ ఇంటిదారి పట్టాడు.
                                   * * *
    "వెంగమాంబా!"
    మేఘ గంభీర స్వరం మంద్రంగా, సమ్మోహనంగా పిలిచింది. పిల్లతెమ్మెర స్పర్శకి విచ్చుకున్న పద్మపు రేకులలాగా అలవోకగా, సున్నితంగా కళ్ళువిప్పి చూసింది వెంగమాంబ. ఎదుట ఎవ్వరూ కానరాలేదు. కన్నులకు మనస్సుకు హాయిని కలిగించే బంగారు కాంతితప్ప.
    "నీవు తిరుమలకు రా! నా సన్నిధిని చేరుకునే సమయం ఆసన్నమైంది"
    "స్వామీ! ... ... ..."
    "రా! వెంగమాంబా! రా! ... లేచిరా!"
    లేచి రెండడుగులు వేసిన వెంగమాంబకి మెలకువ వచ్చి ఇదంతా కలా? అనుకుని తిరిగి నిద్రకుపక్రమించింది.
    "వెంకుతల్లీ కోడికూసి చాలాసేపైంది లేమ్మా!"
    తల్లిపిలుపుకి ఉలిక్కిపడి లేచింది వెంగమాంబ.
    "అయ్యో! ఆలస్యమయిందే! ఇందాక కలవచ్చి లేచి నాలుగడుగులు వేసి మళ్ళీపడుకున్నాను. అందుకని మెలకువ రాలేదు."
    "లేచి నడవటమేమిటి? రాత్రి పొద్దుపోయి పడుకున్న నువ్వు కనీసం పక్కకి కదలనైనా లేదు. నడవటం కూడా కలలోనేమో!"
    "అయితే, కలలో కల వచ్చిందన్నమాట. కలలేరాని నాకు, కల, అందులో మళ్ళీ కల. అంతా వింత!" ఆశ్చర్యపోయింది వెంగమాంబ.
    ఆ ఆశ్చర్యంలో కలలో విషయం మరుగునపడింది. ఎంతటివారికైనా భ్రమ ప్రమాదాలుతప్పవేమో! అందులోనూ సాధకులు మరింత జాగరూకులై ఉండాలి. రెండు రోజులు గడిచాయి.
                                   * * *
    "వెంగమాంబా!"
    అదే మేఘగంభీర స్వరం. మంద్రంగా సమ్మోహనంగా పిలుపు. వెంగమాంబ గుర్తించింది. కళ్ళు తెరిచింది. అదే కాంతి సముద్రం మధ్యలో జగన్మోహన దివ్యరూపం. రూపరేఖలు అలంకారం అంతా తిరుమలేశునిది. ముఖకవళికలు మాత్రం తన మిత్రునివి.
    "నా మాటపై విశ్వాసం లేదా?"
    "... ... ..."
    "కాలాతీతమవుతోంది. బయలుదేరు."
    "చిత్తం స్వామీ! ధన్యురాలిని"
    వెంగమాంబకి మెలకువ వచ్చింది. ఇంకా తల్లి, తండ్రి గాఢనిద్రలో ఉన్నారు. ఒక్కసారి లేచి ఇల్లంతాచుట్టి వచ్చింది. గవాక్షంలో నృసింహస్వామి కోవెల గోపురం చూసింది. చల్లటి నీరు ముఖానచల్లుకుంది చేతిమీద గిల్లిచూసుకుంది. ఇది కల కాదు. అంటే స్వామితనకు దర్శనమిచ్చింది కలలో మాత్రమే! కలలోని కలలోకాదు. తను స్వామి ఆజ్ఞ అమలుజరపాలి. నృసింహాలయంలో ఉండటం తగ్గించటమే, తరిగొండని వదలమనే సూచన అని తాను గుర్తించలేదు. తిరుమల చేరాలి. స్వామి సన్నిధానంలో ఉండి తన కర్తవ్యం నిర్వర్తించాలి. ఈ నిర్ణయంతో తిరుమలవైపు తిరిగి నమస్కరించి నిత్యకృత్యాలలో పడింది వెంగమాంబ.
