అందగాడివయినా అంతగర్వం పనికి రాదు ." అన్నదామె. ఆమాటలలో కోపం రవంత అయినా లేదు. కాని కొరడా విదిలించటం వుంది.
"నేను అందరు ఆడపిల్లల సంగతీ చెప్పలేదు. నీ సంగతి గురించి మాత్రమే అంటున్నాను." అంటూ సమర్ధించుకున్నాడు జయకృష్ణ.
"నా మంచితనమే కాదు, నా మొండి తనం కూడా నీకు తెలుసనుకుంటాను. మిస్టర్ జయకృష్ణా! ఆడపిల్లలు ఆశించేది అందచందాలు మాత్రమే కాదు, మంచి మనసు. నీవంటే నేను యిష్టపడుతున్నాను. యదార్ధమే కాని నా పరధ్యానమంతా నీ గురించే అనుకోవటం నీ అహంకారం తప్ప మరేమీ కాదు.
ఈ పురుషాహంకారమనేది ఇప్పటిది కాదు . ఇది చాల పురాతనమయిన సెంటిమెంట్! అందు నించి ఈసారికి నీమీద కోపం తెచ్చుకోను" అన్నదామె. జయకృష్ణ టీ త్రాగటం పూర్తి కానిచ్చి నవ్వాడు.
"బ్రతికించావు . కాని ఈ పరధ్యాన మెందుకో చెప్పు" అన్నాడు ఆ ప్రశ్నకు అంత ప్రాధాన్యం లేనట్లు యధాలాపంగానే అడిగాడు.
ఆ ప్రశ్నకు సమాధానం వెతుక్కునెందుకు రవంత సేపు అంతర్ముకంగా అయిపొయింది జ్యోతి. అరక్షణం కళ్ళు మూసుకుని మనసు పొరల మాటున ఒదిగి పోతున్న ఆ దృశ్యాలను ప్రత్యేక్షం చేసుకుంది.
వరదలో చిక్కిన కృష్ణసర్పంలా ఏటికి ఎదురీదుతున్న శ్వేతకి, ముచివిందనాగుడు ఉలూపి, అంతా ప్రత్యక్షమయినారు.
క్షుద్రకళింగుడు ఎత్తి వస్తున్నాడని విని యక్షపుండ్ర పుళింద గణాలను సమీకరించింది శ్వేతకి.
ఆ తరువాత ఏమయిందని అర్ధంతరంగా ఆగిపోయిన దృశ్యాలను చూడాలని విఫల ప్రయత్నం చేసింది. మనోపటలం మీద ఒక పెద్ద ప్రశ్నార్ధకమే ప్రత్యేక్షమయింది.
"ఆ తరువాత ఏమయింది ?" అన్నదామె.
"ఏ తరువాత" అని అడిగాడు జయకృష్ణ. తన ప్రశ్నతో ఆమె ఏదో అనుహ్యమయిన ఆలోచనలకూ లోను అయిందని గ్రహించాడు.
ఆలోచన వివశత్వం నించి అర్ధనిమీలితాలయిన జ్యోతి సుందర నయనాంచనాలు పూర్తిగా విప్పారినాయి. ఎదురుగా కన్పించినవాడు జయకృష్ణ. ఉలికిపడినట్లుగా అయింది జ్యోతి.
"నాకు చెప్పకుండా ఏదో దాస్తున్నావు" అన్నాడు జయకృష్ణ బాధగా. రవంత బాధతో, సిగ్గుతో తల దించుకుందామే.
అతనిని చేయి పుచ్చుకుని చెట్టు నీడ నించి వెలుపలకు మైదానం మీదికి తీసుకువచ్చింది. రాకాసి గుడి త్రవ్వకం ప్రారంభించినప్పటి ఉదృతమయిన వర్షం తగ్గిపోయింది. కాని ఇంకా చినుకులు పడుతున్నాయి. పశ్చిమాన మబ్బులు విచ్చిపోయి సూర్యుడు కన్పిస్తున్నాడు. కాని ఆకాశంలో బరువు దింపుకున్న మేఘ శకలాలు కురంగాల్లా వడిగా పరుగులు తీస్తూనే ఉన్నాయి.
ఒక వంక రవి కిరణాలు, మరొక వంక సూదుల్లా శరీరాన్ని గ్రుచ్చుతున్న చినుకులు . ద్వంద్వ ప్రకృతి అయింది. వెలుగు వాస్తవంలా, వర్ష పాతమే అసత్యమయిన అభాసలా అన్పించింది.
"జయా! వెలిగే ఆ సూర్యుడు సాక్షిగా చెప్తున్నాను -- నీనించి దాచుకోవలసిందీ నాకేమీ లేదు. ఇప్పటికే నీవు నాకోసం ఎంతో శ్రమించావు! ఏ అధికారంతో నిన్ను యింత పరిశ్రమకు లోను చేస్తున్నానో నాకు అర్ధం కావటల్లేదు. నీ మంచితనంలో అనుక్షణం నా మనస్సు లొంగదీసుకుంటున్నావు.
నీకు ఎంతగానో రుణపడిపోయినాను.
ఇంకా నా మనోగతాలన్నింటినీ నీ ముందుంచి నీకు సమస్యలు కల్పించాలని లేదు. నేను ఒక భ్రాంతికి లోను అవుతున్నాను. అనివార్యంగా లొంగిపోతున్నను. అది బ్రాంతి అని అంటున్నానే కాని మనసారా అనుకోలేకపోతున్నాను " అన్నదామె దీనంగా.
ఉద్విగ్నంగా అయిపోతున్న ఆమెను అనునయించాడు జయకృష్ణ.
