ఆ అదురికి అతని తల క్షణంపాటు దిమ్మెక్కిపోయింది. పళ్ళ మధ్య ఇరుక్కుని తెగిపోయిన నాలుక, విడివడి అల్లంతదూరాన పడింది. దవడ కదిలి, టంబ్రొ-మెండిబ్యులార్ జాయింట్స్ విరిగిపోయాయి. అతడు ఈ లోపులో దబ్బున నేలమీద వెల్లకిలా పడ్డాడు.
పదకొండో వెర్టిబ్రా (వెన్నెముక క్రింద) దగ్గిర రాతి అంచు గుచ్చుకుని కార్డ్ ఇంజరీ అయింది. క్రిందిభాగంలో నరాల స్పందన పోయింది. అయితే అతడికి స్పృహ తప్పలేదు. స్కల్ కి దెబ్బ తగలలేదు.
కొద్ది క్షణాలపాటూ నొప్పి కూడా తెలియలేదు.
చెవుల్లో మాత్రం సముద్రపు హోరులా వినిపించసాగింది. ఆ తరువాత ఒకటి రెండు నిముషాలకి నోటి బాధ తెలియవచ్చింది.
మూడో అంతస్తు మీదనుంచి అతడు అలా జరగానే నాయుడు బాల్కనీ మీదనుంచి వంగి చూసేడు. శేఖరం నేలమీదకి పడటం కనిపించింది. అతడు వెంటనే చేసిన పని ఏమిటంటే, దీన్ని ఎవరయినా గమనించారా అని చుట్టుప్రక్కలా పరిశీలించటం.
అది ఫెన్నిగ్ దగ్గరున్న్ ఇల్లు. క్రింది అంతస్తులో వాళ్ళు లేరు. ఉన్నా చెత్తాచెదారం పడేసే వెనుకవైపుకి రారు.
అంత ఎత్తుమీద నుంచి పడినవాడు ఇంకా బ్రతికి వుంటాడని అనుకోలేదు. ఏ విధమైన పోలీసు కేసులోనూ అతడు ఇరుక్కోదల్చుకోలేదు. అందుకే అక్కణ్నించి కామ్ గా వెళ్ళిపోదామనుకున్నాడు. అలా అనుకుని లేవబోతూంటే- క్రింది ఆకారంలో కదలిక కనిపించింది.
లేవటానికి ప్రయత్నించిన శేఖరం- కాళ్ళు రెండూ స్పర్శజ్ఞానం పోయి తిమ్మిరెక్కటంతో, లేవలేకపోయాడు. అదీగాక ఏ మాత్రం కదిలినా నడుము దగ్గర విపరీతమైన బాధ మొదలై శరీరాన్ని మెలికలు తిప్పేస్తూంది.
పైన నాయుడు గ్లాసులో మళ్ళీ బీరు పోసుకుని తాగటం మొదలెట్టాడు. పూర్వకాలం రోమన్ రాజులు యిద్దరు బానిసలకు కత్తులు ఇచ్చి గోదాలోకి దింపి, వాళ్ళలో ఒకళ్ళు చచ్చేవరకూ పోరాడమని, ఆ వినోదాన్ని చూస్తూ సంతృప్తి చెందేవారట. అలానే నాయుడు దాదాపు నలభై అడుగుల క్రింద నేలమీద నిస్సహాయంగా కొనవూపిరితో కొట్టుకుంటున్న శేఖరాన్ని చిర్నవ్వుతో గమనిస్తున్నాడు. ఒక రకమైన సాడిస్టిక్ సంతృప్తి వుంది.
పడిపోయినవాడు మోహన్ లాల్ ఇన్ స్టిట్యూట్ చీఫ్ అకౌంటెంట్ అని తెలీదు. బావమరిది ఇంట్లో ప్రవేశించాడని తెలుసు. మామూలు దొంగ కాడని తెలుసు. అంతవరకే తెలుసంతే. తెలియకపోవటమే మంచిదయింది. తన కంపెనీ తయారుచేసే కాన్స్- క్యూర్ మందు తాలూకూ రిపోర్టు కోసం వచ్చాడని తెలిస్తే మరెంత కౄరంగా కసి తీర్చుకొనేవాడే...
క్రింద పడివున్న శేఖరం పరిస్థితి చాలా ఘోరంగా వుంది. తెగిన నాలుక విపరీతంగా మంట పెడుతూంది. నోరంతా ఎర్రగా మారిపోయింది. రక్తం గొంతులో కెళ్ళి క్లాబ్ అయి ఊపిరికి అడ్డుపడకుండా తల ప్రక్కకి తిప్పి వుంచాడు. పంపులోంచి నీటిధార వచ్చినట్టూ నోటిలోంచి రక్తం నేల మీదకు జారసాగింది. అదిచూస్తే షాక్ తగులుతుందని కళ్ళు మూసుకున్నాడు. కొంచెంసేపటికి రక్తం గడ్డకట్టింది.