                                   * * *
    "అమ్మా! వెంకుతల్లీ!
    "......."
    "ఆగమ్మా!"
    కృష్ణయార్యుడు గట్టిగా పిలుస్తున్నాడు. వెంగమాంబ వినిపించుకోనట్టు ముందుకి సాగిపోతోంది. గబగబా నడిచి వెంగమాంబని సమీపించి ఆయాసపడుతూ అన్నాడు,
    "అమ్మలూ! ఎక్కడికమ్మా వెళ్ళేది?"
    వెంగమాంబ చేతితో ముందుకి చూపించింది. కృష్ణయార్యుడి కళ్ళముందు ఒక అద్భుత దృశ్యం ఉంది. ఎత్తైన కొండలు, పచ్చని చెట్లతో నిండి ఉన్నాయి. సెలయేళ్ళు గలగలా లయబద్ధంగా పారుతున్నాయి. వాతావరణం ప్రశాంతంగా ఉంది. జన సంచారం లేదు. కాదు, కాదు...ఉంది. అక్కడొకరు, అక్కడొకరు చదునైన శిలలమీద తపోనిష్టులై ఉన్నారు.
    ఇంతమంది తపస్సుచేస్తున్న ఋషులని చూడటం తన అదృష్టం అని కృష్ణయార్యుడు అనుకునేలోపుగా ఋషులలో కొంతమంది కనులువిప్పి లేచి, వెంగమాంబని చూసి, రమ్మన్నట్టుగా చేతులు చాచి సాదరంగా ఆహ్వానించటం కనిపించింది. చూస్తూ ఉండగానే వెంగమాంబ వేషం మారిపోయింది. కాషాయవస్త్రం, రుద్రాక్షలు, జపమాలలు, దండం, కమండలువు... ... ...
    తాపసి వేషంతో ముందుకి సాగుతోంది. కృష్ణయార్యుడికి భయంలాంటిది కలిగింది. కాని చేసేది లేక అటే చూస్తుండిపోయాడు. కృష్ణయార్యునికి తాను కడులుతున్నాడో లేదో తెలియటం లేదు కాని, వెంగమాంబ ప్రస్థానం తెలుస్తోంది. అక్కడ దేవతలు వెంగమాంబ రాకకి ఎదురుచూస్తూ, స్వాగతం పలకటానికి సన్నాహాలు చేస్తున్నారు.
    తన కూతురు, తనకి అందనంత దూరం వెళ్ళిపోతోందనే బాధతో గట్టిగా వెనక్కి పిలవాలని ప్రయత్నం చేస్తున్నాడు కాని గొంతు పెగలటం లేదు. గొంతు ఆర్చుకుపోతోంది. గొంతు ఎండిపోయి భరించలేనంత దాహం వేయటంతో మెలకువ వచ్చిన తర్వాత కూడా చాలాసేపటివరకు భయం తగ్గలేదు కృష్ణయార్యుడికి.
                                   * * *
    తనకి వచ్చిన కల గురించి కూతురుతో చర్చించాలనుకున్నాడు కృష్ణయార్యుడు. వెంగమాంబ కూడా తనాన్ నిర్ణయం తండ్రితో చెప్పాలనుకుంది. మధ్యాహ్నం భోజనాల  తర్వాత ఉయ్యాలబల్లమీద కూర్చుని భార్యా కూతురు వంటింటిని సర్దివచ్చేదాకా ఎదురు చూశాడు. వారు వచ్చి విశ్రాంతిగా చాపపరుచుకుని కూర్చోగానే ప్రారంభించాడు.
    "అమ్మాయీ! నీతో ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నాను." అన్నాడు.
    "అమ్మాయి కూడా మనతో ఏదో చెప్పాలనుకుంటోందిట" అంది మంగమాంబ.
    "రెండూ ఒకటేనేమో?" కృష్ణయార్యుని సందేహం.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS