Previous Page Next Page 
త్రీ- ఇన్- వన్ పేజి 40

    "ఒరేయ్ పండూ... నువ్వు ఇక్కడ కూర్చుని చాక్లెట్లు తింటూ ఉండు. నేనేమో అన్నం తిని వస్తాను" అన్నాను.

    "అలాగే. త్వరగా మింగు"

    కొందరు పిల్లలు లేత వయసులోనే ముదురు మాటలు మాట్లాడుతారు అనుకుంటూ వంటింట్లోకి నడిచాను.

    అయిదు నిమిషాల్లో భోజనం చేసి గదిలోకి వచ్చి మంచం మీద కూర్చున్నాను. మంచం చల్లగా ఉంది.

    "ఎందుకురా ఇలా మంచం మీద నీళ్ళు పోశావ్?" అని బుజ్జిపండుని అడిగాను.

    "మంచం మీద నీళ్ళు పొయ్యడానికి నాకు బుద్ధి లేదనుకున్నావా ఏమిటి?" అన్నాడు వాడు కోపంగా చూస్తూ.

    "మరి ఇలా చల్లగా ఉందేం?"

    "ఉచ్చపోశాను.... మా యింట్లో కూడా ఒకటికి వస్తే నేను మంచం మీదే పోస్తాను" అన్నాడు.

    నాకు ఒళ్ళు మండింది. వాడికి ఒక్క జిల్లకాయ ఇవ్వాలనిపించింది. మంచం మీది దుప్పటి తీసి బాత్రూమ్ కెళ్ళి దాన్ని ఉతుకుతుండగా చంచల్రావు వచ్చాడు.

    "ఈ టైంలో ఏం ఉతుకుతున్నావోయ్?... అంటూ బాత్రూమ్ గుమ్మంలోంచి అడిగాడు.

    "గదిలో చూడలేదూ... వాడు ఉచ్చపోస్తే ఆ దుప్పట్లు ఉతుకుతున్నా" అన్నాను పళ్ళు బిగబట్టి.

    దుప్పటి ఆరేసి గదిలోకి వచ్చాను.

    "ఒరేయ్... వీడెవడో దొంగనాయాలు నీకోసం వచ్చాడు" అన్నాడు బుజ్జిపండు చంచల్రావుని చూపిస్తూ.

    "తప్పమ్మా... అలా అనకూడదు" అన్నాడు చంచల్రావు కుర్చీలో ఇబ్బందిగా కదులుతూ.

                                        

    "నోర్ముయ్" అన్నాడు చంచల్రావుని కాల్తో తంతూ బుజ్జిపండు.

    చంచల్రావు పళ్ళు బయటికి పెట్టి "గుర్ర్ ర్ర్..." అన్నాడు కోపంగా కుక్కలా.

    "నువ్వు పళ్ళు తోముకోవా?" అన్నాడు బుజ్జిపండు కోపంగా చూస్తూ.

    చంచల్రావు గబుక్కున నోరు మూసేస్కున్నాడు.

    నేను బుజ్జిపండు రెక్క పట్టుకుని దూరంగా లాగుతూ అన్నాను "వీడు పిల్లల్తో ఆటలాడుతూ ఒరేయ్ గిరేయ్ అంటూ మాట్లాడతాడు కదా... అలానే మనతోనూ మాట్లాడతాడు... తప్పని చెప్పేవాళ్ళు లేరు... ఇంతకీ వీడెవడో  తెలుసా?

    "ఊహించాను. వీడిని ఇంత సహిస్తున్నావంటే తప్పకుండా ఆ అమ్మాయి తమ్ముడై ఉండాలి"

    "కరెక్టు!"

    "పిల్లల్లో అలా మాట్లాడే అలవాటు కాదు. వాళ్ళన్నయ్య చారల బనీనుగాడు లేదూ... వాడి నట్లు వీడు అనుకరిస్తున్నాడని నా అనుమానం..." అన్నాడు చంచల్రావు.

    "ఒరేయ్... నాకోసం చాక్లెట్లు తెచ్చావా?" అని చంచల్రావుని అడిగాడు బుజ్జిపండు.

    క్షణంపాటు బిత్తరపోయి తరువాత "లేదు" అన్నాడు చంచల్రావు.

    బుజ్జిపండు చంచల్రావు ని కోపంగా చూసి చర్రున వాడి దగ్గరికి పరుగెత్తుకు వెళ్ళి ముఖం మీద "థూ" అని ఊచాడు. చంచల్రావు వాడి రెక్కపట్టుకుని వీపుమీద ఒక్కటియ్య బోయాడు. నేను గబుక్కున వాడి చెయ్యి పట్టుకున్నాను.

    "ఒరేయ్... నా ప్రేమని గంగపాలు చెయ్యకురా. ఇప్పుడిప్పుడే వీడి స్నేహం లభించింది... తరువాత వీళ్ళక్క.... దయచేసి వాడిని కక్షమించెయ్" అని వాడి ముఖం మీద ఉమ్ముని నా చొక్కాతో తుడిచేశాను.

    బుజ్జిపండుకు జేబులోంచి మరో రెండు చాక్లెట్లు తీసి ఇచ్చి "నువ్వు ఆ మూల కూర్చుని ఇవి తినమ్మా... నేనూ అంకుల్ మాట్లాడు కోవాలి" అన్నాను.

    "అలాగే... ఆ దొంగనాకొడుకుని ఈసారి వచ్చినప్పుడు చాక్లెట్లు తెమ్మని చెప్పు" అని గది మూలకి వెళ్ళి కూర్చున్నాడు.

    చంచల్రావు పిడికిళ్ళు బిగించాడు

    "వీడిని ఎలా భరిస్తున్నవురా?" అన్నాడు.

    "తప్పదు... ప్రేమకోసం ఆ మాత్రం కష్టాల్ని భరించకపోతే ఎలా?"
                                          
   

     "ఇంతకీ నీ ప్రేమ ఎంత దాకా వచ్చింది?'

    "అమ్మాయి పేరు సుందరి అని తెలిసింది. అంతకు మించి ఏమీ జరగలేదు. వీడితో ఆ అమ్మాయికి పుస్తకాలు పంపిస్తున్నా. వరండాలో నించుని ఉంటుందిగానీ నా వైపు అస్సలు చూడడు. వాళ్ళ పని మనిషి మాత్రం నా వైపు చూసి నవ్వుతుంది... సైగలు చేస్తుంది."

    "పోనీ, దాన్నే ప్రేమించేయ కూడదూ?"

    "అందంగా వుంటే పోనీ దాన్నే ప్రేమించి ఉందును... ఒరేయ్ చెంచిగా... రెండ్రోజుల్నుంచి సుందరి కనీసం వరండాలోనైనా కనిపించడం లేదురా"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS