Previous Page Next Page 
బస్తీమే సవాల్ పేజి 40


    ఊహించని ఆ పరిణామానికి మొదలు నరికిన చెట్టులా వెనక్కి విరుచుకు పడిపోయాడు రణధీర్. అతను లేచేలోగా చిన్న బల్లని ఎత్తి మిగిలిన వాళ్ళపైన విసిరాడు. చేతికి దొరికిన పాండూని, గొట్టాం సాయిల్ని జుట్టు పట్టుకొని ఒకరి తలని మరొకరి తలతో కొట్టడం మొదలు పెట్టాడు.

    వాళ్ళు అరుస్తున్నారు. ముక్కుల్లోంచి, నోట్లోంచి రక్తం వస్తోంది.

    పైకి లేవబోతున్న రణధీర్ పైకి చెంగున ఎగిరాడు పరుశురాం. అతని దవడల క్రింద చేతులు వేసి తలని వెనక్కి విరిచేశాడు.

    ఫట్ మని శబ్దం!

    కీచుగా అరిచాడు రణధీర్.

    పైకి లేవనెత్తి మోకాళ్ళతో కుమ్మేస్తూ. పిడికిళ్ళతో మొహంపైన, కడుపులో గుద్దుతుంటే రణధీర్ చావుకేకలు పెడుతున్నాడు.

    రణధీర్ ని రెండు చేతులతో ఎత్తి గిరగిరా తిప్పి గుమ్మంలోంచి బయటికి విసిరేశాడు పరుశురాం.

    బయట వరండా మెట్లపైన పడుతూ భయంకరంగా ఆర్తనాదం చేశాడు పరుశురాం.

    రక్తం మడుగులో పడున్నాడు రణధీర్.

    "హత్య.... హత్య...." అరిచాడు ప్రభు.

    "గురుడు చచ్చిపోయాడు" కీచుగా అరిచాడు రెడ్డి.

    పరుశురాం ఆవేశం తగ్గింది.

    రక్తపు మడుగులో రణధీర్ ని చూశాడు. అతని స్నేహితులు అరుస్తున్నారు.

    ఆవేశంలో తను రణధీర్ ని చంపేసినట్లు గ్రహించాడు పరుశురాం.

    హత్యానేరంలో ఇరుక్కున్నాడు. ఆలస్యం చేయకూడదు. చేస్తే జరిగేదేమిటో అతనికి తెలుసు.

    పారిపోవాలి. పోలీసులు రాకముందే అక్కడ్నించి తప్పించుకోవాలి.

    అప్పటివరకు ఉన్న ధైర్యం స్థానంలో పిరికితనం, భయం చోటు చేసుకున్నాయి.

    రణధీర్ స్నేహబృందం తనని పట్టుకునే ప్రయత్నం ఏదీ చేయకుండా అరుస్తున్నారు. అలాంటి సాహసం వాళ్ళు చేయరని కూడా పరుశురాంకి తెలుసు.

    కానీ జనం వస్తే....

    రెడ్డి, ప్రభు పెడుతున్న కేకలకి జనం రాకపోగా, ఇళ్ళల్లో లైట్లు ఆరిపోతున్నాయి. తలుపులు మూతలు పడుతున్నాయి. అంతే క్షణం ఆలస్యం చేయలేదు పరుశురాం.

    అక్కడ్నించి మైదానంలోంచి రైలు కట్టవైపు పరుగుతీశాడు.

    వెనుక ఎవరో తనని తరుముకొస్తున్నారన్న బ్రాంతిలోనే అతను పరుగెత్తుతున్నాడు.

    ఒక నేరం చేసేవరకు వుండే ధైర్యం, అది చేశాక వుండదనే నిజం పరుశురాంని చూస్తేనే తెలుస్తోంది.

    అటుగా వస్తున్న రైలు వెంట పరుగెత్తి రైలు ఎక్కేశాడు పరుశురామ్.

    అయినా అతని గుండె దడ తగ్గలేదు.