కళ్ళు విప్పి చూసేడు, పైన బాల్కనీలో అతడు కనపడ్డాడు. చాలా నెమ్మదిగా గ్లాసు నోటి దగ్గరకు తీసుకుని తాగుతున్నాడు. తన వేపే చూస్తున్నాడు. తను చచ్చిపోయాడనుకున్నాడేమో అతడు! అలా భావించి, శేఖరం చెయ్యి వూపాడు.
పై నుంచి అతడూ చెయ్యి వూపేడు 'హలో' అన్నట్టూ.
శేఖరానికి అప్పుడర్థమయింది అతడికి తను బ్రతికి వున్నట్టూ తెలుసనీ- కేవలం తన మరణాన్ని చూడటానికే అలా తాపీగా వేచి వున్నాడనీ!! అతడు కాకపోతే ఇంకెవరయినా తనకి సాయం చేస్తారని గట్టిగా 'హెల్ప్' అని అరవబోయాడు. గొంతులోంచి కీచుమని ధ్వని వచ్చింది కానీ మాట రాలేదు.
మళ్ళీ అరవబోయాడు.
నాలుక నుంచి రక్తం తిరిగి స్రవించసాగిందే తప్ప మాటరాలేదు.
గొంతు గాలిని మాటలుగా మార్చే నాలుక అనే సాధనం శరీరం నుంచి తెగి దూరంగా పడటంవల్ల తను స్వరాన్ని కోల్పోయేనని తేల్చుకోవటానికి అంతసేపు పట్టింది.
అతడికి ఆ సత్యం అర్థమయ్యేసరికి ప్రపంచమే మూగబోయినట్లయింది. చెవిలో హోరు తగ్గింది.
అంతలో దూరంగా అలికిడి అయింది. దాన్ని అతడు గమనించలేదు. మేడమీదున్న నాయుడు గమనించాడు.
పాతగుడ్డలూ, ఇనుపముక్కలూ ఏరుకునే కుర్రవాడు ఆ చెత్తకుండీ వైపు రావటాన్ని గమనించి కుర్చీలోంచే లేచి 'రేయ్' అని అరిచాడు. వాడు ఆగేడు.
నాయుడు ఉద్దేశ్యం గమనించి, శేఖరం వాడి దృష్టి తనమీద పడటం కోసం శతవిధాల ప్రయత్నించాడు. కానీ లాభం లేకపోయింది. అరవబోయాడు. కానీ గొంతులోంచి 'ఎక్... ఎక్...' మన్న శబ్దం మాత్రం వచ్చింది.
ఈ లోపులో నాయుడు వాడితో "ఎవడ్రా నిన్నిటు రమ్మన్నది" అని అరిచాడు. వాడు బెదురుతూ చూసి, ఏదో అన్నాడు. శేఖరానికి ఇవేమీ వినిపించలేదు.
ఇంతలో నాయుడు "వెళ్ళెళ్ళు, ఇటేపు రాకు" అన్నాడు.
వాడు వెళ్ళిపోయాడు. నాయుడు తిరిగి కుర్చీలో కూర్చుని గ్లాసు చేతిలోకి తీసుకున్నాడు. తనవైపు చూసి నవ్వినట్టు కూడా అనిపించింది.
శేఖరం నిస్సహాయతా, కోపమూ మిళితమైన ఉక్రోషంతో పిడికిళ్లు బిగించి నేలమీద కొట్టేడు. నిశ్శబ్దం తప్ప మరేమీ లేదు.
నిశ్శబ్దం!
నాయుడు మాట్లాడిందీ, ఆ కుర్రవాడు జవాబు ఇచ్చిందీ- ఏదీ వినిపించనంత నిశ్శబ్దం....
ఆ నిశ్శబ్దంలోంచి ఒక అనుమానం స్పార్క్ లా మెరిసి క్షణంలో మనసంతా ఆక్రమించింది. చప్పున చెవులు తడువుకొన్నాడు.
రెండు చెవుల దగ్గర జిగటగా తగిలింది.
రక్తం!
అతడికి మనిషి ఫిజియాలజీ గురించి తెలీదు. టంబ్రో- మెండిబ్యులార్ జాయింట్స్ గురించీ తెలీదు.
కానీ శాశ్వతంగా చెవిటి వాడినయ్యానని మాత్రం తెలిసింది. షాక్ మీద షాక్... చుట్టూ రక్తం- అతడికి స్పృహ తప్పింది.
* * *
తిరిగి అతడికి మెలుకువ వచ్చేసరికి చీకటి పడింది.
ఆకాశంలో నక్షత్రాలు కనపడుతున్నాయి.