"డియర్ జ్యోతీ! ఇదంతా శ్రమ అనుకుంటే నీతో తరలి రావలసిన అవసరమే నాకు లేదు. నీ సమస్య లన్నింటినీ నా సమస్యలే అనుకున్నాను. నన్నింకా అర్ధం చేసుకోలేదా?" అన్నాడతను.
జ్యోతి అతని మాటలకు వివశురలయింది. తన అండగా నిలిచిన ఆ పురుషుడు తనవాడు కాగలడని మనసుని నమ్మించుకుంది.
"జయా! ఈ శ్వేతకి ప్రేతాత్మ నన్ను వెన్నాడుతోంది. నీవు పరాయివి అయినప్పుడు గుండెని తూట్లుపొడిచి, ఈ బ్రతుకుని అనిశ్చితంగా చేస్తున్న ఈ సమస్యను నీతో చెప్పవలసిన అవుసరం నాకు లేదు.
నా బాధలు నావి అనుకుంటాను.
కానీ ఆత్మీయతా బంధంతో నన్ను కట్టి పదేశావు. నన్ను గురించి నా దుస్థితి గురించి ఇంకా దాచుకోవటం వంచన ఒక్కటే కాదు, ఆత్మవంచన కూడా అవుతుంది.
"శ్వేతకి ఆత్మ నన్ను నీడలా వెన్నాడుతుంది ." అంటూ ప్రారంభించిందామే. తాను లాంచీ నడుపుతున్న రోజుల్లో సర్పాకృతులున్న తలుపుల వెనక దాగిన తామ్రపత్రాల దగ్గర మొదలెట్టి తన వాడనిపించిన పురుషుని ముందు మనసంతా పరుచుకొంటోంది జ్యోతి.
జయకృష్ణ అర్ధ్రమయిన చేతనతో ఆ కధను వినసాగాడు. వేటకై వెళ్ళిన ఆదిమ జనులు తిరిగి వచ్చేవరకూ జరిగినదంతా జయకృష్ణకు చెప్పేసింది జ్యోతి.
సమాధిలో తాను పడుకున్నప్పుడు క్రేనియంకు తల అన్చుకోగానే కన్పించిన దృశ్యాలను కూడా వివరించింది. అంతా విన్న జయకృష్ణ విభ్రాంతుడయ్యాడు.
పొదల మదుగున దాగిన చెవుల పిల్లుల్ని పట్టుకొచ్చింది లచ్చిమి. కొందరు యువకులు పుట్టతేనే కొట్టుకొచ్చారు. అడ్డాకు దోన్నేల్లో వున్న పుట్టతేనే చెవులూరిస్తోంది.
ఎండిన చెట్ల నించి పుల్లలు విరిచి తెచ్చి చెట్టు క్రింద పోశాడోకడు. ఇంక ఆ ప్రాంతమంతా సందడిగా అయింది. వర్షమయితే నిలిచిపోయింది. కాని యిదురుగాలి ఇంకా విసురుగానే వుంది.
లచ్చిమి నెగడు వెలిగించింది. ఒక యువకుడు ఎండిన చింత మొద్దుకు నిప్పు రగిలించాడు. వెచ్చవెచ్చగా నెగడు దగ్గిర కూర్చుని ముచ్చటలాడుకోవటం ప్రారంభించారు ఆదిమ జనులు.
అప్పటికి ప్రొద్దు కొండల్లో పడి చాలాసేపు అయింది.
వారిలో ఒకరుగా కలిసిపోయిన జయకృష్ణ, జ్యోతి కోడిగాలాడు కుంటూ, కోతలు కోసుకుంటూ ఆదిమ యువతీ యువకులు మంచి వేడుక చేస్తున్నారు.
చెవుల పిల్లిని చీకులుగా మార్చి కాల్చింది లచ్చిమి. ఎర్రగా వేగాక చీకుల్ని తేనెలో ముంచి అడ్డాకులో పెట్టి జయకృష్ణకు అందించింది లచ్చిమి. అతడు కాదంటే జ్యోతికి అందించింది.
ఆమె కూడా కాదంటే అబ్బురంగా తనవారి వంక చూచింది.
"దొరబిడ్డలకు ఆకలి తక్కువ" అంది తనవారితో. వారంతా పక్కుమని నవ్వగానే జ్యోతి, జయకృష్ణ ఒకరి మొఖాలోకరు చూచుకున్నారు. అది చూచి మరింత నవ్వారు అదిమజనులు.
"దొరసానీ! పండంటీ దొరబాబుని పట్టినావు. కొంగున కట్టుకుని గూడాల వెంట త్రిప్పుతున్నావు" అంటూ కోడిగం ప్రారంభించింది లచ్చిమి. జ్యోతి సిగ్గుపడి తల దింపుకుంది. జయకృష్ణ వంక ఓరగా చూచింది.
"లచ్చిమీ! నువ్వు ఏం మాట్లాడకు" అన్నాడు జయకృష్ణ.
"కోడిగం చెయ్యకే లచ్చిమి! పుంజు కుర్రుమన్నది చూడు" అన్నాడొక ఆదిమ యువకుడు. లచ్చిమి పక్కున నవ్వింది.
వారి జీవిత విధానం పరిమితమయినది. వారి కోరికలు పరిమితమయినవి. వారి ఆలోచనలు నిర్మలమయినవి. రవంత అయినా అరమరికలు లేని వారి సంభాషణ జ్యోతిని కలవరపరచటం చిత్రమనిపించింది.
అయినా వారి మాటలు అపుచేయకపొతే తామిద్దరినీ వారు యిరుకున పడవేయగలరు. అందునించి ఆ సంభాషణ అపు చేయించేందుకు ప్రయత్నించాడు జయకృష్ణ.