    పోలీసులు తనని వెంటాడతారు. పట్టుకుంటారు. ఉరిశిక్ష పడుతుంది.

    కంపార్ట్ మెంట్ తలుపు దగ్గర నించుని క్షణంపాటు కళ్ళు మూసుకున్నాడు. అతని కళ్ళనుంచి రెండు కన్నీటిబొట్లు జారాయి.

    ఇప్పుడు తను అందరికీ పూర్తిగా దూరం అయిపోయాడు.
   
                                                                            18

    పార్క్ లోంచి సిగరెట్ కాలుస్తూ బయటికి వస్తూ వెర్రిగా నవ్వుకున్నాడు పరుశురాం.

    తనపైన కక్ష సాధింపు చర్య భాగంగానే సరస్వతిని ఓ అస్త్రంగా వాడుకున్నాడు రణధీర్.

    ఇది రణధీర్ కుట్రని అనూష తెలుసుకోలేకపోయింది.

    అసలు అతనితో విరోధం తెచ్చుకున్నదే ఆమె గురించి.

    ఆ మాత్రం ఆలోచించలేకపోయిందా? పైగా తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి చేసిన ప్రయత్నాన్ని సున్నితంగా తిరస్కరించింది.

    ఆడవాళ్ళింతే.

    ఆడది ఎంత తెలివైనదైనా కూడా 'తనవాడు' అనుకున్న వ్యక్తి ఏదైనా పొరపాటు అదీ మరో ఆడదానితో చేశాడని నమ్మితే కట్టలు తెంచుకున్న ఆవేశంతో మాట కూడా వినదు. అదే ఆడవాళ్ళ దౌర్భాగ్యం.

    సరస్వతి ద్వారా అనూషకి ఈ పాటికి నిజం తెలిసే వుంటుంది. సరస్వతిని తను క్షమించి విడిచిపెట్టాడు. కానీ అనూష?

    అనూష ఆమెని కొట్టినా ఆశ్చర్యపోనవసరం లేదు.

    రణధీర్ ని తను చంపేసిన విషయం తెలిసి సరస్వతి నోరు విప్పక పోవచ్చు. ఈ గొడవలో తను ఇరుక్కుంటానని భయపడవచ్చు.

    ఏం జరిగినా ఆశ్చర్యపోనవసరం లేదు. అనూష వాళ్ళ డాడీకి ట్రాన్స్ ఫర్ అవడం వల్ల కూడా ఆమె ఊరు విడిచివుంటే నిజం తెలుసుకునే అవకాశం లేకపోవచ్చు.

    ఒక మనిషి ఇచ్చిన రిపోర్టు పైన ఆధారపడి తనని క్రూరంగా హింసించారు పోలీసులు. దర్యాప్తుచేసి నిజానిజాలు తెలుసుకోకుండా అన్యాయంగా తనని కొట్టాడు.

    చట్టంపైన అతనికి నమ్మకం, గౌరవం పూర్తిగా పోయినాయి. తనలాంటి వాడికి న్యాయం జరుగుతుందన్న నమ్మకం కూడా అతనిలో పూర్తిగా నశించింది.

    అసలు రణధీర్ బతికున్నాడో లేదో తెలీడంలేదు.

    రణధీర్ ని తను హత్య చేశానని అతను భయపడుతున్నాడు.. తనో మనిషిని చంపే అనుమానమే భయం నీడలా అతన్ని వెంటాడుతోంది.

    కానీ ఏ పేపర్లోనూ ఆ హత్య గురించి ప్రచురించలేదు.

    హత్య జరిగితే కనీసం ఏదో ఒక పేపర్ లో వేస్తారు.

    ఇన్నాళ్ళూ పోలీసులకి భయపడుతూ వచ్చాడు. పోలీసులు కూడా తనకోసం వెతుకుతున్న జాడ లేదు.

    అంటే రణధీర్ చనిపోలేదు. బ్రతికే వుండాలి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS